పల్లెపోరు..ప్రచార జోరు | Telangana Panchayat Elections News Karimnagar | Sakshi
Sakshi News home page

పల్లెపోరు..ప్రచార జోరు

Published Thu, Jan 17 2019 8:24 AM | Last Updated on Thu, Jan 17 2019 8:24 AM

Telangana Panchayat Elections News Karimnagar - Sakshi

పంచాయతీ ఎన్నికల గడువు సమీపిస్తుండడంతో పోటీదారుల్లో టెన్షన్‌ పెరిగింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు నానాపాట్లు పడుతున్నారు. గ్రామాల్లో పోటాపోటీగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కుల, యువజన సంఘాల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎంత ఖర్చుకైనా సై అంటున్నారు. 

కరీంనగర్‌: గ్రామపంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. ఈనెల 21న ఎన్నికలను సజావుగా నిర్వహిం చేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. మొదటి విడతలో జిల్లాలోని కరీంనగర్‌రూరల్, కొత్తపల్లి, చొప్పదండి, రామడుగు, గంగాధర మం డలాల్లోని 97 గ్రామపంచాయతీలకు, 928 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో నాలుగు పంచాయతీలైన చొప్పదండి మండలం మంగళ్లపల్లి, రామడుగు మండలం గోలి రామయ్యపల్లి, పందికుంటపల్లి, కరీంనగర్‌ రూరల్‌ మండలం జూబ్లీనగర్‌ పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 93 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేపట్టారు. సర్పంచ్‌గా పోటీ చేసేందుకు 93 స్థానాల్లో 464 మంది బరిలో ఉన్నారు. మొదటి విడతలో 928 వార్డులకు గాను 220 వార్డులు ఏకగ్రీవం కాగా, 708 వార్డుల కోసం 2092 మంది వార్డు స్థానాల్లో పోటీ చేస్తున్నారు.

జోరందుకున్న ప్రచారం..
తొలివిడత ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులను ఖరారు చేస్తూ గుర్తులు కేటాయించారు. దీంతో అభ్యర్థులు పల్లెల్లో విసృతంగా ప్రచారం నిర్వహిస్తూ ఎలాగైనా గెలువాలని పగలురాత్రి తేడా లేకుండా గ్రామాల్లోని వీధులన్ని చుట్టుముడుతున్నారు. కులసంఘాల నాయకులను మచ్చిక చేసుకుంటూ మిగతా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. 20వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ప్రచారం ముగించాల్సి ఉంటుంది. ప్రచారానికి సమయం తక్కువగా ఉండడం, ఎన్నికల గుర్తులు రావడంతో ప్రచారం జోరందుకుంది.

నమూనా బ్యాలెట్‌ పేపర్లతో... 
మొదటి విడతకు సంబంధించి బరిలో ఉండే అభ్యర్థులు ఎవరో తేలిపోవడంతో పోటీలో ఉన్న సర్పంచ్, వార్డుమెంబర్‌ అభ్యర్థులంతా ప్రింటింగ్‌ ప్రెస్‌లకు వెళ్లి పోస్టర్లు, ఫ్లెక్సీలు, కరపత్రాలు, నమూనా బ్యాలెట్‌ పత్రాలు ముద్రించుకున్నారు. వాటిని ఇంటింటా అంటిస్తూ, నమూనా బ్యాలెట్‌లో తమ గుర్తులను ఓటర్లకు చూపిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. సర్పంచ్‌ అభ్యర్థులు రూ.1.50, వార్డు మెంబర్లకు రూ.30వేలు, 5వేల జనాభా దాటిన మేజర్‌ పంచాయతీల్లో సర్పంచ్‌ అభ్యర్థులకు రూ.2.50లక్షలు, వార్డు మెంబర్లకు రూ.50 వేల వరకు ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది. ఈ నిబంధనలు అనుసరించి తక్కువ ఖర్చుతో ప్రచార సామగ్రిని ముద్రించుకునేందుకు అభ్యర్థులు తంటాలు పడుతున్నారు. కొంత మంది ఎక్కువ ముద్రించినా తక్కువ బిల్లులు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

ఎలాగైనా గెలువాల్సిందే...
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎలాగైనా గెలువాల్సిందేనని వెనుకా ముందు ఆలోచించకుండా అందినంత ఖర్చపెడుతూ గ్రామాల్లో ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. కొంత మంది అయితే సర్పంచ్‌ పీఠంపై కూర్చుండటమే లక్ష్యంగా పెట్టుకుంటూ ఉన్న భూములను అమ్మివేయడంతో పాటు తనఖా పెట్టి డబ్బులు సమకూర్చుకుంటున్నారు. చిన్న పంచాయతీల్లో రూ.3–4 లక్షలు, పెద్ద పంచాయతీల్లో అయితే రూ.10–20 లక్షల వరకు ఖర్చు పెట్టేందుకు అయినా వెనుకాడటం లేదు. మరింత కొంత మంది అభ్యర్థులు డబ్బుల జోలికి వెళ్లకుండా తమను గెలుపించాలని కోరుతున్నారు. గెలిచాక పనులు చేయకపోతే నిలదీయండి అంటూ ప్రజలను వేడుకుంటున్నారు.

రెండవ విడతలో మిగిలేది ఎందరో..?
జిల్లాలో రెండవ విడత ఎన్నికలు నిర్వహించే మానకొండూర్, తిమ్మాపూర్, శంకరపట్నం, గన్నేరువరం, చిగురుమామిడి మండలాల్లోని 107 గ్రామపంచాయతీలు, 1014 వార్డు స్థానాల్లో ఈనెల 11 నుంచి 13 వరకు నామినేషన్ల స్వీకరణ ముగిసింది. ఈనెల 14,15,16 తేదీల్లో అభ్యర్థుల జాబితా, అప్పీళ్లు, పరిష్కారం పూర్తయింది. 17న నామినేషన్ల ఉపసంహరణకు గడువుంది. ఉపసంహరణ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటిస్తారు. దీంతో సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యే స్థానాలకు పోను మిగిలిన స్థానాలకు ఈనెల 25న ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి, ఉపసర్పంచ్‌ ఎన్నిక చేపట్టనున్నారు.

మూడవ విడతకు రేపటికే నామినేషన్లు.. 
మూడవ విడతలో జిల్లాలోని హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, సైదాపూర్‌ మండలాల్లోని 109 గ్రామపంచాయతీలకు, 1024 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. బుధవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా.. శుక్రవారంతో నామినేషన్ల స్వీకరణ ముగుస్తుంది. ఈనెల 19న నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల జాబితా తయారీ, 20న అప్పీళ్లు, 21న అప్పీళ్ల పరిష్కారం ఉంటుంది. 22న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత పోటీలో ఉన్నవారి జాబితాను ప్రకటిస్తారు. మూడవ దశ ఎన్నికల పోలింగ్‌ ఈనెల 30న నిర్వహించేందుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేపట్టారు. 

  • పంచాయతీ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రోజురోజుకు సమీకరణలు ఆసక్తికరంగా మారుతున్నాయి. స్థానిక నాయకులను సమన్వయం చేసుకుని అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. 
  • అన్ని పార్టీల నేతలు ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పార్టీపరంగా సానుభూతిపరులెవరు? తమకు ఎవరెవరు మద్దతు పలుకుతున్నారు? ఏ పార్టీకి సంబంధం లేని వారు ఎంత మంది ఉన్నారు? కుల సంఘాలను సంప్రదించడం ద్వారా ఎన్ని ఓట్లను రాబట్టుకోగలం..? అన్న లెక్కల్లో పార్టీల నేతలు నిమగ్నమయ్యారు. 
  • ఒక్కో గ్రామంలో సర్పంచుకు ఆరు మంది వరకు నామినేషన్లు వేశారు. దీంతో పోటీ రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలకు చెందిన వారే ముగ్గురేసి పోటీల్లో ఉన్నారు. వారిని పోటీ నుంచి విరమింపజేయడం అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది.
  • కాలనీలకు, సంఘాలకు పలు నజరానాలు ప్రకటిస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. సొంత ఖర్చుతో దేవాలయాల అభివృద్ది, బోరుబావులు తవ్వించడం, తదితర పనులు చేపడుతాననే çహామీలు ఇవ్వడంతో పాటు  ఒక్కో ఓటుకు ఎంతైనా చెల్లించేందుకు వెనకాడట్లేదన్న మాటలు వినిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement