ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్
తొలివిడత పంచాయతీ సమరానికి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ, అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక జరగనుంది. మొదటి విడతగా ఐదు మండలాలు కరీంనగర్‌రూరల్, కొత్తపల్లి, చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లోని 93 గ్రామాలు, 728వార్డులకు తొలిదశలో ఎన్నికలు జరుగుతున్నాయి. 2556 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
కరీంనగర్ : చొప్పదండి మండలంలోని 15 గ్రామపంచాయతీలు, గంగాధర మండలంలో 33, కరీంనగర్‌రూరల్ మండలంలో 17, కొత్తపల్లి మండలంలోని 8, రామడుగు మండలంలోని 21 గ్రామపంచాయతీలకు తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్, ఉపసర్పంచ్ ఎన్నిక ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేపట్టింది. మొదటి విడత ఎన్నికల నిర్వహణకు 928 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయడంతోపాటు అవసరమయ్యే సామగ్రిని బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్‌పేపర్లను సిబ్బందికి అందించారు. జిల్లావ్యాప్తంగా 146 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. 113 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ కెమెరాలతో ఎన్నికల ప్రక్రియను పరిశీలించనున్నారు.
ఎన్నికల విధుల్లో 922 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1236 మంది ఇతర సిబ్బందిని నియమించారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశా రు. ఎన్నికల నిర్వహణకు 13 జోన్లు, 40 రూట్లను ఏర్పాటు చేసి ఒక్కో అధికారిని నియమించారు. అదనంగా చెక్‌పోస్టులు, ఫ్‌లైయింగ్ స్క్యాడ్‌లను నియమించారు. ఎన్నికల నిర్వహణ విషయంలో సిబ్బందికి ఇప్పటికే రెండు విడతల్లో కలెక్టర్‌తోపాటు పంచాయతీ అధికారులు, రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు భారతిలక్‌పతినాయక్ ఎప్పటికప్పుడు ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు.
సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ
తొలివిడత పంచాయతీ ఎన్నికలు నిర్వహించే కరీంనగర్, కొత్తపల్లి మండలాల ఎన్నికల సామగ్రిని సిబ్బందికి ఆదివారం మధ్యాహ్నం నుంచే అందజేశారు. రేకుర్తి లయోలా స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాన్ని పంచాయతీ ఎన్నికల జిల్లా పరిశీలకురాలు భారతి లక్‌పతినాయక్ సందర్శించి పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలింగ్ సామగ్రిని, బ్యాలెట్ పేపర్, వెబ్‌క్యాస్టింగ్ సామగ్రిని పరిశీలించారు. ఆమెవెంట జిల్లా పంచాయతీ అధికారి సిహెచ్ మనోజ్‌కుమార్, కరీంనగర్ మండల ప్రజాఅభివృద్ధి అధికారి పవన్, విస్తరణ అధికారి జగన్మోహన్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం
తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. పోలింగ్ సిబ్బంది, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు అందజేశాం. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులకు బాధ్యతలు అప్పగించాం. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌తో పాటు అన్ని వసతులను ఏర్పాటు చేయడం జరిగింది. – డీపీవో మనోజ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment