కరీంనగర్/కమాన్‌చౌరస్తా(కరీంనగర్): మానకొండూర్ మండలంలోని ఒక గ్రామానికి చెందిన వారు ఉపాధికోసం మహారాష్ట్రలో నివసిస్తున్నారు. ఆ గ్రామంలో వారికి ఓట్లు ఉండడంతో అక్కడ పోటీ చేస్తున్న ఒక అభ్యర్థి వారితో మాట్లాడి గ్రామానికి వచ్చి తమకు ఓటు వేయాలని ప్రాధేయపడ్డాడు. వారి కుటుంబ సభ్యులందరూ అక్కడే ఉండగా ప్రత్యేకంగా వాహనం ఏర్పాటు చేయడంతో వారు ఓట్లు వేసేందుకు రావడానికి బయల్దేరారు.
గన్నేరువరం మండలంలోని ఒక గ్రామానికి చెందిన పదిమంది వరకు యువకులు ఉన్నత చదువుల నిమిత్తం హైదరాబాద్‌తో పాటు సమీప ప్రాంతాల్లో ఉంటున్నారు. వారికి గ్రామంలో ఓట్లు ఉండడంతో అక్కడ పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి, సదరు వార్డు సభ్యులు సైతం పేరుపేరునా ఫోన్ చేసి ఓటు వేసేందుకు రావాలని అభ్యర్థించారు. ఒకరికి మించి ఒకరు ఫోన్లు చేసి వివిధ రకాల ఆఫర్లు ప్రకటించారని తెలిసింది.పంచాయతీ ఎన్నికల పోరు పోటాపోటీగా సాగుతోంది.
సర్పంచ్, వార్డు స్థానాల గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అభ్యర్థులు ఎలాగైనా కుర్చీని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో సర్వశక్తులు ఒడ్డుతున్నారు. శుక్రవారం రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, మూడో విడత ఎన్నికల ప్రచారం గ్రామాల్లో ముమ్మరంగా సాగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే కావడంతో ఉపాధి, చదువుల కోసం వెళ్లినవారు, ఉద్యోగులతో పాటు ఇతర పనుల రీత్యా వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారిని నానా పాట్లు పడి ఓట్ల కోసం రప్పిస్తున్నారు. వారికి రకరకాల నజరానాలతో పాటు రానుపోను ఖర్చులు ఇస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఒక రోజు ముందే గ్రామాలకు చేరుకోగా, ఈ రోజు మరికొంత మంది రానున్నారు.
వివరాలు సేకరించిన అభ్యర్థులు...
రెండో విడతలో గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాల్లో పోటీలో ఉంటున్న అభ్యర్థులు నామినేషన్ వేసిన నాటినుంచే గ్రామం, వార్డుల్లోని ఓటరు లిస్టు చూస్తూ స్థానికేతరులను గుర్తించారు. వారి వివరాలు సేకరించి ఎక్కడెక్కడ నివసిస్తున్నారో తెలుసుకొని స్వయంగా ఫోన్లు చేయడం, వారి అనుచరులు, బంధుగణంతో ఫోన్లు చేయించారు. పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా తమకే ఓటు వేయాలని వేడుకున్నారు. వారికి అవసరమైన రవాణా ఖర్చుతో పాటు ఎక్కువ మంది ఉంటే ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లాలోని పలు పల్లెలకు చెందినవారు స్వరాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా నివసిస్తున్నారు. ఉద్యోగం, వ్యాపారం, చదువుల నిమిత్తం హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, మహారాష్ట్ర, బెంగళూర్, ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను కూడా రప్పించడానికి శతవిధాలా ప్రయత్నించారు.
ఆన్‌లైన్‌లో డబ్బులు ట్రాన్స్‌ఫర్...
వలస ఓటర్లకు ఊరు రాజకీయాలతో పెద్దగా సంబంధం ఉండదు కాబట్టి వారికి ఎంత కావాలంటే అంత ముట్టజెపుతున్నట్లు తెలిసింది. తమ పనులను, సమయాన్ని, వ్యాపారాలను తమ కోసం కేటాయించడానికి సిద్ధపడుతున్నందుకు వారికి పెద్ద ఎత్తున్న నజరానాలు అందించడానికి సిద్ధపడ్డారని ప్రచారం జరుగుతోంది. ఓటర్ల అకౌంట్‌లలోకి తేజ్, పేటీఎం, గూగూల్ పేలతో పాటు వివిధ యాప్‌ల ద్వారా కొంతమందికి ట్రాన్స్‌ఫర్ నగదు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు సమాచారం.
సెల్‌ఫోన్ సాంకేతికత లేని వారికి వారి అకౌంటు నంబర్లు తీసుకొని ఓటుకు కొంత మొత్తం చెప్పున లెక్కించి వారి ఖాతాల్లో జమ చేసినట్లు పలు గ్రామాల్లో చెప్పుకుంటున్నారు. స్థానికంగా ఉన్న ఓట్లతో పాటు వలస ఓట్లు కీలకంగా ఉండడంతో అభ్యర్థుల గెలుపులో స్థానికేతరులు కీలకపాత్ర పోషించనున్నారని అర్థమవుతోంది. అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉండడంతో ఎలాగైనా గెలువాలని అడ్డదారులు తొక్కుతున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ నోట్ల కట్టలు పంచుతున్నారు. ఈ హోరాహోరీ పోరులో ఎవరి వ్యూహాలు ఫలించాయో సాయంత్రానికల్లా తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment