సాక్షి ప్రతినిధి, నల్లగొండ : గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి వ్యయాన్ని చూపించని వారిపై ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా స్పందించింది. వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీరితోపాటు జిల్లాలో ఇద్దరు సర్పంచులు అక్రమాలకు పాల్పడడంతో వారిపై కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ అనర్హత వేటు వేశారు. కాజేసిన సొమ్ములు తిరిగి చెల్లిస్తేనే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత సాధిస్తారు.
ఇటు ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించని 292 మందిపైనా అనర్హత వేటు వేశారు. జిల్లాలో 2014 సంవత్సరంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేశారు. వారు ఆ ఎన్నికల్లో ఖర్చు చేసిన నిధుల వివరాలను ఆ తర్వాత ఎన్నికల కమిషన్‌కు అందజేయాల్సి ఉంటుంది. అయినా చాలా మంది స్థానిక ఎన్నికల్లో తాము చేసిన ఖర్చుల వివరాలను అధికారులకు అప్పగించడంలో నిర్లక్ష్యం వహించారు. దీంతో సీరియస్ అయిన ఎన్నికల సంఘం వారిని పోటీకి అనర్హులుగా ప్రకటించింది. జిల్లావ్యాప్తంగా 292మంది జిల్లాపరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేసిన వారంతా ఇపుడు ఎన్నికల్లో పోటీ చేయకుండా పోతున్నారు.
రిజర్వేషన్ కలిసొచ్చినా ఉపయోగపడని పరిస్థితి
ప్రస్తుత సర్పంచ్ ఎన్నికల్లో ఆయా గ్రామాల్లో పలువురు నాయకులకు రిజర్వేషన్ కలిసొచ్చింది. అయినా, పోటీ చేసేందుకు అనర్హులయ్యారు. ప్రస్తుతం దేవరకొండ డివిజన్ పరిధిలో నామినేషన్ల ప్రక్రియ ముగిసిపోయింది. 2వ, 3వ విడతలో మిర్యాలగూడ, నల్లగొండ డివిజన్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. కాగా, రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చినా, ఎన్నికల సంఘం నిర్ణయం వీరి విషయంలో అశనిపాతమైంది. గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేసిన వారు, ఈసీ నిర్ణయం వల్ల సర్పంచ్ పదవులకు పోటీ పడలేని దుస్థితిలో ఉన్నారు.
వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి
మార్చి, ఏప్రిల్ మాసాల్లో జరగనున్న మండల ప్రాదేశిక, జిల్లా ప్రాదేశిక సభ్యుల ఎన్నికకు జరగాల్సిన ఎన్నికల్లోనూ వీరు పోటీ చేయడానికి అనర్హులే. గత ఎన్నికల్లో పోటీచేసి ఎన్నికల ఖర్చుల లెక్కలు చూపించని కారణంగా ఇప్పుడు పోటీ చేయడానికి అర్హత కోల్పోవడంతో లబోదిబోమంటున్నారు. మరో మూడు నెలల్లో జరగనున్న మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికల్లో ఆయా మండలాల్లో వీరికి రిజర్వేషన్ కలిసి వచ్చినా ఉపయోగం లేకుండా పోనునంది.
ఇద్దరు సర్పంచులపై వేటు
సర్పంచ్‌లుగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఇద్దరిపై కూడా అనర్హత వేటు పడింది. ఐదేళ్లు సర్పంచ్‌లుగా పనిచేసి అక్రమాలకు పాల్పడ్డారని తేలింది. దీంతో కలెక్టర్ వారిని ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించారు. పీఏపల్లి మండలం ఒక పంచాయతీ సర్పంచ్ అక్రమాలకు పాల్పడ్డాడు. కాజేసిన నిధులను రికవరీ చేయాలని ఆదేశించారు. ఒకవేళ ఆ వ్యక్తి తిరిగి నిధులు చెల్లిస్తే పోటీకి అర్హుడని, లేదంటే అప్పటివరకూ ఏ ఎన్నికలు జరిగినా వారు పోటీ చేసేందుకు అనర్హులేనని ప్రకటించారు. నార్కట్‌పల్లి మండలంలో కూడా ఒక సర్పంచ్‌పై ఈ వేటు పడింది. అ మొత్తానికి జిల్లాలో గత ఎన్నికల్లో పోటీచేసి ఎన్నికల లెక్కలు చూపని 292మందిపై ఎన్నికల కమిషన్ అనర్హత వేటు వేయగా, నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఇద్దరు సర్పంచ్‌లపై కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ అనర్హత వేటు వేశారు. వారు స్వాహా చేసిన నిధులు తిరిగి చెల్లిస్తే అర్హత సాధిస్తారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment