ineligible
-
పింఛన్లు పొందుతున్న వారిలో చాలా మంది అనర్హులున్నారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చాలా మంది అనర్హులు పింఛన్లు పొందుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని, అనర్హులను గర్తింపు, వారికి సంబంధించి అన్ని అంశాలను పరిశీలించడానికి మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)పై గురువారం సీఎం సమీక్షించారు. అనంతరం రాష్ట్ర సచివాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. అర్హులకే పింఛన్లు ఇస్తామని, అనర్హులు ఎవరైనా ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం పింఛన్ల మంజూరు ప్రక్రియలో లోపాలున్నాయని, వాటిని కూడా మంత్రుల సబ్ కమిటీ సరిచేస్తుందన్నారు. 50 ఏళ్లకే పింఛన్, పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు, మహిళా శక్తి కార్యక్రమాలపైనా సమావేశంలో చర్చించామని, రాబోయే రోజుల్లో వాటిపై కొంత స్పష్టత వస్తుందని తెలిపారు. పొదుపు సంఘాల మహిళలు దాదాపు రూ.80 వేల కోట్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటుండగా, అందులో రూ. 54 వేల కోట్లను మాత్రమే మహిళలు ఉపాధిని పెంచుకోవడానికి పెట్టుబడిగా పెడుతున్నారని ప్రభుత్వ పరిశీలనలో తేలిందని చెప్పారు. మిగిలిన వారు తీసుకునే రుణాలను కూడా ఉపాధి మార్గాల్లోనే పెట్టుబడి పెట్టేలా చర్యలు చేపడతామన్నారు. స్త్రీనిధికి సంబంధించి రూ. 950 కోట్ల మేర వేరే బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకొని, ఆ మొత్తాలను ప్రభుత్వ నిధులకు మళ్లించారని, ఈ కారణంగా స్త్రీనిధి కార్యకలాపాల నిర్వహణకు ఇబ్బందులొచ్చాయని చెప్పారు. పది జిల్లాల్లో పొదుపు సంఘాల మహిళలను చిన్నతరహా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఆ జిల్లాల్లో స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించినట్టు తెలిపారు. పొదుపు సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలకు అమరావతిలో కల్చరల్ కాంప్లెక్స్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపినట్టు చెప్పారు. -
‘ఆసరా’ పక్కదారి.. అర్హులకేదీ దారి?
నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో శనివారం పింఛన్ ధ్రువపత్రాల పంపిణీ చేపట్టారు. ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి పంపిణీ చేస్తుండగా.. ఓ వ్యక్తి పెన్షన్ పత్రం తీసుకోవడానికి స్టేజీపైకి వచ్చారు. 45ఏళ్లు కూడా ఉండని ఆయనకు వృద్ధాప్య పింఛన్ మంజూరు కావడం చూసి ఎమ్మెల్యే అవాక్కయ్యారు. ఇదేమిటంటూ అధికారులపై మండిపడ్డారు. ఇదే కార్యక్రమానికి మరికల్‌కు చెందిన బోయ అనంతమ్మ వచ్చి ఎమ్మెల్యేను ఆశ్రయించారు. భర్త చనిపోయి మూడేళ్లవుతోందని.. 2020లో వితంతు పెన్షన్‌కు దరఖాస్తు చేసుకున్నా రాలేదని వాపోయారు. ఎమ్మెల్యే దీనిపై అధికారులను ప్రశ్నించగా.. ఆమె చనిపోయినట్టు ఆన్లైన్లో నమోదై ఉండటంతో రాలేదని వివరించారు. దీంతో తనను బతికుండగానే చంపేశారని, ఎలాగైనా పింఛన్ మంజూరు చేయాలని అనంతమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. ..తాజాగా నారాయణపేట జిల్లాలో కొత్త పింఛన్ల మంజూరు సందర్భంగా బయటపడిన వాస్తవాలు. ఈ ఒక్క చోటేకాదు.. రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల మంజూరులో ఇలాంటి అవకతవకలు కనిపిస్తున్నాయి. అనర్హులకు ఆసరా అందుతుండగా.. అర్హులకు మొండిచేయి మిగిలింది.ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంతో పింఛన్ల మంజూరు లోపభూయిష్టంగా మారిన తీరుపై ‘సాక్షి’గ్రౌండ్ రిపోర్ట్.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ భారీగా పింఛన్లు ఇస్తుండటంతో.. పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ‘ఆసరా’పథకం కింద భారీ సంఖ్యలో పింఛన్లు అందజేస్తోంది. మరింత మందికి ‘ఆసరా’అందించే ఉద్దేశంతో వృద్ధాప్య పింఛన్ అర్హత వయసును 65 నుంచి 57 ఏళ్లకు కుదించింది. దివ్యాంగులు, వితంతువులు, చేనేత, బీడీ కార్మికులు, ఇతర లబ్ధిదారుల నుంచి కూడా కొత్తగా దరఖాస్తులు స్వీకరించింది. దాదాపు మూడేళ్ల తర్వాత కొత్త పింఛన్ల మంజూరుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కొత్త పింఛన్ల జాబితాలో పెద్ద సంఖ్యలో అనర్హులకు చోటు దక్కిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయి విచారణ ఏదీ? కొత్త పింఛన్ల కోసం మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించగా.. అర్హులతోపాటు అనర్హులూ దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అర్హులను గుర్తించాలి. కానీ ఎక్కడా ఈ ప్రక్రియ సరిగా జరగలేదని.. వాస్తవ వయసు తక్కువగా ఉన్నా, ఆధార్ కార్డులో నమోదైన వయసు ప్రకారం వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేశారని తెలిసింది. కొందరు ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు పింఛన్లు మంజూరవడం, ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురికి ఇవ్వడం వంటివెన్నో జరగడం గమనార్హం. అవకతవకలు ఎన్నో.. ►ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చనిపోయినవారి పేరిట, సింగరేణి, రైల్వే ఉద్యోగులకు, ఒకే వ్యక్తికి రెండు, ఒకే ఇంట్లో రెండేసి పింఛన్లు వంటి అవకతవకలు ఉన్నో జరిగాయి. ఇప్పటివరకు 1,257 మందిని అనర్హులుగా గుర్తించారు. ►ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురానికి చెందిన జటంగి సోమమ్మ భర్త చనిపోయి రెండేళ్లవుతోంది. వితంతు పింఛన్ కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నా రాలేదు. అదే మండలం చెరువు మాదారంలో ఉద్యోగుల తల్లిదండ్రులకు పింఛన్లు మంజూరయ్యాయి. ►సిద్దిపేట జిల్లా రాఘవాపూర్ మధిర గ్రామం ఇంద్రగూడేనికి చెందిన గాండ్ల లక్ష్మి వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదు. ఇదేమిటని అధికారులను అడిగితే.. సమగ్ర కుటుంబ సర్వే వివరాల్లో వయసు తక్కువగా ఉండటంతో రాలేదని సమాధానమిచ్చారు. ►సిరిసిల్ల జిల్లా కథలాపూర్ మండలం పెగ్గెర్లకు కారపు సత్యనారాయణ వయసు 57. ఆయనకు చేనేత పింఛన్ రావాల్సి ఉంది. కానీ ఆయన చనిపోయినట్టు వివరాల్లో ఉందంటూ పింఛన్ ఇవ్వలేదు. ►భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్‌కు చెందిన కొండపాక సత్యనారాయణ (69) చనిపోయి ఏడాదిన్నర అవుతోంది. కొత్త పింఛన్ల జాబితాలో ఆయన పేరుంది. ►మహబూబ్‌నగర్ మండలానికి చెందిన జనార్దన్‌గౌడ్ నాలుగేళ్ల క్రితం వృద్ధాప్య పింఛన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. 8 నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. కొత్త పింఛన్ల జాబితాలో ఆయన పేరుంది. తాను వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నానని.. తనకు మంజూరు చేయాలని ఆయన భార్య జయమ్మ వాపోతున్నారు. ‘సమగ్ర’సర్వేతో పోల్చి.. కొన్ని జిల్లాల్లో కొత్త పింఛన్ల జాబితాలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు మాత్రమే ఉన్నాయి. మండల, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తులు ఇచ్చినవారికి మంజూరు కాలేదని తెలిసింది. ఇక మండల, పురపాలికల్లో దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధించిన వివరాలను సమగ్ర కుటుంబ సర్వేతో పోల్చినట్టు తెలిసింది. అందులో వృత్తి నమోదు కాకపోవడంతో పలువురు గీత, చేనేత కార్మికుల పేర్లు పింఛన్ల జాబితాలో చేర్చలేదని సమాచారం. ప్రస్తుతం పింఛన్ల మంజూరులో లొసుగులు వెలుగులోకి వస్తుండటంతో అధికారులు జల్లెడ పట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే అనర్హుల తొలగింపు పనికి స్థానిక ప్రజాప్రతినిధులు అడ్డువస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈయన పేరు సుంచు మల్లయ్య. వయసు 67 ఏళ్లు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌కు చెందిన ఆయన.. ఓ రేకుల షెడ్డులో భార్య, ఇద్దరు పిల్లలతో బతుకీడుస్తున్నాడు. మరో కుమారుడు ఏడాది క్రితం కరోనాతో మృతిచెందాడు. బిడ్డ శ్రీలతకు 30ఏళ్లు.. ఆమె మరుగుజ్జు. అయినా ఈ కుటుంబానికి పింఛన్ మంజూరు కాలేదు. బతికుండగానే చనిపోయిందంటూ.. ఈ మహిళ పేరు బానోతు వీరమ్మ. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం చిలుకమ్మతండాకు చెందిన వీరమ్మ 2019లో వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంది. కొత్త పింఛన్ల జాబితాలో తన పేరు లేదు. అధికారుల వద్దకు వెళితే ఆమె చనిపోయినట్టు ఆన్లైన్లో చూపిస్తోందనడంతో అవాక్కైంది. -
మెడికల్ కౌన్సిల్’ కేసులో ముగ్గురి అరెస్ట్
సాక్షి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) డేటాబేస్ ట్యాంపరింగ్ చేసి, అనర్హులకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ చేసిన వ్యవహారంలో సీనియర్ అసిస్టెంట్ కందుకూరి అనంతకుమార్ సూత్రధారిగా తేలింది. చైనాలో మెడిసిన్ పూర్తి చేసిన వారు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) పరీక్ష పాస్ అయితేనే రిజిస్ట్రేషన్‌కు ఆస్కారం ఉంటుందని, పాస్ కాని వారి నుంచి రూ.9 లక్షల చొప్పున వసూలు చేసిన కుమార్ సర్టిఫికెట్లు జారీ చేశాడని అదనపు సీపీ (నేరాలు) ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. జేసీపీ డాక్టర్ గజరావ్ భూపాల్, ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావులతో కలిసి గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇబ్రహీంపట్నానికి చెందిన కసరమోని శివానంద్, కర్మన్‌ఘాట్ వాసి తోట దిలీప్ కుమార్ స్నేహితులు. వీరు చైనాలో ఎంబీబీఎస్ చదివారు. 2012లో సర్టిఫికెట్ పొంది తిరిగి వచ్చారు. ఇలా విదేశాల్లో వైద్య విద్యనభ్యసించిన వారు ఇక్కడ ప్రాక్టీసు చేయాలంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) ఉత్తీర్ణులు కావాలి. అత్యంత కఠినంగా ఉండే ఈ పరీక్షను ఎంసీఐ ఆరు నెలలకు ఒకసారి నిర్వహిస్తుంది. ఈ ద్వయం 2012–14 మధ్య రెండుసార్లు పరీక్షకు హాజరైనా ఉత్తీర్ణులు కాలేదు. పాస్ అయితే కానీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగదు. దీంతో వీళ్లిద్దరూ ‘ప్రత్యామ్నాయ మార్గాలు’ అన్వేషించారు. వీరికి ఓ స్నేహితుడు (ప్రస్తుతం దుబాయ్‌లో) ద్వారా టీఎస్‌ఎంసీలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న అనంతకుమార్‌తో పరిచయమైంది. 2017లో అతడిని కలిసి తమ అవసరాన్ని చెప్పారు. దీంతో ఒక్కొక్కరి నుంచి రూ.9 లక్షల చొప్పున వసూలు చేసిన అనంతకుమార్ 2016లో రిజిస్టర్ చేసుకున్న వైద్యుల రిజిస్ట్రేషన్ నంబర్లు వీరికి కేటాయించాడు. ఈ మేరకు టీఎస్ఎంసీ డేటాబేస్‌లో మార్పుచేర్పులు చేసి, వీరిద్దరికీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అందించాడు. ఇటీవల అసలు వైద్యులు రెన్యువల్, అర్హతలు అప్డేట్ కోసం టీఎస్ఎంసీకి రావడంతో విషయం తెలిసింది. టీఎస్ఎంసీ ఫిర్యాదు మేరకు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుల కోసం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ రంగంలోకి దిగింది. ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలోని టీమ్ ముగ్గురు నిందితులను అరెస్టు చేసి నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకుంది. వీరి వద్ద నకిలీ టీఎస్ఎంసీ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ... ఎంసీఐ సర్వర్‌లో మాత్రం ఎంటర్ కాలేదు. దీంతో అందులో అసలు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వివరాలే కనిపిస్తున్నాయి. చిక్కుతామని భయపడిన వీరు ప్రాక్టీసు చేయకుండా వైద్య సంబంధ ఉద్యోగాలు చేస్తున్నారు. అనంతకుమార్ వీరిద్దరితో పాటు శ్రీనివాస్, నాగమణిలకు ఈ తరహాలో సహకరించినట్లు అనుమానాలున్నాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉంటున్న వారి వివరాలు ఆరా తీస్తున్నామన్నారు. శివానందం 2012–16 మధ్య, దిలీప్ 2016 –18 మధ్య సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో డ్యూ టీ డాక్టర్లుగా పని చేశారు. టీఎస్ఎంసీ సర్టిఫికెట్ లేని శివానందంకు ఉద్యోగం ఎలా వచ్చిందనేది ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం వీరిలో ఒకరు మెడికల్ కంపెనీలో, మరొకరు వైద్యులకు అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. (చదవండి: తమ్ముడి ఇంట్లో తుపాకీ పెట్టాడు!) -
వినోద్ కుమార్‌కు భంగపాటు.. కాంస్య పతకాన్ని రద్దు చేసిన నిర్వాహకులు
టోక్యో: పారాలింపిక్స్ పురషుల డిస్కస్ త్రో(F52) కేటగిరీలో ఆదివారం భారత అథ్లెట్ వినోద్ కుమార్ డిస్క్‌ను 19.91 మీటర్ల దూరం విసిరి కాంస్య పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అయితే, వినోద్ F52 కేటగిరీ పరిధిలోకి రాడని ఫిర్యాదు అందడంతో అతడు గెలిచిన పతకాన్ని నిర్వహకులు హోల్డ్‌లో ఉంచారు. అయితే, ఇవాళ ఫిర్యాదును సమీక్షించిన నిర్వహకులు వినోద్ కుమార్ F52 కేటగిరీ పరిధిలోకి రాడని తేల్చి అతను గెలుచుకున్న కాంస్య పతకాన్ని రద్దు చేశారు. ఈ విషయాన్ని టోక్యో పారాలింపిక్స్ నిర్వహకులు అధికారికంగా ప్రకటించారు. కండరాల బలహీనత, కదలికల్లో లోపం, అవయవ లోపం ఉన్న వారు మాత్రమే F52 కేటగిరీ పరిధిలోకి వస్తారని, వినోద్ కుమార్ ఈ కేటగిరీ పరిధిలోకి రాడని వారు తేల్చారు. కాగా, ఇదే నిర్వహకులు ఈ నెల 22న వినోద్ కుమార్ F52 కేటగిరీలో పోటీపడవచ్చని అనుమతివ్వడం చర్చనీయాంశంగా మారింది. చదవండి: Avani Lekhara: భారత 'అవని' పులకించింది.. -
టీడీపీ నేతల నిర్వాకం..
అనంతపురం రూరల్: ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే నివేశన స్థలాలపై పెద్దలు కన్నేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇంటి పట్టాలు చేయించుకున్నారు. అనంతపురం రూరల్ మండలం రాచానపల్లి సర్వే నంబర్ 4 – 2లో 2018లో దాదాపు 110 మందికి అప్పటి రెవెన్యూ అధికారులు ఇంటి పట్టాలు మంజూరు చేశారు. ఆ పట్టాలు పొందిన వారిలో 80 శాతం మందికి సిండికేట్‌నగర్, రాచానపల్లి తదితర ప్రాంతాల్లో సొంత భవనాలతో పాటు పంట పొలాలు ఉన్నాయి. జానెడు జాగా లేని తమను పక్కనపెట్టి ఆర్థికంగా ఉన్న వారికి ఇంటి పట్టాలు మంజూరు చేశారని ఫిర్యాదు చేస్తే రెవెన్యూ అధికారులు పట్టనట్టు వ్యవహరించారని పేదలు ఆరోపించారు. అర్హులైన పేదలు తమకు ఇంటి స్థలం ఇవ్వండని అర్జీలు ఇచ్చినా, అధికారులను కలిసినా కనికరించలేదని వాపోతున్నారు. పట్టాలు ఎంచక్కా అమ్ముకున్నారు! అనంతపురం రూరల్ మండల టీడీపీ నాయకుడిగా చెలామణి అయిన ఓ నాయకుడుతో పాటు రాచానపల్లికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి, మాజీ స్టోర్ డీలర్లు, గతంలో ఇక్కడ పని చేసిన రెవెన్యూ అధికారులు కుమ్మకై దాదాపు 70 ఇంటి పట్టాల వరకు అనర్హులకు కట్టబెట్టారు. దీంతో పట్టాలు పొందిన వారు ఒక్కో పట్టాను దాదాపు రూ.4లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. వారి పట్టాలు రద్దు చేయాలి రాచానపల్లి సర్వే నంబర్ 4– 2లో జారీ చేసిన ఇంటి పట్టాలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి పట్టాలు అమ్ముకున్న వారిని గుర్తించి, వాటిని రద్దు చేసి చర్యలు తీసుకుంటే అసలైన నిరుపేదలక న్యాయం జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. గతంలో రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని మండిపడుతన్నారు. ఈ చిత్రాల్లో కనిపిస్తున్న భవంతులు టీడీపీ నాయకులకు చెందినవి. ఇక్కడ సెంటు స్థలం రూ.15 లక్షల పైమాటే. ఒక్కో టీడీపీ నాయకుడు దాదాపు 5 సెంట్లలో భవంతులు నిర్మించుకున్నారు. ఇలాంటి వారు సైతం అప్పట్లో అధికార బలంతో వారి కుటుంబ సభ్యుల పేర్లు, బినామీ వ్యక్తుల మీద ఒక్కొక్కరు రెండు, మూడు చొప్పున ఇంటి పట్టాలు పొందారు. సిండికేట్‌నగర్ మెయిన్ రోడ్డులో నిర్మించిన టీడీపీ నాయకుల భవంతులు విచారణ చేస్తాం.. అనర్హులకు ఇంటి పట్టాలు మంజూరు చేశారని మాకు ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వం నుంచి పట్టాలు పొంది ఇతరులకు అమ్ముకోవడం చట్టరీత్యా నేరం. ఇదే విషయాన్ని ఆర్డీఓ దృష్టికి తీసుకుపోయాం. క్షేత్రస్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. – లక్ష్మినారాయణరెడ్డి, ఇన్చార్జ్ తహసీల్దార్, అనంతపురం -
లక్షకు మించి రుణాలుంటే పోటీకి అనర్హులు
సాక్షి, హైదరాబాద్: లక్ష రూపాయలకు మించి రుణాలున్న రైతులెవరైనా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారు. లక్ష రూపాయలలోపున్న రైతులకు మాత్రం పోటీ చేయడానికి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల్లోపు రుణమాఫీ ప్రకటించినందున, ఆ మేరకు మినహాయింపు ఇస్తూ సహకార ఎన్నికల అథారిటీ అంతర్గత ఆదేశాలు జారీ చేసింది. ఎవరికైనా రూ.లక్షకు మించి రుణాలుంటే, వారు నామినేషన్ నాటికి లక్షకు పైబడి ఉన్న బకాయిలను చెల్లించాలి. లేదంటే వారి నామినేషన్‌ను తిరస్కరిస్తారు. అదీ రుణమాఫీకి గడువుగా ప్రకటించిన గతేడాది డిసెంబర్ 11లోపు రూ.లక్షలోపు బకాయి ఉన్న రైతులకే వర్తిస్తుంది. ఆ తర్వాత అంతకంటే ఎక్కువ అప్పు చేసి ఉంటే దాన్ని చెల్లించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులకే ఈ నిబంధనలు వర్తిస్తాయి. వాణిజ్య బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులకు ఈ నిబంధనలు వర్తించబోవని స్పష్టంచేశారు. బకాయిలు వసూలు చేసేందుకు సహకారశాఖ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. మహిళలు, బీసీలకు చెరో 1,812 పదవులు.. మొత్తం 906 ప్యాక్స్‌కు ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రతీ ప్యాక్స్‌కు 13 మంది డైరెక్టర్లను రైతులు ఎన్నుకుంటారు. వాటిలో 2 డైరెక్టర్ పదవులు మహిళలకు, మరో 2 డైరెక్టర్ పదవులు బీసీలకు, ఒక డైరెక్టర్ పదవి ఎస్సీ, ఎస్టీల్లో ఎవరో ఒకరికి రిజర్వు చేశారు. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 906 ప్యాక్స్‌ల్లో 11,778 డైరెక్టర్ పదవులుంటే, వాటిల్లో మహిళలకు 1,812 డైరెక్టర్ పదవులు రిజర్వు చేసినట్లయింది. బీసీలకూ 1,812 డైరెక్టర్ పదవులు రిజర్వు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు 906 డైరెక్టర్ పదవులు రిజర్వు చేస్తారు. అయితే ప్యాక్స్ చైర్మన్ పదవులను రిజర్వు చేయలేదు. ప్యాక్స్ ఎన్నికలకు దాదాపు రూ.12 కోట్ల మేరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఆ సొమ్మును ప్యాక్స్‌లే సమకూర్చుకోవాలి. లేదంటే డీసీసీబీ బ్యాంకుల నుంచి అప్పుగా తెచ్చుకోవాలి. ఎన్నికలను బ్యాలెట్‌తోనే నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. ప్యాక్స్ డైరెక్టర్లు ఎన్నికయ్యాక, వారంతా ఆయా జిల్లాల్లోని డీసీసీబీ చైర్మన్లను ఎన్నుకుంటారు. డీసీసీబీ చైర్మన్లు టెస్కాబ్ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ప్యాక్స్ ఎన్నికలయ్యాక డీసీసీబీ, టెస్కాబ్ చైర్మన్ల ఎంపిక ఉంటుంది. -
‘ఇంటి’గుట్టు రట్టు!
సాక్షి, విశాఖపట్నం: నవరత్నాల్లో భాగంగా వైఎస్సార్ గృహ నిర్మాణం పథకం కింద అర్హులందరికీ ఇళ్లు ఇవ్వాలనేదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం. ఈ మేరకు ఇప్పటికే ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. మరో వైపు ఇళ్ల కోసం ‘స్పందన’లో భారీ సంఖ్యలోనే వినతులు దాఖలవుతున్నాయి. ఆయా దరఖాస్తులను బట్టి జిల్లాలోని రూరల్‌లో 68,520, అర్బన్‌లో ఇండివిడ్యువల్ ఇళ్లు 13,898 అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇవి మొత్తం 82,418 ఉన్నప్పటికీ ఈ సంఖ్య లక్ష దాటే అవకాశం ఉందని జిల్లా గృహనిర్మాణ శాఖ అధికారులు భావిస్తున్నారు. వీటి నిర్మాణం కోసం రూరల్‌లో 1,354, అర్బన్‌లో 1,199 ఎకరాలు అవసరం అవుతాయని అంచనా. అవకతవకలకు చెల్లు.. గత టీడీపీ ప్రభుత్వం అందరికీ ఇళ్లు ఇస్తామని ఊరించినప్పటికీ తొలి నాలుగేళ్లూ మంజూరు గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఎన్నికలు సమీపిస్తున్నాయనే తరుణంలో ఇళ్లు మంజూరు కు తెరలేపింది. అర్హతలతో సంబంధం లేకుండా జన్మభూమి కమిటీలు సిఫారసు చేసిన పేర్లన్నీ జాబితాలో చేరిపోయాయి. టీడీపీ ప్రభుత్వం మంజూరైతే చేసింది కానీ నిర్మాణాలకు పైసా కూడా విదల్చలేదు. దీంతో చాలావరకూ నిర్మాణాలు ప్రారంభించలేదు. చాలా చోట్ల పునాది రాయి కూడా వేయలేదు. ఇలాంటివాటిని రద్దు చేయాలన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్ణయం మేరకు గృహనిర్మాణ శాఖ అధికారులు క్షేత్ర పరిశీలన చేశారు. 19,054 ఇళ్లను రద్దు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఇందులో భాగంగా చోడవరంలో జీ ప్లస్ 3 ఇళ్లు 3,936 రద్దు చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు విడుదల చేసింది. అలాగే ఎన్టీఆర్ స్పెషల్ హౌసింగ్ స్కీమ్ (ప్రస్తుతం వైఎస్సార్ స్పెషల్ హౌసింగ్ స్కీమ్‌గా పేరు మారింది) కింద జిల్లాలో మంజూరైన మరో 10,042 ఇళ్లను రద్దు చేయడానికి త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ స్కీమ్‌లో లబ్ధిదారులంతా ఇప్పటికే ఇళ్లను నిర్మించుకున్నారు. కానీ వాటినీ టీడీపీ నాయకులు స్కీమ్‌లో చేర్చేశారు. కొత్త ఇళ్ల మాదిరిగానే సొమ్ము వస్తుందని ఆశ చూపించడం గమనార్హం. మిగతా స్కీమ్‌లన్నీ కొనసాగింపు.. గతంలో మంజూరై పిట్టగోడలు, శ్లాబ్ దశలో ఆగిపోయిన 68,201 ఇళ్లతో పాటు కేంద్ర ప్రభుత్వం హౌసింగ్ పథకాల కింద మంజూరైన 20,158 ఇళ్లను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్సార్ రూరల్ హౌసింగ్ పథకం 2016–17 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన 415 ఇళ్లు, 2017–18లోని 1,896 ఇళ్లు, 2018–19లోని 3,648 ఇళ్లు, 2019–20లోని 1,983 ఇళ్లు మొత్తం 7,942 ఇళ్లకూ నిధుల విడుదలకు అడ్డంకి ఏమీ లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన పీఎంఏవై–వైఎస్సార్ (గ్రామీణ్) 2016–17 స్కీమ్‌లోని 1,879 ఇళ్లు, 2017–18లోని 1,543 ఇళ్లనూ పూర్తి చేయాల్సి ఉంది. అలాగే అర్బన్‌లో పీఎంఏవై–వైఎస్సార్(యూ) బీఎల్సీ 2016–17లోని 1,126 ఇళ్లు, 2017–18లో సిఫారసు చేసిన 468 ఇళ్లతో పాటు మంజూరైన 5,053 ఇళ్లను, అలాగే పీఎంఏవై–వైఎస్సార్ (యూ) యూడీఏ స్కీమ్ 2018–19లో ఎంపిక చేసిన 19,690 ఇళ్లతో పాటు మంజూరైన 37,956 ఇళ్ల నిర్మాణాలకు ఢోకా లేదు. అర్హులందరికీ ఇళ్లు.. ఒక్క వైఎస్సార్ స్పెషల్ హౌసింగ్ 2018–19 స్కీమ్ తప్ప మిగతా 11 రకాల హౌసింగ్ స్కీమ్‌లు కొనసాగుతున్నాయి. వాటికి సంబంధించి మార్చి 31వ తేదీ నాటికి లబ్ధిదారులకు చెల్లించాల్సిన రూ.32 కోట్ల వరకూ బకాయిలు ఉండిపోయాయి. ప్రస్తుతం అవి రూ.64 కోట్లకు చేరాయి. వీటిని ప్రభుత్వం త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఆచరణలోకి వచ్చిన వెంటనే ఇళ్లు, ఇళ్ల స్థలాల మంజూరు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అర్హులైన వారందరికీ ఇల్లు వస్తుందనడంలో సందేహం అక్కర్లేదు. – సి.జయరామాచారి, ప్రాజెక్టు డైరెక్టర్, జిల్లా గృహనిర్మాణ శాఖ -
అనర్హతపై కోర్టుకెళ్తాం
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి సభ్యులుగా తమను అనర్హులను చేస్తూ చైర్మన్ స్వామిగౌడ్ జారీ చేసిన ఉత్తర్వులపై న్యాయ పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్సీలు రాములు నాయక్, భూపతిరెడ్డి, యాదవరెడ్డిలు వెల్లడించారు. స్వామిగౌడ్ నిర్ణయం అనంతరం వారు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడుతూ తమపై అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యయుతం కాదని, ఇది చీకటి రోజని పేర్కొన్నారు. గిరిజన హక్కుల గురించి మాట్లాడినందుకే... నన్ను డిస్క్వాలిఫై చేసినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు. గాంధీతో పోల్చినందుకు నాకు అనర్హత గిఫ్ట్ ఇచ్చారు. సీఎం ఆఫీస్ డైరెక్షన్లోనే స్వామిగౌడ్ మాపై నిర్ణయం తీసుకున్నారు. నేను గవర్నర్ కోటాలో ఎన్నికయ్యా. ఏకపక్షంగా నన్ను అనర్హుడిగా ప్రకటించారు. ఫారూఖ్ హుస్సేన్ కూడా గవర్నర్ కోటాలోనే వచ్చారు. ఆయనపై చర్యలు తీసుకోలేదు కానీ నా గురించి బులెటిన్ ఇచ్చారు. టీఆర్ఎస్ 88 స్థానాలు గెలిచినా సీఎం సెంచరీ కావాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు. ప్రజలు పాలిం చాలని అధికారం ఇస్తే కేసీఆర్ ప్రతిపక్ష నాయకులను లేకుండా చేస్తున్నారు. గిరిజనుల హక్కుల గురించి నేను మాట్లాడినందుకు నన్ను డిస్క్వాలిఫై చేశారు. కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తా. కాంగ్రెస్ పక్షం టీఆర్ఎస్లో విలీనమైన తర్వాత మేము కాంగ్రెస్ ఎమ్మెల్సీలం ఎలా అవుతామో వారికే తెలియాలి. – రాములు నాయక్ చైర్మన్ అధికారాలు తొలగించాలి... మమ్మల్ని అనర్హులను చేసినట్లు మీడియా ద్వారానే తెలిసింది. చట్టాన్ని అవహేళన చేస్తూ మమ్మల్ని డిస్క్వాలిఫై చేశారు. ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు. కాంగ్రెస్‌పక్షం టీఆర్ఎస్లో విలీనమైనప్పుడు మేము పార్టీ మారినట్లు ఎలా అవుతుంది? పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించాలి. చైర్మన్లకు ఉన్న అధికారాలు తొలగించి ఒక కమిటీకి అప్పగించాలి. – యాదవరెడ్డి ఏ పార్టీ గుర్తుపై గెలవకున్నా అనర్హతా? మండలి చైర్మన్ నిర్ణయం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమే. నేను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యా. ఏ పార్టీ గుర్తుపైనా గెలవలేదు. గవర్నర్ కోటాలో ఎన్నిక కాలేదు. నాపై ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్లో విలీనమైనట్లు గెజిట్ విడుదల చేశారు. అలాంటప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుంది? ఏ ప్రాతిపదికన నాపై అనర్హత వేటు వేస్తారు? కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. పెద్దల సభలోనే న్యాయం జరగనప్పుడు ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది? ఈ అంశంపె కోర్టుకు వెళ్తా. – భూపతిరెడ్డి -
‘స్థానిక’ నేతలపై..అనర్హత వేటు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి వ్యయాన్ని చూపించని వారిపై ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా స్పందించింది. వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీరితోపాటు జిల్లాలో ఇద్దరు సర్పంచులు అక్రమాలకు పాల్పడడంతో వారిపై కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ అనర్హత వేటు వేశారు. కాజేసిన సొమ్ములు తిరిగి చెల్లిస్తేనే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత సాధిస్తారు. ఇటు ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించని 292 మందిపైనా అనర్హత వేటు వేశారు. జిల్లాలో 2014 సంవత్సరంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేశారు. వారు ఆ ఎన్నికల్లో ఖర్చు చేసిన నిధుల వివరాలను ఆ తర్వాత ఎన్నికల కమిషన్‌కు అందజేయాల్సి ఉంటుంది. అయినా చాలా మంది స్థానిక ఎన్నికల్లో తాము చేసిన ఖర్చుల వివరాలను అధికారులకు అప్పగించడంలో నిర్లక్ష్యం వహించారు. దీంతో సీరియస్ అయిన ఎన్నికల సంఘం వారిని పోటీకి అనర్హులుగా ప్రకటించింది. జిల్లావ్యాప్తంగా 292మంది జిల్లాపరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేసిన వారంతా ఇపుడు ఎన్నికల్లో పోటీ చేయకుండా పోతున్నారు. రిజర్వేషన్ కలిసొచ్చినా ఉపయోగపడని పరిస్థితి ప్రస్తుత సర్పంచ్ ఎన్నికల్లో ఆయా గ్రామాల్లో పలువురు నాయకులకు రిజర్వేషన్ కలిసొచ్చింది. అయినా, పోటీ చేసేందుకు అనర్హులయ్యారు. ప్రస్తుతం దేవరకొండ డివిజన్ పరిధిలో నామినేషన్ల ప్రక్రియ ముగిసిపోయింది. 2వ, 3వ విడతలో మిర్యాలగూడ, నల్లగొండ డివిజన్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. కాగా, రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చినా, ఎన్నికల సంఘం నిర్ణయం వీరి విషయంలో అశనిపాతమైంది. గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేసిన వారు, ఈసీ నిర్ణయం వల్ల సర్పంచ్ పదవులకు పోటీ పడలేని దుస్థితిలో ఉన్నారు. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి మార్చి, ఏప్రిల్ మాసాల్లో జరగనున్న మండల ప్రాదేశిక, జిల్లా ప్రాదేశిక సభ్యుల ఎన్నికకు జరగాల్సిన ఎన్నికల్లోనూ వీరు పోటీ చేయడానికి అనర్హులే. గత ఎన్నికల్లో పోటీచేసి ఎన్నికల ఖర్చుల లెక్కలు చూపించని కారణంగా ఇప్పుడు పోటీ చేయడానికి అర్హత కోల్పోవడంతో లబోదిబోమంటున్నారు. మరో మూడు నెలల్లో జరగనున్న మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికల్లో ఆయా మండలాల్లో వీరికి రిజర్వేషన్ కలిసి వచ్చినా ఉపయోగం లేకుండా పోనునంది. ఇద్దరు సర్పంచులపై వేటు సర్పంచ్‌లుగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఇద్దరిపై కూడా అనర్హత వేటు పడింది. ఐదేళ్లు సర్పంచ్‌లుగా పనిచేసి అక్రమాలకు పాల్పడ్డారని తేలింది. దీంతో కలెక్టర్ వారిని ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించారు. పీఏపల్లి మండలం ఒక పంచాయతీ సర్పంచ్ అక్రమాలకు పాల్పడ్డాడు. కాజేసిన నిధులను రికవరీ చేయాలని ఆదేశించారు. ఒకవేళ ఆ వ్యక్తి తిరిగి నిధులు చెల్లిస్తే పోటీకి అర్హుడని, లేదంటే అప్పటివరకూ ఏ ఎన్నికలు జరిగినా వారు పోటీ చేసేందుకు అనర్హులేనని ప్రకటించారు. నార్కట్‌పల్లి మండలంలో కూడా ఒక సర్పంచ్‌పై ఈ వేటు పడింది. అ మొత్తానికి జిల్లాలో గత ఎన్నికల్లో పోటీచేసి ఎన్నికల లెక్కలు చూపని 292మందిపై ఎన్నికల కమిషన్ అనర్హత వేటు వేయగా, నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఇద్దరు సర్పంచ్‌లపై కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ అనర్హత వేటు వేశారు. వారు స్వాహా చేసిన నిధులు తిరిగి చెల్లిస్తే అర్హత సాధిస్తారని పేర్కొన్నారు. -
పింఛన్ రికవరీ..!
అనర్హుల నుంచి వసూలుకు అధికారుల సమాయత్తం ఉమ్మడి ఆదిలాబాద్‌లో 3,33,966 మందికి పింఛన్లు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 3,318 మంది పింఛన్ల తొలగింపు రికవరీకి నోటీసుల అందజేత.. ఆందోళనలో లబ్ధిదారులు ఆదిలాబాద్ అర్బన్ : సామాజిక పింఛన్ పథకం(ఆసరా) ద్వారా లబ్ధిపొందిన అనర్హుల నుంచి పింఛన్ డబ్బులు వసూలుకు రంగం సిద్ధమైంది. ఎలాంటి ఆధారం లేని వృద్ధులకు నెలనెల అందిస్తున్న పింఛన్ సొమ్ము పక్కదారి పట్టడంతోపాటు అనర్హులూ పింఛన్ పొందడంతో ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. ఎన్ని రోజుల నుంచి ఆసరా పథకం ద్వారా పింఛన్ పొందుతున్నారు.. ఏ విధంగా పింఛన్ సొమ్ము పక్కదారి పడుతోంది.. అనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఆ లెక్క తేలిన వెంటనే అనర్హుల నుంచి పింఛన్ సొమ్ము రికవరీ చేయడంతోపాటు పక్కదారి పట్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3,33,966 మంది పింఛన్లు నెలనెల తీసుకుంటున్నారు. గత నెలలో సెర్ప్ నుంచి అందిన ఆదేశాల ప్రకారం 3,318 మంది పింఛన్లు తొలగించారు. కాగా, జాబితా నుంచి తొలగించిన కొందరికీ ఇప్పటికే పింఛన్ రికవరీకి సంబంధించిన నోటీసులు అందజేశారు. ఇక వారు తీసుకున్న నెలల వారీగా పింఛన్ డబ్బులు వసూలు చేయాల్సి ఉందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఇలా... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్ని రకాల పింఛన్లు కలిపి 3,33,966 ఉన్నాయి. వీరు ప్రతి నెల పింఛన్ పొందుతున్నారు. పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ప్రతినెల రూ. 48 కోట్లు విడుదల చేస్తోంది. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత, బీడీ కార్మికుల పింఛన్లు కలిపి మొత్తం 62,688 ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో 1,36,353 పింఛన్లు, మంచిర్యాలలో 88,505 పింఛన్లు, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 46,420 పింఛన్లు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాల ప్రకారం మండలాల్లోని ఎంపీడీవోలు అనర్హులు, అర్హుల లెక్క తేల్చి నాలుగు జిల్లాల పరిధిలో ఉన్న 3,318 మంది పింఛన్లను తొలగించారు. తొలగించిన లబ్ధిదారులకు పింఛన్ రికవరీ నోటీసులు సైతం అందజేశారు. ఎన్ని నెలలు, ఎంత సొమ్ము రికవరీ చేస్తారు.. ఎలా రికవరీ చేస్తారనే విషయం తేలాల్సి ఉంది. సొమ్ము దారి మళ్లకుండా... ప్రభుత్వం ఆసరా పింఛన్ల సొమ్ముపై నిఘా పెట్టింది. పక్కదారి పట్టకుండా చర్యలు చేపడుతోంది. పింఛన్ డబ్బులు ముందుగా డీఆర్డీఏకు చేరుతుంది. అక్కడి నుంచి సంబంధిత మండలాల ఎంపీడీవోల ఖాతాల్లో జమ అవుతుంది. ఎంపీడీవోలు పంచాయతీ కార్యదర్శులు, పోస్టల్ అధికారులు, బ్యాంకులకు చెక్కులు జారీ చేస్తారు. ఆ చెక్కులతో సంబంధిత అధికారులు సొమ్మును డ్రా చేసి పింఛన్‌దారులకు పంపిణీ చేయాలి. చనిపోయిన వారి డబ్బులు, పింఛన్ తీసుకునేందుకు రానివారి సొమ్మును అధికారులు ఎంపీడీవోలకు తిరిగివ్వాలి. వారు ఆ సొమ్మును మళ్లీ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. కానీ అలా జరగడం లేదని ఆరోపణలు ఉన్నాయి. పింఛన్ పంపిణీ చేయగా మిగిలిన సొమ్మును కొందరు అధికారులు తమ సొంత పనులకు వాడుకుంటున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై నిఘా పెట్టడంతోపాటు లబ్ధిదారులపై కూడా ప్రభుత్వం ఓ కన్నేసింది. అసలు పింఛన్లు పొందుతున్న వారిలో ఎవరు అర్హులు... ఎవరు అనర్హులు అనే లెక్క తేల్చి సంబంధిత అధికారులకు జాబితా పంపించింది. అ జాబితాలో అనర్హులుగా ఉన్న వారిని తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే అధికారులు పింఛన్ సొమ్ము రికవరీకి సిద్ధమైనట్లు పేర్కొంటున్నారు. ఆదేశాల ప్రకారం రికవరీ చేస్తాం.. అనర్హులు పింఛన్లు పొందితే రికవరీ చేస్తాం. ఆసరా ద్వారా అర్హులతోపాటు అనర్హులు పింఛన్ పొందారని సమాచారం ఉంది. మాకు వచ్చిన ఆదేశాల ప్రకారం అనర్హుల నుంచి పింఛన్ సొమ్మును రికవరీ చేయాలని ఉంది. అనర్హత గల లబ్ధిదారుల నుంచి పింఛన్ సొమ్మును వెనక్కి తీసుకునేందుకు కొంత సమయం పడుతుంది. ప్రభుత్వాదేశాల ప్రకారం తప్పకుండా అనర్హుల నుంచి సొమ్మును రికవరీ చేస్తాం. – రాజేశ్వర్ రాథోడ్, డీఆర్డీవో, ఆదిలాబాద్ -
రుణమాఫీలో ఏరివేత
అనర్హుల లెక్క తేల్చేందుకు సిద్ధమైన సర్కారు సాక్షి, హైదరాబాద్: రైతుల రుణమాఫీలో లబ్ధిపొందిన అనర్హులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతేడాది గ్రామాల్లో అంచనా సర్వే నిర్వహించిన ప్రభుత్వం.. ఈసారి సమగ్రంగా, సంపూర్ణంగా పరిశీలన జరిపేందుకు సిద్ధమైంది. అనర్హులను గుర్తించి జాబితా తయారుచేయాలని యోచిస్తోంది. రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో బుధవారం జరిగిన సమావేశంలో ఆర్థిక శాఖ ఈ మేరకు తమ ఉద్దేశాన్ని బ్యాంకర్లకు వివరించినట్లు తెలిసింది. రుణమాఫీ లబ్ధిదారుల జాబితాను సమగ్రంగా పరిశీలించాలని భావిస్తున్నామని, అందుకోసం లబ్ధిపొందిన 35 లక్షల మంది రైతుల సంపూర్ణ జాబితాను ఇవ్వాలని ఆర్థికశాఖ అధికారులు కోరినట్లు సమాచారం. అయితే తక్షణమే సంపూర్ణ జాబితా ఇవ్వలేమని, కొంత గడువిస్తే వివిధ బ్యాంకుల నుంచి సమాచారం తెప్పించి ఇస్తామని బ్యాంకర్లు స్పష్టం చేసినట్లు తెలిసింది. నెలాఖరు నాటికి ఆర్థికశాఖకు బ్యాంకర్లు సమాచారం ఇచ్చే అవకాశమున్నట్లు చెబుతున్నారు. మూడోసారి విడుదలకు ముందు... రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షలోపు పంట రుణాలకు రుణమాఫీ పథకాన్ని ప్రకటించింది. ఇందుకు 35.82 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించి.. వారికి సంబంధించి సుమారు రూ.17వేల కోట్లు మాఫీ చేయాలని నిర్ణయించింది. నాలుగు విడతల్లో రుణమాఫీ చేస్తామని ప్రకటించి... మొదటి విడతగా 2014లో రూ.4,230కోట్లను బ్యాంకులకు అందజేసింది. ఆ సొమ్ములో రూ.4,040 కోట్లను బ్యాంకులు రైతుల ఖాతాలో మాఫీ చేశాయి. తర్వాత రెండో విడత రుణమాఫీ కింద రూ.4,040 కోట్లను విడుదల చేసింది. ఇంకా రెండు విడతల సొమ్ము రూ.8,080 కోట్లు బ్యాంకులకు ఇవ్వాల్సి ఉంది. ఈ ఏడాది మూడో విడత సొమ్ము రూ.4,040 కోట్లు విడుదల చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం బడ్జెట్లో నిధులు కేటాయించింది. వీటిని వచ్చే జూన్‌లో విడుదల చేసే అవకాశాలున్నాయి. అయితే ఈ నిధులను విడుదల చేయడానికి ముందే రుణమాఫీ లబ్ధిపొందిన బోగస్ రైతులను, అనర్హులను గుర్తించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ పథకం కింద అనర్హులున్నారా, ఉంటే ఎంతమంది ఉండొచ్చు, వారిని ఏరివేస్తే ప్రభుత్వానికి మిగిలేదెంత? అనే అంశాలను సమగ్రంగా పరిశీలించాలని తాజాగా నిర్ణయించినట్లు సమాచారం. ‘బోగస్ పాసు పుస్తకాలు, బినామీ పేర్లతో అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వానికి సమాచారం అందినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తొలి రెండు విడతల జాబితాలను క్షుణ్నంగా పరిశీలించనున్నారు. అవసరాన్ని బట్టి క్షేత్రస్థాయిలోనూ పరిశీలన జరిపే అవకాశాలున్నాయి. గతంలో ప్రతి జిల్లాలో 10 గ్రామాల చొప్పున తనిఖీలు చేశారు. ఈసారి ప్రతి రైతు వివరాలను సమగ్రంగా పరిశీలించి.. నిబంధనల ప్రకారమే వారికి రుణమాఫీ జరిగిందా లేదా పరిశీలిస్తారని తెలిసింది. -
రేషన్ కట్ !
♦ దొడ్డిదారి ‘రేషన్ కార్డులకు’ చెల్లుచీటీ ♦ 19 వేల ఆహారభద్రత కార్డుల తొలగింపు ♦ ఎన్ఐసీతో సమాచారం విశ్లేషించి నిర్ధారణ ♦ అనర్హులుగా తేలడంతో తీసివేతలు.. దొడ్డిదారిన రేషన్‌కార్డులు పొందిన అక్రమార్కులపై జిల్లా యంత్రాంగం కొరడా ఝళిపిస్తోంది. తాజాగా మరో 19 వేల మంది అనర్హుల పేర్లను ఆహారభద్రత జాబితా నుంచి తొలగించింది. రాష్ట్ర ఖజానాకు గుదిబండగా మారిన ప్రజాపంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తున్న ప్రభుత్వం.. ఆహారభద్రతలో అనర్హుల ఏరివేతకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటోంది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఆధార్ సీడింగ్‌తో ప్రతి యూనిట్ సమాచారాన్ని నిక్షిప్తం చేసిన జిల్లా యంత్రాంగం.. ఇప్పుడు ఆ సమాచారాన్ని ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్)తో అనుసంధానిస్తోంది. తద్వారా ఉద్యోగుల తల్లిదండ్రులు, పొరుగు రాష్ట్రాల్లో కార్డు కలిగిఉన్నవారి చిట్టాను రాబట్టింది. అదేసమయంలో ఆధార్‌తో సరిపోలని కార్డుదారుల జాబితా కూడా ఎన్ఐసీ సేకరించింది. అలాగే ఉద్యోగులు హెల్త్‌కార్డుల్లో పొందుపరిచిన సమాచారంతో వడపోత జరిపారు. ఈ నేపథ్యంలోనే 19,451 మంది అనర్హులున్నట్లు గుర్తించారు. ఫిబ్రవరి కోటాలో 8,395, మార్చి కోటాలో 11,056 కార్డులు అక్రమమని నిర్ధారించారు. ఈ కార్డుల తొలగింపుతో నెలకు 1,064 మెట్రిక్ టన్నుల బియ్యం ఆదా అవుతుందని అధికారవర్గాలు తెలిపాయి. మార్చి నుంచి ఈ- పాస్ యంత్రాలు ప్రజాపంపిణీ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. మార్చి నుంచి ఈ-పాస్ యంత్రాలను ప్రవేశపెడుతోంది. గ్రేటర్ పరిధిలోని మూడు సర్కిళ్లలో ఈ విధానాన్ని అమలు చేయనుంది. సర్కిల్‌కు 35 యంత్రాల చొప్పున ప్రవేశపెడుతున్న అధికారులు.. వీటిని చౌకధరల దుకాణాలకు అందజేశారు. నిత్యావసర సరుకులు తీసుకునేందుకు వచ్చే కార్డుదారుల వేలిముద్రల ఆధారంగా రేషన్‌ను పంపిణీ చేయనున్నారు. అదేసమయంలో ఏరోజుకారోజు సరుకు పంపిణీకి సంబంధించిన సమాచారం పౌరసరఫరాలశాఖకు చేరనుంది. మరోవైపు జీపీఎస్ యంత్రాలను కూడా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా నిత్యావసరాలు పక్కదారి పట్టకుండా నిఘా పెట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు జీపీఎస్, వెహికల్ ట్రాకింగ్ యూనిట్లను కూడా ప్రవేశపెట్టే దిశగా కసరత్తు చేస్తోంది. -
అనర్హులకు అడ్డుకట్ట వేయండి
అప్పుడే ప్రభుత్వ లక్ష్యం సిద్ధిస్తుంది: సీఎం కేసీఆర్ * పాములపర్తి గ్రామానికి వరాల జల్లు కురిపించిన సీఎం వర్గల్: ప్రభుత్వ పథకాలు అనర్హుల పరం కాకుండా.. ప్రజలు అప్రమత్తంగా ఉండి అడ్డుకట్ట వేయాలని, అపుడే అర్హులకు ప్రయోజనం చేకూరుతుందని, ప్రభుత్వ లక్ష్యం కూడా సిద్ధిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. అనర్హులను ప్రజలు గుర్తించినట్లయితే వెంటనే అధికారులకు సమాచారమివ్వాలని సూచించారు. ఆదివారం మధ్యాహ్నం ఫాంహౌస్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న సీఎం కేసీఆర్ వర్గల్ మండలం పాములపర్తి గ్రామాన్ని సందర్శించారు. ఆ గ్రామపంచాయతీ చావిడి వద్ద చెట్టునీడలో గ్రామస్తులతో గంటసేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ గ్రామానికి వివిధ అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని అభ్యర్థిస్తూ సర్పంచ్ చంద్రకళ, ఎంపీటీసీ సభ్యురాలు స్వప్న ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేశారు. దీంతో ఆ వినతిపత్రాన్ని నిశితంగా పరిశీలించిన కేసీఆర్.. అందులోని అంశాలను ఒక్కొక్కటిగా చదువుతూ దాదాపు రూ.10 కోట్ల పైచిలుకు అంచనాలతో కూడిన పనులను అక్కడికక్కడే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాలు సహా 150 ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 10 రోజుల్లో మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని, మోడల్ కాలనీగా తీర్చిదిద్దేందుకు కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తానన్నారు. రూ. 50 లక్షలతో ఫంక్షన్ హాల్ (కల్యాణ మండపం), రూ.10 లక్షలతో వైకుంఠధామం, రూ. 20 లక్షలతో అంగన్వాడీ భవనాలు, రూ. 50 లక్షలతో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, రూ. 70 లక్షలతో మురుగు తొలగింపు కాల్వ, గ్రామ పంచాయతీకి 2 అదనపు గదులు, తాగునీటి సమస్య పరిష్కారానికి 3 బోర్లు, మోటార్లు, హైస్కూల్‌కు కాంపౌండ్ వాల్ నిర్మాణం, వెటర్నరీ ఆసుపత్రి భవనం, పాములపర్తితోపాటు, పాతూరులో తాగునీటి కోసం పైప్లైన్లు, సీసీ రోడ్ల కోసం నిధులు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఊళ్లోకి బస్సు వచ్చేలా ఆర్టీసీ అధికారులను ఆదేశించిన సీఎం, బస్ షెల్టర్‌ను కూడా మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సీఎంను వేడుకున్న ఇద్దరు మహిళలకు సీఎం ఫండ్ నుంచి రూ. లక్ష చొప్పున మంజూరు చేశారు. కలత చెందవద్దు.. ఖర్చు ఎంతైనా భరిస్తా.. చికిత్స కోసం వికలాంగుడిని తన వెంటే తీసుకెళ్లిన సీఎం కేసీఆర్ ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తిపేరు కనకస్వామి. నల్లగొండ జిల్లా భువనగిరి నివాసి. వెల్డింగ్ పని చేసుకుంటూ ఉపాధి పొందుతుండగా ప్రమాదవశాత్తు రెండు చేతులు కోల్పోయాడు. కృత్రిమ అవయవాలు పెట్టిం చుకోవాలంటే రూ. లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా ములుగు మండలం నాగిరెడ్డిపల్లిలోని అత్తగారింటికి వచ్చిన ఆ యువకుడు పక్కనే ఉన్న పాములపర్తికి సీఎం కేసీఆర్ వస్తున్నట్లు తెలిసి అక్కడకు చేరుకున్నాడు. సీఎం వద్దకు అతికష్టంగా చేరుకున్న కనకస్వామి.. సగంవరకు తెగిన రెండుచేతులను చూపుతూ తనకు సాయం చేయాలని అభ్యర్థించారు. అతన్ని దగ్గరకు తీసుకొని అప్యాయంగా మాట్లాడిన సీఎం ఏం సాయం కావాలని అడిగాడు. కృత్రిమ అవయవాలకు ఇరవై లక్షల రూపాయలు అడిగారని, నాకు చేతులు పెట్టించండని అభ్యర్థించాడు. సానుకూలంగా స్పందించిన సీఎం వెంటనే తన విజిటింగ్ కార్డును అందజేసి సోమవారం హైదరాబాద్‌కు రావాలని చెప్పా డు. కలత చెందొద్దు, ఖర్చు ఎంతైనా సరే కృత్రిమ అవయవాలు పెట్టిస్తానని చెప్పారు. అయితే, తన వెంట బావమరిది పరుశురాము లు ఉన్నాడని చెప్పడంతో.. ఇపుడే నా వెంట వచ్చేయ్.. అని చెప్పి తనతోపాటు వెంట ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వాహనంలో కనకస్వామిని చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లారు. -
టీడీపీకి మద్దతివ్వలేదని పింఛన్లు తొలగించారు
హైకోర్టును ఆశ్రయించిన బాధితులు హైదరాబాద్: అధికార పార్టీకి మద్దతు తెలపడం లేదన్న నెపంతో వృద్ధాప్య, వికలాంగ, వితంతు పింఛన్లకు అనర్హులుగా ప్రకటించి జాబితా నుంచి తమ పేర్లను తొలగించారని, ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దాదాపు 50 మంది హైకోర్టును ఆశ్రయించారు. పింఛన్లు పొందేందుకు అనర్హులుగా చేస్తూ గ్రామ పంచాయతీ పెన్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై తమ అప్పీళ్లను పరిశీలించి అర్హుల జాబితాలో చేర్చేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఈ మేరకు అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన సబ్బెల సూర్యనారాయణరెడ్డితోపాటు మరో 49 మంది పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా పెన్షన్ల కమిటీ మెంబర్ కన్వీనర్, మండల పెన్షన్ల కమిటీ మెంబర్, గ్రామ పంచాయతీ పెన్షన్ల కమిటీ మెంబర్ కన్వీనర్, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. -
అనర్హులకు ఆసరా
ఇదే గ్రామానికి చెందిన దాసరి కృష్ణవేణి భర్త లింగయ్య పుట్టుకతోనే మూగ. చిన్న గుడిసె తప్ప మరే ఆస్తిపాస్తుల్లేని నిరుపేద కుటుంబం. లింగయ్య మిషన్ కుట్టి సంపాదిస్తేనే కుటుంబ గడిచేది. గత కొన్నేళ్లుగా లింగయ్యకు పింఛన్ వస్తుండగా, ప్రస్తుతం ఆగిపోయింది. మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నా పట్టించుకునే నాథుడేలేరు. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : జిల్లాలో ఆసరా పథకం అభాసుపాలవుతోందనడానికి ఇంతకంటే ఉదాహరణలు ఏం కావాలి? అర్హులైన వారు చెప్పులరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నా పింఛన్ ఇవ్వని అధికారులు... అన్ని ఆస్తుపాస్తులుండీ, ఎలాంటి వైకల్యంలేని శ్రీమంతులకు మాత్రం డబ్బులిస్తే చాలు.. ఇంటికొచ్చి మరీ పింఛన్ అందించి వెళుతున్నారు. ఇందుకు నిదర్శనం కాటారం మండలం గంగారం గ్రామం. ఈ పంచాయతీ పరిధిలో అనర్హులకు పింఛన్లు ఇస్తున్నారంటూ అందిన సమాచారంపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. గ్రామంలో ఎంతమందికి పింఛన్లు మంజూ రు చేశారనే జాబితాను సంపాదించి అందులోని అర్హులెందరు? అనర్హులెందరు? అనే అంశాలను లోతుగా పరిశీలించింది. ఆ జా బితాలో పేర్కొన్క వారి ఇళ్లకు వెళ్లి వారి ఆర్థిక, వైకల్య పరిస్థితులను తెలుసుకునే క్రమంలో విస్తుగొలిపే వాస్తవాలు బయటపడ్డాయి. గంగారం గ్రామంలో మొత్తం 400 మందికిపైగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోగా, 382 మందిని అర్హులుగా ప్రకటిస్తూ జాబితా రూపొందించారు. మార్గదర్శకాలను అనుసరిస్తే ఈ జాబితాలో అతి కొద్దిమంది మాత్రమే పింఛన్లకు అర్హులని తేలింది. 350 మంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం పింఛన్లకు అనర్హులు. కొందరైతే తమకు వైకల్యం లేకున్నా నకిలీ ధ్రువీకరణ పత్రాలు సంపాదించి వికలాంగుల కోటాలో అర్హత సంపాదించడం విశేషం. నిబంధనల ప్రకారం అన్ని అర్హతలుండీ... తినడానికి తిండి కూడా లేని నిర్భాగ్యులు ఇదే ఊరిలో ఉన్నారు. వాళ్లు పింఛన్ ఇవ్వండి మహాప్రభో అంటూ దరఖాస్తు చేసుకున్నా, అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరవుయ్యారు. ఇదే గ్రామానికి చెందిన దాసరి కృష్ణవేణి భర్త లింగయ్య పుట్టుకతోనే మూగ. చిన్న గుడిసె తప్ప మరే ఆస్తిపాస్తుల్లేని నిరుపేద కుటుంబం. లింగయ్య మిషన్ కుట్టి సంపాదిస్తేనే కుటుంబం గడిచేది. కొన్నేళ్లుగా లింగయ్యకు పింఛన్ వస్తుండగా, ప్రస్తుతం ఆగిపోయింది. మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నా పట్టించుకునే నాథుడే లేరు. ఇదే గ్రామానికి చెందిన బండారి రాజయ్య కొడుకు శంకర్ చిన్నప్పటి నుంచే మానసిక వికలాంగుడు. నిరుపేద కుటుంబానికి పూట గడవడమే నానా కష్టం. మొన్నటి వరకు శంకర్‌కు ఫింఛన్ ఇచ్చేవారు. ఆసరా కోసం నాలుగైదుసార్లు దరఖాస్తు చేసుకున్నా.. పింఛన్ రావడం లేదు. కొడుకును తీసుకుని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునేనాథుడే లేరు. జిల్లాలో సగానికి పైగా అక్రమాలే! ఆసరా పథకంలో అక్రమాలు గంగారం గ్రామానికే పరిమితం కాలేదు. అర్హులను పక్కనపెట్టి అనర్హులకు ఏవిధంగా పింఛన్లు మంజూరు చేస్తున్నారడానికి గంగారం ఒక ఉదాహరణ మాత్ర మే. జిల్లావాప్తంగా దాదాపు ఇదే పరిస్థితి. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు ఆరు లక్షల మంది వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛ న్ల కోసం దరఖాస్తు చేసుకోగా, 3,65,815 మందిని అర్హులుగా ప్రకటించారు. అధికారులు ఆమోదించిన జాబితాలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిశీలిస్తే సగం మంది పింఛన్లకు అనర్హులే. స్థానిక ప్రజాప్రతినిధుల పైరవీలు, అధికార పార్టీ నేతల అండతోపాటు అధికారులకు అమ్యామ్యాలు ముట్టజెప్పడం ద్వారా అనర్హులైన వారు సైతం పింఛన్లకు అర్హత సాధించారు. వికలాంగులకు నెలకు రూ.1500 ఇస్తుండటం తో వైకల్యం లేని వాళ్లు కూడా అధికారులకు డబ్బులు ముట్టజెప్పి సదరెం సర్టిఫికెట్లు సంపాదించి వికలాంగులకు దక్కాల్సిన పింఛన్లు పొందుతున్నారు. అట్లాగే నూటికి నూరుశాతం వైకల్యం ఉండి, బతుకుదెరువు కష్టమైన నిర్భాగ్యులకు మాత్రం నేటికీ పింఛన్లు మంజూరు కాకపోవడం బాధాకరం. వీరంతా ప్రతిరోజు తమకు పింఛన్లు ఇప్పించండి మహాప్రభో అంటూ జిల్లా ప్రభుత్వాసుపత్రి, మండల కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. వారం వారం ప్రజావాణి కార్యక్రమానికి హాజరై తమగోడు వెళ్లబోసుకుంటున్నా ఫలితం కన్పించకపోవడంతో దిక్కుతోచక బతుకు నెట్టుకొస్తున్నారు. అధికారవర్గాల సమాచారం ప్రకారం... పింఛన్ పొందడానికి అన్ని అర్హతలున్న వారు జిల్లాలో సుమారు 25 వేల మందికిపైగా ఉన్నట్లు అంచనా. స్థానిక ప్రజాప్రతినిధుల అండలేకపోవడం, అధికారులను ‘సంతృప్తి’ పర్చకపోవడం వంటి అంశాలతోపాటు చిన్న చిన్న సాంకేతిక కారణాలను సాకుగా చూపి పింఛన్లు ఇవ్వకుండా తిప్పుతున్నట్లు తెలుస్తోంది. ్చఆఫీసుల చుట్టు తిరిగి తిరిగి బేజారైనం నా పేరు దాసరి కృష్ణవేణి. నాభర్త పేరు లింగయ్య. ఆయన పుట్టుకతోనే మూగ. మేము చాలా పేదోళ్లం. ఉండటానికి చిన్న గుడిసె తప్ప ఏమి లేదు. మాకు ఒక కూతురు, కొడుకు. నా భర్త మిషన్ కుట్టి సంపాదిస్తేనే గడుత్తది. సానా ఏళ్ల నుంచి ఫించన్ అత్తంది. మొన్న కొత్త పింఛన్లు అచ్చిన కాడినుంచి మా ఆయన ఫించన్ బంద్ అయింది. మూడుసార్ల దరఖాస్తు చేసుకున్నం. ఆఖరికి మూగాయిన అని సర్టిఫికెట్ తెచ్చుకొమ్మన్నరు. డాక్టర్ల దగ్గరకు పోతే నీవు మూగోనివి కాదు పో అన్నరు. పైసలు ఇత్తే సర్టిఫెకెట్ ఇస్తా అన్నారు. ఆళ్ల ఈళ్ల కాళ్లమీద పడి సర్టిఫికెట్ తెచ్చుకున్నం. పుట్టు మూగ అని ఊరోళ్లందరికీ తెలుసు. కానీ అధికారులకు మాత్రం కాయితం ఉంటనే తెలుస్తదట. మూడు నెల్ల పెంచన్ రాకా ఇబ్బందిపడుతున్నం. సర్టిఫికెట్ ఉన్న పెన్షన్ ఇస్తలేరు నా పేరు బండారి రాజయ్య. మాది కాటారం మండలం గంగారం. నా కొడుకు పేరు శంకర్. ముప్పై ఏండ్లుంటయ్. చిన్నప్పటి నుంచి మానసిక వికలాంగుడు. చాలా ఏళ్ల నుంచి పింఛన్ అత్తంది. ఈ మూడు నెలల నుంచి పింఛన్ ఇత్తలేరు. మానసిక వికలాంగుడు అని సర్టిఫికెట్ తెచ్చుకోమంటే తెచ్చుకున్న. నాలుగు సార్ల దరఖాస్తు చేసిన కానీ మమ్మల్ని పట్టించుకునేవాళ్లే లేరు. నేను ముసలోన్ని. ఎప్పటికి తిరగాలంటే చేతనైతలేదు. ముంద ట ఉన్న మనిషి కాదని అధికారులు కాయితాన్ని నమ్ముతరట. నా భార్య, నేను ఇద్దరం ముసలోల్లమే. మాది మాకు పూట గడుసుడే తిప్పలైతంది. -
ఇస్టులకే పింఛన్లు
పింఛన్ల జాబితాలో అర్హుల పేర్లు తొలగించడం దుమారం రేపుతోంది. ఆనక అనర్హులకు పింఛన్లు చెల్లించడం ప్రభుత్వ ప్రతిష్టను మసకబారేలా చేస్తోంది. ఈ ఉదంతంలో తెలుగుదేశం పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు వివాదస్పదమవుతోంది. రాజకీయాలతో తమకు పని లేదని, అయినా తమ జీవితాలతో ఇలా చెలగాటమాడటం ఎంత వరకు సమంజసమని బాధితులు ప్రశ్నిస్తున్నారు. చక్రాయపేట:చక్రాయపేట మండలం గంగారపువాండ్లపల్లెకు చెందిన పింఛన్‌దారుల పేర్లను జాబితా నుంచి తొలగించడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విచారణ అనంతరం అర్హులైన చాలా మందిని పింఛన్ల కమిటీ అనర్హులుగా తేల్చడంతో వారి పేర్లను పీకేశారు. అక్టోబర్ వరకు ఫించన్లు అందుకున్న వారు నవంబర్ వచ్చేసరికి ఏ విధంగా అనర్హులయ్యారో అర్థం కావడం లేదంటున్నారు. ఏ ప్రాతిపదికన తమను అనర్హులుగా తేల్చారో చెప్పాలని పట్టుబడుతున్నారు. తొలగించిన వారి పేర్లను పరిశీలిస్తే... ఎద్దులవాండ్లపల్లెకు చెందిన పెద్దెరికల నాగమ్మ వృద్ధురాలు. భర్తకు వయసు మీదపడింది. దానికి తోడు అనారోగ్యం వెంటాడుతోంది. మంచం నుంచి కదలలేని స్థితి. మరే దిక్కు లేదు. ఆమెకు గత నెలలో పింఛన్ ఇచ్చారు. నవంబర్ వచ్చేసరికి జాబితాలో పేరు లేదంటూ డబ్బులు ఇవ్వలేదు. గంగారపువాండ్లపల్లెకు చెందిన డేరంగుల రామక్క వితంతువు. ఆమెకు తలదాచుకునేందుకు కనీసం ఇల్లు కూడా లేదు. భూమి లేదు. ఆమె పేరును పింఛ న్ల జాబితాలో లేకుండా చేశారు. అదే గ్రామానికి చెందిన జె.నాగమ్మదీ అదే పరిస్థితి. ఇలా మరో 15 మంది పేర్లను జాబితా నుంచి తొలగించారు. కక్షతోనే ఇలా చేశారు పైన పేర్కొన్న వారంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గీయులుగా భావించారు. దీంతో వారి పేర్లను టీడీపీ నాయకులు పట్టుబట్టి పింఛన్ల జాబితా నుంచి తొలగించేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరు అర్హులట.. గంగారపువాండ్లపల్లెకు చెందిన జరిపిటి నారాయణమ్మ(ఖాతా నెంబరు 31)కు అనువంశిక ంగా 8.38 ఎకరాలు వచ్చినట్లు రెవెన్యూ రికార్డులు తెలుపుతున్నాయి. అదే గ్రామానికి చెందిన పెద్దారికల పెద్ద గంగిరెడ్డి(ఖాతా నెంబరు 43)లో 6.29 ఎకరాల భూమి ఉంది. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఐదెకరాల భూమి ఉంటే పింఛన్‌కు అనర్హులు. అయితే వీరు టీడీపీ వర్గానికి చెందిన వారు కావడంతో వీరి పేర్లు పింఛన్ల జాబితాలో పదిలంగా ఉన్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇవి ఉదాహరణ మాత్రమే. అధికారులు సమగ్ర విచారణ జరిపితే ఇటువంటి మరెన్నో ఉదంతాలు వెలుగులోకి వస్తాయి. -
9.16 లక్షల మంది పింఛన్లకు కోత
సాక్షి, హైదరాబాద్: అనర్హుల ఏరివేత పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాత పింఛనుదారుల్లో 9,16,310 మందిని తొలగించింది. సెప్టెంబర్ వరకు 13 జిల్లాల్లో మొత్తం 43,12,533 మంది పింఛన్లు పొందుతుండగా, అక్టోబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 33,96,223 మందికే పింఛన్లు విడుదల చేసింది. పింఛనుదారులలో అనర్హులను గుర్తించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు కమిటీలు 3,34,569 మందిని అనర్హులుగా నిర్ధారించాయి. ఈ కమిటీలు అర్హులుగా పేర్కొన్న జాబితాను సైతం ప్రభుత్వం గత రెండు రోజులుగా పునఃపరిశీలించి, మరో 4.70 లక్షల మందికిపైగా అనర్హులంటూ వారి పింఛన్లకు కోతపెట్టింది. అలాగే పాతవారిలో 1,11,372 మంది గ్రామ సభల సమయంలో అందుబాటులోకి రాకపోవడంతో వారినీ అనర్హులుగా తేల్చారు. -
మోసకారి బాబును అనర్హుడిగా ప్రకటించాలి
అనంతపురం టవర్‌క్లాక్ : తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబును ముఖ్యమంత్రి పదవికి అనర్హుడిగా ప్రకటించాలని వామపక్షపార్టీల నేతలు ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేశారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జగదీష్‌తోపాటు సీపీఐ సీనియర్ నాయకుడు ఎంవీ రమణ, సీపీఎం నగర కార్యదర్శి రాంభూపాల్, నల్లప్ప, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకరరెడ్డి, సీపీఐ ఎంఎల్ నాయకుడు చంద్రశేఖర్, ఎస్‌యూసీఐ నాయకులు రాఘవేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ... ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా చంద్రబాబు నె రవేర్చలేదని దుయ్యబట్టారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చె ప్పి ఉన్న ఉద్యోగాలను ఊడదీస్తున్నారని, రైతుకు అండగా నిలవాల్సిన బాబు వ్యవసాయాన్ని బ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. రైతులు, మహిళలను మొండి బకాయిదారులుగా మార్చి ఆయా వర్గాలను నీరు గార్చారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే రూ. 8లక్షల కోట్లు అవసరమవుతాయని, ఇంత భారీ బడ్జెట్‌ను ఎక్కడ నుంచి తెస్తారని నిలదీశారు. అక్టోబర్‌లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలు పాలకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈనెల 29 నుంచి అక్టోబర్ 12 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపటుతున్నట్లు ప్రకటించారు. 13న అన్ని మండల కార్యాలయాల ఎదుట ఆందోళన చేపడతామని, మహిళలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. -
రెండు లక్షల మంది పింఛన్ దారుల పై వేటు