సాక్షి, హైదరాబాద్: శాసనమండలి సభ్యులుగా తమను అనర్హులను చేస్తూ చైర్మన్ స్వామిగౌడ్ జారీ చేసిన ఉత్తర్వులపై న్యాయ పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్సీలు రాములు నాయక్, భూపతిరెడ్డి, యాదవరెడ్డిలు వెల్లడించారు. స్వామిగౌడ్ నిర్ణయం అనంతరం వారు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడుతూ తమపై అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యయుతం కాదని, ఇది చీకటి రోజని పేర్కొన్నారు.
గిరిజన హక్కుల గురించి మాట్లాడినందుకే...
నన్ను డిస్‌క్వాలిఫై చేసినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు. గాంధీతో పోల్చినందుకు నాకు అనర్హత గిఫ్ట్ ఇచ్చారు. సీఎం ఆఫీస్ డైరెక్షన్‌లోనే స్వామిగౌడ్ మాపై నిర్ణయం తీసుకున్నారు. నేను గవర్నర్ కోటాలో ఎన్నికయ్యా. ఏకపక్షంగా నన్ను అనర్హుడిగా ప్రకటించారు. ఫారూఖ్ హుస్సేన్ కూడా గవర్నర్ కోటాలోనే వచ్చారు. ఆయనపై చర్యలు తీసుకోలేదు కానీ నా గురించి బులెటిన్ ఇచ్చారు. టీఆర్‌ఎస్ 88 స్థానాలు గెలిచినా సీఎం సెంచరీ కావాలని చూస్తున్నారు.
ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు. ప్రజలు పాలిం చాలని అధికారం ఇస్తే కేసీఆర్ ప్రతిపక్ష నాయకులను లేకుండా చేస్తున్నారు. గిరిజనుల హక్కుల గురించి నేను మాట్లాడినందుకు నన్ను డిస్‌క్వాలిఫై చేశారు. కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తా. కాంగ్రెస్ పక్షం టీఆర్‌ఎస్‌లో విలీనమైన తర్వాత మేము కాంగ్రెస్ ఎమ్మెల్సీలం ఎలా అవుతామో వారికే తెలియాలి.
– రాములు నాయక్
చైర్మన్ అధికారాలు తొలగించాలి...
మమ్మల్ని అనర్హులను చేసినట్లు మీడియా ద్వారానే తెలిసింది. చట్టాన్ని అవహేళన చేస్తూ మమ్మల్ని డిస్‌క్వాలిఫై చేశారు. ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు. కాంగ్రెస్‌పక్షం టీఆర్‌ఎస్‌లో విలీనమైనప్పుడు మేము పార్టీ మారినట్లు ఎలా అవుతుంది? పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించాలి. చైర్మన్‌లకు ఉన్న అధికారాలు తొలగించి ఒక కమిటీకి అప్పగించాలి. – యాదవరెడ్డి
ఏ పార్టీ గుర్తుపై గెలవకున్నా అనర్హతా?
మండలి చైర్మన్ నిర్ణయం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమే. నేను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యా. ఏ పార్టీ గుర్తుపైనా గెలవలేదు. గవర్నర్ కోటాలో ఎన్నిక కాలేదు. నాపై ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్‌లో విలీనమైనట్లు గెజిట్ విడుదల చేశారు. అలాంటప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుంది? ఏ ప్రాతిపదికన నాపై అనర్హత వేటు వేస్తారు? కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. పెద్దల సభలోనే న్యాయం జరగనప్పుడు ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది? ఈ అంశంపె కోర్టుకు వెళ్తా.
– భూపతిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment