సాక్షి, ఖమ్మం: అధికార పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటనకు ఇంకా ఒక్కరోజే ఉంది. ఈలోపు టికెట్ల కుంపటి భగ్గుమనే స్థాయికి చేరుకుంది. ఖమ్మం జిల్లాలోనూ బీఆర్ఎస్లో టికెట్ల వార్ కొనసాగుతుండగా.. వైరాలో అది మరో టర్న్ తీసుకుంది.
వైరా టికెట్ తనకే మళ్లీ వస్తుందంటూ ఎమ్మెల్యే రాములు నాయక్ ధీమాగా ఉండగా.. తమకే వస్తుందంటూ అనుచరులతో హల్ చల్ చేయించుకుంటున్నారు మాజీలు మదన్‌లాల్, బానోతు చంద్రావతిలు. ఈ క్రమంలో మదన్‌లాల్‌కే టికెట్ అనే ప్రచారాన్ని బలంగా తీసుకెళ్తున్న ఆయన వర్గీయులకు ఊహించని ఝలక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ రాసలీలలు ఫోటోలు తెరపైకి వచ్చి వైరల్ ప్రకంపనలు సృష్టించాయి.
వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ ఓ మహిళతో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు ప్రస్తుతం అక్కడి వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియా అకౌంట్లలో చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? అంటూ ప్రత్యర్థి గ్రూపులు ప్రశ్నలు గుప్పిస్తున్నాయి.
అయితే.. అవి మార్ఫింగ్ ఫొటోలు అని, మదన్‌లాల్‌కే బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇవ్వనుందని, అది తట్టుకోలేకే ఎమ్మెల్యే రాములు నాయక్ వర్గమే ఈ పని చేయించిందని మదన్‌లాల్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. రాములు నాయక్ వర్గం మాత్రం ఆ అవసరం తమకు లేదని చెబుతోంది.
డీజీపీకి ఫిర్యాదు చేస్తా: మదన్‌లాల్
తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మార్పింగ్ చేసిన ఫొటోలతో తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. మరోవైపు ఈ ప్రచారంపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment