సాక్షి, హైదరాబాద్: గుండ్లపోచంపల్లి సమీపంలో మల్లన్న గుట్టమీద ఉన్న ఆదిమానవుల కాలం నాటి రాతి చిత్రాలు అరుదైనవి, అత్యంత విలువైనవిగా రాష్ట్ర వారసత్వ శాఖ (పురావస్తు శాఖ) గుర్తించింది. వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని, వెంచర్ల కోసం రియల్ వ్యాపారులు ఆ ప్రాంతాన్ని చదును చేస్తుండటంతో ఈ రాతి చిత్రాలున్న గుట్ట ప్రమాదంలో పడిందని ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాములు నాయక్ వెల్లడించారు.
గుండ్లపోచంపల్లి గుట్టల్లో ఉన్న రాతి చిత్రాల తావులను రియల్ వెంచర్ల విస్తరణతో ధ్వంసమవుతున్న తీరును వివరిస్తూ ‘‘చరిత్రను చెరిపేస్తున్నారు’’శీర్షికతో మంగళవారం ‘సాక్షి’ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనికి స్పందించిన తెలంగాణ వారసత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాములు నాయక్ ఆ శాఖ అధికారులు భానుమూర్తి, సైదులు, సతీశ్‌లతో కలిసి మంగళవారం మధ్యాహ్నం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.
అక్కడ నాలుగు ప్రాంతాల్లో ఆదిమానవుల చిత్రాలున్నట్టు గుర్తించామని, మూడు తావులను పరిశీలించామని, రెండు చోట్ల చిత్రాలున్నాయని రాములు నాయక్ ‘సాక్షి’తో చెప్పారు. ఆ నాలుగు రాక్ పెయింటింగ్ షెల్టర్లను కాపాడేందుకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు వివరించారు.
వెంటనే పరిరక్షించాలి: కొత్త తెలంగాణ చరిత్ర బృందం
ఆ అరుదైన రాతి చిత్రాలను వెంటనే పరిరక్షించని పక్షంలో ధ్వంసమయ్యే ప్రమాదముందని కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఆ బృందం సభ్యులు వేముగంటి మురళి, భద్ర గిరీశ్, డా.మండల స్వామి, మనోజ్‌లతో కూడిన బృందం వాటిని పరిశీలించింది.
తెలంగాణ ప్రాంతంలో ఏనుగుల మనుగడ ఉండేదనటానికి సాక్ష్యంగా అక్కడ ఏనుగు చిత్రముందని, విచిత్రమైన ఆకృతుల్లో ఉన్న జంతువుల చిత్రాలున్నాయని, 10 వేల ఏళ్ల నుంచి 4 వేల ఏళ్ల క్రితం వరకు వివిధ కాలాల్లో బొమ్మలు గీసిన జాడలున్నాయని తెలిపారు. భవిష్యత్తులో కొత్త అధ్యయనాలకు ఇవి దోహదపడే అవకాశం ఉన్నందున వాటిని పరిరక్షించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment