Primitive human
-
అవి అరుదైనవి... విలువైనవే
సాక్షి, హైదరాబాద్: గుండ్లపోచంపల్లి సమీపంలో మల్లన్న గుట్టమీద ఉన్న ఆదిమానవుల కాలం నాటి రాతి చిత్రాలు అరుదైనవి, అత్యంత విలువైనవిగా రాష్ట్ర వారసత్వ శాఖ (పురావస్తు శాఖ) గుర్తించింది. వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని, వెంచర్ల కోసం రియల్ వ్యాపారులు ఆ ప్రాంతాన్ని చదును చేస్తుండటంతో ఈ రాతి చిత్రాలున్న గుట్ట ప్రమాదంలో పడిందని ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాములు నాయక్ వెల్లడించారు. గుండ్లపోచంపల్లి గుట్టల్లో ఉన్న రాతి చిత్రాల తావులను రియల్ వెంచర్ల విస్తరణతో ధ్వంసమవుతున్న తీరును వివరిస్తూ ‘‘చరిత్రను చెరిపేస్తున్నారు’’శీర్షికతో మంగళవారం ‘సాక్షి’ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనికి స్పందించిన తెలంగాణ వారసత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాములు నాయక్ ఆ శాఖ అధికారులు భానుమూర్తి, సైదులు, సతీశ్‌లతో కలిసి మంగళవారం మధ్యాహ్నం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ నాలుగు ప్రాంతాల్లో ఆదిమానవుల చిత్రాలున్నట్టు గుర్తించామని, మూడు తావులను పరిశీలించామని, రెండు చోట్ల చిత్రాలున్నాయని రాములు నాయక్ ‘సాక్షి’తో చెప్పారు. ఆ నాలుగు రాక్ పెయింటింగ్ షెల్టర్లను కాపాడేందుకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు వివరించారు. వెంటనే పరిరక్షించాలి: కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఆ అరుదైన రాతి చిత్రాలను వెంటనే పరిరక్షించని పక్షంలో ధ్వంసమయ్యే ప్రమాదముందని కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఆ బృందం సభ్యులు వేముగంటి మురళి, భద్ర గిరీశ్, డా.మండల స్వామి, మనోజ్‌లతో కూడిన బృందం వాటిని పరిశీలించింది. తెలంగాణ ప్రాంతంలో ఏనుగుల మనుగడ ఉండేదనటానికి సాక్ష్యంగా అక్కడ ఏనుగు చిత్రముందని, విచిత్రమైన ఆకృతుల్లో ఉన్న జంతువుల చిత్రాలున్నాయని, 10 వేల ఏళ్ల నుంచి 4 వేల ఏళ్ల క్రితం వరకు వివిధ కాలాల్లో బొమ్మలు గీసిన జాడలున్నాయని తెలిపారు. భవిష్యత్తులో కొత్త అధ్యయనాలకు ఇవి దోహదపడే అవకాశం ఉన్నందున వాటిని పరిరక్షించాలని కోరారు. -
మర్కూక్‌లో ఇనుపయుగం నాటి మెన్హిర్
సాక్షి, హైదరాబాద్: ఆదిమానవుల సమూహాల్లోని ముఖ్య వ్యక్తులకు సంబంధించిన సమాధుల గుర్తు నిలువు రాళ్లు(మెన్హిర్) తాజాగా వరదరాజపురం గ్రామ శివారులో గుర్తించారు. అది క్రీ.పూ. వేయి సంవత్సరాల క్రితం ఇనుప యుగం నాటి సమాధి రాయిగా విశ్రాంత పురావస్తు అధికారి, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. ఔత్సాహిక పరిశోధకుడు నసీరుద్దీన్‌తో కలిసి సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం వరదరాజపురం, మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవరం తండా పరిసరాల్లో శివనాగిరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వరదరాజపురం గ్రామ శివారులోని గుట్టమీద ఒక మెన్హిర్ను గుర్తించారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపటంతో ఆ రాయి కాస్తా పక్కకు ఒరిగిపోయింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఈ ఒక్క మెన్హిర్ మాత్రమే ఉందని, దీనిని కాపాడుకోవాలని ఆయన స్థానికులను కోరారు. కేశవరం తండా రోడ్డుకు రెండువైపులా వందల సంఖ్యలో ఉన్న ఇనుప యుగం నాటి సమాధులు కూడా చెదిరిపోయాయని, కొన్ని మాత్రమే మిగిలాయని పేర్కొన్నారు. -
ఆదిమానవుల సమాధులు మాయం
సాక్షి, హైదరాబాద్: అక్కడ ఆదిమానవుల సమాధులను ఎత్తుకుపోయారు. వంద సమాధులను మాయం చేసేశారు. ఆదిమానవుల సమాధులకు వినియోగించిన పెద్దపెద్ద రాతి గుండ్లను తీసుకుపోయి, వేల ఏళ్ల నాటి మానవ మనుగడకు సజీవసాక్ష్యంగా ఉన్న ఆధారాలను లేకుండా చేశారు. వృత్తాకారంలో ఉన్న ఈ రాతిగుండ్ల వరుస క్రీ.పూ. వెయ్యేళ్ల నాటి ఇనుపయుగపు మానవుడి సమాధి. ఇది మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం మూసాపేట గ్రామ శివారులోనిది. స్థానికంగా ఇలాంటి సమాధులను ముత్యపు గుండ్లుగా పిలుచుకుంటారు. రాకాసి గుండ్లని బంతిరాళ్లని పిలుచుకుంటారు. స్థానికంగా ఇప్పుడు ఇలాంటివి ఆరు సమాధులున్నాయి. సోమవారం ఈ సమాధులను చూసిన చరిత్ర పరిశోధకుడు, విశ్రాంత పురావస్తు అధికారి, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి విస్తుపోయారు. ‘నేను రెండు దశాబ్దాల క్రితం పురావస్తు శాఖ అధికారిగా మహబూబ్‌నగర్ జిల్లాలో పనిచేసినప్పుడు ఈ ప్రాంతానికి వచ్చి సర్వే చేశాను. ఇనుప యుగానికి చెందిన వందకుపైగా సమాధులు ఈ ప్రాంతంలో కనిపించాయి. మూసాపేట, సంకలమద్ది, వేముల తదితర ప్రాంతాల్లో ఉన్న సమాధులను గుర్తించి నివేదిక రూపంలో పురావస్తు శాఖకు సమర్పించాను. ఇప్పుడు వాటిని మరోసారి చూద్దామని ‘ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టెరిటీ’అవగాహన కార్యక్రమంలో భాగంగా వచ్చాను. కేవలం ఆరు సమాధులు మాత్రమే కనిపించాయి. మిగతావాటి రాళ్లను తీసుకెళ్లి రకరకాల అవసరాలకు వాడేసుకున్నారు’అని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. మిగిలిన ఆరు సమాధులనైనా కాపాడుకోవాలని స్థానికులకు వివరించినట్టు పేర్కొన్నారు. కంకరగా, పునాది రాళ్లుగా, కడీలుగా ఆ రాళ్లను వాడుకున్నట్టు తెలుస్తోందన్నారు. గతంలో పలువురు ఈ సమాధి రాళ్లను పరిశోధించారని, అలాంటివి తొలగించి, నాటి చరిత్రను కనుమరుగు చేయటం బాధగా ఉందని తెలిపారు.. -
పెద్దరాతియుగం నాటి చిత్రాల తావు గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో ఆదిమానవులు గీసిన చిత్రాల తావు వెలుగు చూసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ బుర్కగుట్ట మీద ఈ చిత్రాలున్నాయి. ఇవి పెద్ద రాతియుగానికి చెందినవిగా భావిస్తున్నారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు అల్లె రమేశ్ ఈ చిత్రాలను గుర్తించినట్లు ఆ బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. చదరంలో తేలు, వృత్తాకారాలు, త్రిభుజాకార గీతలు, ఆరు వేళ్లున్నట్లుగా ఉన్న పాదాలు, చేతులు పైకెత్తిన మనిషి రూపాన్ని పోలిన చిత్రాలతో పాటు అంతుచిక్కని మరెన్నో చిత్రాలున్నాయని తెలిపారు. ఖమ్మం జిల్లా ఒంటిగుండుపై కనిపించిన చిత్రాల తరహాలో ఇవి ఉన్నాయని, నరసింహస్వామి క్షేత్రం పక్కనే ఉండటంతో మొత్తం సున్నాలు కొట్టించటంతో చాలా చిత్రాలు అంతర్ధానమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. -
బార్బెక్యూ... ఉయ్ లైక్యూ
WESTERN Style Cooking మనిషెంత ఎత్తుకు ఎదిగినా మూలాలెక్కడికీ పోవనడానికో ప్రత్యక్ష ఉదాహరణ బార్బెక్యూ. ఆదిమ మానవుడు నిప్పులపై కాల్చుకుని తిన్నాడు. ఇప్పుడా నిప్పులపై చువ్వలు పేర్చి వాటిపై ఆహారం ఉడికించి మోడరన్‌గా తింటున్నాం. అక్కడా ఇక్కడా ఆహారాన్ని ఇష్టంగా తినేలా చేసింది స్మోకీ టేస్ట్. బార్బెక్యూ కుకింగ్ స్టైల్‌పై సిటిజనులకు ఆసక్తి పెరుగుతోంది. అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో అత్యంత ఆదరణ పొందిన ఈ కుకింగ్ స్టైల్ ప్రత్యేకత నిదానంగా వండడం. వేడిని ఎక్కువసేపు నిల్వ ఉంచడం. బార్బెక్యూ శైలిలో నిప్పుసెగ ప్రత్యక్షంగా వండే పదార్థాన్ని తాకకుండా, గాఢమైన పొగ ప్రభావం తగిలేలా వండుతారు. దీని వల్ల ఆహార పదార్థాలకు ఓ వినూత్నమైన స్మోకీ టేస్ట్ అంటుతుంది. ఆ స్మోకీ టేస్టే బార్బెక్యూని ప్రపంచవ్యాప్తంగా ఫుడ్లవర్స్కి సన్నిహితం చేసింది. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని బంజారాహిల్స్ రోడ్‌నం.2 సినీమాక్స్లోని యూనిక్ బార్బెక్యూలో ఫుడ్‌తోపాటు బార్ వాతావరణాన్ని కూడా మార్చేశారు నిర్వాహకులు. బఫేలో మెయిన్ డిషెస్తోపాటు స్టార్టర్స్, సూప్స్, సలాడ్స్, మాక్టెయిల్స్, డెసర్ట్స్, హైదరాబాదీ స్పెషల్స్ పాయా, హలీమ్ కూడా అందిస్తున్నారు. హంగేరీ ముర్గీ చికెన్, మటన్ గలీఫ్ సిక్ కబాబ్ వంటి స్పైసీ డిషెస్, షాయితుక్డా, డబుల్‌కామీటా, కద్దూ కీ ఖీర్, తదితర డెసెర్ట్స్ ఆఫర్ చేస్తున్నారు. బుధవారం వరకూ ఫుడ్ ఫెస్ట్ కొనసాగుతుంది. - సాక్షి, సిటీప్లస్