మెన్హిర్‌ను పరిశీలిస్తున్న ఈమని శివనాగిరెడ్డి, నసీరుద్దీన్
సాక్షి, హైదరాబాద్: ఆదిమానవుల సమూహాల్లోని ముఖ్య వ్యక్తులకు సంబంధించిన సమాధుల గుర్తు నిలువు రాళ్లు(మెన్హిర్) తాజాగా వరదరాజపురం గ్రామ శివారులో గుర్తించారు. అది క్రీ.పూ. వేయి సంవత్సరాల క్రితం ఇనుప యుగం నాటి సమాధి రాయిగా విశ్రాంత పురావస్తు అధికారి, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.
ఔత్సాహిక పరిశోధకుడు నసీరుద్దీన్‌తో కలిసి సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం వరదరాజపురం, మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవరం తండా పరిసరాల్లో శివనాగిరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వరదరాజపురం గ్రామ శివారులోని గుట్టమీద ఒక మెన్హిర్‌ను గుర్తించారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపటంతో ఆ రాయి కాస్తా పక్కకు ఒరిగిపోయింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఈ ఒక్క మెన్హిర్ మాత్రమే ఉందని, దీనిని కాపాడుకోవాలని ఆయన స్థానికులను కోరారు. కేశవరం తండా రోడ్డుకు రెండువైపులా వందల సంఖ్యలో ఉన్న ఇనుప యుగం నాటి సమాధులు కూడా చెదిరిపోయాయని, కొన్ని మాత్రమే మిగిలాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment