మూసాపేటలోని ఇనుపయుగపు ఆదిమానవుల సమాధిని పరిశీలిస్తున్న శివనాగిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: అక్కడ ఆదిమానవుల సమాధులను ఎత్తుకుపోయారు. వంద సమాధులను మాయం చేసేశారు. ఆదిమానవుల సమాధులకు వినియోగించిన పెద్దపెద్ద రాతి గుండ్లను తీసుకుపోయి, వేల ఏళ్ల నాటి మానవ మనుగడకు సజీవసాక్ష్యంగా ఉన్న ఆధారాలను లేకుండా చేశారు. వృత్తాకారంలో ఉన్న ఈ రాతిగుండ్ల వరుస క్రీ.పూ. వెయ్యేళ్ల నాటి ఇనుపయుగపు మానవుడి సమాధి. ఇది మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం మూసాపేట గ్రామ శివారులోనిది. స్థానికంగా ఇలాంటి సమాధులను ముత్యపు గుండ్లుగా పిలుచుకుంటారు. రాకాసి గుండ్లని బంతిరాళ్లని పిలుచుకుంటారు. స్థానికంగా ఇప్పుడు ఇలాంటివి ఆరు సమాధులున్నాయి.
సోమవారం ఈ సమాధులను చూసిన చరిత్ర పరిశోధకుడు, విశ్రాంత పురావస్తు అధికారి, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి విస్తుపోయారు. ‘నేను రెండు దశాబ్దాల క్రితం పురావస్తు శాఖ అధికారిగా మహబూబ్‌నగర్ జిల్లాలో పనిచేసినప్పుడు ఈ ప్రాంతానికి వచ్చి సర్వే చేశాను. ఇనుప యుగానికి చెందిన వందకుపైగా సమాధులు ఈ ప్రాంతంలో కనిపించాయి.
మూసాపేట, సంకలమద్ది, వేముల తదితర ప్రాంతాల్లో ఉన్న సమాధులను గుర్తించి నివేదిక రూపంలో పురావస్తు శాఖకు సమర్పించాను. ఇప్పుడు వాటిని మరోసారి చూద్దామని ‘ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టెరిటీ’అవగాహన కార్యక్రమంలో భాగంగా వచ్చాను. కేవలం ఆరు సమాధులు మాత్రమే కనిపించాయి. మిగతావాటి రాళ్లను తీసుకెళ్లి రకరకాల అవసరాలకు వాడేసుకున్నారు’అని శివనాగిరెడ్డి పేర్కొన్నారు.
మిగిలిన ఆరు సమాధులనైనా కాపాడుకోవాలని స్థానికులకు వివరించినట్టు పేర్కొన్నారు. కంకరగా, పునాది రాళ్లుగా, కడీలుగా ఆ రాళ్లను వాడుకున్నట్టు తెలుస్తోందన్నారు. గతంలో పలువురు ఈ సమాధి రాళ్లను పరిశోధించారని, అలాంటివి తొలగించి, నాటి చరిత్రను కనుమరుగు చేయటం బాధగా ఉందని తెలిపారు..
Comments
Please login to add a commentAdd a comment