సిద్దిపేట సమీపంలోని హస్తాల్‌పూర్ శివారు గుట్టమీద అంచుపై ఉన్న గుండు రాయి ఇది. కాస్త పట్టుకుని ఉన్నట్టుండే ఈ రాయి కూడా కనుమరుగయ్యే పరిస్థితిలో ఉంది. ..పైన చెప్పినవన్నీ ఒకే రకంగా ఏర్పడిన రాళ్లే. తెలంగాణలో పలుచోట్ల ఇలాంటివి ఉన్నాయి. కానీ వాటి ప్రత్యేకతలపై అవగాహన లేక ధ్వంసమైపోతున్నాయి. ఒక్కదాన్ని కూడా పురావస్తు శాఖ (ప్రస్తుతం వారసత్వ శాఖ) రక్షిత ప్రాంతంగా గుర్తించలేదు. ప్రకృతి చెక్కిన ఈ రాళ్లను పరిరక్షించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు. విదేశాల్లో ఇలాంటి వాటిని రక్షిత ప్రాంతంగా గుర్తించి, కాపాడుకుంటున్నారని పేర్కొంటున్నారు.
రెండేళ్ల కింద ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మహాబలిపురంలో ద్వైపాక్షిక చర్చలు జరిపిన వేళ.. పెద్ద పరుపు బండపై నిలిచిన గుండ్రటి రాయి వద్ద ఫొటో దిగారు. కృష్ణుడి చేతిలోని వెన్నెముద్దగా పిలిచే ఆ రాయి ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ముట్టుకుంటే జారిపోతుందేమో అన్నట్టున్న ఆ రాయి.. అలా ఎలా నిలిచి ఉందన్న ప్రశ్న అందరినీ తొలిచేసింది.
ఇది హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉన్న ఓ చిత్రమైన రాయి. అడ్డంగా ఉన్న అంత పెద్ద రాయి.. మధ్యలో చిన్న భాగం మాత్రమే కింద తాకుతుంది. మిగతా భాగమంతా గాలిలో తేలుతూ ఉంటుంది. అయినా బలంగా నిలిచి ఉంది. దీన్ని ‘మష్రూమ్ (పుట్టగొడుగు) రాక్’గా పిలుచుకుంటారు.
హిమాయత్‌సాగర్ జలాశయం పక్కనే.. చిన్నగుట్టపై ఒకదానిమీద మరొకటి పేర్చినట్టుగా ఉన్న రాళ్లు ఇవి. ఏ క్షణాన్నయినా జలాశయంలోకి దొర్లిపోయేట్టుగా కనిపిస్తాయి. ఆ రాళ్ల పక్కన గుట్ట భాగాన్ని గతంలోనే తొలిచేశారు. ఎప్పుడో అప్పుడు ఇవీ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.
ఎలా ఏర్పడతాయి?
భూమ్యాకర్షణ శక్తికి విరుద్ధంగా ఉన్నట్టు భ్రమింపజేసే ఈ రాళ్లను బ్యాలెన్సింగ్ స్టోన్స్‌గా పిలుస్తారు. భూమిపై 350–250 కోట్ల ఏళ్ల క్రితం గ్రానైట్, ఇతర రాళ్ల పొరలు ఏర్పడ్డాయని.. వాటిలో క్రమంగా పగుళ్లు ఏర్పడి, దిగువకు కూరుకుపోవడమో, పడిపోవడమో జరిగిందని నిపుణులు చెప్తున్నారు. అలాంటి సమయంలో కొన్ని రాళ్లు అలాగే నిలిచిపోతాయని.. అవే ఈ బ్యాలెన్సింగ్ రాళ్లు అని అంటున్నారు.
– సాక్షి, హైదరాబాద్
ఆరు కోట్ల ఏళ్ల నాటివి
‘‘కోట్ల ఏళ్ల క్రమంలో భూమిలో వచ్చే మార్పుల వల్ల బ్యాలెన్సింగ్ రాళ్లు ఏర్పడతాయి. తెలంగాణలో కనిపిస్తున్న ఈ బ్యాలెన్సింగ్ రాళ్లు దాదాపు 6 కోట్ల ఏళ్ల క్రితం నాటివిగా అంచనా. పురాతన ప్రాధాన్యమున్న ఈ రాళ్లను పర్యాటకులకు చేరువ చేయాలి’’
– చకిలం వేణుగోపాల్, విశ్రాంత డిప్యూటీ డీజీ, జీఎస్‌ఐ
మనవద్ద గుర్తింపు రాలేదు
‘‘బ్యాలెన్సింగ్ రాళ్లకు విదేశాల్లో మంచి గుర్తింపు ఉంది. రాష్ట్రంలో కొన్ని గుట్టల్లో ఇలాంటి రాళ్లున్నా వాటికి గుర్తింపు లేదు. స్థానికంగా ఏ అవగాహనా లేదు. క్రషర్లలో, ఇళ్ల నిర్మాణాల్లో వాడే రాళ్లుగా వినియోగిస్తున్నారు. వాటిని పరిరక్షించాలి’’
– శ్రీరామోజు హరగోపాల్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్
Comments
Please login to add a commentAdd a comment