
విక్కీ కౌశల్ లీడ్ రోల్‌లో తెరకెక్కిన ఛావా(Chhaava) చిత్రం బ్లాక్‌బస్టర్ టాక్‌తో.. రికార్డు కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతోంది. ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. ఓవైపు ఛావా కథాకథనాలపై విమర్శలు.. మరోవైపు రోమాంచితమైన ఫెర్మార్మెన్స్‌కు ప్రశంసలు దక్కాయి. అయితే ఈ సినిమా ప్రభావం మధ్యప్రదేశ్ బుర్హన్‌పూర్‌లో అలజడికి కారణమైంది.
బుర్హన్‌పూర్‌లోని అసర్‌ఘడ్ కోట(Asirgarh Fort)ను బంగారు గనిగా, శంభాజీ సైన్య స్థావరంగా ఛావా చిత్రంలో చూపించాడు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. అయితే ఈ మధ్య అక్కడ జరిగిన ఓ ఘటన.. ఈ వాదనకు మరింత బలం చేకూర్చి జనాల్ని ఉరుకులు పరుగులు పెట్టించింది. టార్చ్ లైట్లు, ఇనుప పనిముట్లు, మెటల్ డిటెక్టర్స్ స్థానికులు రాత్రిపూట కోట దగ్గరకు చేరుకున్నారు. ఇష్టానుసారం తవ్వకాలకు దిగారు. కొందరు బంగారు నాణేలు దొరికాయని ప్రకటించడంతో.. ఆ ప్రాంతానికి రోజురోజుకీ జనాల తాకిడి పెరిగింది. అయితే పోలీసులకు, అధికారులకు ఈ విషయమై సమాచారం అందించినా పట్టించుకోవడం లేదని స్థానికంగా కొందరు యువకులు చెబుతున్నారు.
అసలేం జరిగిందంటే..
అసర్‌ఘడ్ కోటకు దగ్గర్లో ఉన్న జాతీయ రహదారిపై నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ ఉన్న దర్గా దగ్గర తవ్వకాలు జరిపిన ఓ జేసీబీ మిషన్.. ఆ మట్టిని స్థానికంగా ఉన్న ఓ రైతు పొలంలో పోశారు. అయితే కూలీలు ఆ మట్టి నుంచి పాత నాణేలు గుర్తించరాని, అందులో బంగారం, వెండి నాణేలు ఉన్నాయని ప్రచారం మొదలైంది. ఈ పుకార్లు చిలిచిలికి గాలివానగా చుట్టుపక్కల ఊర్లకు విస్తరించాయి. అయితే ఈ ప్రచారం కొందరు ఆకతాయిల ప్రచారమేనని స్థానికులు అంటున్నారు.
చరిత్రకారులు ఏం చెబుతున్నారంటే..
బుర్హన్‌పూర్ గతంలో మొఘలుల నగరంగా ఉండేది. ఆ కాలంలో అప్పటి ప్రజలు యుద్ధాలు, దొంగలకు భయపడి తమ వద్ద ఉన్న బంగారం, ఇతర విలువైన వస్తువుల్ని మట్టిలో పాతి పెట్టేవాళ్లు. కాబట్టి తవ్వకాల్లో నాణేలు బయటపడడంలో పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదని అంటున్నారు. నిజంగా అక్కడ నాణేలు దొరుకుతుంటే గనుక.. ఈ అంశాన్ని తీవ్రంగా భావించాలని, తక్షణమే ఆ ప్రాంతానికి రక్షణ కల్పించాలని పురావస్తు శాఖ అధికారులు స్థానిక యంత్రాంగాన్ని కోరుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశాన్ని పరిశీలించాలని పోలీసులను కోరింది. దీంతో స్పందించిన అధికారులు రంగంలోకి దిగి.. ఆ ప్రాంతంలో సిబ్బందిని మోహరింపజేశారు. ఇష్టానుసారం తవ్వకాలు చేపడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.