Archeology Department
-
‘భోజ్‌శాల’ సర్వేపై సుప్రీం కీలక తీర్పు
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో ధార్‌లోని పురాతన భోజ్‌శాల కట్టడంలో ఎలాంటి తవ్వకాలు చేపట్టవద్దని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా( ఏఎస్ఐ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం భోజ్‌శాలలో ఏఎస్ఐ చేస్తున్న సర్వే రిపోర్టుపై తమ అనుమతి లేకుండా ఎలాంటి చర్య తీసుకోవద్దని కోరింది. భోజ్‌శాల కట్టడంలో ఏఎస్ఐ సర్వే చేపట్టాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అక్కడ మసీదు నిర్వహిస్తున్న మౌలానా కమాలుద్దీన్ వెల్ఫేర్ సొసైటీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి, హిందూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. భోజ్‌శాల ఆవరణలో ప్రస్తుతమున్న స్థితిని మార్చే ఎలాంటి తవ్వకాలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. కమాలుద్దీన్ వెల్ఫేర్ సొసైటీ తరపున సీనియర్ న్యాయవాది, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వాదనలు వినిపించారు. భోజ్‌శాల సరస్వతీ దేవి ఆలయం అని హిందువులు వాదిస్తుండగా అది కమల్ మౌలా మాస్క్ అని ముస్లింలు అంటున్నారు. ఇదీ చదవండి.. జ్ఞానవాపి మసీదు వివాదం.. సెల్లార్లో పూజలకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్ -
‘మన్ కీ బాత్’థీమ్.. గోల్కొండలో సౌండ్ అండ్ లైట్ షో
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ నగరంలోని గోల్కొండ కోటలో ఈ నెల 29న ‘మన్ కీ బాత్’థీమ్‌తో ప్రత్యేకమైన సౌండ్ అండ్ లైట్ షోను కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ నెల 30 న ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రసారం కానున్న మన్ కీ బాత్ 100 వ ఎపిసోడ్ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనుంది. మన్ కీ బాత్కు సంబంధించిన ఎంపిక చేసిన కొన్ని థీమ్స్‌ను పురావస్తు శాఖ అధీనంలో దేశవ్యాప్తంగా ఉన్న 13 చారిత్రక కట్టడాల్లో సౌండ్ అండ్ లైట్ షో ద్వారా ప్రదర్శించనున్నారు. అందులో భాగంగా ఢిల్లీలోని ఎర్రకోట, గ్వాలియర్ కోట, సూర్య దేవాలయం, వెల్లూరు కోట, గేట్ వే ఆఫ్ ఇండియా, నవ్నతన్ ఘడ్ కోట, రాంనగర్ ప్యాలెస్, ది రెసిడెన్సీ భవనం, గుజరాత్‌లోని సూర్య దేవాలయం, రాంఘడ్ కోట, చిత్తోర్‌ఘడ్ కోట, ప్రధాని సంగ్రహాలయతో పాటు హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలోనూ ‘మన్ కీ బాత్’కు సంబంధించిన ప్రత్యేక ప్రదర్శనలను చేపట్టనున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ గురువారం తెలిపారు. ‘మన్ కీ బాత్ ఆర్ట్ ఎగ్జిబిషన్’ మరోవైపు మన్ కీ బాత్ థీమ్ ఆధారంగా దేశంలో ప్రసిద్ధి పొందిన 12 మంది చిత్రకారులు వేసిన పెయింటింగ్స్, ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ఈ నెల 30 న ఢిల్లీలో ప్రారంభించనున్నారు. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్లో నీటి పొదుపు, నారీశక్తి, కోవిడ్‌పై అవగాహన, స్వచ్ఛ భారత్, వాతావరణ మార్పు, రైతాంగం–వ్యవసాయం, యోగా – ఆయుర్వేదం, సైన్స్–ఖగోళ శాస్త్రం, క్రీడలు–ఫిట్నెస్, భారత్ ఎట్ 75 అమృత్ కాల్, ఈశాన్య రాష్ట్రాలు అనే 12 రకాల థీమ్స్ ఉంటాయి. దీంతో పాటు 12 అమర్‌చిత్ర కథ కామిక్స్‌లో మొదటి కామిక్‌ను ఈ నెల 30 న విడుదల చేయనున్నట్లు గోవింద్ మోహన్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: సాగర తీరాన ధగధగల సౌధం -
అవి అరుదైనవి... విలువైనవే
సాక్షి, హైదరాబాద్: గుండ్లపోచంపల్లి సమీపంలో మల్లన్న గుట్టమీద ఉన్న ఆదిమానవుల కాలం నాటి రాతి చిత్రాలు అరుదైనవి, అత్యంత విలువైనవిగా రాష్ట్ర వారసత్వ శాఖ (పురావస్తు శాఖ) గుర్తించింది. వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని, వెంచర్ల కోసం రియల్ వ్యాపారులు ఆ ప్రాంతాన్ని చదును చేస్తుండటంతో ఈ రాతి చిత్రాలున్న గుట్ట ప్రమాదంలో పడిందని ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాములు నాయక్ వెల్లడించారు. గుండ్లపోచంపల్లి గుట్టల్లో ఉన్న రాతి చిత్రాల తావులను రియల్ వెంచర్ల విస్తరణతో ధ్వంసమవుతున్న తీరును వివరిస్తూ ‘‘చరిత్రను చెరిపేస్తున్నారు’’శీర్షికతో మంగళవారం ‘సాక్షి’ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనికి స్పందించిన తెలంగాణ వారసత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాములు నాయక్ ఆ శాఖ అధికారులు భానుమూర్తి, సైదులు, సతీశ్‌లతో కలిసి మంగళవారం మధ్యాహ్నం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ నాలుగు ప్రాంతాల్లో ఆదిమానవుల చిత్రాలున్నట్టు గుర్తించామని, మూడు తావులను పరిశీలించామని, రెండు చోట్ల చిత్రాలున్నాయని రాములు నాయక్ ‘సాక్షి’తో చెప్పారు. ఆ నాలుగు రాక్ పెయింటింగ్ షెల్టర్లను కాపాడేందుకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు వివరించారు. వెంటనే పరిరక్షించాలి: కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఆ అరుదైన రాతి చిత్రాలను వెంటనే పరిరక్షించని పక్షంలో ధ్వంసమయ్యే ప్రమాదముందని కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఆ బృందం సభ్యులు వేముగంటి మురళి, భద్ర గిరీశ్, డా.మండల స్వామి, మనోజ్‌లతో కూడిన బృందం వాటిని పరిశీలించింది. తెలంగాణ ప్రాంతంలో ఏనుగుల మనుగడ ఉండేదనటానికి సాక్ష్యంగా అక్కడ ఏనుగు చిత్రముందని, విచిత్రమైన ఆకృతుల్లో ఉన్న జంతువుల చిత్రాలున్నాయని, 10 వేల ఏళ్ల నుంచి 4 వేల ఏళ్ల క్రితం వరకు వివిధ కాలాల్లో బొమ్మలు గీసిన జాడలున్నాయని తెలిపారు. భవిష్యత్తులో కొత్త అధ్యయనాలకు ఇవి దోహదపడే అవకాశం ఉన్నందున వాటిని పరిరక్షించాలని కోరారు. -
1938 నుంచి తవ్వకాలు.. ఎట్టకేలకు బయటికి
పులుల అభయారణ్యంలో శాంతిబోధను చేసిన బుద్ధుని ఆనవాళ్లు బయటపడ్డాయి. మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్ పులుల అభయారణ్యంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఇటీవల జరిపిన తవ్వకాల్లో అత్యంత పురాతనమైన బౌద్ధ ఆలయాలు, ఇతర బౌద్ధ చిహ్నాలు బయటపడ్డాయి. ఏఎస్ఐ ఈ ప్రాంతంలో 1938 నుంచి తవ్వకాలు సాగిస్తోంది. దాదాపు 170 చదరపు కిలోమీటర్ల పరిధిలో సాగిస్తున్న తవ్వకాల్లో ఇటీవల బౌద్ధ ఆలయాలు ఇవి. ఈ ప్రాంతంలో ఏఎస్ఐ జరిపిన తవ్వకాల్లో ఇప్పటి వరకు 26 ఆలయాలు, 26 గుహలు, రెండు స్థూపాలు, రెండు బౌద్ధారామాలు, 46 శిల్పాలు, 24 శిలాశాసనాలు బయటపడ్డాయి. ఇవన్నీ క్రీస్తుశకం ఐదో శతాబ్దానికి చెందినవని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. చదవండి: ఏడు ఖండాలు కాదు ఏక ఖండమే..! -
పునాది కోసం తవ్వుతుండగా.. బయటపడ్డ భూగర్భ కట్టడం.. ఏముంది అందులో!
దొడ్డబళ్లాపురం: రామనగర పట్టణ పరిధిలోని రైల్వేస్టేషన్ రోడ్డులో పునాది కోసం తవ్వుతుండగా పురాతన కట్టడం వెలుగు చూసింది.న వాజ్ అహ్మద్ అనే వ్యక్తి తన స్థలంలో దుకాణం నిర్మించడానికి పునాది కోసం పాయ తీయిస్తుండగా కట్టడం బయటపడింది. నాణ్యతతో నిర్మించబడిన ఆ కట్టడం వందల ఏళ్ల నాటిదని తెలుస్తోంది. క్రమంగా మట్టిలో మూసుకుపోవడంతో భూగర్భంలో కలిసిపోయి ఎవరి కంటా పడలేదు. ఇది టిప్పుసుల్తాన్ కాలంలో నిర్మించబడిందని స్థానిక చరిత్రకారులు చెప్పారు. కట్టడం రూపురేఖలు చూస్తుంటే ఆయుధాగారం మాదిరిగా ఉందని, శ్రీరంగపట్టణంలోనూ ఇలాంటి కట్టడాలే ఉన్నాయని తెలిపారు. నేలమాళిగ నిర్మించి ఇందులో ఆయుధాల తయారీ, నిల్వ చేసేవారని పేర్కొన్నారు. -
కుతుబ్ మినార్ తవ్వకాలపై మంత్రి కిషన్‌రెడ్డి క్లారిటీ
న్యూఢిల్లీ: ప్రపంచవారసత్వ కట్టడంగా గుర్తింపు దక్కించుకున్న కుతుబ్ మినార్ వార్తల్లోకి ఎక్కింది. అదొక ఆలయం అనే వాదన.. ఈ చారిత్రక కట్టడం చుట్టూ తిరుగుతోంది. ఢిల్లీలోని కుతుబ్ మినార్‌లో తవ్వకాలు జరిపాలని భారత పురావస్తు శాఖను కేంద్ర సాంస్కృతిక శాఖ ఆదేశించినట్టు వచ్చిన కథనాలపై ఆ శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతానికి అలాంటి ఆదేశాలేవీ ఇవ్వలేదని ఆయన చెప్పారు. జ్ఞానవాపి మసీదు సర్వే నేపథ్యంలో కుతుబ్ మినార్ నిర్మాణం కింద కూడా హిందూ, జైన్ ఆలయాలున్నాయని హిందువులు విశ్వసిస్తున్నారు. ఇలాంటి సమయంలో కుతుబ్‌మినార్‌లో తవ్వకాలకు ఆదేశించినట్టుగా వార్తలు చక్కెర్లు కొట్టడంతో.. ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదని కిషన్ రెడ్డి స్పష్టతనిచ్చారు. మరోవైపు పురావస్తు శాఖ మాత్రం తవ్వకాల విషయంపై స్పందించలేదు. మరోవైపు శనివారం కుతుబ్‌మినార్‌ను పురావస్తు శాఖ అధికారులు సందర్శించడంపై ఆసక్తికరమైన చర్చ నడిచింది. ఆర్కియాలజీ సర్వే దీనిని కట్టించెదవరు అనే విషయంపై పరిశోధనలు నిర్వహించబోతున్నట్లు ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే అది రెగ్యులర్ సందర్శనేని, ఎలాంటి పరిశోధన కోసం రాలేదని అధికారులు ఆ తర్వాత స్పష్టత ఇచ్చారు. ఇదిలా ఉంటే.. 12వ శతాబ్ధానికి చెందినదిగా భావిస్తున్న కుతుబ్‌మినార్ కట్టడపు కాంప్లెక్స్‌లో ఉన్న రెండు గణేష్ విగ్రహాలను.. తదుపరి ఆదేశాల ఇచ్చేంతవరకు తొలగించవద్దని గతంలో ఢిల్లీ కోర్టు ASIని ఆదేశించింది. రెండు విగ్రహాలను ‘ఉల్టా గణేష్’, ‘పంజరంలో వినాయకుడు’గా పిలుస్తున్నారు. కుతుబ్‌మినార్‌ను UNESCO 1993లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఆ ఆలయాలను పునర్నిర్మించాలి దేశంలో ఒకప్పుడు ధ్వంసం చేసిన ఆలయాలన్నిటినీ పునర్నిర్మించాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అన్నారు. గోవాలో పోర్చుగీసు పరిపాలనలో ధ్వంసమైన ఆలయాలను తిరిగి నిర్మించడానికి తాము బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. గోవాలో సాంస్కృతిక టూరిజంను కూడా ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటున్నామని సావంత్ తెలిపారు. చదవండి: అది కుతుబ్‌మినార్ కాదు.. సూర్య గోపురం!! -
తాజ్‌మహల్‌లో మూతపడ్డ 22 గదుల్లో ఏముందంటే...
లక్నో: భారత పురావస్తు శాఖ తాజ్‌మహల్‌లో మూతపడ్డ 22 గదులకు సంబంధించి కొన్ని ఫోటోలను విడుదల చేసింది. ఈ మేరకు తాజ్‌మహల్‌ని పరిరక్షిస్తున్న ఆర్కియాలజీ సర్వే ఆప్ ఇండియా (ఏఎస్ఐ) మూతపడ్డ గదులకు సంబంధించిన మరమత్తుల ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అంతేగాదు ఇటీవలే తాజ్‌మహల్‌లో మూతపడ్డ 22 గదులు తెరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పిటిషన్ పెద్ద హాట్ టాపిక్‌గా వార్తల్లో నిలిచింది. అయితే అలహాద్ హైకోర్టు ఈ పిటిషన్‌ను విచారించడానికి ముందే న్యూస్ లెటర్ జనవరి 2022 పేరుతో ఆర్కియాలజీ సర్కే ఆప్ ఇండియా(ఏఎస్ఐ) తాజ్‌మహల్‌లో మరమత్తుల పనులు చేపట్టినట్లు పేర్కొనడం గమనార్హం. అంతేగాదు మే9 వ తేదీన తాజ్‌మహల్‌లో అండర్ గ్రౌండ్ వర్క్స్ అనే పేరుతో మూతపడ్డ 22 గదుల చిత్రాలను వారి అధికారిక వెబ్సైట్లో పోస్ట్ చేయగా, వీటిని తాజాగా ఏఎస్ఐ విడుదల చేసింది. అంతేగాదు తాజ్‌మహల్ పునరుద్ధరణకు ముందు తర్వాత ఫోటోలను గురించి వివరించింది. గోడలు మెట్లు, పాడైన సున్నపు ప్లాస్టర్ రీప్లాస్టర్‌గా స్క్రాప్ చేయడం వంటి పనులు చేపట్టినట్లు ఏఎస్ఐ వెల్లడించింది. అలాగే తాజ్‌మహల్ బయటి వైపున, యమునానది ఒడ్డున కూడా మరమత్తుల పనులు చేపట్టినట్లు పేర్కొంది. ఈ మేరకు ఆయా మరమత్తులకు సంబంధించిన ఫోటోలతోపాటు "స్మారక కట్టడం పునరుద్ధరణ పనులు" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. Click on the link to download/view the January issue of @ASIGoI's Newsletter.https://t.co/tIJmE46UR4 pic.twitter.com/UKWsTA2nPZ — Archaeological Survey of India (@ASIGoI) May 9, 2022 (చదవండి: ‘తాజ్ మహల్ కాదు.. తేజో మహాలయా పిటిషన్’.. కోర్టు ఏమందంటే..) -
అందరికీ అందుబాటులోకి శాసనాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లభ్యమైన పురాతన శాసనాలను పరిరక్షించడంతోపాటు వాటిలోని సమాచారాన్ని గ్రంథస్తం చేసేందుకు రాష్ట్ర పురావస్తు శాఖ చర్యలు చేపడుతోంది. జిల్లాలవారీగా లభ్యమైన శాసనాలను రాజవంశాల పాలనా క్రమం ఆధారంగా ముద్రించనుంది. వాటిని ఆంగ్లంతోపాటు తెలుగులోకి అనువాదం చేసి సామాన్యులకు సైతం అందుబాటులోకి తేనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేవలం వైఎస్సార్ జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 2, అనంతపురం జిల్లాలో ఒకదాన్ని మాత్రమే పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు. అయితే చారిత్రక వారసత్వ సంపదను భావితరాలకు అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పుస్తకాలతోపాటు డిజిటల్ రూపంలో శాసనాలను భద్రపరచనుంది. వివిధ భాషల్లో శాసనాలు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పురావస్తు శాఖలో 8,613 శిలా శాసనాలు ఉండగా రాష్ట్ర విభజన అనంతరం 5,375 శాసనాలు ఏపీకి దక్కాయి. వీటిల్లో బ్రాహ్మీ, తెలుగు–కన్నడం, కన్నడం, తెలుగు, తమిళం, ఒడియా లిపితోపాటు ప్రాకృతం, సంస్కృతం, కన్నడం, తెలుగు, తమిళం, ఒడియా భాషల్లో శాసనాలున్నాయి. ఇందులో కర్నూలు జిల్లా ఎర్రగుడిలో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో గండశిలలపై బ్రాహ్మీ లిపిలో ప్రాకృతంలో చెక్కిన మౌర్య చక్రవర్తి అశోకుడి శాసనాన్ని పురాతనమైనదిగా చరిత్రకారులు చెబుతారు. ఇక వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లలో క్రీస్తు శకం 575లో చోళరాజు పాలనలో వేసిన కలమల్ల శాసనాన్ని తొలి తెలుగు శాసనంగా గుర్తించారు. ఈ శిలా శాసనాలు అరుగుదలకు గురయ్యే ప్రమాదం ఉండటంతో వీటిలోని సమాచారాన్ని యథాతథంగా ప్రత్యేక పేపర్లపై నకళ్లుగా తీసి భద్రపరిచారు. వీటిని కూడా త్వరలో డిజిటల్ రూపంలోకి మార్చనున్నారు. తెలంగాణలోనే ఏపీ రాగి శాసనాలు.. తమ వంశాల చరిత్ర, సామాజిక, మత, పరిపాలన విధానాలు, నిర్దిష్ట కాలం, ప్రాంతం, ఆర్థిక, రాజకీయ చరిత్రకు సంబంధించి రాజులు.. రాతి ఫలకాలు, రాతి స్తంభాలు, పురాతన దేవాలయాల గోడలు, మండపాల నేలపై శాసనాలు వేయించేవారు. వీటితోపాటు రాగి ఫలకాలపైనా శాసనాలు ముద్రించేవారు. ఉమ్మడి రాష్ట్రంలో 250 సెట్లు (ఒక్కో సెట్‌కు 4–5 రాగి ఫలకాలు) రాగి శాసనాల్లో అత్యధికం ఏపీకి చెందినవే. అయితే వీటి విభజన ఇంకా పూర్తికాకపోవడంతో విలువైన చారిత్రక సంపద తెలంగాణలోనే ఉండిపోయింది. భావితరాలకు అందిస్తాం.. శాసనాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. రాష్ట్రంలో లభించిన శాసనాల్లోని సమాచారాన్ని పుస్తక రూపంలోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. – జి.వాణీమోహన్, కమిషనర్, రాష్ట్ర పురావస్తు శాఖ -
చార్మినార్ చెక్కుచెదరకుండా.. పిడుగుపాటుకు గురికాకుండా లైటనింగ్ కండక్టర్
సాక్షి, హైదరాబాద్: నాలుగు శతాబ్దాలకుపైగా నవనవోన్మేషం.. నగరానికే తలమానికం.. అపురూప కట్టడం మన చార్మినార్. దీనిని చెక్కుచెదరకుండా కాపాడేందుకు కేంద్ర పురావస్తు శాఖ (ఏఎస్ఐ) రక్షణ చర్యలు తీసుకుంటోంది. పిడుగుపాటు ఇతర ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే దిశగా లైటనింగ్ కండక్టర్‌ను ఏర్పాటు చేస్తోంది. చారిత్రక కట్టడం దెబ్బతినకుండా.. పిడుగుపాటుకు గురైనా నష్టం వాటిల్లకుండా ఈ కండక్టర్ నిరోధించనుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న చారిత్రక, వారసత్వ సంపదను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్న ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. చార్మినార్ అంతర్భాగంలో ఎలక్ట్రికల్ కండక్టర్ల ఏర్పాటు కోసం గోతుల తవ్వకాలు చేపట్టింది. సమాచార లోపం కారణంగా స్థానికులు.. సొరంగాల తవ్వకాలు జరుపుతున్నారని పొరబడి ఆందోళనకు దిగారు. చార్మినార్ కట్టడం పరిరక్షణలో భాగంగా నాలు గు మినార్లతో పాటు మరిన్ని అంతర్గత నిర్మాణాలకు ప్రకృతి పరంగా, ఇతర ప్రమాదాల కా రణంగా నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టా మని ఆర్కియాలజీ సూపరింటెండెంట్ ఎస్.ఎ.స్మిత, అధికారులు ఎస్. కుమార్, రాజేశ్వరి ‘సాక్షి’కి తెలిపారు. లైటనింగ్ కండక్టర్ల ఏర్పాటుకు చేస్తున్న తవ్వకాల విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని, కట్టడాన్ని పరిరక్షించేందుకే ఈ చర్యలు తీసుకుంటామని చెప్పారు. అవాస్తవాలను ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
గొట్టిప్రోలు కోటదిబ్బ.. 2వేల ఏళ్ల నాటి చరిత్రకు సాక్ష్యం
నాయుడుపేట: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా నాయుడుపేట మండలం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో గొట్టిప్రోలు గ్రామం ఉంది. ఊరి ముఖద్వారానికి ఎడమవైపు ఎత్తైన కొండలాగా ఓ దిబ్బ కనిపించేది. పిచ్చిమొక్కలతో నిండి వుండే ఈ దిబ్బ మీద మేకలు, గొర్రెలు మేపే కాపరులకు వర్షాకాలంలో ఇక్కడ కుండ పెంకులు, పాతరాతి యుగానికి సంబంధించిన వస్తువులు లభించేవి. వాటిని చూసి అప్పటి పెద్దలు ఇక్కడ రాజులు వుండేవారట అని ముందు తరాలవారికి చెప్పెవారు. గ్రామంలోని కోట దిబ్బలో ఓ మూలన పల్లవులనాటి విష్ణుమూర్తి విగ్రహం గ్రావెల్(గులకరాళ్లు) తవ్వకాల్లో బయటపడడంతో గ్రామ ప్రజలు అప్పటి నుంచి పూజలు చేసేవారు. కోట దిబ్బగా పిలువబడే ప్రాంతం 40 ఎకరాలు స్థలంలో వుంది. గడిచిన రెండు దశాబ్ధాల్లో గ్రావెల్ అక్రమ రవాణా కోసం కొంత మంది పెత్తందారులు కోట దిబ్బను ద్వంసం చేసి సొమ్ముచేసుకున్నారు. ఇందులో పురాతన వస్తు సామగ్రి ఓక్కోక్కటిగా బయటపడడంతో గ్రామస్తులు కొంత మంది అక్రమ రవాణా చేయరాదంటూ అడ్డుకున్నారు. విషయం పురవస్తుశాఖ అధికారుల దృష్టికి చేరింది. ఏడాది తరువాత ఆర్కియాలజీ అధికారులు స్పందించారు. కోట దిబ్బ చుట్టూ నలబై ఎకరాలకు చుట్టు హద్దులు వేశారు. ఇందులోకి బయటవ్యక్తులు ఎవ్వరూ ప్రవేశించరాదంటూ దండోరా వేయించారు. గ్రామ పెద్దలతో మాట్లాడి పురావస్తుశాఖ సారద్యంలో తవ్వకాలు చేపడుతామని చెప్పారు. రెవెన్యూ, పోలీస్ జిల్లా ఉన్నతాధికారులకు పురావస్తుశాఖ శాస్త్రవేత్తలు, అధికారులు ఇక్కడి పరిస్థితిపై వివరించారు. డ్రోన్ కెమెరాలతో 40 ఎకరాలోని అన్ని ప్రదేశాలను చిత్రీకరించారు. గ్రామంలోని వంద మందికిపైగా కూలీలతో పురావస్తుశాఖ అధికారులు, సిబ్బంది తవ్వకాలు ప్రారంభించారు. తొలిదశలో పెంకులు, చిన్న చిన్నరాతి ముక్కలు బయటపడ్డాయి. వీటిపై పురావస్తుశాఖ అధికారులు పరిశోధనలు చేయాలని ఆశాఖ పరిశోధనశాలలకు పంపడం జరిగింది. పల్లవులు, రోమన్లు, శాతవాహనుల కాలంనాటి ఆనవాళ్లు కనిపిస్తున్నాయని పరిశోధనల్లో తేటతెల్లమవుతుందని అధికారులు వెల్లడించారు. పూర్తి స్థాయి తవ్వకాలు చేపట్టి పరిశోధనలు చేస్తే తప్ప ఓ కొలిక్కిరాదని అధికారులు నిర్ణయానికి వచ్చారు. రెండువేల ఏళ్లనాటి పురాతన కట్టడాలు.... పురావస్తు తవ్వకాల్లో బయల్పడ్డ కట్టడాలు రెండు వేల ఏళ్ళనాటి మధ్య యుగంనాటి చరిత్ర పురాతన కట్టడాలని శాసననాలు చెబుతున్నాయి. స్వర్ణముఖినది బంగాళాఖాతం సముద్రతీరానికి దగ్గరగా వుండడంతో రోమన్లతో వర్తక వ్యాపారాలు కొసాగించేందుకు ఇక్కడ కట్టడాలు చేసి వుండవచ్చని భావిస్తున్నారు. ఇదే క్రమంలో చతుర్ముఖి ముఖం కలిగిన విష్ణుమూర్తి విగ్రహంతో పాటు నాణ్యమైన నలుపు, ఎరుపు మట్టిపాత్రలు,నాణ్యాలు, జాడీలు గృహాపకరణాలు బయల్పడ్డాయి. పల్లవుల కాలం నాటివిగా భావిస్తున్న విగ్రహాలు అలనాటి శిల్పకళను చాటిచెప్పే విధంగా వుండటమే కాక నాటి చరిత్రను వివరిస్తున్నాయి. రెండువేళ్ల నాటి డ్రైనేజీ వ్యవస్థ, భారీ ఘన ఇటుకలతో చుట్టూ వలయాకారంలో గోడ నిర్మాణం, 48–49 వెడల్పు కలిగిన ఇటుకల వుండడంతో.. ఇవి అమరావతి, నాగార్జున కొండ శాతవాహనుల కాలంనాటి నిర్మాణంలో వాడిన ఇటుకలుగా తెలుస్తోంది. సముద్రతీరం ప్రాంతానికి దగ్గరగా వ్యాపార వాణిజ్య పరంగా అనువైన ప్రాంతం కావడంతో కోట దిబ్బను ఎంచుకుని.. ఇక్కడ కట్టడాలు నిర్మించిన ఆనవాళ్లు బయల్పడ్డాయని ఆర్కియాలజీ అధికారులు గుర్తించారు. గొట్టిప్రోలు గ్రామం కోటదిబ్బలో చేపట్టిన పురావస్తుశాఖ తవ్వకాలను ఆశాఖ విశ్రాంత జాయింట్ డైరెక్టర్ జనరల్ ఆర్ఎస్ బిస్ట్ పరిశీలించారు. తవ్వకాల్లో శాతవాహన కాలంనాటి ఆనవాళ్లు కోటదిబ్బలో బయల్పడిన ఆ ప్రాంతాన్ని ఆర్ఎస్ బిస్ట్ చూశారు. ఇక్కడ బయల్పడిన కట్టడాలు శాతవాహనుల కాలంలో ఏర్పాటు చేసుకున్న కోటలో రాజులు, పరిపాలకులు, లోపలభాగంలోనే కోర్టు, సెక్యూరిటీ వంటి పురాతన కట్టడాల మాదిరి కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఇతర ప్రాంతాలకు వర్తక వాణిజ్యపరంగా ఇక్కడి నుంచే జరిగి వుంటాయని స్పష్టం చేశారు. గొట్టిప్రోలు శాతవాహన కాలంనాటి కట్టడాలు బయటపడడం చరిత్రగా మారనుందని అన్నారు. వీటిని కళాశాలలు, పాఠశాలలోని విద్యార్థులకు ప్రదర్శించి.. శాతవాహనుల చరిత్ర అర్థమయ్యేలా చూపాలన్నారు. గొట్టిప్రోలులో పురావస్తు కట్టడాలు ఉన్నట్లు ఎలా గుర్తించారు..! గొట్టిప్రోలు గ్రామానికి శివారుప్రాంతంలో 30 అడుగులు ఎత్తుగల దిబ్బవుండేది. ఇక్కడ గ్రావెల్ విరివిగా వుండడంతో ఇది కొందరికి కల్పతరువుగా మారింది. దిబ్బను సొంతం చేసుకుని ప్రకృతి సంపదను దొచుకుంటే కోట్లు గడించవచ్చని దీనిపై దృష్టిసారించారు. దాదాపుగా 30 అడుగులు ఎత్తు ఉండే దిబ్బ ప్రస్తుతం 7 అడుగులు ఎత్తుకు తగ్గింది. అప్పటికే కోటలో కట్టడాలు ఒక్కొక్కటిగా బయల్నడుతూ వచ్చాయి. అది గమనించిన గ్రామంలోని ఓ విద్యావంతుడు గ్రావెల్ తవ్వకాలను అడ్డుకుంటూ వచ్చాడు. అదేక్రమంలో పురావస్తుశాఖ అధికారులకు సందేశాలు పంపుతూ వచ్చినా ప్రయోజనం లేకపోయింది. 2018 నవంబర్‌లో పురవాస్తుశాఖ అధికారులు స్వర్ణముఖినది తీరాల వెంబడి గ్రామాల ఆలయాలు, పురావస్తు కట్టడాలు ఎక్కడెక్కడ వున్నాయోనని పరిశీలించారు. ఈసమయంలో గొట్టిప్రోలు వద్ద కోట దిబ్బలో పురావస్తు కట్టడాలు వున్నట్లు శాసనాలలో గుర్తించారు. -
మహాస్తూపంలో ‘గుప్త నిధుల’ తవ్వకాలు
రాంబిల్లి: విశాఖ జిల్లాలో ప్రసిద్ధి చెందిన.. కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలోని కొత్తూరు బౌద్ధ క్షేత్రంలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఈ క్షేత్రంలో గల మహాస్తూపంలోని ఓ గదిలో ఎనిమిది అడుగుల మేర గొయ్యిని తవ్వినట్లు పురావస్తు శాఖ కన్జర్వేటివ్ అసిస్టెంట్ శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఉదయం విధులకు హాజరైన సిబ్బంది మహాస్తూపంలో మట్టి కుప్పను గుర్తించి తనకు సమాచారం ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. కొన్ని ఏళ్ల క్రితం ఈ బౌద్ధక్షేత్రంలో కేంద్ర పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో విలువైన ధాతు, రాతి భరిణెలు లభ్యమయ్యాయి. వీటిలో కళ్లు మిరిమిట్లు గొలిపే వజ్రాలు, ఇతర వస్తువులున్నాయి. ఈ బౌద్ధ క్షేత్రాన్ని ధన దిబ్బలుగా పిలుస్తారు. ఈ ఘటన సంచలనం కలిగించింది. శనివారం రాత్రి నుంచి ఇక్కడ పోలీసులను పహారా పెట్టారు. -
హుజూరాబాద్‌కు ఎన్నేళ్ల చరిత్ర ఉందో తెలుసా?
సాక్షి, హుజూరాబాద్: హుజూరాబాద్‌కు రెండువేల ఏళ్ల చరిత్ర ఉందని ఔత్సాహిక పురావాస్తు చరిత్ర పరిశోధకుడు ఆర్.రత్నాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన పరిశోధనలో భాగంగా హుజూరాబాద్ రంగనాయకుల గుట్ట దిగువన ఎదులాపురం గ్రామాన్ని కనుగొన్నట్లు తెలిపారు. ఇక్కడ రెగ్యులర్‌గా కనిపించే రోళ్లకు భిన్నంగా ఉన్న వెడల్పాటి రోళ్లు, దంచి నూరడానికి ఉపయోగించిన రోకలి బండతో పాటు, అలంకరణకు ఉపయోగించే మట్టి పూసలు, ఇనుము, ఉక్కు పరిశ్రమ, కుండల పరిశ్రమ, పెద్ద పెద్ద ఇటుకులు, వీరుల విగ్రహాలు, నాగ దేవతలు, భైరవ శిల్పం, మొదలైన అనేక చారిత్రక ఆధారాలను గుర్తించినట్లు వివరించారు. హుజూరాబాద్ పట్టణ శివారులోని రంగనాయకుల గుట్ట పరిసర ప్రాంతాల్లో నవీన శిలాయుగం నుంచి మొదలు శాతవాహనులు, తర్వాత కాలంలో చోటుచేసుకున్న అనేక చారిత్రక ఆధారాలకు సంబంధించిన విశేషాలను బయటపెట్టారు. అరుదైన ‘పాటిగడ్డ’ రంగనాయకుల గుట్ట చుట్టూ పూర్వపు ఎదులాపురం గ్రామం ఉందని, సుమారుగా 80 ఎకరాల్లో పాటిమీద అని పిలిచే ఎత్తైన మట్టి దిబ్బ ఉండేదని, ఇంత విశాలమైన ‘పాటి గడ్డ’ చాలా అరుదని, ఈ ప్రదేశంలో ఇప్పుడు ఉన్నట్లే నాడు కూడా అన్ని వృత్తుల వారితో కలిసి జీవించిన పెద్ద గ్రామం ఉన్నట్లు తెలుస్తోందన్నారు. దీనినే ఇప్పుడు హుజూరాబాద్ అని పిలుచుకుంటున్నట్లు తెలిపారు. ఇంత పెద్ద గ్రామానికి తాగు, సాగునీరు అందించిన ఏరు ప్రవాహం పాటి మీద నుంచి ప్రవహిస్తుందని, సమీపంలో నాగుల చెరువు కూడా ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. అనేక వృత్తుల వారు జీవించిన ఇంత పెద్ద గ్రామానికి వైద్యులు కూడా అవసరమే అని, అందుకే ఇక్కడ సాధారణ రోళ్లకు భిన్నంగా పరుపు బండలపై వరుసగా మూడు రోళ్లు ఉన్నాయని, ఇవి లోతు తక్కువగా ఉండటంతో పాటు వెడల్పు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. వీటిని ఆయుర్వేద వైద్యం కోసం మందుల తయారీకి ఉపయోగించి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. రంగనాయకుల గుట్ట వద్ద లభించిన చిట్టెపు రాళ్లను చూపుతున్న రత్నాకర్‌రెడ్డి నూరడానికి, దంచడానికి ఉపయోగించే రోకలి బండ ఒకటి లభించగా, ఇటువంటి రోళ్లను గతంలో హనుమకొండలోని అగ్గలయ్య గుట్టపై గుర్తించినట్లు రత్నాకర్‌రెడ్డి తెలిపారు. పాటి మీద చిట్టెపు రాళ్లు దండిగా ఉన్నాయని, ఇనుమును సంగ్రహించి పోత పోసేటప్పుడు మిగిలిన వ్యర్థ పదార్థాలను చిట్టెపు రాళ్లు అంటారని అన్నారు. ఈ ప్రాంతంలో రెండు వేల ఏళ్ల కిందటే ఇనుము, ఉక్కు పరిశ్రమ ఉందని తన పరిశోధనలో వెల్లడైనట్లు తెలిపారు. పంటలు పండించడంతో పాటు, ధాన్యం నిల్వ చేసిన పెద్ద పెద్ద కాగులు ఇక్కడ లభ్యమైనట్లు పేర్కొన్నారు. చక్రం మీద తయారు చేసి బాగా కాల్చిన నాణ్యమైన ఎరుపు, నలుపు, బూడిద, గోధుమ రంగు మట్టి పాత్రల ఆనవాళ్లు ఇక్కడ విస్తారంగా కనిపించాయన్నారు. మంచి ఆకృతి గల ఎరుపు రంగు మట్టి పూసలతో పాటు రంగు రాళ్లు కనిపించాయని, దీనిని బట్టి పెద్ద రాతియుగము నాటి నుంచి మొదలు ప్రజలు అలంకార ప్రియులనీ తెలుస్తోందని చెప్పారు. పాటి మీద బరువైన పెద్ద పెద్ద ఇటుకలతో నిర్మాణాలు చేశారని, పై కప్పునకు గూన పెంకులు ఉపయోగించారని, వీటితో పాటు తేలికైన ఇటుకలు కూడా దర్శమిచ్చాయని వివరించారు. హనుమాన్ గుడి పక్కన గల పొలంలో ఓ వీరుడి విగ్రహం ఉందని, కాకతీయుల కాలంలో వీరుల ఆరాధన ఎక్కువగా కనిపిస్తుండటం విశేషమని, పాటి మీద పూర్వపు శిథిల ఆలయం, హనుమాన్ గుడి ఉందని, గుట్ట వెనుక నుంచి వెళ్లే దారి పక్కన గుట్ట కింద విడిగా ఉన్న ఒక బండకు భైరవ శిల్పాన్ని చెక్కారని వివరించారు. స్థానిక రైతులు ఇచ్చిన సమాచారంతో పురావాస్తు శాఖ గతంలో ఇక్కడ రెండు కుండలను స్వాధీనం చేసుకుందని, ఇప్పటికీ పాటిగడ్డ అనేక చారిత్రక ఆధారాలతో నిండి ఉందన్నారు. పురావాస్తు శాఖ వారు ఇక్కడ తవ్వకాలు జరిపితే ఎన్నో చారిత్రక విషయాలు బయటపడే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. -
Covid Effect: 19 వరకు సందర్శకులకు నో ఎంట్రీ
సాక్షి, సిటీబ్యూరో: పర్యాటక ప్రదేశాల పునఃప్రారంభాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న చారిత్రక, పర్యాటక ప్రదేశాలకు ఈ నెల 16వ తేదీ నుంచి సందర్శకులను అనుమతించాలని కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. అయితే, ఆయా రాష్ట్రాల్లో స్థానికంగా నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో గత మార్చి నెలలో పర్యాటక ప్రదేశాలకు సందర్శకుల రాకను నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా కేసులు తగ్గుముఖం పట్టడంతో వీటిని తిరిగి సందర్శకుల కోసం తెరవాలని భావించింది. అయితే, మన రాష్ట్రంలో సాయంత్రం ఐదు గంటల వరకే లాక్డౌన్ నుంచి సడలింపులు ఉన్నందున.. పర్యాటకులను అనుమతించాలా? వద్దా? అనే అంశంపై జిల్లా కలెక్టర్లతో చర్చించిన తర్వాతే ఈ నెల 19వ తేదీ అనంతరం నిర్ణయం తీసుకుంటామని కేంద్ర పురావస్తుశాఖ సూపరింటెండెంట్ స్మితా ఎస్ కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. కాగా, కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో చార్మినార్, గోల్కొండ, వరంగల్ కోట ఉన్న సంగతి తెలిసిందే. చదవండి: విషాదం: ఆ పాప ఇక లేదు.. మీ విరాళాలు తిరిగిచ్చేస్తాం! -
తవ్వకాల్లో వెయ్యి సంవత్సరాల కోడిగుడ్డు లభ్యం
జెరూసలేం: ఇజ్రాయెల్‌లో ఇటీవల జరిపిన తవ్వకాల్లో వెయ్యి సంవత్సరాల నాటి కోడిగుడ్డు దొరికింది. ఆశ్చర్యం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు గడిచినా సురక్షితంగా ఉన్నది. దానికి బయటకు తీసి శుభ్రపరుస్తుండగా పగుళ్లు వచ్చాయి. వెయ్యేండ్ల నాటి ఈ కోడిగుడ్డును అతి జాగ్రత్తగా భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోడిగుడ్లు వారం రోజులకే చెడిపోతున్న తరుణంలో వేయి సంవత్సరాల నుంచి ఈ కోడిగుడ్డు ఎలా భద్రంగా ఉందో కనుక్కొనేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇది ప్రపంచంలోని పురాతన గుడ్లలో ఒకటి అని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ అద్భుతమైన ఆవిష్కరణ గురించి ఇజ్రాయెల్ పురావస్తు విభాగం ఫేస్బుక్లో ఒక వివరణాత్మక పోస్ట్‌ను షేర్ చేశారు. ఇజ్రాయెల్‌లోని యావ్నేలో పట్టణ అభివృద్ధి ప్రాజెక్టు పనుల తవ్వకాల సమయంలో ఈ పురాతన కోడిగుడ్డు దొరికింది. ఈ గుడ్డు 10 వ శతాబ్దానికి చెందినదని భావిస్తున్నారు. యావ్నేలో పురావస్తు త్రవ్వకాల్లో దాదాపు 1000 సంవత్సరాల క్రితం నాటి కోడిగుడ్డు కనుగొన్నాం అని ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇలాంటి అతిపురాత కోడిగుడ్డు దొరకడం చాలా అరుదు అని ఇజ్రాయేల్ పురవాస్తు విభాగానికి చెందిన నిపుణురాలు డాక్టర్ లీ పెర్రీ గాల్ చెప్పారు. -
ఆలయాలకు కరోనా ఎఫెక్ట్
ఒంటిమిట్ట/లేపాక్షి: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మళ్లీ ఉగ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ఒక్కొక్కటిగా ఆంక్షలు అమలవుతున్నాయి. తాజాగా కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఆలయాలను తాకింది. కరోనా ఉధృతి నేపథ్యంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని అన్ని చారిత్రక, పురాతన ఆలయాలు, కట్టడాలు, సందర్శన ప్రదేశాలు, మ్యూజియంలను వెంటనే మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని శుక్రవారం నుంచి మూసివేశారు. మే 15 వరకు ఆలయంలోకి భక్తులను ఎవర్నీ అనుమతించబోమని ఆలయ ఏఈవో మురళీధర్ తెలిపారు. అయితే, స్వామివారికి నిత్యం జరిగే పూజా కైంకర్యాలన్నీ యథావిధిగా కొనసాగుతాయన్నారు. ఒంటిమిట్ట ఆలయ బ్రహ్మోత్సవాల నిర్వహణపై కూడా టీటీడీ అధికారులు పురావస్తు శాఖ అధికారులతో సమీక్షిస్తున్నారని, సమీక్ష అనంతరం బ్రహ్మోత్సవాలపై అధికారిక ప్రకటన వెలువరిస్తామని చెప్పారు. ఇక, అనంతపురం జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో మే 15 వరకు భక్తులకు ప్రవేశాన్ని నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో నరసింహమూర్తి తెలిపారు. లేపాక్షి నంది విగ్రహం వద్ద కూడా పర్యాటకులకు ప్రవేశం లేదని, నంది విగ్రహం పార్కింగ్‌ను కూడా మూసివేశామని పేర్కొన్నారు. -
గోల్కొండ, కుతుబ్‌షాహీ పరిరక్షణలో నిర్లక్ష్యమా?
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక చారిత్రక కట్టడాలు గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ టూంబ్స్ పరిరక్షణలో ఆర్కియాలజీ, పర్యాటకశాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. రాత్రయితే ఒక్కలైటు ఉండడం లేదని, పర్యాటకుల టికెట్ల ద్వారా వచ్చిన డబ్బుతో ఏం చేస్తున్నారని నిలదీసింది. చారిత్రక కట్టడాల నిర్వహణ, పరిరక్షణకు ఎటువంటి ప్రణాళికలు రూపొందించారో తెలియజేయాలని, అలాగే బడ్జెట్ కేటాయింపులు తదితర వివరాలు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణకు కేంద్ర ఆర్కియాలజీ విభాగం డైరెక్టర్ జనరల్, రాష్ట్ర పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మా సనం మంగళవారం ఆదేశించింది. గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ టూంబ్స్ పరిరక్షణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దీంతో ఈ రెండు చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయంటూ పత్రికల్లో వచ్చిన కథనాలను ధర్మాసనం సుమోటోగా విచారణకు స్వీకరించింది. ‘ఈ రెండు చారిత్రక కట్టడాల పరిరక్షణలో అధికారులు నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. రాత్రయితే ఒక్కలైటూ కనిపించడం లేదు. మట్టిగోడలు కూలిపోతున్నాయి’అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈనెల 7న కేంద్ర ఆర్కియాలజీ విభాగం డైరెక్టర్ జనరల్, రాష్ట్ర పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. గో మహాగర్జనకు హైకోర్టు అనుమతి కవాడిగూడ: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం లో ఏప్రిల్ 1న జరగనున్న గో మహాగర్జనకు హై కోర్టు అనుమతిచ్చిందని యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్, టీటీడీ పాలక మండలి సభ్యుడు కొలిశెట్టి శివకుమార్ తెలిపారు. మంగళవారం ఆయన ఎన్టీఆర్ స్టేడియంలో విలేకరులతో మాట్లాడుతూ.. గో హత్యలు నిషేధించాలని, కబేళాలు మూసివేయాలని, గోవులను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తాము పిలుపునిచ్చిన గో మహాగర్జనకు ప్రభు త్వం అడ్డుపడిందన్నారు. ఈ గర్జనలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా ప్రకటనలు వస్తాయన్న ఉద్దేశంతో అనుమతి నిరాకరించిందన్నారు. వెంటనే తాము హైకోర్టును ఆశ్రయించగా అనుమతి వచ్చిందన్నారు. -
2,500 ఏళ్ల తర్వాత 'మమ్మీ'ని బయటకు తీశారు!
కైరో: ఈజిప్టు చరిత్రను చూస్తే మమ్మీలు గుర్తుకు రాక మానవు. ఏళ్ల నాటి మమ్మీలను వెలికి తీసి వాటి చరిత్రను తవ్వి తీయడంలో అక్కడి సైంటిస్టులు కూడా ఎంతో ఆసక్తి చూపుతుంటారు. అయితే పురావస్తు శాస్త్రవేత్తలు ఈ సంవత్సరం ఆరంభంలో సక్కారా ప్రాంతంలో 59 మమ్మీలను వెలికి తీశారు. సక్కారా అనేది ఈజిప్టులో విస్తారమైన, పురాతన శ్మశానవాటిక. ఇక్కడ వెలికి తీసిన మమ్మీలు దాదాపు 2,500 ఏళ్ల క్రితానికి చెందినవిగా గుర్తించారు. శనివారం రోజున అందుకు సంబంధించిన ఓ శవపేటికను ఈజిప్టు పురావస్తు శాస్త్రవేత్తలు తెరిచారు. బయటకు తీసిన శవపేటికలు, అందులోని మమ్మీలు కూడా చెక్కుచెదరకుండా ఉండటాన్ని గుర్తించారు. ఇవి ఈజిప్టు సమాజంలోని పూజారులు, ఇతర గొప్ప వ్యక్తులువిగా గుర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఈజిప్ట్ పర్యాటక, పురావస్తు మంత్రిత్వ శాఖ తన ఖాతాలో పోస్ట్‌లో చేయగా.. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈజిప్టులోని న్యూజిలాండ్ రాయబారి గ్రెగ్ లూయిస్ కూడా శనివారం ట్విటర్లో అన్‌సీలింగ్ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో శవపేటికలో మమ్మీ వస్త్రంతో చుట్టబడి, ఏమాత్రం పాడవకుండా ఉంది. ఈజిప్టు పురావస్తు శాఖ షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటిదాకా 9 మిలియన్ల మంది వీక్షించారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 2020 సంవత్సరంలో ఒక మిలీనియా పాత శవపేటికను తెరవడం ఉత్తమమైన చర్య కాకపోవచ్చు అంటూ ఓ నెటిజన్ చమత్కరించారు. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం, పాప్ సంస్కృతిలోని జానపద కథల్లో మమ్మీలను తెరవడం ద్వారా మరణాలకు, శాపాలకు దారితీస్తుందనే అపోహ కూడా ఉంది. (ఒక ఫొటో ఎంపీకి నిద్ర లేకుండా చేస్తోంది!) The mummy tomb, which has been sealed for 2500 years, has been opened for the first time. pic.twitter.com/KWGT95girv — Psychedelic Art (@VisuallySt) October 5, 2020 కాగా.. ఈజిప్టు పర్యాటక, పురాతన మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం మొదట 13 శవపేటికలతో మూడు బావులు సక్కారాలో కనుగొనబడ్డాయి. ఆ తర్వాత మరో 14 శవపేటికలు బయటపడ్డాయి. అలా ఈ రోజు వరకు మొత్తం 59 శవపేటికలను వెలికితీశారు. అయితే వీటిని గిజాలోని కొత్త గ్రాండ్ ఈజిప్టియన్ మ్యూజియానికి తరలించి ప్రదర్శన కోసం ఉంచనున్నారు. -
గండికోటలో 8 ఫిరంగి గుండ్లు
సాక్షి, జమ్మలమడుగు : పర్యాటక కేంద్రమైన గండికోటలో 8 ఫిరంగి గుండ్లు బయటపడ్డాయి. గుండ్లు ఒక్కొక్కటి 15 కేజీల నుంచి 18 కేజీలు మరికొన్ని 12 కేజీల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. గండికోటలో కొన్ని రోజుల నుంచి కోనేరు సమీపం ప్రాంతంలో ఉన్న ముళ్ల పొదలను తొలగించి అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం నీటి తొట్టి బయటపడింది. అదే రోజు ఒక ఫిరంగి గుండు దొరికింది. శనివారం కూలీలతో పనులు చేయిస్తుండగా.. పూరాతన కాలం నాటి ఫిరంగి గుండ్లు బయటపడ్డాయి. గుండ్లు దొరికిన ప్రదేశం 400 ఏళ్ల నాటివి: గండికోటలో బయటపడ్డ ఫిరంగి గుండ్లు దాదాపు నాలుగు వందల ఏళ్ల నాటివని స్థానిక ప్రజలు, అధికారులు తెలుపుతున్నారు. గండికోట జూమ్మా మసీదు వెనుక వైపు ఆయుధ కర్మాగారంగా ఉండేది. అందులో రాజులకు సంబంధించిన కత్తులతోపాటు, నాణేల ముద్రణ కోసం టంకశాల కూడా ఉండేదని చరిత్ర చెబుతుందంటూ స్థానికులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం పహారా మహాల్ వద్ద ఫిరంగి ఉండగా మరొకటి దక్షిణ వైపులో ఉంది. ఇటీవల బయల్పడిన నీటి కుంట శత్రువులు రాకుండా అడ్డుకట్ట వేయడం కోసం అప్పట్లో రాజులు కోటకు సంబంధించిన నాలుగు వైపులా బురుజులను ఏర్పాటు చేసి కొన్ని ప్రాంతాలలో ఫిరంగులను ఏర్పాటు చేస్తుండే వారు. ఆ ఫిరంగి గుండ్లను ఉక్కుతో తయారు చేసే వారు. గతంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుకుని భూగర్భంలో కలిసిపోయినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా జుమ్మా మసీదు వెనుక వైపు ఉన్న వ్యాయామశాల (తాళింఖానా), ఆయుధ కర్మాగారాలకు సైతం అధికారులు మరమ్మతు పనులు చేపట్టాలని పర్యాటకులు కోరుకుంటున్నారు. -
జాడల్ని చెరిపేసుకుంటున్నాం
రాజ్యాలు, యుద్ధాలు.. గెలుపు ఓటములు.. శిలలు, శాసనాలు.. మహళ్లు, మంతనాలు.. మతాలు, బోధనలు.. ఆరామాలు, ఆలయాలు.. చరిత్రకు సంబంధించిన ఏ జాడలైనా ప్రజలకు హక్కున్న వారసత్వ సంపదే! భావితరాలకూ చెందేలా జాగ్రత్తగా సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే!! ఆ బాధ్యతను గుర్తు చెయ్యడం కోసం గత పదిహేనేళ్లుగా ఏకదీక్షగా శ్రమిస్తున్నారు ప్రముఖ చరిత్రకారిణి రాణీ శర్మ. గత శతాబ్దపు ఎనిమిదవ దశకం చివరి సంవత్సరాలలో విశాఖపట్టణం దగ్గర్లోని తొట్లకొండలో ఆర్కియాలజీ తవ్వకాల్లో బౌద్ధ క్షేత్రాలు బయటపడ్డాయి. వాటిని ‘ఉన్నవి ఉన్నట్లుగా’ సంరక్షించుకోవలసిన ఆవశ్యకతపై చరిత్రకారిణి, రచయిత్రి రాణి శర్మ తాజాగా ‘తథాగతుని అడుగుజాడలు’ అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా ఆమె హైదరాబాద్ వచ్చినప్పుడు ‘సాక్షి’తో పంచుకున్న విషయాలు, విశేషాలు. ‘‘పురావస్తు శాఖ జరిపిన తవ్వకాలలో 1980ల చివర్లో విశాఖపట్టణం దగ్గర్లోని తొట్లకొండ, బావికొండ, పావురాల కొండలో బౌద్ధ క్షేత్రాలు బయటపడ్డాయి. ఈ శాఖ అప్పటి డైరెక్టర్ డాక్టర్ వి.వి. కృష్ణశాస్త్రి ఆనాటి తవ్వకాలకు చాలా కృషి చేశారు. ఈ పుస్తకానికి ప్రేరణ ఆయనే. సముద్ర తీరంలో కొండమీది క్షేత్రాలవి. రెండువేల మూడువందల సంవత్సరాల కిందట బౌద్ధ భిక్షువులు ఎలా విడిచిపెట్టి పోయారో అలాగే దొరికాయి. అయితే ఇన్నేళ్లు మట్టిలో నిక్షిప్తమై ఉన్న కట్టడాలు ఒక్కసారి బయటపడగానే పాడైపోతాయి. వాటిని పరిరక్షించాలి. ఈ తవ్వకాలు జరిగినప్పుడు విశాఖపట్టణ పరిధి చాలా తక్కువగా ఉంది. రానురాను పట్టణ పరిధి విస్తరించి తొట్లకొండ, బావికొండ దాకా వచ్చేసింది. దీనివల్ల రియల్ స్టేట్ వ్యాప్తి చెందడం, ఎలాగైనా పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలన్న ప్రభుత్వాల ఉత్సాహం వల్ల ఎంతో అమూల్యమైన ఈ ప్రాచీన నిర్మాణం దెబ్బతినడం మొదలైంది. ప్రాచీనతకు హంగులా!! శిథిలావస్థలో ఉన్న కొన్ని కట్టడాలను చూసి పర్యాటకశాఖ అధికారులు నాతో అన్నారు ‘‘వీటికి మనం కొన్ని హంగులు కల్పించి అందంగా తీర్చిదిద్దాలి’’ అని. ‘‘ఈ వారసత్వ సంపదకు మించిన అందం ఉంటుందా? వీటి గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఇక్కడ ఇంటర్‌ప్రెటేషన్ సెంటర్స్ (వ్యాఖ్యాన కేంద్రాలు) ఏర్పాటు చేయండి’’ అని చెప్పాను. ఇంటర్‌ప్రెటేషన్ సెంటర్స్ అంటే.. ఈ కట్టడాల చరిత్ర, గొప్పదనం, ప్రత్యేకత, వీటిని ఎందుకు సందర్శిస్తున్నాం, ఎందుకు, ఎలా కాపాడుకోవాలి వగైరాలను బ్రోషర్స్, పుస్తకాలు, ఫిల్ముల ద్వారా సందర్శకులకు వివరించడం, చూపించడం. ఇలా 2004 నుంచి నేటి దాకా వాటిని కాపాడ్డానికి నేను పాడిన పాట్లు దేవుడికే తెలుసు. దీనికి సంబంధించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలోని స్థానిక అధికారుల నుంచి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వరకు దగ్గర దగ్గర డెబ్భై ఎనభై లేఖలు రాశా. ఓ రెండుమూడు నెలలకు ‘ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా’ వాళ్లు ఒక లేఖను పట్టుకొని విశాఖపట్టణంలోని మా ఇంటికొచ్చారు.. ‘‘రాణీ శర్మగారు ఎవరు? ప్రైమ్ మినిస్టర్ గారికి కంప్లయింట్ రాశారట’’ అంటూ. అప్పుడు వాళ్లలో ఒక అధికారిని తొట్లకొండ తీసుకెళ్లి అంతా చూపించాను. ‘‘రాణీ శర్మగారు చెప్పింది నిజమే.. ఈ సైట్ పాడైపోతోంది.. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఈ సైట్‌ను అప్పగిస్తే దీన్ని మేము పునరుద్ధరించి, పరిరక్షించగలం’’ అని ఆయన పైకి లెటర్ రాశారు. స్నానాల బాటను తవ్వేశారు టూరిజం భ్రమలో పడి సైట్‌ను, దాని ప్రాశస్త్యాన్ని పాడుచేసుకోవడం ప్రపంచంలో ఎక్కడా ఉండదు. సైట్‌ను జాగ్రత్తగా కాపాడుకుంటూ దానిమీద టూరిజంను వృద్ధి చేసుకుంటారు. పర్యాటకులకు ఇష్టం వచ్చినట్లు మసులుకోనివ్వరు. కారు ఎక్కడో కిలోమీటర్ల దూరంలో ఆపి.. కట్టడం వరకు నడుచుకుంటూ రావాలి. పరిరక్షణలో ఉన్న వాటిని చేతులతో తాకడం.. ముట్టుకోవడం వంటివి చేయనివ్వరు. కానీ మనం?! టూరిస్ట్‌ను ముద్దు చేస్తూ గుమ్మం దాకా వాహనాలలో రానిస్తాం. అలా వాహనాల కోసం ఇక్కడ పూర్వకాలం బౌద్ధ గురువులు స్నానం కోసం నడిచివెళ్లిన బాటను తవ్వేసి రోడ్లు వేశారు! హంగులు, ఆర్భాటాలు కల్పించి.. షాపింగ్ కాంప్లెక్స్‌లు, ప్రార్థనా మందిరాలు కట్టి.. దాన్నో విహారకేంద్రంలా తయారు చేశారు. నిజానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇవన్నీ చేయకూడదు. వీటన్నిటినీ ఎత్తిచూపుతూ ఉత్తరాలు రాశా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ స్పందనా రాలేదు. అది ఏ ఉత్సాహంలో ఉండిందంటే ఎలాగైనా సరే ఈ బౌద్ధక్షేత్రాలను నలుగురికీ చూపించి డబ్బులు గడించాలి అని! పాత తొట్లకొండ మాయం బౌద్ధ గురువులెప్పుడూ అందమైన ప్రకృతి ప్రదేశాలనే తమ ఆవాసాలుగా చేసుకున్నారు. తొట్లకొండలో కూడా అంతే. సముద్రమట్టానికి ఎత్తులో చుట్టూ పచ్చని చెట్లు, చేమల మధ్య చక్కటి వాతావరణంతో ఆహ్లాదంగా ఉంటుంది. అలాంటి అద్భుతమైన స్థలాన్ని కమర్షియల్ కాంప్లెక్స్‌లు, హోటల్స్, రిసార్టులు కట్టే ఆలోచనతో నాశనం చేస్తున్నారు. నేను చెప్పిన ఇంటర్‌ప్రెటేషన్ సెంటర్ ఈనాటికీ వాళ్ల కార్యాచరణలో లేకపోగా ఈ మధ్య ఏం చేశారంటే.. 2,300 ఏళ్ల నాటి కట్టడంలోని పాత ఇటుకలన్నిటినీ తీసిపారేసి ఇప్పటి ఇటుకలతో కట్టేశారంతా! ఇప్పుడు మీరు తొట్లకొండను చూద్దామని వస్తే.. నాటి తొట్లకొండకు బదులుగా రెండేళ్ల కిందట కొత్తగా కట్టిన తొట్లకొండ సాక్షాత్కరిస్తుంది. ఇదంతా నిబంధనలకు విరుద్ధమే. ఈ ఆక్రోశంతో, బాధతో, దుఃఖంతో కన్నీళ్లు కారుస్తూ ‘తథాగతుని అడుగుజాడలు’ పుస్తకం రాశాను. ప్రేరణ ఏంటంటే.. నేను చరిత్ర విద్యార్థిని అవడం, ఒకప్పుడు ఇటు తెలంగాణ, అటు కోస్తా అంతటా కూడా బౌద్ధమే ఉండడం. అప్పుడు మనందరం బౌద్ధులమే. వరం కొద్దీ ఈ ప్రాంతం మన ఆంధ్రదేశం ఒడిలో పడింది. ఈ ప్రాముఖ్యం తెలియక టూరిజం ‘అభివృద్ధి’లో కొట్టుకుపోతున్నాయి ప్రభుత్వాలు. ఇదంతా భావితరాల ఆస్తి నియమాలకు విరుద్ధంగా తొట్లకొండ స్తూపానికి దగ్గర్లో నిర్మాణాలు మొదలుపెట్టారు. దీని మీద హైకోర్టులో కేసు వేశా. సాంచీలో కాని, భార్హూత్లో కాని ఎక్కడా ఇలా నిర్మాణాలకు అనుమతించలేదు. అసలు జీవో ప్రకారం కొండంతా కూడా సంరక్షణ ప్రాంతమే. ఈ జీవో అందరికీ చూపించుకుంటూ పోరాడాల్సి వస్తోంది. తొట్లకొండ, బావికొండ, పావురాలకొండను అనాథ ప్రాంతాలుగా చేసేశారు. ఇది ప్రభుత్వ ఆస్తో, ప్రజాప్రతినిధుల ఆస్తో కాదు. ప్రజలది, మన భావితరాలది. ఇవి ప్రపంచ వారసత్వ సంపదలు. వీటికి మనం సంరక్షులం మాత్రమే. దురదృష్టమేమంటే వాటిని భద్రంగా కాపాడే పురావస్తు శాఖను నిర్వీర్యం చేసి, పర్యాటక శాఖ కింద పెట్టడం. పాశ్చాత్య దేశాల్లో ఇలా ఉండదు. ప్రతి ఊళ్లో ‘హిస్టారికల్ సొసైటీస్’ ఉంటాయి. ప్రజలకు వాటి మీద యాజమాన్యపు హక్కుంటుంది. ప్రజలను అడక్కుండా ప్రభుత్వాలు ఏ పనీ చేయడానికి వీల్లేదు. మన దగ్గరా అలాంటి చైతన్యం రావాలి’’ అంటారు ఈమని రాణి శర్మ. – సరస్వతి రమ ఫొటోలు : ఐ.దేవేంద్రనాథ్ రెండవ పుస్తకం రాణీ శర్మ జన్మస్థలం విశాఖపట్టణం. తండ్రి మురుకుట్ల పురుషోత్తమ శర్మ. తల్లి పార్వతి. తండ్రి ఉద్యోగరీత్యా ప్రాథమిక విద్యను రాయలసీమలో, ఉన్నత విద్యను మచిలీపట్టణం, హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో అభ్యసించారు. భర్త ఈఏఎస్ శర్మ ఐఏఎస్ అధికారి. ఆయన ఉద్యోగరీత్యా ఢిల్లీ వెళ్లడంతో రాణీ శర్మ కూడా తన అధ్యాపక వృత్తిని అక్కడే ఢిల్లీ యూనివర్సిటీలో కొనసాగించారు. పదవీ విరమణ తర్వాత విశాఖపట్టణంలో స్థిరపడ్డారు. ‘తథాగతుని అడుగుజాడలు’ ఆమె రెండవ పుస్తకం. మొదటి పుస్తకం హైదరాబాద్ పూర్వ సంస్కృతి మీద రాసిన ‘‘ది డియోడిస్ ఆఫ్ హైదరాబాద్ : ఎ లాస్ట్ హెరిటేజ్ ’’. -
శ్రీవారి ఆభరణాలపై చెన్నారెడ్డి కీలక వ్యాఖ్యలు
-
పుల్లూరు బండలో పురాతన చరిత్ర
సాక్షి, హైదరాబాద్: ‘మెదక్ జిల్లా సిద్దిపేట మండలం పుల్లూరు బండ గ్రామ శివార్లలో దాదాపు రెండు నెలల పాటు పురావస్తు శాఖ నిర్వహించిన తవ్వకాల్లో అత్యంత విలువైన ఆధారాలు లభించాయి... ఇక్కడి సమాధుల్లో అతిపురాతన అస్తిపంజరం లభించింది. ఇలా పూర్తి అస్తిపంజరం లభించడం అరుదు... అది ఎన్నేళ్లనాటిదనే కచ్చితత్వం కోసం దాన్ని సీసీఎంబీకి పంపాలని నిర్ణయించాం’ అని తెలంగాణ పర్యాటక, పురావస్తుశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. బుధవారం పురావస్తుశాఖ ఇన్చార్జి డెరైక్టర్ సునీతాభగవత్తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పుల్లూరుబండ తవ్వకాల్లో ఎన్నో విలువైన వస్తువులు లభించాయని, ఇవన్నీ తమ పరిశోధనలకు ఎంతో ఉపయోగపడనున్నాయన్నారు. అతి పురాతన ఆంథ్రోమార్ఫిక్ ఫిగర్ కూడా లభించిందని, ఆదిమానవులు నాటి వ్యక్తులకు గుర్తుగా మానవాకృతిగా రాతిని మలిచేవారని, అలాంటి ఆధారాలు లభ్యమవడం అత్యంత అరుదని చెప్పారు. వరంగల్ జిల్లాలో వెలుగుచూసిన మైలారం గుహలను అభివృద్ధి చేయనున్నామని, 15 కిలోమీటర్ల మేర విస్తరించిన ఇవి ప్రపంచంలోనే పెద్ద గుహల్లో ఒకటిగా చరిత్రకెక్కుతాయన్నారు. బిహార్, ఉత్తరప్రదేశ్ తర్వాత బౌద్ధ జాడలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణనేనని, కేంద్రం నుంచి ప్రత్యేక బౌద్ధ సర్క్యూట్ అభివృద్ధి కోసం నిధులు పొంది ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని బౌద్ధ జాడలతో సంయుక్తంగా పర్యాటక సర్క్యూట్ అభివృద్ధి చేస్తే దేశంలో ప్రధాన పర్యాటక ప్రాంతాలుగా మారుతాయని అభిప్రాయపడ్డారు. త్వరలో పదవీ విరమణ చేయనున్న తమిళనాడు పురావస్తు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కన్నన్ సేవలను తెలంగాణలో చారిత్రక ప్రాంతాల పురోగతికి వినియోగించుకునే ఆలోచనలో ఉన్నామని వెంకటేశం వెల్లడించారు. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొండమల్లెపల్లెలో కృష్ణవేణి అనే విద్యార్థినికి లభించిన తాళపత్ర గ్రంథంలో బైండ్ల మగ్గ మాయ చరిత్రకు సంబంధించిన పంచకథలున్నట్టు తెలిపారు. ఖమ్మం జిల్లా గార్ల బయ్యారంలో కృష్ణదేవరాయ, అచ్యుతరాయ కాలం నాటి 40 బంగారు నాణేలు దొరికాయని, నాణేలపై బాలకృష్ణుడి చిత్రం మరోవైపు నగరి లిపిలో శ్రీప్రతాప కృష్ణరాయ అన్న అక్షరాలున్నాయని, మిగతా నాణేలపై ఒకవైపు గండబేరుండం చిత్రం మరోవైపు నగరి లిపిలో శ్రీ ప్రతాపాచ్యుతరాయ అని అక్షరాలున్నాయన్నారు. ఇలాంటి నాణేలు దొరికితే ప్రభుత్వానికి అందజేయాలని, లేనిపక్షంలో నేరమవుతుందని వెంకటేశం తెలిపారు. ఇప్పటి వరకు లభించిన నాణేలతో ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.