రాజ్యాలు, యుద్ధాలు.. గెలుపు ఓటములు.. శిలలు, శాసనాలు.. మహళ్లు, మంతనాలు.. మతాలు, బోధనలు.. ఆరామాలు, ఆలయాలు.. చరిత్రకు సంబంధించిన ఏ జాడలైనా ప్రజలకు హక్కున్న వారసత్వ సంపదే! భావితరాలకూ చెందేలా జాగ్రత్తగా సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే!! ఆ బాధ్యతను గుర్తు చెయ్యడం కోసం గత పదిహేనేళ్లుగా ఏకదీక్షగా శ్రమిస్తున్నారు ప్రముఖ చరిత్రకారిణి రాణీ శర్మ.
గత శతాబ్దపు ఎనిమిదవ దశకం చివరి సంవత్సరాలలో విశాఖపట్టణం దగ్గర్లోని తొట్లకొండలో ఆర్కియాలజీ తవ్వకాల్లో బౌద్ధ క్షేత్రాలు బయటపడ్డాయి. వాటిని ‘ఉన్నవి ఉన్నట్లుగా’ సంరక్షించుకోవలసిన ఆవశ్యకతపై చరిత్రకారిణి, రచయిత్రి రాణి శర్మ తాజాగా ‘తథాగతుని అడుగుజాడలు’ అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా ఆమె హైదరాబాద్ వచ్చినప్పుడు ‘సాక్షి’తో పంచుకున్న విషయాలు, విశేషాలు. ‘‘పురావస్తు శాఖ జరిపిన తవ్వకాలలో 1980ల చివర్లో విశాఖపట్టణం దగ్గర్లోని తొట్లకొండ, బావికొండ, పావురాల కొండలో బౌద్ధ క్షేత్రాలు బయటపడ్డాయి. ఈ శాఖ అప్పటి డైరెక్టర్ డాక్టర్ వి.వి. కృష్ణశాస్త్రి ఆనాటి తవ్వకాలకు చాలా కృషి చేశారు.
ఈ పుస్తకానికి ప్రేరణ ఆయనే. సముద్ర తీరంలో కొండమీది క్షేత్రాలవి. రెండువేల మూడువందల సంవత్సరాల కిందట బౌద్ధ భిక్షువులు ఎలా విడిచిపెట్టి పోయారో అలాగే దొరికాయి. అయితే ఇన్నేళ్లు మట్టిలో నిక్షిప్తమై ఉన్న కట్టడాలు ఒక్కసారి బయటపడగానే పాడైపోతాయి. వాటిని పరిరక్షించాలి. ఈ తవ్వకాలు జరిగినప్పుడు విశాఖపట్టణ పరిధి చాలా తక్కువగా ఉంది. రానురాను పట్టణ పరిధి విస్తరించి తొట్లకొండ, బావికొండ దాకా వచ్చేసింది. దీనివల్ల రియల్ స్టేట్ వ్యాప్తి చెందడం, ఎలాగైనా పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలన్న ప్రభుత్వాల ఉత్సాహం వల్ల ఎంతో అమూల్యమైన ఈ ప్రాచీన నిర్మాణం దెబ్బతినడం మొదలైంది.
ప్రాచీనతకు హంగులా!!
శిథిలావస్థలో ఉన్న కొన్ని కట్టడాలను చూసి పర్యాటకశాఖ అధికారులు నాతో అన్నారు ‘‘వీటికి మనం కొన్ని హంగులు కల్పించి అందంగా తీర్చిదిద్దాలి’’ అని. ‘‘ఈ వారసత్వ సంపదకు మించిన అందం ఉంటుందా? వీటి గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఇక్కడ ఇంటర్‌ప్రెటేషన్ సెంటర్స్ (వ్యాఖ్యాన కేంద్రాలు) ఏర్పాటు చేయండి’’ అని చెప్పాను. ఇంటర్‌ప్రెటేషన్ సెంటర్స్ అంటే.. ఈ కట్టడాల చరిత్ర, గొప్పదనం, ప్రత్యేకత, వీటిని ఎందుకు సందర్శిస్తున్నాం, ఎందుకు, ఎలా కాపాడుకోవాలి వగైరాలను బ్రోషర్స్, పుస్తకాలు, ఫిల్ముల ద్వారా సందర్శకులకు వివరించడం, చూపించడం. ఇలా 2004 నుంచి నేటి దాకా వాటిని కాపాడ్డానికి నేను పాడిన పాట్లు దేవుడికే తెలుసు.
దీనికి సంబంధించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలోని స్థానిక అధికారుల నుంచి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వరకు దగ్గర దగ్గర డెబ్భై ఎనభై లేఖలు రాశా. ఓ రెండుమూడు నెలలకు ‘ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా’ వాళ్లు ఒక లేఖను పట్టుకొని విశాఖపట్టణంలోని మా ఇంటికొచ్చారు.. ‘‘రాణీ శర్మగారు ఎవరు? ప్రైమ్ మినిస్టర్ గారికి కంప్లయింట్ రాశారట’’ అంటూ. అప్పుడు వాళ్లలో ఒక అధికారిని తొట్లకొండ తీసుకెళ్లి అంతా చూపించాను. ‘‘రాణీ శర్మగారు చెప్పింది నిజమే.. ఈ సైట్ పాడైపోతోంది.. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఈ సైట్‌ను అప్పగిస్తే దీన్ని మేము పునరుద్ధరించి, పరిరక్షించగలం’’ అని ఆయన పైకి లెటర్ రాశారు.
స్నానాల బాటను తవ్వేశారు
టూరిజం భ్రమలో పడి సైట్‌ను, దాని ప్రాశస్త్యాన్ని పాడుచేసుకోవడం ప్రపంచంలో ఎక్కడా ఉండదు. సైట్‌ను జాగ్రత్తగా కాపాడుకుంటూ దానిమీద టూరిజంను వృద్ధి చేసుకుంటారు. పర్యాటకులకు ఇష్టం వచ్చినట్లు మసులుకోనివ్వరు. కారు ఎక్కడో కిలోమీటర్ల దూరంలో ఆపి.. కట్టడం వరకు నడుచుకుంటూ రావాలి. పరిరక్షణలో ఉన్న వాటిని చేతులతో తాకడం.. ముట్టుకోవడం వంటివి చేయనివ్వరు. కానీ మనం?! టూరిస్ట్‌ను ముద్దు చేస్తూ గుమ్మం దాకా వాహనాలలో రానిస్తాం.
అలా వాహనాల కోసం ఇక్కడ పూర్వకాలం బౌద్ధ గురువులు స్నానం కోసం నడిచివెళ్లిన బాటను తవ్వేసి రోడ్లు వేశారు! హంగులు, ఆర్భాటాలు కల్పించి.. షాపింగ్ కాంప్లెక్స్‌లు, ప్రార్థనా మందిరాలు కట్టి.. దాన్నో విహారకేంద్రంలా తయారు చేశారు. నిజానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇవన్నీ చేయకూడదు. వీటన్నిటినీ ఎత్తిచూపుతూ ఉత్తరాలు రాశా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ స్పందనా రాలేదు. అది ఏ ఉత్సాహంలో ఉండిందంటే ఎలాగైనా సరే ఈ బౌద్ధక్షేత్రాలను నలుగురికీ చూపించి డబ్బులు గడించాలి అని!
పాత తొట్లకొండ మాయం
బౌద్ధ గురువులెప్పుడూ అందమైన ప్రకృతి ప్రదేశాలనే తమ ఆవాసాలుగా చేసుకున్నారు. తొట్లకొండలో కూడా అంతే. సముద్రమట్టానికి ఎత్తులో చుట్టూ పచ్చని చెట్లు, చేమల మధ్య చక్కటి వాతావరణంతో ఆహ్లాదంగా ఉంటుంది. అలాంటి అద్భుతమైన స్థలాన్ని కమర్షియల్ కాంప్లెక్స్‌లు, హోటల్స్, రిసార్టులు కట్టే ఆలోచనతో నాశనం చేస్తున్నారు. నేను చెప్పిన ఇంటర్‌ప్రెటేషన్ సెంటర్ ఈనాటికీ వాళ్ల కార్యాచరణలో లేకపోగా ఈ మధ్య ఏం చేశారంటే.. 2,300 ఏళ్ల నాటి కట్టడంలోని పాత ఇటుకలన్నిటినీ తీసిపారేసి ఇప్పటి ఇటుకలతో కట్టేశారంతా! ఇప్పుడు మీరు తొట్లకొండను చూద్దామని వస్తే.. నాటి తొట్లకొండకు బదులుగా రెండేళ్ల కిందట కొత్తగా కట్టిన తొట్లకొండ సాక్షాత్కరిస్తుంది.
ఇదంతా నిబంధనలకు విరుద్ధమే. ఈ ఆక్రోశంతో, బాధతో, దుఃఖంతో కన్నీళ్లు కారుస్తూ ‘తథాగతుని అడుగుజాడలు’ పుస్తకం రాశాను. ప్రేరణ ఏంటంటే.. నేను చరిత్ర విద్యార్థిని అవడం, ఒకప్పుడు ఇటు తెలంగాణ, అటు కోస్తా అంతటా కూడా బౌద్ధమే ఉండడం. అప్పుడు మనందరం బౌద్ధులమే. వరం కొద్దీ ఈ ప్రాంతం మన ఆంధ్రదేశం ఒడిలో పడింది. ఈ ప్రాముఖ్యం తెలియక టూరిజం ‘అభివృద్ధి’లో కొట్టుకుపోతున్నాయి ప్రభుత్వాలు.
ఇదంతా భావితరాల ఆస్తి
నియమాలకు విరుద్ధంగా తొట్లకొండ స్తూపానికి దగ్గర్లో నిర్మాణాలు మొదలుపెట్టారు. దీని మీద హైకోర్టులో కేసు వేశా. సాంచీలో కాని, భార్‌హూత్‌లో కాని ఎక్కడా ఇలా నిర్మాణాలకు అనుమతించలేదు. అసలు జీవో ప్రకారం కొండంతా కూడా సంరక్షణ ప్రాంతమే. ఈ జీవో అందరికీ చూపించుకుంటూ పోరాడాల్సి వస్తోంది. తొట్లకొండ, బావికొండ, పావురాలకొండను అనాథ ప్రాంతాలుగా చేసేశారు. ఇది ప్రభుత్వ ఆస్తో, ప్రజాప్రతినిధుల ఆస్తో కాదు. ప్రజలది, మన భావితరాలది.
ఇవి ప్రపంచ వారసత్వ సంపదలు. వీటికి మనం సంరక్షులం మాత్రమే. దురదృష్టమేమంటే వాటిని భద్రంగా కాపాడే పురావస్తు శాఖను నిర్వీర్యం చేసి, పర్యాటక శాఖ కింద పెట్టడం. పాశ్చాత్య దేశాల్లో ఇలా ఉండదు. ప్రతి ఊళ్లో ‘హిస్టారికల్ సొసైటీస్’ ఉంటాయి. ప్రజలకు వాటి మీద యాజమాన్యపు హక్కుంటుంది. ప్రజలను అడక్కుండా ప్రభుత్వాలు ఏ పనీ చేయడానికి వీల్లేదు. మన దగ్గరా అలాంటి చైతన్యం రావాలి’’ అంటారు ఈమని రాణి శర్మ.
– సరస్వతి రమ
ఫొటోలు : ఐ.దేవేంద్రనాథ్
రెండవ పుస్తకం
రాణీ శర్మ జన్మస్థలం విశాఖపట్టణం. తండ్రి మురుకుట్ల పురుషోత్తమ శర్మ. తల్లి పార్వతి. తండ్రి ఉద్యోగరీత్యా ప్రాథమిక విద్యను రాయలసీమలో, ఉన్నత విద్యను మచిలీపట్టణం, హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో అభ్యసించారు. భర్త ఈఏఎస్ శర్మ ఐఏఎస్ అధికారి. ఆయన ఉద్యోగరీత్యా ఢిల్లీ వెళ్లడంతో రాణీ శర్మ కూడా తన అధ్యాపక వృత్తిని అక్కడే ఢిల్లీ యూనివర్సిటీలో కొనసాగించారు. పదవీ విరమణ తర్వాత విశాఖపట్టణంలో స్థిరపడ్డారు. ‘తథాగతుని అడుగుజాడలు’ ఆమె రెండవ పుస్తకం. మొదటి పుస్తకం హైదరాబాద్ పూర్వ సంస్కృతి మీద రాసిన ‘‘ది డియోడిస్ ఆఫ్ హైదరాబాద్ : ఎ లాస్ట్ హెరిటేజ్ ’’.
Comments
Please login to add a commentAdd a comment