Historian
-
అసమాన ప్రశ్నలు
ఈ ప్రపంచం ఎందుకు ఇలా ఉంది? ఈ అసమానతలకు కారణం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు ఒక శాస్త్రవేత్తకు వస్తే? ఆయన చరిత్రకారుడు కూడా అయితే! జియోగ్రాఫర్, ఆర్నిథాలజిస్ట్ లాంటి అదనపు అర్హతలు కూడా ఉంటే? ఇలాంటి ప్రశ్నలకు బహు వృత్తులు, ప్రవృత్తులు కలగలిసినవారే జవాబులు చెప్పగలరు. ఒకానొక సముద్రపు ఒడ్డు నడకలో అమెరికన్ రచయిత జేరెడ్ డైమండ్ (జ.1937)ను ఒక నల్లజాతి యువకుడు, పాపువా న్యూ గినియా దీవులకు చెందిన ‘యాలి’ ఇలా నిలదీశాడు: ‘మీ తెల్లవాళ్ల దగ్గర అంత ‘కార్గో’(వస్తు సామగ్రి) ఉన్నప్పుడు, మా దగ్గర అది ఎందుకు లేదు?’ ఈ అన్వేషణలో భాగంగా ఏళ్లపాటు చేసిన పరిశోధనతో జేరెడ్ డైమండ్ రాసిన పుస్తకం ‘గన్స్, జెర్మ్స్ అండ్ స్టీల్: ద ఫేట్స్ ఆఫ్ హ్యూమన్ సొసైటీస్’. శీర్షికలోనే సమాధానాలను నిలుపుకొన్న ఈ పుస్తకం సరిగ్గా పాతిక సంవత్సరాల క్రితం 1997లో వచ్చింది. ఆ తర్వాత దీని ఆధారంగానే ఇదే పేరుతో ‘ఎన్జీసీ’ ఛానల్ డైమండ్ హోస్ట్‌గా మూడు భాగాల డాక్యుమెంటరీ కూడా నిర్మించింది. సులభంగా కనబడే ఈ ప్రశ్నలకు జవాబులు అంత సులభంగా దొరకవు. వీటికి సమాధానాలు కూడా వర్తమానమో, సమీప గతమో చెప్పలేదు. అందుకే చరిత్ర, పూర్వ చరిత్ర యుగంలోకి డైమండ్ మనల్ని తీసుకెళ్తారు. మనుషులందరూ ఆహార సేకరణ దశలోనే ఉన్న తరుణంలో పదమూడు వేల ఏళ్ల క్రితం ‘మధ్య ప్రాచ్యం’లో మొదటిసారి వ్యవసాయం మొదలైంది. బార్లీ, గోదుమ పండించారు. ఎప్పుడైతే మిగులు పంట సాధ్యమైందో అక్కడ మనుషుల వ్యాపకాలు ఇతరాల వైపు మళ్లాయి. అలా మానవాళి మొదటి నాగరికత నిర్మాణం జరిగింది. చిత్రంగా పాపువా న్యూ గినియాలో ఇప్ప టికీ వ్యవసాయం మొదలుకాలేదు. అక్కడివాళ్లు తెలివైనవాళ్లు కాదనా? ఏ చెట్టు ఏమిటో, ఏ పుట్టలో ఏముందో చెప్పగలిగేవాళ్లు; ఎంతదూరమైనా బాణాన్ని గురిచూసి కొట్టేవాళ్లు తెలివైనవాళ్లు కాక పోవడం ఏమిటి? ఏ పంటలైతే మధ్యప్రాచ్యంలో నాగరికతకు కారణమయ్యాయో, అవి ఇక్కడ పెరగవు. ఆ భౌగోళిక పరిమితి వల్ల వాళ్లు ఇంకా ఆహార అన్వేషణ దశలోనే ఉన్నారు. అందుకే మనుషులను ‘అసమానంగా’ ఉంచుతున్న కీలక కారణం భౌగోళికత అంటారు డైమండ్. ‘ఫెర్టయిల్ క్రెసెంట్’(సారవంతమైన చంద్రవంక)గా పిలిచే ఈ యురేసియా ప్రాంతంలోనే జంతువులను మచ్చిక చేసుకోవడం కూడా జరిగింది. ఇవి గొప్ప అదనపు సంపదగా పనికొచ్చాయి. ఆవు, ఎద్దు, గొర్రె, మేక, గుర్రం, గాడిద, పంది లాంటి పద్నాలుగు పెంపుడు జంతువుల్లో ఒక్క లామా(పొట్టి ఒంటె; దక్షిణ అమెరికా) తప్ప పదమూడు ఈ ప్రాంతం నుంచే రావడం భౌగోళిక అనుకూలతకు నిదర్శనంగా చూపుతారు డైమండ్. మనుషుల విస్తరణ కూడా సరిగ్గా ఆ భౌగోళిక రేఖ వెంబడి, అంటే ఏ ప్రాంతాలు వీటికి అనుకూలంగా ఉన్నాయో వాటివెంటే జరిగింది. మరి ఒకప్పుడు మొదటి నాగరికత వర్ధిల్లిన మధ్య ప్రాచ్యం ఇప్పుడు ప్రపంచంలోనే సంపన్న ప్రాంతంగా ఎందుకు లేదు? భౌగోళికత ఒక కారణం అవుతూనే, దాన్ని మించినవి కూడా ఇందులో పాత్ర పోషిస్తున్నాయన్నది డైమండ్ సిద్ధాంతం. అయితే భౌగోళికత ప్రతికూలంగా కూడా పరిణమించవచ్చు. కరవు కాటకాలు ఓ దశలో మధ్యప్రాచ్యాన్ని తుడిచిపెట్టాయి కూడా! వారికి తెలియకుండానే ఐరోపావాసుల పక్షాన పనిచేసినవి సూక్ష్మ క్రిములని చెబుతారు డైమండ్. ఇతర ప్రాంతాలకు విస్తరించే క్రమంలో జరిగిన పోరాటాల్లో, ఆ పోరాటాల కంటే ఎక్కువగా వీరి నుంచి వ్యాపించిన సూక్ష్మక్రిముల వల్ల ‘మూలజాతులు’ నశించాయి. దానిక్కారణం – వేల సంవత్సరాల జంతువుల మచ్చిక వల్ల వాటి నుంచి వచ్చే సూక్ష్మక్రిముల నుంచి వీరికి నిరోధకత ఏర్పడింది. కానీ అలాంటి సంపర్కం లేని అమెరికన్ జాతులు దాదాపు తొంభై ఐదు శాతం నశించిపోయాయి. ముఖ్యంగా ‘స్మాల్‌పాక్స్’(మశూచి) కోట్లాది మంది ప్రాణాలు తీసింది. ఇంక ఎప్పుడైతే ఉక్కు వాడకంలోకి వచ్చిందో, ఆ ఉక్కుతో ముడిపడిన తుపాకులు రావడం ప్రపంచ గతినే మార్చేసింది. ఆ తుపాకుల వల్లే యూరప్ దేశాలు ప్రపంచాన్ని తమ కాలనీలుగా మార్చుకోగలిగాయి. ముఖ్యంగా ఆఫ్రికాలోని ప్రాచీన నాగరిక సమాజాలు, అవెంతటి ఘన సంస్కృతి కలిగినవి అయినప్పటికీ తుపాకుల ముందు నిలవలేకపోయాయి. అక్కడి నుంచి ఎంతో అమూల్యమైన సంపద తరలిపోయింది. మరి ఐరోపావాసులకు ప్రతికూలతలుగా పరిణమించినవి ఏవీ లేవా? ఏ భౌగోళిక రేఖ వెంబడి ప్రయాణిస్తూ వారికి అనుకూలమైన శీతోష్ణస్థితి ఉండే ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’(దక్షిణాఫ్రికా)లో మనగలిగారో, దాన్ని దాటి ఆఫ్రికాలోని ఉష్ణ మండలం వైపు విస్తరించినప్పుడు కేవలం మలేరియాతో కోట్లాదిమంది చచ్చిపోయారు. ప్రపంచం స్థిరంగా ఆగిపోయేది కాదు. భౌతిక ప్రమాణాల రీత్యా ప్రపంచంలో అసమానతలు స్పష్టంగా కనబడుతుండవచ్చు. కానీ మొన్న కోవిడ్ మహమ్మారి సమయంలో ఐరోపా, అమెరికా అల్లాడిపోయాయి. అదే పేద దేశాలు అంత ప్రభావితం కాలేదు. కాబట్టి అసమానత అనేది కూడా ఒక చరాంకం కావొచ్చు. ఒకే సమాజంలోనే కొందరు ధనికులుగా, ఇంకొందరు పేదవాళ్లుగా ఎందుకు ఉండిపోతున్నారు? ఒకే ఇంటిలోనే ఇద్దరన్నదమ్ములు భిన్న స్థాయుల్లోకి ఎందుకు చేరుతున్నారు? ఈ మొత్తంలో మానవ ప్రయత్నానికి ఏ విలువా లేదా? అందుకే డైమండ్ జవాబులు మరీ సరళంగా ఉన్నాయేమో అనిపించక మానదు. కానీ మార్గదర్శులు వాళ్ల జీవితాలను రంగరించి కొన్ని సమాధానాలు చెబుతారు. వాటి వెలుగులో సమాజం మరిన్ని జవాబులు వెతకాల్సి ఉంటుంది. ఎందుకంటే మానవ సమాజం అనేది మానవ స్వభావం అంత సంక్లిష్టమైనది. -
సమ్మక్క చరిత్ర తెలియాలంటే.. దీన్ని డీకోడ్ చేయాల్సిందే
సమ్మక్క, సారలమ్మ జాతర గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. సమ్మక్క కారణజన్మురాలని.. పుట్టుకతోనే మహిమలు చూపేదని కోయపురాణం చెబుతుంది. కాకతీయులతో పోరాడి సమ్మక్క వీరమరణం పొందింది అని చరిత్రకారుల అభిప్రాయం. సమ్మక్క దైవాంశ సంభూతురాలని భక్తుల విశ్వాసం. ఇంతకీ సమ్మక్క చరిత్రకు సంబంధించిన వివరాలు ఎక్కడున్నాయి? జాతర సందర్భంగా గోవిందరాజులు, పగిడిద్దరాజులను మేడారం తీసుకువచ్చే పూజారులు ప్రత్యేకంగా తయారు చేసిన జెండాలను మోసుకుంటూ వస్తారు. గోవిందరాజులు, పగిడిద్దరాజులకు వేర్వేరుగా ఈ జెండాలు ఉన్నాయి. ఇలాంటి జెండాలే సమ్మక్క, సారలమ్మలకు ఉన్నాయి. ఆ జెండాలు వందల ఏళ్ల నాటి విషయాలను తమలో దాచుకున్నాయి. సమ్మక్క చరిత్ర పూర్తిగా లిఖితంగా ఎక్కడా లభించలేదు . అయితే సమ్మక్కతో పాటు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల చరిత్ర మరో రూపంలో నిక్షిప్తమై ఉంది. ఈ చరిత్రను పటం రూపంలో నిక్షిప్తమయ్యిందని ఆదివాసీలు చెబుతుంటారు. అనాదిగా కోయలు, ఆదివాసీలకు వేర్వేరు భాషలు ఉన్నాయి. అయితే చాలా కోయ భాషలకు లిపి లేదు. దీంతో పురాతన పద్దతి అనుసరించి బొమ్మల రూపంలో చరిత్రను నిక్షిప్తం చేశారు. బొమ్మల రూపంలో చరిత్రను.. ఆనాటి పరిస్థితులను నిక్షిప్తం చేయడం ఎప్పటి నుంచో అమల్లో ఉన్న పద్దతి. ప్రాచీన ఈజిప్టులు ఇదే పద్దతిని ఫాలో అయ్యారు. ఈజిప్టు చరిత్రకు సంబంధించిన అనేక అంశాలు ఈ బొమ్మల లిపిలోనే మనకు లభ్యమయ్యాయి. వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా పేరొందిన మధ్యప్రదేశ్‌లోని భీమ్బెట్కా దగ్గర ఈ తరహా బొమ్మల లిపి రూపంలో చరిత్ర అందుబాటులో ఉంది. ఇంచుమించు ఇదే పద్దతిలో ఆదివాసీ దేవతల చరిత్ర లిఖించబడింది. ఎర్రగా త్రిభుజాకారంలో తయారు చేసిన ఈ జెండాలనే వనదేవతల చరిత్ర ఉంది. సమక్క, సారలమ్మల పూర్వీకులు, ప్రకృతితో వారికి ఉన్న సంబంధం అంతా ఇక్కడ బొమ్మల రూపంలో వివరించి ఉంటుంది. ఒక్కో ఆదివాసీ దేవతకు ఒక్కో రూపంలో ఈ జెండాలు ఉన్నాయి. ఈ జెండాలో ఉన్న బొమ్మల ఆధారంగా డోలీలు సమ్మక్క కథను మౌఖికంగా చెబుతారు. సమక్క, సారలమ్మలతో పాటు ఇతర ఆదివాసీ దేవతలకు సంబంధించి జెండాల గురించి చాలినంత పరిశోధన జరగలేదు. వందల ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న ఈ జెండాలోని బొమ్మల లిపిపై చరిత్రకారులు పరిశోధనలు చేయాల్సి ఉంది. ఈ జెండాలోని అంశాలు, వాటి ఆధారంగా చెబుతున్న మౌఖిక కథలను డీకోడ్ చేస్తే ఆదివాసీ దేవతలకు సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి -
ప్రముఖ చరిత్రకారుడు పురందరే కన్నుమూత
పుణె: ప్రముఖ చరిత్రకారుడు, పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత బల్వంత్ మోరేశ్వర్ పురందరే సోమవారం అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచారు. నిమోనియాతో బాధపడుతున్న ఆయన సోమవారం పుణెలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. బాబాసాహెబ్ పురందరేగా చిరపరిచితుడైన ఆయన వయసు 99 సంవత్సరాలు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్‌పై విశేషమైన పరిశోధనలతో పురందరే దేశంలోనే ఖ్యాతికెక్కారు. 1950లలో రాజా శివచక్రవర్తి పేరిట రాసిన పుస్తకంతో ఆయన మహారాష్ట్ర వాసుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. జానతా రాజా పేరుతో ఆయన రూపొందించిన నాటకం సైతం ఎంతో పేరొందింది. 2015లో మహారాష్ట్ర భూషణ్ అవార్డు ఆయనను వరించింది. 2019లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. పురందరే మృతిపై ప్రధాని మోదీ తదితరులు తీవ్ర విచారం వ్యక్తంచేశారు. పురందరే అంత్యక్రియలను పుణెలో సోమవారం మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో పూర్తిచేశారు. -
జాడల్ని చెరిపేసుకుంటున్నాం
రాజ్యాలు, యుద్ధాలు.. గెలుపు ఓటములు.. శిలలు, శాసనాలు.. మహళ్లు, మంతనాలు.. మతాలు, బోధనలు.. ఆరామాలు, ఆలయాలు.. చరిత్రకు సంబంధించిన ఏ జాడలైనా ప్రజలకు హక్కున్న వారసత్వ సంపదే! భావితరాలకూ చెందేలా జాగ్రత్తగా సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే!! ఆ బాధ్యతను గుర్తు చెయ్యడం కోసం గత పదిహేనేళ్లుగా ఏకదీక్షగా శ్రమిస్తున్నారు ప్రముఖ చరిత్రకారిణి రాణీ శర్మ. గత శతాబ్దపు ఎనిమిదవ దశకం చివరి సంవత్సరాలలో విశాఖపట్టణం దగ్గర్లోని తొట్లకొండలో ఆర్కియాలజీ తవ్వకాల్లో బౌద్ధ క్షేత్రాలు బయటపడ్డాయి. వాటిని ‘ఉన్నవి ఉన్నట్లుగా’ సంరక్షించుకోవలసిన ఆవశ్యకతపై చరిత్రకారిణి, రచయిత్రి రాణి శర్మ తాజాగా ‘తథాగతుని అడుగుజాడలు’ అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా ఆమె హైదరాబాద్ వచ్చినప్పుడు ‘సాక్షి’తో పంచుకున్న విషయాలు, విశేషాలు. ‘‘పురావస్తు శాఖ జరిపిన తవ్వకాలలో 1980ల చివర్లో విశాఖపట్టణం దగ్గర్లోని తొట్లకొండ, బావికొండ, పావురాల కొండలో బౌద్ధ క్షేత్రాలు బయటపడ్డాయి. ఈ శాఖ అప్పటి డైరెక్టర్ డాక్టర్ వి.వి. కృష్ణశాస్త్రి ఆనాటి తవ్వకాలకు చాలా కృషి చేశారు. ఈ పుస్తకానికి ప్రేరణ ఆయనే. సముద్ర తీరంలో కొండమీది క్షేత్రాలవి. రెండువేల మూడువందల సంవత్సరాల కిందట బౌద్ధ భిక్షువులు ఎలా విడిచిపెట్టి పోయారో అలాగే దొరికాయి. అయితే ఇన్నేళ్లు మట్టిలో నిక్షిప్తమై ఉన్న కట్టడాలు ఒక్కసారి బయటపడగానే పాడైపోతాయి. వాటిని పరిరక్షించాలి. ఈ తవ్వకాలు జరిగినప్పుడు విశాఖపట్టణ పరిధి చాలా తక్కువగా ఉంది. రానురాను పట్టణ పరిధి విస్తరించి తొట్లకొండ, బావికొండ దాకా వచ్చేసింది. దీనివల్ల రియల్ స్టేట్ వ్యాప్తి చెందడం, ఎలాగైనా పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలన్న ప్రభుత్వాల ఉత్సాహం వల్ల ఎంతో అమూల్యమైన ఈ ప్రాచీన నిర్మాణం దెబ్బతినడం మొదలైంది. ప్రాచీనతకు హంగులా!! శిథిలావస్థలో ఉన్న కొన్ని కట్టడాలను చూసి పర్యాటకశాఖ అధికారులు నాతో అన్నారు ‘‘వీటికి మనం కొన్ని హంగులు కల్పించి అందంగా తీర్చిదిద్దాలి’’ అని. ‘‘ఈ వారసత్వ సంపదకు మించిన అందం ఉంటుందా? వీటి గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఇక్కడ ఇంటర్‌ప్రెటేషన్ సెంటర్స్ (వ్యాఖ్యాన కేంద్రాలు) ఏర్పాటు చేయండి’’ అని చెప్పాను. ఇంటర్‌ప్రెటేషన్ సెంటర్స్ అంటే.. ఈ కట్టడాల చరిత్ర, గొప్పదనం, ప్రత్యేకత, వీటిని ఎందుకు సందర్శిస్తున్నాం, ఎందుకు, ఎలా కాపాడుకోవాలి వగైరాలను బ్రోషర్స్, పుస్తకాలు, ఫిల్ముల ద్వారా సందర్శకులకు వివరించడం, చూపించడం. ఇలా 2004 నుంచి నేటి దాకా వాటిని కాపాడ్డానికి నేను పాడిన పాట్లు దేవుడికే తెలుసు. దీనికి సంబంధించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలోని స్థానిక అధికారుల నుంచి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వరకు దగ్గర దగ్గర డెబ్భై ఎనభై లేఖలు రాశా. ఓ రెండుమూడు నెలలకు ‘ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా’ వాళ్లు ఒక లేఖను పట్టుకొని విశాఖపట్టణంలోని మా ఇంటికొచ్చారు.. ‘‘రాణీ శర్మగారు ఎవరు? ప్రైమ్ మినిస్టర్ గారికి కంప్లయింట్ రాశారట’’ అంటూ. అప్పుడు వాళ్లలో ఒక అధికారిని తొట్లకొండ తీసుకెళ్లి అంతా చూపించాను. ‘‘రాణీ శర్మగారు చెప్పింది నిజమే.. ఈ సైట్ పాడైపోతోంది.. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఈ సైట్‌ను అప్పగిస్తే దీన్ని మేము పునరుద్ధరించి, పరిరక్షించగలం’’ అని ఆయన పైకి లెటర్ రాశారు. స్నానాల బాటను తవ్వేశారు టూరిజం భ్రమలో పడి సైట్‌ను, దాని ప్రాశస్త్యాన్ని పాడుచేసుకోవడం ప్రపంచంలో ఎక్కడా ఉండదు. సైట్‌ను జాగ్రత్తగా కాపాడుకుంటూ దానిమీద టూరిజంను వృద్ధి చేసుకుంటారు. పర్యాటకులకు ఇష్టం వచ్చినట్లు మసులుకోనివ్వరు. కారు ఎక్కడో కిలోమీటర్ల దూరంలో ఆపి.. కట్టడం వరకు నడుచుకుంటూ రావాలి. పరిరక్షణలో ఉన్న వాటిని చేతులతో తాకడం.. ముట్టుకోవడం వంటివి చేయనివ్వరు. కానీ మనం?! టూరిస్ట్‌ను ముద్దు చేస్తూ గుమ్మం దాకా వాహనాలలో రానిస్తాం. అలా వాహనాల కోసం ఇక్కడ పూర్వకాలం బౌద్ధ గురువులు స్నానం కోసం నడిచివెళ్లిన బాటను తవ్వేసి రోడ్లు వేశారు! హంగులు, ఆర్భాటాలు కల్పించి.. షాపింగ్ కాంప్లెక్స్‌లు, ప్రార్థనా మందిరాలు కట్టి.. దాన్నో విహారకేంద్రంలా తయారు చేశారు. నిజానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇవన్నీ చేయకూడదు. వీటన్నిటినీ ఎత్తిచూపుతూ ఉత్తరాలు రాశా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ స్పందనా రాలేదు. అది ఏ ఉత్సాహంలో ఉండిందంటే ఎలాగైనా సరే ఈ బౌద్ధక్షేత్రాలను నలుగురికీ చూపించి డబ్బులు గడించాలి అని! పాత తొట్లకొండ మాయం బౌద్ధ గురువులెప్పుడూ అందమైన ప్రకృతి ప్రదేశాలనే తమ ఆవాసాలుగా చేసుకున్నారు. తొట్లకొండలో కూడా అంతే. సముద్రమట్టానికి ఎత్తులో చుట్టూ పచ్చని చెట్లు, చేమల మధ్య చక్కటి వాతావరణంతో ఆహ్లాదంగా ఉంటుంది. అలాంటి అద్భుతమైన స్థలాన్ని కమర్షియల్ కాంప్లెక్స్‌లు, హోటల్స్, రిసార్టులు కట్టే ఆలోచనతో నాశనం చేస్తున్నారు. నేను చెప్పిన ఇంటర్‌ప్రెటేషన్ సెంటర్ ఈనాటికీ వాళ్ల కార్యాచరణలో లేకపోగా ఈ మధ్య ఏం చేశారంటే.. 2,300 ఏళ్ల నాటి కట్టడంలోని పాత ఇటుకలన్నిటినీ తీసిపారేసి ఇప్పటి ఇటుకలతో కట్టేశారంతా! ఇప్పుడు మీరు తొట్లకొండను చూద్దామని వస్తే.. నాటి తొట్లకొండకు బదులుగా రెండేళ్ల కిందట కొత్తగా కట్టిన తొట్లకొండ సాక్షాత్కరిస్తుంది. ఇదంతా నిబంధనలకు విరుద్ధమే. ఈ ఆక్రోశంతో, బాధతో, దుఃఖంతో కన్నీళ్లు కారుస్తూ ‘తథాగతుని అడుగుజాడలు’ పుస్తకం రాశాను. ప్రేరణ ఏంటంటే.. నేను చరిత్ర విద్యార్థిని అవడం, ఒకప్పుడు ఇటు తెలంగాణ, అటు కోస్తా అంతటా కూడా బౌద్ధమే ఉండడం. అప్పుడు మనందరం బౌద్ధులమే. వరం కొద్దీ ఈ ప్రాంతం మన ఆంధ్రదేశం ఒడిలో పడింది. ఈ ప్రాముఖ్యం తెలియక టూరిజం ‘అభివృద్ధి’లో కొట్టుకుపోతున్నాయి ప్రభుత్వాలు. ఇదంతా భావితరాల ఆస్తి నియమాలకు విరుద్ధంగా తొట్లకొండ స్తూపానికి దగ్గర్లో నిర్మాణాలు మొదలుపెట్టారు. దీని మీద హైకోర్టులో కేసు వేశా. సాంచీలో కాని, భార్హూత్లో కాని ఎక్కడా ఇలా నిర్మాణాలకు అనుమతించలేదు. అసలు జీవో ప్రకారం కొండంతా కూడా సంరక్షణ ప్రాంతమే. ఈ జీవో అందరికీ చూపించుకుంటూ పోరాడాల్సి వస్తోంది. తొట్లకొండ, బావికొండ, పావురాలకొండను అనాథ ప్రాంతాలుగా చేసేశారు. ఇది ప్రభుత్వ ఆస్తో, ప్రజాప్రతినిధుల ఆస్తో కాదు. ప్రజలది, మన భావితరాలది. ఇవి ప్రపంచ వారసత్వ సంపదలు. వీటికి మనం సంరక్షులం మాత్రమే. దురదృష్టమేమంటే వాటిని భద్రంగా కాపాడే పురావస్తు శాఖను నిర్వీర్యం చేసి, పర్యాటక శాఖ కింద పెట్టడం. పాశ్చాత్య దేశాల్లో ఇలా ఉండదు. ప్రతి ఊళ్లో ‘హిస్టారికల్ సొసైటీస్’ ఉంటాయి. ప్రజలకు వాటి మీద యాజమాన్యపు హక్కుంటుంది. ప్రజలను అడక్కుండా ప్రభుత్వాలు ఏ పనీ చేయడానికి వీల్లేదు. మన దగ్గరా అలాంటి చైతన్యం రావాలి’’ అంటారు ఈమని రాణి శర్మ. – సరస్వతి రమ ఫొటోలు : ఐ.దేవేంద్రనాథ్ రెండవ పుస్తకం రాణీ శర్మ జన్మస్థలం విశాఖపట్టణం. తండ్రి మురుకుట్ల పురుషోత్తమ శర్మ. తల్లి పార్వతి. తండ్రి ఉద్యోగరీత్యా ప్రాథమిక విద్యను రాయలసీమలో, ఉన్నత విద్యను మచిలీపట్టణం, హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో అభ్యసించారు. భర్త ఈఏఎస్ శర్మ ఐఏఎస్ అధికారి. ఆయన ఉద్యోగరీత్యా ఢిల్లీ వెళ్లడంతో రాణీ శర్మ కూడా తన అధ్యాపక వృత్తిని అక్కడే ఢిల్లీ యూనివర్సిటీలో కొనసాగించారు. పదవీ విరమణ తర్వాత విశాఖపట్టణంలో స్థిరపడ్డారు. ‘తథాగతుని అడుగుజాడలు’ ఆమె రెండవ పుస్తకం. మొదటి పుస్తకం హైదరాబాద్ పూర్వ సంస్కృతి మీద రాసిన ‘‘ది డియోడిస్ ఆఫ్ హైదరాబాద్ : ఎ లాస్ట్ హెరిటేజ్ ’’. -
‘అర్బన్ నక్సల్’ అంటే ఏంటి?: రొమిలా థాపర్
న్యూఢిల్లీ: ‘అర్బన్ నక్సల్’ అనే మాటకు అర్థం ఏమిటో చెప్పాలని ప్రముఖ చరిత్రకారిణి రొమిలా థాపర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తనతోపాటు తనవంటి కార్యకర్తలకు ఆ మాటకు నిర్వచనం తెలియదని అన్నారు. వామపక్ష అనుకూల కార్యకర్తల గృహ నిర్బంధానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో థాపర్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..‘అర్బన్ నక్సల్ అని పిలవడం తేలికైపోయింది. అర్బన్ నక్సల్స్ అంటే వారికి అర్థం తెలుసా? ముందుగా ప్రభుత్వాన్ని ఆ మాటకు అర్థం చెప్పమనండి. ఆ కేటగిరీలో మేమెలా ఉంటామో, అర్బన్ నక్సల్స్ ఎలా అయ్యామో చెప్పమనండి. అర్బన్ నక్సల్ నిర్వచనం ప్రభుత్వానికీ తెలియదా లేదా మాకు అర్థం కాలేదా చెప్పమనండి’ అని అన్నారు. సమాజంలో మంచి కోసం పోరాడుతున్న వారికి అర్బన్ నక్సల్స్ అని పేరు పెట్టటం వెనుక రాజకీయ కారణాలున్నాయని ఆమె ఆరోపించారు. -
నిరాదరణకు గురవుతున్న ఆలయం!
గురుగ్రామ్, హరియాణ: కురు, పాండవులకు విలువిద్య నేర్పిన గురు ద్రోణాచార్యుడి ఆలయం నిరాదరణకు గురవుతోంది. దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయం హరియాణాలోని గురుగ్రామ్‌లో ఉంది. అయితే, నగరంలోని సుభాష్ నగర్లో ఉన్న ఈ ఆలయం ఇరుకు వీధుల్లో, చుట్టూ చెట్లతో నిండిన ప్రదేశంలో ఉండడంతో జనాదరణకు నోటుకోవడం లేదు. దేశంలో ద్రోణుడికి ఉన్న ఏకైక ఆలయంపట్ల అటు ప్రభుత్వం, ఇటు పాలకుల చిన్న చూపు తగదని స్థానికులు అంటున్నారు. 1872లో సింఘా భగత్ అనే భూస్వామి ఈ ఆలయాన్ని నిర్మించారని స్థానికులు చెప్తున్నారు. ద్రోణాచార్యుడికి నిత్య పూజలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. ధూపదీప నైవేద్యాలు నిర్విఘ్నంగా సాగాలని వందల ఎకరాలు ఆలయానికి మాన్యంగా దానం ఇచ్చాడని అంటున్నారు. కాలక్రమంలో ఆ భూములు అన్యాక్రాంతం అయ్యాయని వారు తెలిపారు. ఆమె గుడికి వైభవం.. ద్రోణాచార్యుడి భార్య శీత్లాదేవికి కూడా గురుగ్రామ్‌లో ఆలయం ఉంది. 18వ శతాబ్దానికి చెందిన రాజస్థాన్ మహారాజు దీనిని నిర్మించారు. హరియాణాలో భక్తుల కోర్కెలు తీర్చే దైవంగా శీత్లాదేవి ప్రాచుర్యం పొందారు. ‘కురు, పాండవుల గురువు ద్రోణాచార్యుడి గుర్తుగా ఈ ప్రాంతం పేరును ఇటీవలే గురుగ్రామ్‌గా మార్చారనీ, అయినా సందర్శకుల సంఖ్యకు నోచుకోవడం లేదని గుడి పూజారి శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వ సహాయ, సహకారాలు కోరతామని అన్నారు. సుభాష్ నగర్ ప్రాంతానికి ‘గురు ద్రోణాచార్య నగర్’గా నామకరణం చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన చెప్పారు. ఆలయ పునరుద్ధరణకు కూడా ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఆలయం నిర్మితమైన ప్రదేశానికి గురు ద్రోణాచార్యుడికి ఏ విధమైన సంబంధాలు లేవని చరిత్రకారులు వాదిస్తున్నారు. -
చరిత్ర మలచిన చరిత్రకారుడు
చారిత్రక ఘటనల వెంట నడిచి వెళ్లినవారే చరిత్రకారులైతే! ఇలాంటి ఘటనలు చరిత్రలో అరుదు. తెలుగు ప్రాంతాలలో మాత్రం ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య అలా చరిత్రకు సాక్షిగా నిలిచి, అదే చరిత్రను నమోదు చేసి, విద్యార్థులకు బోధించే సదవకాశం పొందారు. కేఏ నీలకంఠశాస్త్రి, నేలటూరి వెంకటరమణయ్య, మల్లంపల్లి సోమశేఖరశర్మ, పీవీ పరబ్రహ్మశాస్త్రి వంటివారు దక్షిణ భారతంలోనే ఖ్యాతికెక్కిన చరిత్రకారులు, లేదా చరిత్ర కోసం శ్రమించినవారు. మామిడిపూడి వెంకటరంగయ్య గారు (జనవరి 8, 1889–జనవరి 13, 1982) అలాంటి ఉన్నత శ్రేణి చరిత్రకారుడు. కానీ చారిత్రక ఘటనలతో ప్రేరణ పొంది, ప్రత్యక్ష సాక్షిగా ఉండి ఆ క్రమంలో చరిత్రకారునిగా తనను తాను తీర్చిదిద్దుకున్నప్పటికీ, చరిత్రను సశాస్త్రీయంగా ఆవిష్కరించిన ఘనత ఆచార్య మామిడిపూడికి దక్కుతుంది. వెంకటరంగయ్యగారు నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా పురిణి గ్రామంలో పుట్టారు. వీరి పూర్వీకులది మామిడిపూడి అగ్రహారం. దీనికీ ఓ చరిత్ర ఉంది. మామిడిపూడిని విజయనగర పాలకుడు సదాశివరాయలు నీలమేఘాచార్యులకు బహూకరించినది. ఆయనే మామిడిపూడి వారి పూర్వులు. నీలమేఘాచార్యుల వైదిక జ్ఞాన సంపత్తికి మెచ్చిను సదాశివరాయలు అలా సత్కరించాడు. వీరి ఇంటి పేరు దానితోనే స్థిరపడింది. వెంకటరంగయ్యగారి ప్రాథమిక విద్య పురిణిలోనే సాగింది. సంప్రదాయం మేరకు మొదటి తండ్రిగారి వద్దనే వెంకటరంగయ్య వేదాధ్యయనం, సంస్కృతాధ్యయనం చేశారు. కానీ ఆయనకి కొడుకును ఇంగ్లిష్ చదువులు చదివించాలని అనిపించింది. కొద్దికాలం ఇంటిదగ్గరే ప్రైవేటు చెప్పించి, 1899లో మద్రాసులోని పచ్చయప్ప కళాశాలకు అనుబంధంగా ఉన్న ఒక పాఠశాలలో రెండవ ఫారంలో చేర్చారు. 1907 నాటికి పచ్చయప్ప కళాశాలలోనే బీఏ చదువుతున్నారు. అప్పుడే వెంకటరంగయ్యగారి జీవితం మలుపు తిరిగింది. బెంగాల్ విభజన (1905) వ్యతిరేకోద్యమంలో భాగంగా బిపిన్‌చంద్ర పాల్ దక్షిణ భారతదేశంలో పర్యటించారు. ప్రస్తుత ఉత్తరాంధ్రలోని విజయనగరం మొదలుకొని, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, అక్కడ నుంచి మద్రాసు వరకు పాల్ పర్యటించారు. పాల్ ఉపన్యాసం అంటే దేశ ప్రజలు ఉరకలేసిన కాలం. రాజమండ్రి, కాకినాడలలో ఆయన ప్రసంగాలు మిగిల్చిన ప్రభావం కూడా పెద్ద చరిత్రకు కారణమైంది. కాకినాడలో అల్లర్లు జరిగాయి. రాజమండ్రిలో ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో అల్లర్లు జరిగాయి. పాల్ వెంట నడిచినందుకు గాడిచర్ల హరిసర్వోత్తమరావును ఆ కళాశాల నుంచి బహిష్కరించారు. అక్కడ నుంచి పాల్ మద్రాస్ వెళ్లారు. వందేమాతరం నినాదం దేశమంతటా ప్రతిధ్వనించిన కాలమది. మద్రాసు మహా నగరంలోకి ప్రవేశించే ముందు కనిపించే బేసిన్ బ్రిడ్జ్ స్టేషన్లోనే పాల్ దిగుతారని జనానికి తెలిసింది. మొత్తం నగరమే అక్కడికి కదిలి వచ్చిందా అన్నంతగా ప్రజలు వచ్చారు. రాయపురం ఆసుపత్రి మీదుగా, అశేష జనవాహిని వెంటరాగా తిరువల్లిక్కణి వరకు ఉరేగింపుగా వెళ్లారు. అయితే పాల్ ప్రసంగించడానికి ఎవరూ హాలు ఇవ్వలేదు. ‘‘సముద్రుడు ప్రసాదించిన స్థలమే ఉంది, దిగులెందుకు?’’ అన్నారట పాల్. మేరీనా బీచ్‌లో ఐదు రోజుల పాటు ప్రసంగాలు చేశారు. టీఎన్ వెంకటసుబ్బయ్యర్ అనే జాతీయవాది ఆ సభలకు అధ్యక్షత వహించారు. బెంగాల్ విభజన వెనుక కుట్ర, స్వదేశీ, జాతీయత వంటి అంశాల గురించి పాల్ అద్భుతంగా ప్రసంగించేవారు. ఈ ఐదు రోజులు కూడా ఆయన ప్రసంగాలు విన్నవారిలో వెంకటరంగయ్య కూడా ఉన్నారు. అదే ఆయనలో కొత్త చింతనకు శ్రీకారం చుట్టింది. శొంఠి రామమూర్తి మద్రాసులో వెంకటరంగయ్యగారి సహాధ్యాయులు. ఇంగ్లండ్ వెళ్లి ఐసీఎస్ చదవడానికి రామమూర్తిగారికి ఆఫీసర్స్ అసోసియేషన్ విద్యార్థి వేతనం ఏర్పాటు చేసింది. అలాంటి అవకాశం వెంకటరంగయ్య గారికి కూడా వచ్చింది. అప్పుడే బిపిన్పాల్గారి ఉపన్యాసం విన్నారాయన. ఆ ప్రభావంతోనే ఐసీఎస్‌కు వెళ్లరాదన్న నిర్ణయానికి వచ్చారు. పచ్చయప్ప కళాశాలలోనే చరిత్ర ట్యూటర్‌గా చేరారు. ఈ ఉద్యోగంలో ఉంటూనే ఆయన ఎంఏ విడిగా చదివి ఉత్తీర్ణులయ్యారు. అటు తరువాతి మలుపు కాకినాడకు తిప్పింది. మరో చరిత్ర పురుషుని సాంగత్యం ఇచ్చింది. బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడిగారి ఆహ్వానం మేరకు వెంకటరంగయ్య పీఆర్ విద్యా సంస్థలో 1910లో చరిత్రోపన్యాసకులుగా చేరారు. ఆ తరువాత విజయనగరం మహారాజా కళాశాలలో బీఏ తరగతులు ప్రారంభించారు. వారి ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లి 1927 వరకు పనిచేశారు. అక్కడ ఉండగానే మరొక ఘటన. 1921లో గాంధీజీ విజయనగరం వచ్చారు. అవి సహాయ నిరాకరణోద్యమం రోజులు. వెంకటరంగయ్య కుటుంబంతో సహా వెళ్లి గాంధీగారిని కలుసుకున్నారు. ఆయన సతీమణి వెంకమ్మగారు తన బంగారుగాజులు గాంధీజీ నిధికి ఇచ్చారు కూడా. దీనితో సంస్థానంలో ఆయన పట్ల కొంచెం వ్యతిరేకత వచ్చి, స్థానచలనం తప్పలేదు. 1925లో మహారాజా ఇంగ్లండ్ యాత్రకు వెళ్లారు. ఆ సమయంలో వెంకటరంగయ్య సెలవు పెట్టి మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధన ఆరంభించారు. 1928తో ఆయనకు విజయనగరం బంధం తెగిపోయింది. విజయనగరం సంస్థానం నుంచి వెంకటగిరి సంస్థానం చేరారు. అక్కడ వెంకటగిరి మహారాజా కళాశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టారు. ఖద్దరు దుస్తులలో, తలపాగతో వెంకటరంగయ్యగారు ఉండేవారు. అది దండి సత్యాగ్రహ ఉద్యమకాలం. స్వదేశీ పారిశ్రామిక ప్రదర్శన కూడా ఆయన ఏర్పాటు చేశారు. అక్కడ నుంచే వెంకటరంగయ్యగారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పిలుపు వచ్చింది. ఎన్నో నిరసనల మధ్య వైస్‌చాన్స్‌లర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వెంకట రంగయ్యగారిని చరిత్ర, రాజనీతి శాఖలో రీడర్‌గా నియమించారు. ఆ తరువాత అక్కడే ఆయన ప్రొఫెసర్ కూడా అయ్యారు. మధ్యలో అంటే 1949లో బొంబాయి విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్త్ర విభాగం అధిపతిగా పనిచేశారు. మూడేళ్లే అయినా ఆచార్య వెంకటరంగయ్య గౌరవార్ధం ఆ విశ్వవిద్యాలయం ఒక ప్రత్యేక సంచికను ప్రచురించింది. 1908లో వెంకటరంగయ్య ‘శశిరేఖ’ అన్న పత్రికలో తొలి వ్యాసం ప్రచురించారు. అది ఇటలీ స్వాతంత్య్రోద్యమం గురించిన వ్యాసం. పదవీ విరమణ చేసిన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచన మేరకు చరిత్ర రచన ప్రారంభించారు. అందుకు ఆయన సేకరించిన సమాచారమే పదివేల పుటలు. ఇంగ్లిష్తో పాటు, తెలుగులో కూడా చక్కని వచనం రాయగల శక్తి వెంకటరంగయ్యగారికి ఉంది. ఆంధ్రలో స్వాతంత్య్రోద్యమం పేరుతో వెలువరించిన నాలుగు సంపుటాలు చరిత్రకారునిగా ఆయన ప్రతిభను వెల్లడిస్తాయి. కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని ఆయన తెలుగులోకి అనువదించారు. తెలుగులో ఆయన రాసిన పుస్తకాలే 25 వరకు ఉన్నాయి. 20కి పైగా పుస్తకాలు ఇంగ్లిష్‌లో రాశారు. భారత స్వాతంత్య్రం సమరగాథను మూడు సంపుటాలలో ఆయన తెలుగులో కూడా రచించారు. చరిత్ర రచనతో పాటు రాజ్యాంగం మీద విశ్లేషణ, పంచాయతీరాజ్ గురించి పుస్తకాలు రాశారు. విజ్ఞాన సర్వస్వం సంకలనాలకు కూడా ఆయన పనిచేశారు. ఆయన పుస్తకాల జాబితాయే విస్మయం గొలిపే రీతిలో ఉంటుంది. సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశం, ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్, మన పరిపాలకులు, మన శాసనసభలు, పారిశ్రామిక విప్లవం, విద్యారంగం నాడు–నేడు – ఆయన రాసిన తెలుగు పుస్తకాలలో కొన్ని. ఆంగ్లంలో కూడా ది వెల్ఫేర్ స్టేట్ అండ్ సోషలిస్ట్ స్టేట్, సమ్ థియరీస్ ఆఫ్ ఫెడరలిజమ్, సమ్ యాస్పెక్ట్స్ ఆఫ్ డెమొక్రాటిక్ పాలిటిక్స్ ఇన్ ఇండియా, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ మ్యాన్ ఇన్ థియరీ అండ్ ప్రాక్టీస్, లోకల్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా వంటి వైవిధ్య భరితమైన రచనలు కనిపిస్తాయి. జీవితంలో ఎక్కువ భాగం విద్యా బోధనకీ, చరిత్ర రచనకీ అంకితం చేసిన వెంకటరంగయ్య గారికి ఆయన చివరి రోజుల నాటి విద్యా విధానం అంత సంతృప్తికరంగా కనిపించలేదు. అందుకే ఒక మాట అన్నారు. కానీ అది నేటికీ వర్తిస్తుంది. ‘ఇప్పుడు చదువులలో శిష్యులకు, గురువులకు శ్రద్ధ కనిపించదు. నేను (ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తప్ప) పన్నెండు విశ్వవిద్యాలయాలకు పరీక్షకుడిగా ఉన్నాను. విద్యా ప్రమాణం తగ్గిందనే నా నమ్మకం. ప్రభుత్వం బాధ్యత వహించాలి. మేమంతా ఈ దుస్థితి మారాలని అంటూనే ఉన్నాము. పూర్వం ఇప్పుడున్నన్ని వినోదాలు లేవు. కనుక అప్పటివారి దృష్టి ఏకాగ్రంగా ఉండేదనుకుంటాను.’ -
భారతీయుడి పుర్రెను భారత్‌లోనే ఖననం చేయాలి!
లండన్: ఈస్ట్ ఇండియా కంపెనీలో సైనికుడిగా విధులు నిర్వర్తించిన ఓ భారతీయుడి పుర్రెను.. అతని మాతృభూమిలోనే ఖననం చేయాలంటూ ఓ బ్రిటన్ చరిత్రకారుడు డిమాండ్ చేస్తున్నారు. ఏప్రిల్ 13తో 99 ఏళ్లు గడిచిన జలియన్ వాలాబాగ్ దుర్ఘటనలో మరణించిన సైనికుడి పుర్రెకు ఇండియాలో దహన సంస్కారాలు జరిపించాలని కోరుతున్నాడు డాక్టర్ కిమ్ వాగ్నర్. కిమ్ లండన్‌లోని క్వీన్ మేరీ కాలేజిలో సీనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఆయన 2014లో జలియవాలా బాగ్ గురించి ఓ బుక్ రాయడానికి పరిశోధన మొదలు పెట్టారు. ఆ క్రమంలో ఉన్న ఆయనకు ఒక స్టోర్‌రూమ్‌లో ఒక పుర్రె దొరికింది. దాని కళ్ల భాగంలో ఆ పుర్రెకు సంబంధించిన వివరాలతో కూడిన ఓ కాగితం కనిపించింది. అది తెరిచి చూడగా దానిలో ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసిన భారతీయ సైనికుడు ఆలం బాగ్ పుర్రె అని, ఇతను 32 సంవత్సరాల వయసువాడని, 5 అడుగుల 7 అంగుళాలు ఎత్తు కలిగి ఉన్నాడు. అంతేగాక అతని కుటుంబం మొత్తాన్ని స్కాటిష్ మిషనరీలు చంపేశాయని రాసి ఉంది. ఇది చదివిన కిమ్ మరింత అధ్యయనం జరిపి వాగ్నర్ ద స్కల్ ఆఫ్ ఆలం బాగ్( ద లైఫ్ ఆండ్ డెత్ ఆఫ్ ఏ రెబల్ ఆఫ్ 1857) పేరిట పుస్తకాన్ని రాసి విడుదలచేశారు. అంతటితో ఆగకుండా ఆలం బాగ్‌ను మాతృభూమి మట్టిలోనే పూడ్చిపెట్టాలని న్యూఢిల్లీలోని బ్రిటన్ హై కమిషన్ ద్వారా భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. -
క్రియేటివ్ హిస్టారియన్
డీడీ కోసంబి.. భారతదేశ చరిత్రను వాస్తవిక కోణంలో చూపిన చరిత్రకారుడు. యాభైల్లో ఆయన రాసిన పుస్తకం తెలుగులో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ద్వారా ఎన్.వేణుగోపాల్ కలం నుంచి ‘భారతదేశ చరిత్ర అధ్యయనానికి ఒక పరిచయం’గా వెలువడనుంది. దీన్ని ప్రముఖ హిస్టారియన్, ఫెమినిస్ట్, ఫిల్మ్ మేకర్ ఉమా చక్రవర్తి నేడు ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా కోసంబిని ఆమె పరిచయం చేశారిలా... ‘స్వాతంత్య్రానికి పూర్వం మన దగ్గర రెండు రకాల రచనలుండేవి. మన సంస్కృతిని చిన్నచూపు చూసే, తేలిక చేసే వలసవాద రచనలు ఒక రకం అయితే, ‘లేదు మా సమాజంలో కూడా మంచి విషయాలున్నాయి, ప్రజాస్వామ్య భావనలున్నాయి’ అంటూ అసలు విషయాన్ని రొమాంటిసైజ్ చేస్తూ వచ్చిన కౌంటర్ రచనలు రెండోవి. అసంబద్ధమైన ఈ రెండూ మన సమాజానికి, చరిత్రకు అద్దం పట్టలేదు. స్వాతంత్య్రం వచ్చాక మన గతాన్ని మనం తరచి చూసుకునే అవసరం, సందర్భం ఏర్పడ్డాయి. ఆ చరిత్రను తిరగరాయాలని కొంతమంది కలం పట్టారు. వాళ్లే మొదటిసాంఘిక చరిత్రకారులు. వాళ్లలో ఒకరు దామోదర్ ధర్మానంద్ కోసంబి. జర్నీలోనే పుస్తకం... నిజానికి కోసంబి చరిత్రకారుడు కాదు. బట్ హీ ప్రాక్టీస్డ్ హిస్టరీ ఆల్ హిజ్ లైఫ్. ఆయనో మ్యాథమెటీషియన్. టాటా ఇనిస్టిట్యూట్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో ఉద్యోగం చేశారు. ముంబైలో ఉద్యోగం అయినా అక్కడికి షిఫ్ట్ కాలేదు. ప్రతిరోజూ ఉదయం డెక్కన్ క్వీన్ ట్రైన్లో ముంబై వెళ్లి సాయంకాలం తిరిగి పుణే వచ్చేవారు. ఆ జర్నీలోనే ఈ పుస్తకం రాయడం పూర్తి చేశాడు. ఆయన తండ్రి ధర్మానంద్ కోసంబి భాషావేత్త, పాలీ స్కాలర్, హిస్టారియన్ ఆఫ్ బుద్ధిజం. ఈయన ప్రభావం కోసంబిపై చాలా ఉంది. అఫీషియల్ మార్క్సిస్ట్... చరిత్ర అధ్యయనానికి కోసంబి చూపిన దారి అమోఘం. గతాన్ని ఎలా చూడాలి, పురాణాలను చదువుతూ సాంఘిక సంబంధాలను ఎలా వెదకాలనేది నేర్పాడు. ‘మిథ్ అండ్ రియాలిటీ’ పుస్తకంలో ఊర్వశి, పురూరవ లకు గురించిన ఒకే కథ వివిధ కాలాల్లో ఎలాంటి మార్పులను చేర్చుకుందనే విషయాన్ని ఇందులో చక్కగా విశ్లేషించాడు. కోసంబి అఫీషియల్ మార్క్సిస్ట్ అయినా చరిత్రను అధ్యయనం చేసేటప్పుడు ఆ చట్రంలో బందీ కాలేదు. ఏ చరిత్రను అర్థం చేసుకోవాలన్నా సోషల్ రిలేషన్సే మూలం అని గ్రహించినవాడు. అందుకే కోసంబిని ఎవరూ అనుకరించలేరు. స్ఫూర్తి పొందడం తప్ప చరిత్రను ఆయనలా ఎవరూ విశ్లేషించలేరు. ముక్కుసూటి మనిషి... నమ్మినదాన్ని ఆచరించడంలో కోసంబిని మించినవారు లేరు. యాంటి న్యూక్లియర్ మూవ్మెంట్లో చురుగ్గా ఉన్నాడు. అందుకే టాటా ఇన్స్టిట్యూట్ ఉద్యోగాన్ని వదిలేశాడు. అంతేకాదు చెక్‌డ్యామ్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కానీ.. కోసంబి ఆ రోజుల్లోనే రాశాడు. మంచి విమర్శకుడు. చరిత్రను తప్పుగా చెప్తున్నవాళ్లను తూర్పారబ ట్టాడు. రష్యాలో కూర్చొని భారతదేశ చరిత్ర రాస్తున్నవాళ్లనూ వదిలిపెట్టలేదు. ‘నేను సొంతంగా ఆలోచించగలిగినప్పుడు, విషయాన్ని విశ్లేషించే శక్తి ఉన్నప్పుడు, నేను చెప్పే ప్రతి అంశాన్ని రుజువు చేయగులుగుతున్నప్పుడు ఎవరి మార్గదర్శకత్వమో ఎందుకు’ అనేది ఆయన అభిప్రాయం. కోసంబి తన పుస్తకంలో కొన్ని విషయాలను డ్రాయింగ్స్, ఫొటోగ్రాఫ్స్‌తో కూడా వివరిస్తాడు. ట్రైబల్స్ మీద వర్క్ చేసిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ సునీల్ రాణా ఫొటోగ్రాఫ్స్‌ను ఎక్కువగా ఉపయోగించుకున్నాడు. సరస్వతి రమ