పుణె: ప్రముఖ చరిత్రకారుడు, పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత బల్వంత్ మోరేశ్వర్ పురందరే సోమవారం అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచారు. నిమోనియాతో బాధపడుతున్న ఆయన సోమవారం పుణెలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. బాబాసాహెబ్ పురందరేగా చిరపరిచితుడైన ఆయన వయసు 99 సంవత్సరాలు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్‌పై విశేషమైన పరిశోధనలతో పురందరే దేశంలోనే ఖ్యాతికెక్కారు. 1950లలో రాజా శివచక్రవర్తి పేరిట రాసిన పుస్తకంతో ఆయన మహారాష్ట్ర వాసుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. జానతా రాజా పేరుతో ఆయన రూపొందించిన నాటకం సైతం ఎంతో పేరొందింది. 2015లో మహారాష్ట్ర భూషణ్ అవార్డు ఆయనను వరించింది. 2019లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. పురందరే మృతిపై ప్రధాని మోదీ తదితరులు తీవ్ర విచారం వ్యక్తంచేశారు. పురందరే అంత్యక్రియలను పుణెలో సోమవారం మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో పూర్తిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment