క్రియేటివ్ హిస్టారియన్
డీడీ కోసంబి.. భారతదేశ చరిత్రను వాస్తవిక కోణంలో చూపిన చరిత్రకారుడు. యాభైల్లో ఆయన రాసిన పుస్తకం తెలుగులో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ద్వారా ఎన్.వేణుగోపాల్ కలం నుంచి ‘భారతదేశ చరిత్ర అధ్యయనానికి ఒక పరిచయం’గా వెలువడనుంది. దీన్ని ప్రముఖ హిస్టారియన్, ఫెమినిస్ట్, ఫిల్మ్ మేకర్ ఉమా చక్రవర్తి నేడు ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా కోసంబిని ఆమె పరిచయం చేశారిలా...
‘స్వాతంత్య్రానికి పూర్వం మన దగ్గర రెండు రకాల రచనలుండేవి. మన సంస్కృతిని చిన్నచూపు చూసే, తేలిక చేసే వలసవాద రచనలు ఒక రకం అయితే, ‘లేదు మా సమాజంలో కూడా మంచి విషయాలున్నాయి, ప్రజాస్వామ్య భావనలున్నాయి’ అంటూ అసలు విషయాన్ని రొమాంటిసైజ్ చేస్తూ వచ్చిన కౌంటర్ రచనలు రెండోవి.
అసంబద్ధమైన ఈ రెండూ మన సమాజానికి, చరిత్రకు అద్దం పట్టలేదు. స్వాతంత్య్రం వచ్చాక మన గతాన్ని మనం తరచి చూసుకునే అవసరం, సందర్భం ఏర్పడ్డాయి. ఆ చరిత్రను తిరగరాయాలని కొంతమంది కలం పట్టారు. వాళ్లే మొదటిసాంఘిక చరిత్రకారులు. వాళ్లలో ఒకరు దామోదర్ ధర్మానంద్ కోసంబి.
జర్నీలోనే పుస్తకం...
నిజానికి కోసంబి చరిత్రకారుడు కాదు. బట్ హీ ప్రాక్టీస్‌డ్ హిస్టరీ ఆల్ హిజ్ లైఫ్. ఆయనో మ్యాథమెటీషియన్. టాటా ఇనిస్టిట్యూట్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో ఉద్యోగం చేశారు. ముంబైలో ఉద్యోగం అయినా అక్కడికి షిఫ్ట్ కాలేదు. ప్రతిరోజూ ఉదయం డెక్కన్ క్వీన్ ట్రైన్‌లో ముంబై వెళ్లి సాయంకాలం తిరిగి పుణే వచ్చేవారు. ఆ జర్నీలోనే ఈ పుస్తకం రాయడం పూర్తి చేశాడు. ఆయన తండ్రి ధర్మానంద్ కోసంబి భాషావేత్త, పాలీ స్కాలర్, హిస్టారియన్ ఆఫ్ బుద్ధిజం. ఈయన ప్రభావం కోసంబిపై చాలా ఉంది.
అఫీషియల్ మార్క్సిస్ట్...
చరిత్ర అధ్యయనానికి కోసంబి చూపిన దారి అమోఘం. గతాన్ని ఎలా చూడాలి, పురాణాలను చదువుతూ సాంఘిక సంబంధాలను ఎలా వెదకాలనేది నేర్పాడు. ‘మిథ్ అండ్ రియాలిటీ’ పుస్తకంలో ఊర్వశి, పురూరవ లకు గురించిన ఒకే కథ వివిధ కాలాల్లో ఎలాంటి మార్పులను చేర్చుకుందనే విషయాన్ని ఇందులో చక్కగా విశ్లేషించాడు. కోసంబి అఫీషియల్ మార్క్సిస్ట్ అయినా చరిత్రను అధ్యయనం చేసేటప్పుడు ఆ చట్రంలో బందీ కాలేదు. ఏ చరిత్రను అర్థం చేసుకోవాలన్నా సోషల్ రిలేషన్సే మూలం అని గ్రహించినవాడు. అందుకే కోసంబిని ఎవరూ అనుకరించలేరు. స్ఫూర్తి పొందడం తప్ప చరిత్రను ఆయనలా ఎవరూ విశ్లేషించలేరు.
ముక్కుసూటి మనిషి...
నమ్మినదాన్ని ఆచరించడంలో కోసంబిని మించినవారు లేరు. యాంటి న్యూక్లియర్ మూవ్‌మెంట్‌లో చురుగ్గా ఉన్నాడు. అందుకే టాటా ఇన్‌స్టిట్యూట్ ఉద్యోగాన్ని వదిలేశాడు. అంతేకాదు చెక్‌డ్యామ్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కానీ.. కోసంబి ఆ రోజుల్లోనే రాశాడు. మంచి విమర్శకుడు. చరిత్రను తప్పుగా చెప్తున్నవాళ్లను తూర్పారబ ట్టాడు. రష్యాలో కూర్చొని భారతదేశ చరిత్ర రాస్తున్నవాళ్లనూ వదిలిపెట్టలేదు.
‘నేను సొంతంగా ఆలోచించగలిగినప్పుడు, విషయాన్ని విశ్లేషించే శక్తి ఉన్నప్పుడు, నేను చెప్పే ప్రతి అంశాన్ని రుజువు చేయగులుగుతున్నప్పుడు ఎవరి మార్గదర్శకత్వమో ఎందుకు’ అనేది ఆయన అభిప్రాయం. కోసంబి తన పుస్తకంలో కొన్ని విషయాలను డ్రాయింగ్స్, ఫొటోగ్రాఫ్స్‌తో కూడా వివరిస్తాడు. ట్రైబల్స్ మీద వర్క్ చేసిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ సునీల్ రాణా ఫొటోగ్రాఫ్స్‌ను ఎక్కువగా ఉపయోగించుకున్నాడు.
సరస్వతి రమ