
ఒంటిమిట్ట/లేపాక్షి: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మళ్లీ ఉగ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ఒక్కొక్కటిగా ఆంక్షలు అమలవుతున్నాయి. తాజాగా కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఆలయాలను తాకింది. కరోనా ఉధృతి నేపథ్యంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని అన్ని చారిత్రక, పురాతన ఆలయాలు, కట్టడాలు, సందర్శన ప్రదేశాలు, మ్యూజియంలను వెంటనే మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని శుక్రవారం నుంచి మూసివేశారు. మే 15 వరకు ఆలయంలోకి భక్తులను ఎవర్నీ అనుమతించబోమని ఆలయ ఏఈవో మురళీధర్ తెలిపారు. అయితే, స్వామివారికి నిత్యం జరిగే పూజా కైంకర్యాలన్నీ యథావిధిగా కొనసాగుతాయన్నారు.
ఒంటిమిట్ట ఆలయ బ్రహ్మోత్సవాల నిర్వహణపై కూడా టీటీడీ అధికారులు పురావస్తు శాఖ అధికారులతో సమీక్షిస్తున్నారని, సమీక్ష అనంతరం బ్రహ్మోత్సవాలపై అధికారిక ప్రకటన వెలువరిస్తామని చెప్పారు. ఇక, అనంతపురం జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో మే 15 వరకు భక్తులకు ప్రవేశాన్ని నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో నరసింహమూర్తి తెలిపారు. లేపాక్షి నంది విగ్రహం వద్ద కూడా పర్యాటకులకు ప్రవేశం లేదని, నంది విగ్రహం పార్కింగ్‌ను కూడా మూసివేశామని పేర్కొన్నారు.