
తిరుమల: ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాను డీనోటిఫై చేసే వరకు అందరూ జాగ్రత్తగా ఉండాలని, ఆ మహమ్మారి వల్లే తిరుమల శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యలో టికెట్లు జారీచేస్తున్నామని టీటీడీ ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి చెప్పారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలోను, ఆ తర్వాత మీడియా సమావేశంలోను ఈఓ మాట్లాడారు.
కరోనా మూడో దశ హెచ్చరికల నేపథ్యంలో.. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న యాత్రికులు కోవిడ్ నిబంధనలు విధిగా పాటించాలన్నారు. భక్తుల విజ్ఞప్తి మేరకు ఆగస్టు నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఐదు వేల నుంచి 8 వేలకు పెంచినట్లు ఈఓ వెల్లడించారు. గదులు పొందే యాత్రికులు బసకు సంబంధించిన ఫిర్యాదులను 9989078111 నెంబర్‌లో ఇవ్వాలని జవహర్‌రెడ్డి తెలిపారు. అంజనాద్రే హనుమంతుని జన్మస్థలమని.. దీనిపై త్వరలోనే సమగ్ర గ్రంథం ముద్రిస్తామన్నారు. అలాగే, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ విమాన గోపురానికి వంద కిలోల బంగారంతో తాపడం పనులను వచ్చే సెప్టెంబరు 14న ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.
13న గరుడ వాహనంపై శ్రీ మలయప్పస్వామి
ఆగస్టు 13వ తేదీ గరుడ పంచమి, ఆగస్టు 22వ తేదీ శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా శ్రీమలయప్పస్వామివారు గరుడ వాహనంపై దర్శనమిస్తారని ఈఓ తెలిపారు. అలాగే, ఆగస్టు 18 నుంచి 20 వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగనున్నాయని, ఇందుకోసం ఆగస్టు 17న ఆంకురార్పణ నిర్వహిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment