నాయుడుపేట: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా నాయుడుపేట మండలం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో గొట్టిప్రోలు గ్రామం ఉంది. ఊరి ముఖద్వారానికి ఎడమవైపు ఎత్తైన కొండలాగా ఓ దిబ్బ కనిపించేది. పిచ్చిమొక్కలతో నిండి వుండే ఈ దిబ్బ మీద మేకలు, గొర్రెలు మేపే కాపరులకు వర్షాకాలంలో ఇక్కడ కుండ పెంకులు, పాతరాతి యుగానికి సంబంధించిన వస్తువులు లభించేవి. వాటిని చూసి అప్పటి పెద్దలు ఇక్కడ రాజులు వుండేవారట అని ముందు తరాలవారికి చెప్పెవారు.
గ్రామంలోని కోట దిబ్బలో ఓ మూలన పల్లవులనాటి విష్ణుమూర్తి విగ్రహం గ్రావెల్(గులకరాళ్లు) తవ్వకాల్లో బయటపడడంతో గ్రామ ప్రజలు అప్పటి నుంచి పూజలు చేసేవారు. కోట దిబ్బగా పిలువబడే ప్రాంతం 40 ఎకరాలు స్థలంలో వుంది. గడిచిన రెండు దశాబ్ధాల్లో గ్రావెల్ అక్రమ రవాణా కోసం కొంత మంది పెత్తందారులు కోట దిబ్బను ద్వంసం చేసి సొమ్ముచేసుకున్నారు. ఇందులో పురాతన వస్తు సామగ్రి ఓక్కోక్కటిగా బయటపడడంతో గ్రామస్తులు కొంత మంది అక్రమ రవాణా చేయరాదంటూ అడ్డుకున్నారు. విషయం పురవస్తుశాఖ అధికారుల దృష్టికి చేరింది.
ఏడాది తరువాత ఆర్కియాలజీ అధికారులు స్పందించారు. కోట దిబ్బ చుట్టూ నలబై ఎకరాలకు చుట్టు హద్దులు వేశారు. ఇందులోకి బయటవ్యక్తులు ఎవ్వరూ ప్రవేశించరాదంటూ దండోరా వేయించారు. గ్రామ పెద్దలతో మాట్లాడి పురావస్తుశాఖ సారద్యంలో తవ్వకాలు చేపడుతామని చెప్పారు. రెవెన్యూ, పోలీస్ జిల్లా ఉన్నతాధికారులకు పురావస్తుశాఖ శాస్త్రవేత్తలు, అధికారులు ఇక్కడి పరిస్థితిపై వివరించారు. డ్రోన్ కెమెరాలతో 40 ఎకరాలోని అన్ని ప్రదేశాలను చిత్రీకరించారు. గ్రామంలోని వంద మందికిపైగా కూలీలతో పురావస్తుశాఖ అధికారులు, సిబ్బంది తవ్వకాలు ప్రారంభించారు.
తొలిదశలో పెంకులు, చిన్న చిన్నరాతి ముక్కలు బయటపడ్డాయి. వీటిపై పురావస్తుశాఖ అధికారులు పరిశోధనలు చేయాలని ఆశాఖ పరిశోధనశాలలకు పంపడం జరిగింది. పల్లవులు, రోమన్‌లు, శాతవాహనుల కాలంనాటి ఆనవాళ్లు కనిపిస్తున్నాయని పరిశోధనల్లో తేటతెల్లమవుతుందని అధికారులు వెల్లడించారు. పూర్తి స్థాయి తవ్వకాలు చేపట్టి పరిశోధనలు చేస్తే తప్ప ఓ కొలిక్కిరాదని అధికారులు నిర్ణయానికి వచ్చారు.
రెండువేల ఏళ్లనాటి పురాతన కట్టడాలు....
పురావస్తు తవ్వకాల్లో బయల్పడ్డ కట్టడాలు రెండు వేల ఏళ్ళనాటి మధ్య యుగంనాటి చరిత్ర పురాతన కట్టడాలని శాసననాలు చెబుతున్నాయి. స్వర్ణముఖినది బంగాళాఖాతం సముద్రతీరానికి దగ్గరగా వుండడంతో రోమన్‌లతో వర్తక వ్యాపారాలు కొసాగించేందుకు ఇక్కడ కట్టడాలు చేసి వుండవచ్చని భావిస్తున్నారు. ఇదే క్రమంలో చతుర్ముఖి ముఖం కలిగిన విష్ణుమూర్తి విగ్రహంతో పాటు నాణ్యమైన నలుపు, ఎరుపు మట్టిపాత్రలు,నాణ్యాలు, జాడీలు గృహాపకరణాలు బయల్పడ్డాయి. పల్లవుల కాలం నాటివిగా భావిస్తున్న విగ్రహాలు అలనాటి శిల్పకళను చాటిచెప్పే విధంగా వుండటమే కాక నాటి చరిత్రను వివరిస్తున్నాయి.
రెండువేళ్ల నాటి డ్రైనేజీ వ్యవస్థ, భారీ ఘన ఇటుకలతో చుట్టూ వలయాకారంలో గోడ నిర్మాణం, 48–49 వెడల్పు కలిగిన ఇటుకల వుండడంతో.. ఇవి అమరావతి, నాగార్జున కొండ శాతవాహనుల కాలంనాటి నిర్మాణంలో వాడిన ఇటుకలుగా తెలుస్తోంది. సముద్రతీరం ప్రాంతానికి దగ్గరగా వ్యాపార వాణిజ్య పరంగా అనువైన ప్రాంతం కావడంతో కోట దిబ్బను ఎంచుకుని.. ఇక్కడ కట్టడాలు నిర్మించిన ఆనవాళ్లు బయల్పడ్డాయని ఆర్కియాలజీ అధికారులు గుర్తించారు. గొట్టిప్రోలు గ్రామం కోటదిబ్బలో చేపట్టిన పురావస్తుశాఖ తవ్వకాలను ఆశాఖ విశ్రాంత జాయింట్ డైరెక్టర్ జనరల్ ఆర్‌ఎస్ బిస్ట్ పరిశీలించారు.
తవ్వకాల్లో శాతవాహన కాలంనాటి ఆనవాళ్లు
కోటదిబ్బలో బయల్పడిన ఆ ప్రాంతాన్ని ఆర్‌ఎస్ బిస్ట్ చూశారు. ఇక్కడ బయల్పడిన కట్టడాలు శాతవాహనుల కాలంలో ఏర్పాటు చేసుకున్న కోటలో రాజులు, పరిపాలకులు, లోపలభాగంలోనే కోర్టు, సెక్యూరిటీ వంటి పురాతన కట్టడాల మాదిరి కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఇతర ప్రాంతాలకు వర్తక వాణిజ్యపరంగా ఇక్కడి నుంచే జరిగి వుంటాయని స్పష్టం చేశారు. గొట్టిప్రోలు శాతవాహన కాలంనాటి కట్టడాలు బయటపడడం చరిత్రగా మారనుందని అన్నారు. వీటిని కళాశాలలు, పాఠశాలలోని విద్యార్థులకు ప్రదర్శించి.. శాతవాహనుల చరిత్ర అర్థమయ్యేలా చూపాలన్నారు.
గొట్టిప్రోలులో పురావస్తు కట్టడాలు ఉన్నట్లు ఎలా గుర్తించారు..!
గొట్టిప్రోలు గ్రామానికి శివారుప్రాంతంలో 30 అడుగులు ఎత్తుగల దిబ్బవుండేది. ఇక్కడ గ్రావెల్ విరివిగా వుండడంతో ఇది కొందరికి కల్పతరువుగా మారింది. దిబ్బను సొంతం చేసుకుని ప్రకృతి సంపదను దొచుకుంటే కోట్లు గడించవచ్చని దీనిపై దృష్టిసారించారు. దాదాపుగా 30 అడుగులు ఎత్తు ఉండే దిబ్బ ప్రస్తుతం 7 అడుగులు ఎత్తుకు తగ్గింది. అప్పటికే కోటలో కట్టడాలు ఒక్కొక్కటిగా బయల్నడుతూ వచ్చాయి.
అది గమనించిన గ్రామంలోని ఓ విద్యావంతుడు గ్రావెల్ తవ్వకాలను అడ్డుకుంటూ వచ్చాడు. అదేక్రమంలో పురావస్తుశాఖ అధికారులకు సందేశాలు పంపుతూ వచ్చినా ప్రయోజనం లేకపోయింది. 2018 నవంబర్‌లో పురవాస్తుశాఖ అధికారులు స్వర్ణముఖినది తీరాల వెంబడి గ్రామాల ఆలయాలు, పురావస్తు కట్టడాలు ఎక్కడెక్కడ వున్నాయోనని పరిశీలించారు. ఈసమయంలో గొట్టిప్రోలు వద్ద కోట దిబ్బలో పురావస్తు కట్టడాలు వున్నట్లు శాసనాలలో గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment