పర్చూరులో టీడీపీ ముఖ్యనేత గ్రావెల్ దందా
ఖమ్మం జిల్లాకు చెందిన తెలుగుయువత నేతను ముందుపెట్టి అక్రమ వ్యాపారం
అనుమతులున్న గ్రావెల్ లీజులు రద్దుచేయించిన వైనం
ఇసుకదర్శి అటవీ భూముల నుంచి గ్రావెల్ రవాణా
రియల్ వెంచర్లు, రోడ్ల నిర్మాణానికి సరఫరా
టిప్పర్ రూ.8 వేలు, ట్రాక్టర్ రూ.2 వేలు
పర్యావరణం విధ్వంసం
అక్రమరవాణాపై స్పందించని అధికారులు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: అధికారపార్టీ నేతలు బరితెగించారు. ఇసుక, మట్టి, గ్రావెల్, గ్రానైట్, రేషన్ అనే తేడా లేకుండా ఏది దొరికినా.. కొల్లగొట్టి జేబులు నింపుకొంటున్నారు. అక్రమార్జనకు కాదేదీ అనర్హం అనే రీతిలో తెగబడుతున్నారు. ఇందులో పర్చూరు ముఖ్యనేతది ప్రత్యేక స్థానం. నియోజకవర్గంలో ఉన్న ప్రకృతి వనరులను ఎలా దోచుకుతినాలో ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదనుకోవాలి. పర్చూరులో ఉన్న ఇసుక, గ్రానైట్, గ్రావెల్‌లను అక్రమంగా తరలించి కోట్లు కొల్లగొడుతున్నారు.
ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి గండికొట్టి సొంత లాభం చూసుకుంటున్నారు. ఇప్పటికే ఇసుక, పాలిషింగ్ గ్రానైట్ అక్రమ రవాణాలో జోరుపెంచిన పర్చూరు నేత అంతేస్థాయిలో గ్రావెల్ అక్రమ తరలింపు చేపట్టారు. మార్టూరు మండలంలోని అటవీ భూముల నుంచి గ్రావెల్ అక్రమంగా తరలిస్తున్నారు. ఇందుకోసం పచ్చని కొండల్ని పిండిచేస్తున్నారు. జేసీబీలు, ఇటాచ్‌లు పెట్టి గ్రావెల్ అక్రమంగా తరలించి రియల్ వెంచర్లు, రోడ్ల నిర్మాణాలకు అమ్ముకుంటున్నారు.
వంద టిప్పర్లు, వందకుపైగా ట్రాక్టర్లతో..
మార్టూరు మండలంలోని మార్టూరు, ఇసుకదర్శి ప్రాంతాల్లోని అటవీ భూములనుంచి గ్రావెల్‌ను టీడీపీ ముఖ్యనేత రేయింబవళ్లు అక్రమంగా తరలిస్తున్నారు. కొండల్లో జేసీబీ, ఇటాచ్ మిషన్లు పెట్టి తవ్విపోస్తున్నారు. ఇక్కడినుంచి రోజూ వంద టిప్పర్లు, వందకుపైగా ట్రాక్టర్లతో గ్రావెల్ అక్రమంగా రవాణా చేస్తున్నారు. స్థానికంగా ఉన్న రియల్ వెంచర్లతోపాటు బాపట్ల, చీరాల ప్రాంతాల్లోని రియల్ వెంచర్లకు గ్రావెల్ ఇక్కడినుంచే సరఫరా అవుతోంది. ఓడరేవు–నరసరావుపేట జాతీయరహదారి పనులకూ ఈ గ్రావెల్ అమ్ముతున్నారు.
సదరు కాంట్రాక్టర్ మరొకరి వద్ద గ్రావెల్ కొనకుండా పర్చూరు ముఖ్యనేత ఒత్తిడి తెచ్చి తానే సరఫరా చేస్తున్నారు. ఒక్క రోడ్డుపనికే రోజుకు వందలాది ట్రిప్పుల గ్రావెల్‌తోపాటు ట్రాక్టర్ల ద్వారా జిల్లా వ్యాప్తంగా అవసరమైనవారికి పంపించి సొమ్ము చేసుకుంటున్నారు. స్థానికంగా టిప్పర్ గ్రావెల్ రూ.8 వేలకు, ట్రాక్టర్ గ్రావెల్ రూ.2 వేలకు విక్రయిస్తున్నారు. దూరాన్ని బట్టి రేటు పెరుగుతుంది. ఈ అక్రమ దందాను పర్చూరు అధికార పార్టీ ముఖ్యనేత అనుచరుడైన తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన తెలుగుయువత నేత నడిపిస్తున్నాడు.
కూటమి రాకతో లీజుల రద్దు
గత ప్రభుత్వంలో పర్చూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వం గ్రావెల్ కోసం లీజులు మంజూరుచేసింది. మార్టూరు మండలం బొబ్బేపల్లి, కోలలపూడి, వలపర్ల, బొల్లాపల్లి ప్రాంతాల్లో పదులసంఖ్యలో లీజులుండేవి. ఆ లీజు భూముల నుంచి గ్రావెల్ తరలించి విక్రయించేవారు. దీంతో ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం వచ్చేది. తద్వారా జిల్లాకు, మైనింగ్ పరిధిలోని గ్రామ పంచాయతీలకు నిధులు సమకూరేవి. వాటితో అభివృద్ధి పనులు చేపట్టేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పర్చూరు ముఖ్యనేత గతంలో ఉన్న బొబ్బేపల్లి పరిధిలోని లీజులను రద్దు చేయించారు.
కోలలపూడి, వలపర్ల, బొల్లాపల్లి ప్రాంతాల లీజులను రద్దుచేయకపోయినా అధికారం అడ్డుపెట్టి అక్కడ మైనింగ్ జరగకుండా నిలిపేయించారు. తాను మాత్రం లీజు, అనుమతులు వంటివి లేకుండానే ఇసుకదర్శి, ద్రోణాదుల తదితర అటవీప్రాంతాల నుంచి గ్రావెల్‌ను అక్రమంగా తరలించి కోట్లు కొల్లగొడుతున్నారు. పర్చూరు నేత అక్రమ గ్రావెల్ దందాతో ప్రభుత్వ రాబడికి రూ.కోట్ల మేర గండిపడుతోంది. గ్రావెల్ దందా, ప్రభుత్వాదాయానికి గండి గురించి తెలిసినా సంబంధిత శాఖల అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment