Environmental destruction
-
కొండలు పిండి.. సొమ్ములు దండి..
సాక్షి ప్రతినిధి, బాపట్ల: అధికారపార్టీ నేతలు బరితెగించారు. ఇసుక, మట్టి, గ్రావెల్, గ్రానైట్, రేషన్ అనే తేడా లేకుండా ఏది దొరికినా.. కొల్లగొట్టి జేబులు నింపుకొంటున్నారు. అక్రమార్జనకు కాదేదీ అనర్హం అనే రీతిలో తెగబడుతున్నారు. ఇందులో పర్చూరు ముఖ్యనేతది ప్రత్యేక స్థానం. నియోజకవర్గంలో ఉన్న ప్రకృతి వనరులను ఎలా దోచుకుతినాలో ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదనుకోవాలి. పర్చూరులో ఉన్న ఇసుక, గ్రానైట్, గ్రావెల్లను అక్రమంగా తరలించి కోట్లు కొల్లగొడుతున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి గండికొట్టి సొంత లాభం చూసుకుంటున్నారు. ఇప్పటికే ఇసుక, పాలిషింగ్ గ్రానైట్ అక్రమ రవాణాలో జోరుపెంచిన పర్చూరు నేత అంతేస్థాయిలో గ్రావెల్ అక్రమ తరలింపు చేపట్టారు. మార్టూరు మండలంలోని అటవీ భూముల నుంచి గ్రావెల్ అక్రమంగా తరలిస్తున్నారు. ఇందుకోసం పచ్చని కొండల్ని పిండిచేస్తున్నారు. జేసీబీలు, ఇటాచ్‌లు పెట్టి గ్రావెల్ అక్రమంగా తరలించి రియల్ వెంచర్లు, రోడ్ల నిర్మాణాలకు అమ్ముకుంటున్నారు.వంద టిప్పర్లు, వందకుపైగా ట్రాక్టర్లతో..మార్టూరు మండలంలోని మార్టూరు, ఇసుకదర్శి ప్రాంతాల్లోని అటవీ భూములనుంచి గ్రావెల్‌ను టీడీపీ ముఖ్యనేత రేయింబవళ్లు అక్రమంగా తరలిస్తున్నారు. కొండల్లో జేసీబీ, ఇటాచ్ మిషన్లు పెట్టి తవ్విపోస్తున్నారు. ఇక్కడినుంచి రోజూ వంద టిప్పర్లు, వందకుపైగా ట్రాక్టర్లతో గ్రావెల్ అక్రమంగా రవాణా చేస్తున్నారు. స్థానికంగా ఉన్న రియల్ వెంచర్లతోపాటు బాపట్ల, చీరాల ప్రాంతాల్లోని రియల్ వెంచర్లకు గ్రావెల్ ఇక్కడినుంచే సరఫరా అవుతోంది. ఓడరేవు–నరసరావుపేట జాతీయరహదారి పనులకూ ఈ గ్రావెల్ అమ్ముతున్నారు. సదరు కాంట్రాక్టర్ మరొకరి వద్ద గ్రావెల్ కొనకుండా పర్చూరు ముఖ్యనేత ఒత్తిడి తెచ్చి తానే సరఫరా చేస్తున్నారు. ఒక్క రోడ్డుపనికే రోజుకు వందలాది ట్రిప్పుల గ్రావెల్‌తోపాటు ట్రాక్టర్ల ద్వారా జిల్లా వ్యాప్తంగా అవసరమైనవారికి పంపించి సొమ్ము చేసుకుంటున్నారు. స్థానికంగా టిప్పర్ గ్రావెల్ రూ.8 వేలకు, ట్రాక్టర్ గ్రావెల్ రూ.2 వేలకు విక్రయిస్తున్నారు. దూరాన్ని బట్టి రేటు పెరుగుతుంది. ఈ అక్రమ దందాను పర్చూరు అధికార పార్టీ ముఖ్యనేత అనుచరుడైన తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన తెలుగుయువత నేత నడిపిస్తున్నాడు. కూటమి రాకతో లీజుల రద్దుగత ప్రభుత్వంలో పర్చూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వం గ్రావెల్ కోసం లీజులు మంజూరుచేసింది. మార్టూరు మండలం బొబ్బేపల్లి, కోలలపూడి, వలపర్ల, బొల్లాపల్లి ప్రాంతాల్లో పదులసంఖ్యలో లీజులుండేవి. ఆ లీజు భూముల నుంచి గ్రావెల్ తరలించి విక్రయించేవారు. దీంతో ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం వచ్చేది. తద్వారా జిల్లాకు, మైనింగ్ పరిధిలోని గ్రామ పంచాయతీలకు నిధులు సమకూరేవి. వాటితో అభివృద్ధి పనులు చేపట్టేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పర్చూరు ముఖ్యనేత గతంలో ఉన్న బొబ్బేపల్లి పరిధిలోని లీజులను రద్దు చేయించారు.కోలలపూడి, వలపర్ల, బొల్లాపల్లి ప్రాంతాల లీజులను రద్దుచేయకపోయినా అధికారం అడ్డుపెట్టి అక్కడ మైనింగ్ జరగకుండా నిలిపేయించారు. తాను మాత్రం లీజు, అనుమతులు వంటివి లేకుండానే ఇసుకదర్శి, ద్రోణాదుల తదితర అటవీప్రాంతాల నుంచి గ్రావెల్‌ను అక్రమంగా తరలించి కోట్లు కొల్లగొడుతున్నారు. పర్చూరు నేత అక్రమ గ్రావెల్ దందాతో ప్రభుత్వ రాబడికి రూ.కోట్ల మేర గండిపడుతోంది. గ్రావెల్ దందా, ప్రభుత్వాదాయానికి గండి గురించి తెలిసినా సంబంధిత శాఖల అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. -
పర్యావరణ విధ్వంసంతోనే వాతావరణ మార్పులు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పర్యావరణ విధ్యంసం కారణంగానే వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయని ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె.పురుషోత్తంరెడ్డి తెలిపారు. వాతావరణ మార్పుల కారణంగా అతి తక్కువ సమయంలో భారీ వర్షాలు, తీవ్రమైన తుపానులు వంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ఇప్పటి నుంచి రేయింబవళ్లు యుద్ధప్రాతిపదికన శ్రమిస్తే తప్ప పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పూడ్చలేని పరిస్థితి ఉందని... తక్షణమే శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం పెరగాలని పురుషోత్తమ్‌రెడ్డి సూచించారు. ఆదివారం ఢిల్లీలోని ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేపిటల్ ఫౌండేషన్ సంస్థ ప్రొఫెసర్ పురుషోత్తమ్‌రెడ్డికి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డ్‌ను అందించింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ డా. సీవీ ఆనందబోస్ చేతుల మీదుగా ఈ అవార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, అటార్నీ జనరల్ ఆర్.వెంకట రమణి, జస్టిస్ ఏకే పట్నాయక్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తంరెడ్డితో పాటు సామాజికంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన పలువురికి అవార్డులు అందించారు. ఈ సందర్భంగా పురుషోత్తమ్‌రెడ్డి మాట్లాడుతూ, పర్యావరణం, సుస్థిరాభివృద్ధి రంగంలో గత 50 ఏళ్లుగా తాను చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించిందన్నారు. మన దేశంలో పర్యావరణ చట్టాలు బాగున్నప్పటికీ... వాటి అమలు మాత్రం సరిగా జరగడం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక యంత్రాంగాలను నిర్వీర్యం చేస్తున్నాయని.. ఇసుక వంటి ప్రకృతి వనరుల దోపిడీని అరికట్టాల్సింది స్థానిక యంత్రాంగాలేనని తెలిపారు. భారత్‌లో అంతులేని సౌరశక్తి ఉందని, దానిని ఉపయోగించుకోవడం ద్వారా సంప్రదాయ ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని ఆయన సూచించారు. -
వేడి అలలు... జీవజాలానికి ఉరితాళ్లు! పరిస్థితి ఇలాగే కొనసాగితే..
నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, భూతాపం (గ్లోబల్ వార్మింగ్) వల్ల భూఉపరితం క్రమంగా వేడెక్కుతోంది. భూమిపై విలువైన జీవావరణ వ్యవస్థ దెబ్బతింటోంది. పర్యావరణ విధ్వంసం చోటుచేసుకుంటోంది. ఈ పరిణామం కేవలం భూమి ఉపరితలంపైనే కాదు, సముద్రాల అంతర్భాగాల్లోనూ సంభవిస్తున్నట్లు అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్న నేషనల్ ఓషియానిక్, అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్(ఎన్ఓఏఏ) నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. అధిక ఉష్ణోగ్రతల వల్ల సముద్రాల అడుగు భాగం సైతం వేడెక్కుతోందని, అక్కడున్న జీవజాలం ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటోందని తేలింది. ఫలితంగా సముద్ర జీవావరణ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతున్నట్లు పరిశోధకులు చెప్పారు. భూతాపంతో సముద్రాల్లో వేడి అలల తీవ్రత పెరుగుతోంది. ఇవన్నీ ప్రమాద ఘంటికలే’’ అని హెచ్చరించారు. ఏమిటీ భూతాపం? శిలాజ ఇంధనాల వినియోగం, కర్బన ఉద్గారాల వల్ల వాతావరణ మార్పులు, తద్వారా భూ ఉపరితలంపై ఉష్ణోగ్రతలు పెరగడమే భూతాపం. భూగోళంపై జనాభా వేగంగా పెరుగుతుండడంతో అదే స్థాయిలో శిలాజ ఇంధనాల వినియోగం సైతం పెరుగుతోంది. బొగ్గు, చమురు, గ్యాస్ వంటివి మండించడం వల్ల భూమి వేడెక్కుతుంది. దీంతోపాటు అడవుల నరికివేత, పారిశ్రామిక విప్లవం, అగ్నిపర్వతాల పేలుళ్లు, నీరు వేగంగా ఆవిరి కావడం, అడవుల్లో కార్చిచ్చు వంటివి కూడా భూతాపానికి కారణాలే. వాస్తవానికి సూర్య కాంతి వల్ల సంభవించే వేడి వాతావరణంలోకి తిరిగి వెనక్కి వెళ్తుంది. శిలాజ ఇంధనాల వాడకం వల్ల ఉత్నన్నమయ్యే విష వాయువులు వేడి వెనక్కి వెళ్లకుండా అడ్డుకుంటాయి. దీంతో భూమిపై ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఈ ప్రభావం సముద్రాలపైనా పడుతుంది. అధ్యయనంలో ఏం తేలిందంటే... ► మెరైన్ హీట్‌వేవ్స్‌గా పిలిచే సముద్రాల అంతర్భాగాల్లోని వేడి అలల తీవ్రత, వ్యవధి అధికంగా ఉంది. సముద్రాల లోపలి ఉష్ణోగ్రతలు వేర్వేరు ప్రాంతాల్లో 0.5 డిగ్రీల సెల్సియస్ నుంచి 3 డిగ్రీల సెల్సియస్ దాకా పెరిగాయి. ► సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదలకు భూతాపం కారణమని సైంటిస్టులు నిర్ధారించారు. ► హీట్‌వేవ్స్ ప్రభావం ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని సముద్రాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ► సముద్రాల ఉపరితలంలో హీట్వేవ్స్పై గత పదేళ్లుగా పరిశోధనలు కొనసాగిస్తున్నామని, అంతర్భాగంలోని వేడి అలలు, అక్కడి పరిణామాలు, జీవజాలం ప్రభావితం అవుతున్న తీరు గురించి తెలుసుకోవడం ఇదే మొదటిసారి అని ఎన్ఓఏఏ రీసెర్చ్ సైంటిస్టు దిల్లాన్ అమామా చెప్పారు. ► సముద్రాల్లో ఉండే ప్లాంక్టన్ అనే సూక్ష్మజీవుల నుంచి భారీ పరిమాణంలోని వేల్స్ దాకా అన్ని రకాల జీవులు హీట్‌వేవ్స్ వల్ల ప్రభావితమవుతున్నాయి. ► ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సముద్ర జీవుల వలసలు ఆగిపోతున్నాయి. వాటిలో పునరుత్పాదక శక్తి దెబ్బతింటోంది. వివిధ జీవుల మధ్య అనుసంధానం తెగిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం సముద్ర జీవావరణ వ్యవస్థ ప్రమాదంలో పడుతున్నట్లే లెక్క. ► భూతాపం వల్ల నీరు ఇలాగే వేడెక్కడం కొనసాగితే ఈ శతాబ్దం ఆఖరు నాటికి సముద్రాల్లోని పగడపు దీవులన్నీ అంతరించిపోతాయని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం వెల్లడించింది. ► సముద్రాల ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలు పెరిగితే 70–90 శాతం, 2 డిగ్రీలు పెరిగితే పూర్తిగా పగడపు దీవులు మాయమవుతాయని యునెస్కో పేర్కొంది. సముద్రాలే రక్షణ ఛత్రం భూతాపం వల్ల ఉత్పన్నమయ్యే ఉష్ణోగ్రత లో 90% మిగులు వేడిని సముద్రాలే శోషించుకుంటాయి. భూమిని చల్లబరుస్తాయి. సముద్రాలే లేకుంటే భూమి అగ్నిగుండం అయ్యేది. సాగరాల ఉష్ణోగ్రత గత శతాబ్ద కాలంలో సగటున 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. మెరైన్ హీట్‌వేవ్స్ గత పదేళ్లలో 50% పెరిగాయి. భూతాపం పెరుగుదలను అడ్డుకోకపోతే సముద్రాలు సలసల కాగిపోవడం ఖాయం. ఫలితంగా భూమి అగ్నిగోళంగా మారుతుంది మానవులతో సహా జీవుల మనుగడ ప్రశ్నార్థకమే అవుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ వైపరీత్యం ఎవరి పాపం?
పర్యావరణ మార్పుల ప్రభావంతో విధ్వంసం ఏదైనా సరే.. పేదదేశాలకే పరిమితమని పాశ్చాత్య దేశాల ప్రజల్లో సర్వసాధారణంగా ఉన్న అంచనాను గత రెండువారాలుగా జరుగుతున్న పరిణామాలు పటాపంచలు చేశాయి. వరదకు అర్థం తెలీని జర్మనీలో.. అమెరికా, కెనడాల్లో చెలరేగిన వడగాల్పుల్లో వందలాది మంది మృతి చెందడం యావత్ ప్రపంచానికీ గుణపాఠం కావాలి. ఈ ఆకస్మిక వైపరీత్యాల సమస్యను సంపన్నదేశాలు ఏదోలా అధిగమిస్తాయన్న ధీమా గాలికి కొట్టుకుపోయింది. కోవిడ్ కానివ్వండి.. ఇంకో ప్రకృతి విపత్తు కానివ్వండి.. ప్రతి ఒక్కటీ మనకు ఒకే విషయాన్ని గుర్తు చేస్తోంది. ఏ మూల ఏం జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతా కచ్చితంగా ఉంటుందని! యూరప్‌లో వరద బీభత్సం... కెనడాలో చరిత్రలో ఎన్నడూ ఎరగని స్థాయి ఉష్ణోగ్రతలు.. అకాల వర్షాలు... వరదలు!! ఇటీవలి కాలంలో సర్వత్రా వినిపిస్తున్న వార్తలివే. కారణాలు సుస్పష్టం. వాతావరణ మార్పులు. అయితే బాధ్యత ఎవరిదన్న విషయానికి వస్తే మాత్రం ప్రపంచం రెండుగా విడిపోయిందనే చెప్పాలి. జర్మనీలో ఇటీవలి వరదకు సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశమైనప్పటికీ వరదను సమర్థంగా ఎదుర్కోలేని పరిస్థితిలో ఎందుకుంది? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం నీళ్లు నములుతోంది. ‘‘జరిగిన విధ్వంసాన్ని వర్ణించేందుకు జర్మన్ భాషలో పదాలు కరవయ్యాయి’’ అని చాన్స్‌లర్ ఏంజెలా మార్కెల్ ఓ టీవీ రిపోర్టర్‌తో మాట్లాడుతూ వ్యాఖ్యానిస్తే... ఓ సామాన్య మహిళ మాత్రం ‘‘అసలు వరదల్లాంటివన్నీ పేద దేశాల్లో కదా జరగాలి. జర్మనీలోనూ వస్తాయని నేనెప్పుడూ అనుకోలేదు. వాన ఎంత వేగంగా వచ్చిందో... అంతే వేగంగా మనుషులను తనతో తీసుకెళ్లిపోయింది’’ అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సంపన్న దేశాలు మినహాయింపు కాదు... ఈ మహిళ తన వ్యాఖ్యలో తెలిసో తెలియకో పాశ్చాత్యదేశాల్లోని మెజార్టీ ప్రజల్లో ఉన్న ఒక తప్పుడు అవగాహనను ఇంకోసారి స్పష్టం చేసింది. వాతావరణ మార్పుల ప్రభావం తాలూకూ విధ్వంసం ఏదైనా సరే.. పేదదేశాలకే పరిమితమన్నది వీరి అంచనా. అధిక జనాభాతో కిటకిటలాడే ఆయా దేశాల తీర ప్రాంతాల్లోనే నష్టం ఎక్కువగా ఉంటుందని.. ధనిక దేశాలకు ఏం ఫర్వాలేదన్న అపోహకు హేతువేమిటో తెలియదు. అంతేకాదు. సంపన్నదేశాలు ఏదోఒకలా ఈ సమస్యను అధిగమిస్తాయన్న ధీమా కూడా వారిలో వ్యక్తమవుతూంటుంది. కానీ వాస్తవం మాత్రం ఇందుకు భిన్నం. ప్రాంతం ఏదైనా.. ప్రకృతి వైపరీత్యాల కారణంగా జరిగే జననష్టం మాత్రం అంతా ఇంతా కాదు. అయితే ఈ సంఘటనలకు మనం ఎలా స్పందిస్తున్నామన్న అంశంపైనే వాతావరణ మార్పులపై జరుగుతున్న చర్చలు విభేదాలకు దారితీస్తున్నాయి. వాతావరణ మార్పుల వల్ల పేద దేశాలే ఎక్కువ నష్టపోతాయన్న అంచనా కూడా ఇలాంటిదే. కానీ కోవిడ్ కానివ్వండి.. ఇంకో ప్రకృతి విపత్తు కానివ్వండి.. ప్రతి ఒక్కటి మనకు ఒకే విషయాన్ని గుర్తు చేస్తోంది. ఏ మూల ఏం జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతా కచ్చితంగా ఉంటుందని! వాతావరణ మార్పులపై ఈ ఏడాది మరోసారి అంతర్జాతీయ స్థాయి చర్చలు జరగనున్నాయి. బ్రిటన్‌లోని గ్లాస్గ్లవ్లో ఈ చర్చ జరగాల్సి ఉండగా.. ఈ ఏడాది కూడా కనివినీ ఎరుగని రీతిలో ప్రకృతి విపత్తులు చవిచూశాం మనం. కాలిఫోర్నియాను అలవికాని దావానలం చుట్టేస్తే.. అమెరికాలో దశాబ్దాల తరువాత వడగాడ్పులు వీస్తున్నాయి. ఉత్తర అమెరికాలో భాగమైన కెనడాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకోవైపు జర్మనీలో వరదలు.. వెయ్యేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో చైనాలో వాన బీభత్సం. ఇవన్నీ ఇటీవలి పరిణామాలే. చైనాలో ప్రళయాన్ని తలపించేలా కార్లు, విమానాలు నీళ్లలో కొట్టుకుపోతున్న దృశ్యాలు సుదూర భవిష్యత్తులోనూ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. దేశీయంగా చూస్తే.. నలభై ఏళ్లలో లేనంత స్థాయిలో వర్షాలతో మహారాష్ట్ర అతలాకుతలమైంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కేవలం ఆరు వారాల వ్యవధిలో రెండుసార్లు ప్రమాద హెచ్చరికలను చూడాల్సి వచ్చింది. ఉప్పొంగిన సముద్రకెరటాలు ఒకవైపు.. ఎడతెరిపిలేని వానలు ఇంకోవైపు మహా నగరాన్ని భయంతో కంపించేలా చేశాయంటే అతిశయోక్తి కాదేమో. చిన్నపాటి వర్షానికే నగరాలు చెరువుల్లా మారిపోతూండటానికి నగర ప్రణాళికల్లో లోపం, వరద ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ విపరీతంగా సాగుతున్న కాంక్రీట్ నిర్మాణాలు కొంత కారణమైనప్పటికీ... ఇటీవలి కాలంలో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువయ్యాయని అందరూ గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మానవ చేష్టల ఫలితంగా వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయని.. భవిష్యత్తులో వీటి ప్రభావం మరింత తీవ్రమవుతాయని.. సముద్రతీర ప్రాంతాల్లోని మహానగరాలు నీటమునిగినా ఆశ్చర్యం లేదని అందరూ అంగీకరిస్తున్నా.. కొన్ని ధనికదేశాలు ఈ విపత్తును అధిగమించగలవన్న ఆశ కొనసాగుతూండటం ఆందోళనకరం. ఆధిపత్య భావజాలమా? అతితక్కువ సమయంలో అత్యధిక వర్షపాతం! ఇలాంటి అనూహ్య పరిణామాలు తరచూ జరుగుతుంటాయని వాతావరణ మార్పులపై ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి కమిటీ ఐపీసీసీ ఇప్పటికే చాలాసార్లు హెచ్చరికలు జారీ చేసింది. భూతాపోన్నతి కారణంగా సంభవించే వాతావరణ మార్పుల్లో ఇదీ ఒకటని కూడా విస్పష్టంగా పలు నివేదికల్లో పేర్కొంది. ఇది ప్రపంచంలోని అన్నిదేశాలకూ వర్తించే అంశమైనప్పటికీ ఈ విషయమై వివక్ష స్పష్టంగా కనిపిస్తూంటుంది. తెల్లతోలు ఆధిపత్య భావజాలం కనిపిస్తూంటుంది. ప్రకృతి వనరులను రేపన్నది లేని చందంగా వాడేసుకుంటూ వాతావరణ మార్పులకు వారే కారణమవుతున్నా.. నెపం మాత్రం పేద దేశాల్లోని అధిక జనాభాపై నెట్టేయడం ఈ భావజాలానికి ఓ ప్రతీకగా చెప్పుకోవచ్చు. కొందరి సోకు.. అందరి శోకం! వాతావరణ మార్పుల విషయంలో వాస్తవం ఏమిటంటే.. పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకం. ప్రధాన భూమిక దీనిదే. కొందరి కార్బన్ ఫుట్‌ప్రింట్ (మన జీవనశైలి, అలవాట్ల ఫలితంగా ఉత్పత్తి అయ్యే విషవాయువుల మోతాదు. వాహనాల్లో పెట్రోలు వాడకంతో కార్బన్ డయాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ వంటి వాయువులు వెలువడుతూంటాయి). అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఒకసారి తరచి చూస్తే.. కేవలం కొన్ని దేశాలు, ప్రజల కార్బన్ ఫుట్‌ప్రింట్ అధిక జనాభా ఉన్న ఇతర దేశాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండటంతోనే ప్రపంచం ఇప్పుడు ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రపంచ వనరులపై 2019 నాటి ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం.. అధిక ఆదాయానికి, భూ వాతావరణంపై పడుతున్న ప్రభావానికి ప్రత్యక్ష సంబంధం ఉందని చెబుతుంది. అధిక జనాభా కానే కాదు. ఆదాయం పెరిగిన కొద్దీ విలాసాలు ఎక్కువవుతాయన్నది అనుభవం. ధనికదేశాల్లో జరుగుతున్నది అదే. జనాభా వృద్ధి రేటు తగ్గుతున్నా.. ఆయా దేశాల్లో వనరుల వినియోగంలో మాత్రం తగ్గుదల నమోదు కావడం లేదు. అంతేకాదు.. తక్కువ ఆదాయమున్న దేశాల్లో జనాభా ఎక్కువవుతున్నా వారి వనరుల కోసం డిమాండ్‌లో మాత్రం వృద్ధి లేకపోవడం గమనార్హం. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ప్రపంచ వనరుల్లో పేద దేశాల డిమాండ్ మూడు శాతంగానే కొనసాగుతోంది. ఏతావాతా... వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించాలంటే.. జనాభ సమస్యను కాకుండా.. ఐశ్వర్యం అనే సమస్యకు పరిష్కారం వెతకాల్సి ఉంటుంది. రానున్న రోజుల్లో ఈ ఏడాది జర్మనీలో తరహాలోనే పలు ప్రకృతి వైపరీత్యాలను చవిచూడాల్సి వస్తుందని వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే పలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రపంచం ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే పరిస్థితి ఇంతకంటే దిగజారకుండా జాగ్రత్త పడినాచాలు. ఇది జరగాలంటే రానున్న కాప్ 26 సమావేశాల్లో ధనిక దేశాల వివక్ష సమస్యపై కచ్చితంగా చర్చ జరగాల్సి ఉంటుంది. వాతావరణ మార్పుల ప్రభావం భూమ్మీద ప్రతిఒక్కరిపై ఉంటుందన్న ఎరుక కలిగినప్పుడే దాన్ని సమర్థంగా ఎదుర్కోగలమని, విపత్తును నివారించగలమని అందరూ గుర్తించాలి. బహార్ దత్ వ్యాసకర్త పర్యావరణ జర్నలిస్టు, అధ్యాపకురాలు -
అడవి పందులు అంత డేంజరా?
మెల్బోర్న్: అడవి పందులు.. పంటలకు ఇవి కలిగించే నష్టం అంతా ఇంతా కాదు. అంతేకాకుండా స్థానిక వన్యప్రాణులకు ఇవి ముప్పుగా మారుతున్నాయి. భూగోళంపై జీవజాతుల మనుగడకు గొడ్డలిపెట్టుగా మారుతున్న వాతావరణ మార్పులకు సైతం అడవి పందులు కారణమవుతున్నట్లు ఆస్ట్రేలియాలో నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. ట్రాక్టర్లతో నేలను దున్నినట్లుగా అడవి పందులు నేలను తవ్వేస్తుంటాయి. ఒక్క అంటార్కిటికా తప్ప ప్రపంచవ్యాప్తంగా అడవి పందులు ఉన్నాయి. ఇవన్నీ కలిసి ప్రతి ఏటా తవ్వుతున్న భూవిస్తీర్ణం ఎంతో తెలుసా? తైవాన్ దేశ విస్తీర్ణంతో సమానం. భూమిలో పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. అడవి పందుల తవ్వకం వల్ల ఏటా 49 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ భూమి నుంచి వెలువడి వాతావరణంలో కలుస్తోంది. ఇది 10 లక్షల కార్లు ఉత్పత్తి చేసే కార్బన్ డయాక్సైడ్తో సమానం. ఒకప్పుడు యూరప్, ఆసియాకే పరిమితమైన అడవి పందులు క్రమంతా ఇతర ఖండాలకు సైతం విస్తరించాయి. ఆస్ట్రేలియాలో 30 లక్షల అడవి పందులు ఉన్నట్లు అంచనా. ఆస్ట్రేలియాలో ఇవి ఏటా 10 కోట్ల డాలర్ల మేర పంట నష్టం కలుగజేస్తున్నాయి. ఇక అమెరికాలో వీటి కారణంగా కేవలం 12 రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం 27 కోట్ల డాలర్ల విలువైన పంట నష్టం వాటిల్లుతోంది. ప్రపంచవ్యాప్తంగా 54 దేశాల్లో 672 రకాల వన్యప్రాణులు, మొక్కలకు అడవి పందులు పెద్ద ముప్పుగా తయారయ్యాయి. రాబోయే దశాబ్దాల్లో వీటి ఆవాస ప్రాంతాలు మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నాయి. వీటి సంతతి పెరిగితే మనుషుల ఆహార భద్రత ప్రమాదంలో పడుతుందని, జీవ వైవిధ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. అడవి పందుల వల్ల పెరుగుతున్న కర్బన్ ఉద్గారాలపై ప్రభుత్వాలు తక్షణమే దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. -
అంతం ఐదు కాదు.. ఆరు!
న్యూయార్క్: ఇప్పటివరకు శాస్త్రవేత్తలు భావిస్తున్నట్లుగా భూ వినాశనం ఐదు సార్లు కాదు.. ఆరు సార్లు అని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇది 26 కోట్ల ఏళ్ల క్రితం సంభవించింది. ఆరు వినాశనాలూ పర్యావరణ విధ్వంసం కారణంగానే చోటుచేసుకున్నాయి. అగ్ని పర్వతాలు భారీ విస్ఫోటనం చెంది లావాను వెదజల్లాయని, దీంతో లక్షల చదరపు కిలోమీటర్ల భూమి లావా ప్రవాహంతో నిండిపోయిందని అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మైఖెల్ రాంపినో వెల్లడించారు. భూమి ఇప్పటికే ఆరు వినాశనాలను ఎదుర్కొంది. ఈ ఆరు వినాశనాల్లో పర్యావరణ విధ్వంసం కారణంగా భూమిపై అనేక జంతు, వృక్ష జాతులు కనుమరుగయ్యాయి. ఇదే ప్రస్తుతం శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. ఎందుకంటే ఆనాటి పరిస్థితులే ఇప్పుడు పునరావృతమవుతున్నాయి. -
హిమాలయాలూ కరిగిపోతున్నాయ్..
బంజారాహిల్స్: ‘హిమాలయాలూ కరిగిపోతున్నాయి.. పర్యావరణ విధ్వంసానికి ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలి, వ్యాపార ప్రయోజనాల కొరకు పర్యావరణాన్ని తాకట్టు పెడితే పెనుముప్పు తప్పదు, పర్యావరణం ఒక వ్యాపార అవకాశం ఎప్పటికీ కాకూడదు’ అని మాజీ కేంద్రమంత్రి జైరామ్మ్రేష్ అన్నారు. ఫిక్కి ఎఫ్ఎల్ఓ ఆధ్వర్యంలో శనివారం తాజ్‌కృష్ణాలో ‘ఎన్విరాన్మెంట్ యాస్ ఏ బిజినెస్ అపర్చునిటీ ’పేరుతో నిర్వహించిన చర్చా వేదికలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాశ్చాత్య దేశాలకు పర్యావరణం ఒక జీవన విధానమైతే మన దేశంలో అది జీవనంలో ఒక భాగమన్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి అడవులు, నదులు, గనులు, నీళ్లు, గాలి సహా అన్ని ప్రకృతి వనరులను యథేచ్ఛగా వినియోగిస్తుండడంతో మానవాళికి పెనుముప్పుగా మారుతుందన్నారు. హిమాలయాలు కరిగిపోతున్నాయని, నదులు ఇంకిపోతున్నాయని, సముద్రమట్టాలు పెరుగుతున్నాయని, ఎండలు మండిపోతున్నాయని.. పర్యావరణ విధ్వంసానికి ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలన్నారు. కార్యక్రమంలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు జైరామ్ సమాధానాలు ఇచ్చారు. ఎఫ్ఎల్వో చైర్పర్సన్ నిధిస్వరూప్, పింకిరెడ్డి, అజితారెడ్డి సహ పలువురు సభ్యులు పాల్గొన్నారు.