సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పర్యావరణ విధ్యంసం కారణంగానే వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయని ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె.పురుషోత్తంరెడ్డి తెలిపారు. వాతావరణ మార్పుల కారణంగా అతి తక్కువ సమయంలో భారీ వర్షాలు, తీవ్రమైన తుపానులు వంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ఇప్పటి నుంచి రేయింబవళ్లు యుద్ధప్రాతిపదికన శ్రమిస్తే తప్ప పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పూడ్చలేని పరిస్థితి ఉందని... తక్షణమే శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం పెరగాలని పురుషోత్తమ్‌రెడ్డి సూచించారు.
ఆదివారం ఢిల్లీలోని ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేపిటల్ ఫౌండేషన్ సంస్థ ప్రొఫెసర్ పురుషోత్తమ్‌రెడ్డికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్‌ను అందించింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ డా. సీవీ ఆనందబోస్ చేతుల మీదుగా ఈ అవార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, అటార్నీ జనరల్ ఆర్.వెంకట రమణి, జస్టిస్ ఏకే పట్నాయక్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో పురుషోత్తంరెడ్డితో పాటు సామాజికంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన పలువురికి అవార్డులు అందించారు. ఈ సందర్భంగా పురుషోత్తమ్‌రెడ్డి మాట్లాడుతూ, పర్యావరణం, సుస్థిరాభివృద్ధి రంగంలో గత 50 ఏళ్లుగా తాను చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించిందన్నారు. మన దేశంలో పర్యావరణ చట్టాలు బాగున్నప్పటికీ... వాటి అమలు మాత్రం సరిగా జరగడం లేదని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక యంత్రాంగాలను నిర్వీర్యం చేస్తున్నాయని.. ఇసుక వంటి ప్రకృతి వనరుల దోపిడీని అరికట్టాల్సింది స్థానిక యంత్రాంగాలేనని తెలిపారు. భారత్‌లో అంతులేని సౌరశక్తి ఉందని, దానిని ఉపయోగించుకోవడం ద్వారా సంప్రదాయ ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment