మెల్‌బోర్న్: అడవి పందులు.. పంటలకు ఇవి కలిగించే నష్టం అంతా ఇంతా కాదు. అంతేకాకుండా స్థానిక వన్యప్రాణులకు ఇవి ముప్పుగా మారుతున్నాయి. భూగోళంపై జీవజాతుల మనుగడకు గొడ్డలిపెట్టుగా మారుతున్న వాతావరణ మార్పులకు సైతం అడవి పందులు కారణమవుతున్నట్లు ఆస్ట్రేలియాలో నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. ట్రాక్టర్లతో నేలను దున్నినట్లుగా అడవి పందులు నేలను తవ్వేస్తుంటాయి. ఒక్క అంటార్కిటికా తప్ప ప్రపంచవ్యాప్తంగా అడవి పందులు ఉన్నాయి. ఇవన్నీ కలిసి ప్రతి ఏటా తవ్వుతున్న భూవిస్తీర్ణం ఎంతో తెలుసా? తైవాన్ దేశ విస్తీర్ణంతో సమానం. భూమిలో పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ ఉంటుందన్న విషయం తెలిసిందే.
అడవి పందుల తవ్వకం వల్ల ఏటా 49 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ భూమి నుంచి వెలువడి వాతావరణంలో కలుస్తోంది. ఇది 10 లక్షల కార్లు ఉత్పత్తి చేసే కార్బన్ డయాక్సైడ్‌తో సమానం. ఒకప్పుడు యూరప్, ఆసియాకే పరిమితమైన అడవి పందులు క్రమంతా ఇతర ఖండాలకు సైతం విస్తరించాయి. ఆస్ట్రేలియాలో 30 లక్షల అడవి పందులు ఉన్నట్లు అంచనా. ఆస్ట్రేలియాలో ఇవి ఏటా 10 కోట్ల డాలర్ల మేర పంట నష్టం కలుగజేస్తున్నాయి. ఇక అమెరికాలో వీటి కారణంగా కేవలం 12 రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం 27 కోట్ల డాలర్ల విలువైన పంట నష్టం వాటిల్లుతోంది.
ప్రపంచవ్యాప్తంగా 54 దేశాల్లో 672 రకాల వన్యప్రాణులు, మొక్కలకు అడవి పందులు పెద్ద ముప్పుగా తయారయ్యాయి. రాబోయే దశాబ్దాల్లో వీటి ఆవాస ప్రాంతాలు మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నాయి. వీటి సంతతి పెరిగితే మనుషుల ఆహార భద్రత ప్రమాదంలో పడుతుందని, జీవ వైవిధ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. అడవి పందుల వల్ల పెరుగుతున్న కర్బన్ ఉద్గారాలపై ప్రభుత్వాలు తక్షణమే దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment