వారి సహజశైలిలో ఆడనిస్తాం
భారత కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్య
కోహ్లికి సారథి మద్దతు
రేపటి నుంచి భారత్, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు
మెల్‌బోర్న్: బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో పైచేయి సాధించాలని కృతనిశ్చయంతో ఉన్న భారత్ అందుకు అన్ని విధాలా సన్నద్ధమైంది. నాలుగో టెస్టు మ్యాచ్‌కు ముందు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ఆటగాళ్లంతా సుదీర్ఘ సాధనలో పాల్గొన్నారు. ఆ్రస్టేలియాతో సిరీస్ ప్రస్తుతం 1–1తో సమంగా ఉన్న దశలో ఈ మైదానంలో భారత్ మెరుగైన ప్రదర్శన కనబర్చేందుకు మంచి అవకాశం ఉంది. 2020–21 పర్యటనలో మెల్‌బోర్న్‌లో విజయంతోనే టీమిండియా సిరీస్ గెలుపు దిశగా అడుగు వేసింది. గురువారం ‘బాక్సింగ్ డే’ టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత కెపె్టన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. తమ సన్నాహాలపై రోహిత్ ఇచ్చిన సమాధానాలు అతని మాటల్లోనే...
యశస్వి ప్రదర్శనపై...
నాకు తెలిసి జైస్వాల్, గిల్, పంత్ దాదాపు ఒకే తరహా ఆటగాళ్లు. కుర్రాళ్లుగా వారి మానసిక దృక్పథం, ఆలోచనలు ఒకేలాగా ఉంటాయి. తాము ఏం చేయగలమనేది వారికి బాగా తెలుసు. కాబట్టి వాటిని మార్చే ప్రయత్నంతో పరిస్థితులను సంక్లిష్టం చేయదల్చుకోలేదు. జైస్వాల్ ఇక్కడ మొదటిసారి ఆడుతున్నాడు. అతని ప్రతిభ ఎలాంటిదో ఇప్పటికే చూశాం. అతని బ్యాటింగ్ గురించి ఎక్కువగా చర్చించి భారం మోపవద్దు. స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వాలి. ఆసీస్ బౌలర్లపై కూడా అతనికి మంచి అవగాహన ఉంది. అటాక్‌తో పాటు అవసరమైతే జైస్వాల్ డిఫెండ్ కూడా చేయగలడు. ఒక్కసారి కుదురుకుంటే ప్రమాదకారిగా మారతాడు.
గిల్, పంత్ వైఫల్యంపై...
శుబ్‌మన్ గిల్ గురించి కూడా నేను ఇదే చెబుతాను. ఆరంభంలో 30–40 పరుగులు రాబడితే చాలు ఆపై భారీ స్కోరు సాధించడం ఎలాగో గిల్‌కు తెలుసు. ఇలాంటివి అతను గతంలో చేసి చూపించాడు. పంత్‌పై కూడా ఎలాంటి ఒత్తిడీ లేదు. తన బాధ్యతలు పంత్‌కు బాగా తెలుసు. మ్యాచ్ పరిస్థితిని బట్టి కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పడం తప్ప ఇతర విషయాల గురించి వీరితో మాట్లాడాల్సిన అవసరం లేదు.
బుమ్రా బౌలింగ్‌పై...
జస్‌ప్రీత్ బుమ్రాతో మంచి బౌలింగ్ చేయించుకోవాలంటే ఒక్కటే ఉపాయం. అతనికి అసలు ఏమీ చెప్పకుండా ఉంటే చాలు. ఏం చేయాలో, ఎలా చేయాలనే విషయంలో తన బౌలింగ్‌పై అతనికి చాలా స్పష్టత ఉంది. అతిగా ఆలోచించకుండా తన బౌలింగ్‌నే అతను నమ్ముకుంటాడు. వికెట్లు దక్కినా... దక్కకపోయినా తన ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. కాబట్టి మ్యాచ్ మధ్యలో కూడా కొత్తగా బుమ్రాకు నేను ఎలాంటి సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదని అర్థమైంది.
తన గాయం, బ్యాటింగ్ స్థానంపై...
నా మోకాలుకు ఎలాంటి ఇబ్బందీ లేదు. అంతా బాగుంది. జట్టులో నేను ఏ స్థానంలో ఆడతాననే విషయంపై చర్చ అనవసరం. ఏం చేసినా జట్టు మేలు కోరే ప్రణాళికలు ఉంటాయి. గత టెస్టు తర్వాత రెండు బ్యాటింగ్ ప్రాక్టీస్ సెషన్లు జరిగాయి. ఈ రెండు రోజుల్లో నా ఆట ఎంతగా మారిందో చూడాలి.
జోరుగా ప్రాక్టీస్...
భారత ఆటగాళ్లు మంగళవారం నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. ముఖ్యంగా కోహ్లి ఈ సిరీస్‌లో తనను ఇబ్బంది పెడుతున్న ‘ఫోర్త్ స్టంప్’ సమస్యను అధిగమించేందుకు ప్రయతి్నంచాడు. ఆఫ్‌స్టంప్ బయట బంతులు వేయమని చెబుతూ హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణలకు సూచిస్తూ కోహ్లి బ్యాటింగ్ కొనసాగించాడు. సిరీస్‌లో ఇదే తరహా బంతులకు అతను వరుసగా అవుటయ్యాడు. త్రో డౌన్ స్పెషలిస్ట్ రాఘవేంద్రతో భిన్నమైన బంతులు వేయించుకొని రోహిత్ సాధన చేశాడు. బుమ్రా సహా ఇతర ప్రధాన బౌలర్లందరినీ ఎదుర్కొంటూ వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడంతో మెల్‌బోర్న్ టెస్టులో ఇద్దరు స్పిన్నర్లతో జట్టు ఆడవచ్చనే సంకేతాలు వస్తున్నాయి.
కోహ్లి ఫామ్‌పై...
విరాట్ కోహ్లి ఆధునిక క్రికెట్ దిగ్గజాల్లో ఒకడు అని అంతా చెబుతుంటారు. అలాంటి ఆటగాళ్లకు ఎవరో చెప్పాల్సిన పని లేదు. వారు తమకంటూ సొంత దారిని సృష్టించుకుంటారు. లోపాలను సరిదిద్దుకొని ముందుకు వెళ్లడం ఎలాగే వారికి బాగా తెలుసు.
Comments
Please login to add a commentAdd a comment