Gravel mining
-
కొండలు పిండి.. సొమ్ములు దండి..
సాక్షి ప్రతినిధి, బాపట్ల: అధికారపార్టీ నేతలు బరితెగించారు. ఇసుక, మట్టి, గ్రావెల్, గ్రానైట్, రేషన్ అనే తేడా లేకుండా ఏది దొరికినా.. కొల్లగొట్టి జేబులు నింపుకొంటున్నారు. అక్రమార్జనకు కాదేదీ అనర్హం అనే రీతిలో తెగబడుతున్నారు. ఇందులో పర్చూరు ముఖ్యనేతది ప్రత్యేక స్థానం. నియోజకవర్గంలో ఉన్న ప్రకృతి వనరులను ఎలా దోచుకుతినాలో ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదనుకోవాలి. పర్చూరులో ఉన్న ఇసుక, గ్రానైట్, గ్రావెల్లను అక్రమంగా తరలించి కోట్లు కొల్లగొడుతున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి గండికొట్టి సొంత లాభం చూసుకుంటున్నారు. ఇప్పటికే ఇసుక, పాలిషింగ్ గ్రానైట్ అక్రమ రవాణాలో జోరుపెంచిన పర్చూరు నేత అంతేస్థాయిలో గ్రావెల్ అక్రమ తరలింపు చేపట్టారు. మార్టూరు మండలంలోని అటవీ భూముల నుంచి గ్రావెల్ అక్రమంగా తరలిస్తున్నారు. ఇందుకోసం పచ్చని కొండల్ని పిండిచేస్తున్నారు. జేసీబీలు, ఇటాచ్‌లు పెట్టి గ్రావెల్ అక్రమంగా తరలించి రియల్ వెంచర్లు, రోడ్ల నిర్మాణాలకు అమ్ముకుంటున్నారు.వంద టిప్పర్లు, వందకుపైగా ట్రాక్టర్లతో..మార్టూరు మండలంలోని మార్టూరు, ఇసుకదర్శి ప్రాంతాల్లోని అటవీ భూములనుంచి గ్రావెల్‌ను టీడీపీ ముఖ్యనేత రేయింబవళ్లు అక్రమంగా తరలిస్తున్నారు. కొండల్లో జేసీబీ, ఇటాచ్ మిషన్లు పెట్టి తవ్విపోస్తున్నారు. ఇక్కడినుంచి రోజూ వంద టిప్పర్లు, వందకుపైగా ట్రాక్టర్లతో గ్రావెల్ అక్రమంగా రవాణా చేస్తున్నారు. స్థానికంగా ఉన్న రియల్ వెంచర్లతోపాటు బాపట్ల, చీరాల ప్రాంతాల్లోని రియల్ వెంచర్లకు గ్రావెల్ ఇక్కడినుంచే సరఫరా అవుతోంది. ఓడరేవు–నరసరావుపేట జాతీయరహదారి పనులకూ ఈ గ్రావెల్ అమ్ముతున్నారు. సదరు కాంట్రాక్టర్ మరొకరి వద్ద గ్రావెల్ కొనకుండా పర్చూరు ముఖ్యనేత ఒత్తిడి తెచ్చి తానే సరఫరా చేస్తున్నారు. ఒక్క రోడ్డుపనికే రోజుకు వందలాది ట్రిప్పుల గ్రావెల్‌తోపాటు ట్రాక్టర్ల ద్వారా జిల్లా వ్యాప్తంగా అవసరమైనవారికి పంపించి సొమ్ము చేసుకుంటున్నారు. స్థానికంగా టిప్పర్ గ్రావెల్ రూ.8 వేలకు, ట్రాక్టర్ గ్రావెల్ రూ.2 వేలకు విక్రయిస్తున్నారు. దూరాన్ని బట్టి రేటు పెరుగుతుంది. ఈ అక్రమ దందాను పర్చూరు అధికార పార్టీ ముఖ్యనేత అనుచరుడైన తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన తెలుగుయువత నేత నడిపిస్తున్నాడు. కూటమి రాకతో లీజుల రద్దుగత ప్రభుత్వంలో పర్చూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వం గ్రావెల్ కోసం లీజులు మంజూరుచేసింది. మార్టూరు మండలం బొబ్బేపల్లి, కోలలపూడి, వలపర్ల, బొల్లాపల్లి ప్రాంతాల్లో పదులసంఖ్యలో లీజులుండేవి. ఆ లీజు భూముల నుంచి గ్రావెల్ తరలించి విక్రయించేవారు. దీంతో ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం వచ్చేది. తద్వారా జిల్లాకు, మైనింగ్ పరిధిలోని గ్రామ పంచాయతీలకు నిధులు సమకూరేవి. వాటితో అభివృద్ధి పనులు చేపట్టేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పర్చూరు ముఖ్యనేత గతంలో ఉన్న బొబ్బేపల్లి పరిధిలోని లీజులను రద్దు చేయించారు.కోలలపూడి, వలపర్ల, బొల్లాపల్లి ప్రాంతాల లీజులను రద్దుచేయకపోయినా అధికారం అడ్డుపెట్టి అక్కడ మైనింగ్ జరగకుండా నిలిపేయించారు. తాను మాత్రం లీజు, అనుమతులు వంటివి లేకుండానే ఇసుకదర్శి, ద్రోణాదుల తదితర అటవీప్రాంతాల నుంచి గ్రావెల్‌ను అక్రమంగా తరలించి కోట్లు కొల్లగొడుతున్నారు. పర్చూరు నేత అక్రమ గ్రావెల్ దందాతో ప్రభుత్వ రాబడికి రూ.కోట్ల మేర గండిపడుతోంది. గ్రావెల్ దందా, ప్రభుత్వాదాయానికి గండి గురించి తెలిసినా సంబంధిత శాఖల అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. -
సుద్దపల్లిలో 2014–19 మధ్యే భారీగా అక్రమ క్వారీయింగ్
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామం పరిధిలో 2014–19 మధ్య కాలంలోనే భారీగా అక్రమ క్వారీయింగ్ జరిగిందని డైరెక్టర్ ఆఫ్ మైనింగ్, జియాలజీ (డీఎంజీ) వీజీ వెంకటరెడ్డి వెల్లడించారు. సుద్దపల్లిలో అక్రమ గ్రావెల్ క్వారీయింగ్‌పై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మైనింగ్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా గురువారం ఆ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు గుర్తించిన కీలక అంశాలను వెంకటరెడ్డి వివరించారు. చేబ్రోలు మండలంలోని సుద్దపల్లి, ఇతర గ్రామాల పరిధిలో రహదారులు, నిర్మాణాలకు అవసరమైన నాణ్యమైన గ్రావెల్ నిల్వలు ఉన్నాయి. 2014–19 మధ్య నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరపడంతో ఒక్క సుద్దుపల్లిలోనే ప్రమాదకరమైన 19 గోతులు ఏర్పడ్డాయి. భూగర్భ జలాలు ఎండిపోయాయి. సుద్దపల్లిలో 2014–19 మధ్య 3 వేల క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌కు ఒక్క క్వారీకి తాత్కాలిక అనుమతి ఇచ్చారు. కానీ ఇష్టారాజ్యంగా క్వారీయింగ్ జరగ్గా, ఇద్దరికి మాత్రమే నోటీసులు ఇచ్చారు. కేవలం 16,399 క్యూబిక్ మీటర్లకు రూ.33,28,769 జరిమానా విధించారు. రాష్ట్రంలో మైనింగ్ అక్రమాలు, అక్రమ రవాణా నిరోధానికి ప్రభుత్వం విజిలెన్స్ స్క్వాడ్లు, నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఆకస్మిక దాడులతో మాఫియాకు ముక్కుతాడు వేస్తోంది. 2019–22 మధ్య సుద్దపల్లిలో కేవలం 4 క్వారీల ద్వారా 31,515 క్యూబిక్ మీటర్లకు తాత్కాలిక పర్మిట్లు జారీ అయ్యాయి. అక్రమాలకు పాల్పడుతున్న ఐదుగురికి నోటీసులు ఇచ్చారు. మొత్తం 56,834 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ అక్రమ క్వారీయింగ్‌కు బాధ్యులైన వారికి భారీగా రూ.2,06,63,127 జరిమానా విధించారు. అప్పుడు.. ఇప్పుడు చేబ్రోలు మండలంలో 2014–19 మధ్య 3,46,716 క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌కు 14 క్వారీలకు ప్రభుత్వానికి రూ.1,21,05,272 ఆదాయం వచ్చింది. 1,38,200 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ కోసం 4 లీజులకు రూ.42,05,070 వచ్చింది. ఆ ఐదేళ్ళలో అక్రమ తరలింపుపై 661 కేసులు పెట్టి రూ.1,08,24,898 జరిమానా విధించారు. అక్రమ క్వారీయింగ్‌పై 12 కేసులు పెట్టి రూ.5,39,17,924 జరిమానా వసూలు చేశారు. 2019–22 కాలంలో 4,00,684 క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌కు 48 తాత్కాలిక అనుమతులు ఇవ్వగా రూ.1,62,27,994 ఆదాయం వచ్చింది. అలాగే 42,198 క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌కు 4 లీజులకు అనుమతి ఇవ్వగా రూ.30,28,860 ఆదాయం వచ్చింది. 2019–22 మధ్య అక్రమంగా గ్రావెల్‌ను తరలిస్తున్న వారిపై 665 కేసులు నమోదు చేసి రూ.1,02,37,112 జరిమానా విధించాం. అక్రమ క్వారీయింగ్‌కు పాల్పడుతున్న వారిపై 23 కేసులు నమోదు చేసి రూ.8,13,05,703 జరిమానాగా వసూలు చేశాం. -
గొట్టిప్రోలు కోటదిబ్బ.. 2వేల ఏళ్ల నాటి చరిత్రకు సాక్ష్యం
నాయుడుపేట: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా నాయుడుపేట మండలం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో గొట్టిప్రోలు గ్రామం ఉంది. ఊరి ముఖద్వారానికి ఎడమవైపు ఎత్తైన కొండలాగా ఓ దిబ్బ కనిపించేది. పిచ్చిమొక్కలతో నిండి వుండే ఈ దిబ్బ మీద మేకలు, గొర్రెలు మేపే కాపరులకు వర్షాకాలంలో ఇక్కడ కుండ పెంకులు, పాతరాతి యుగానికి సంబంధించిన వస్తువులు లభించేవి. వాటిని చూసి అప్పటి పెద్దలు ఇక్కడ రాజులు వుండేవారట అని ముందు తరాలవారికి చెప్పెవారు. గ్రామంలోని కోట దిబ్బలో ఓ మూలన పల్లవులనాటి విష్ణుమూర్తి విగ్రహం గ్రావెల్(గులకరాళ్లు) తవ్వకాల్లో బయటపడడంతో గ్రామ ప్రజలు అప్పటి నుంచి పూజలు చేసేవారు. కోట దిబ్బగా పిలువబడే ప్రాంతం 40 ఎకరాలు స్థలంలో వుంది. గడిచిన రెండు దశాబ్ధాల్లో గ్రావెల్ అక్రమ రవాణా కోసం కొంత మంది పెత్తందారులు కోట దిబ్బను ద్వంసం చేసి సొమ్ముచేసుకున్నారు. ఇందులో పురాతన వస్తు సామగ్రి ఓక్కోక్కటిగా బయటపడడంతో గ్రామస్తులు కొంత మంది అక్రమ రవాణా చేయరాదంటూ అడ్డుకున్నారు. విషయం పురవస్తుశాఖ అధికారుల దృష్టికి చేరింది. ఏడాది తరువాత ఆర్కియాలజీ అధికారులు స్పందించారు. కోట దిబ్బ చుట్టూ నలబై ఎకరాలకు చుట్టు హద్దులు వేశారు. ఇందులోకి బయటవ్యక్తులు ఎవ్వరూ ప్రవేశించరాదంటూ దండోరా వేయించారు. గ్రామ పెద్దలతో మాట్లాడి పురావస్తుశాఖ సారద్యంలో తవ్వకాలు చేపడుతామని చెప్పారు. రెవెన్యూ, పోలీస్ జిల్లా ఉన్నతాధికారులకు పురావస్తుశాఖ శాస్త్రవేత్తలు, అధికారులు ఇక్కడి పరిస్థితిపై వివరించారు. డ్రోన్ కెమెరాలతో 40 ఎకరాలోని అన్ని ప్రదేశాలను చిత్రీకరించారు. గ్రామంలోని వంద మందికిపైగా కూలీలతో పురావస్తుశాఖ అధికారులు, సిబ్బంది తవ్వకాలు ప్రారంభించారు. తొలిదశలో పెంకులు, చిన్న చిన్నరాతి ముక్కలు బయటపడ్డాయి. వీటిపై పురావస్తుశాఖ అధికారులు పరిశోధనలు చేయాలని ఆశాఖ పరిశోధనశాలలకు పంపడం జరిగింది. పల్లవులు, రోమన్లు, శాతవాహనుల కాలంనాటి ఆనవాళ్లు కనిపిస్తున్నాయని పరిశోధనల్లో తేటతెల్లమవుతుందని అధికారులు వెల్లడించారు. పూర్తి స్థాయి తవ్వకాలు చేపట్టి పరిశోధనలు చేస్తే తప్ప ఓ కొలిక్కిరాదని అధికారులు నిర్ణయానికి వచ్చారు. రెండువేల ఏళ్లనాటి పురాతన కట్టడాలు.... పురావస్తు తవ్వకాల్లో బయల్పడ్డ కట్టడాలు రెండు వేల ఏళ్ళనాటి మధ్య యుగంనాటి చరిత్ర పురాతన కట్టడాలని శాసననాలు చెబుతున్నాయి. స్వర్ణముఖినది బంగాళాఖాతం సముద్రతీరానికి దగ్గరగా వుండడంతో రోమన్లతో వర్తక వ్యాపారాలు కొసాగించేందుకు ఇక్కడ కట్టడాలు చేసి వుండవచ్చని భావిస్తున్నారు. ఇదే క్రమంలో చతుర్ముఖి ముఖం కలిగిన విష్ణుమూర్తి విగ్రహంతో పాటు నాణ్యమైన నలుపు, ఎరుపు మట్టిపాత్రలు,నాణ్యాలు, జాడీలు గృహాపకరణాలు బయల్పడ్డాయి. పల్లవుల కాలం నాటివిగా భావిస్తున్న విగ్రహాలు అలనాటి శిల్పకళను చాటిచెప్పే విధంగా వుండటమే కాక నాటి చరిత్రను వివరిస్తున్నాయి. రెండువేళ్ల నాటి డ్రైనేజీ వ్యవస్థ, భారీ ఘన ఇటుకలతో చుట్టూ వలయాకారంలో గోడ నిర్మాణం, 48–49 వెడల్పు కలిగిన ఇటుకల వుండడంతో.. ఇవి అమరావతి, నాగార్జున కొండ శాతవాహనుల కాలంనాటి నిర్మాణంలో వాడిన ఇటుకలుగా తెలుస్తోంది. సముద్రతీరం ప్రాంతానికి దగ్గరగా వ్యాపార వాణిజ్య పరంగా అనువైన ప్రాంతం కావడంతో కోట దిబ్బను ఎంచుకుని.. ఇక్కడ కట్టడాలు నిర్మించిన ఆనవాళ్లు బయల్పడ్డాయని ఆర్కియాలజీ అధికారులు గుర్తించారు. గొట్టిప్రోలు గ్రామం కోటదిబ్బలో చేపట్టిన పురావస్తుశాఖ తవ్వకాలను ఆశాఖ విశ్రాంత జాయింట్ డైరెక్టర్ జనరల్ ఆర్ఎస్ బిస్ట్ పరిశీలించారు. తవ్వకాల్లో శాతవాహన కాలంనాటి ఆనవాళ్లు కోటదిబ్బలో బయల్పడిన ఆ ప్రాంతాన్ని ఆర్ఎస్ బిస్ట్ చూశారు. ఇక్కడ బయల్పడిన కట్టడాలు శాతవాహనుల కాలంలో ఏర్పాటు చేసుకున్న కోటలో రాజులు, పరిపాలకులు, లోపలభాగంలోనే కోర్టు, సెక్యూరిటీ వంటి పురాతన కట్టడాల మాదిరి కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఇతర ప్రాంతాలకు వర్తక వాణిజ్యపరంగా ఇక్కడి నుంచే జరిగి వుంటాయని స్పష్టం చేశారు. గొట్టిప్రోలు శాతవాహన కాలంనాటి కట్టడాలు బయటపడడం చరిత్రగా మారనుందని అన్నారు. వీటిని కళాశాలలు, పాఠశాలలోని విద్యార్థులకు ప్రదర్శించి.. శాతవాహనుల చరిత్ర అర్థమయ్యేలా చూపాలన్నారు. గొట్టిప్రోలులో పురావస్తు కట్టడాలు ఉన్నట్లు ఎలా గుర్తించారు..! గొట్టిప్రోలు గ్రామానికి శివారుప్రాంతంలో 30 అడుగులు ఎత్తుగల దిబ్బవుండేది. ఇక్కడ గ్రావెల్ విరివిగా వుండడంతో ఇది కొందరికి కల్పతరువుగా మారింది. దిబ్బను సొంతం చేసుకుని ప్రకృతి సంపదను దొచుకుంటే కోట్లు గడించవచ్చని దీనిపై దృష్టిసారించారు. దాదాపుగా 30 అడుగులు ఎత్తు ఉండే దిబ్బ ప్రస్తుతం 7 అడుగులు ఎత్తుకు తగ్గింది. అప్పటికే కోటలో కట్టడాలు ఒక్కొక్కటిగా బయల్నడుతూ వచ్చాయి. అది గమనించిన గ్రామంలోని ఓ విద్యావంతుడు గ్రావెల్ తవ్వకాలను అడ్డుకుంటూ వచ్చాడు. అదేక్రమంలో పురావస్తుశాఖ అధికారులకు సందేశాలు పంపుతూ వచ్చినా ప్రయోజనం లేకపోయింది. 2018 నవంబర్‌లో పురవాస్తుశాఖ అధికారులు స్వర్ణముఖినది తీరాల వెంబడి గ్రామాల ఆలయాలు, పురావస్తు కట్టడాలు ఎక్కడెక్కడ వున్నాయోనని పరిశీలించారు. ఈసమయంలో గొట్టిప్రోలు వద్ద కోట దిబ్బలో పురావస్తు కట్టడాలు వున్నట్లు శాసనాలలో గుర్తించారు. -
చిత్తూరులో తెలుగు తమ్ముళ్ల కొత్త దందా
-
గట్టు.. ఇదీ లోగుట్టు
ఎడాపెడా అక్రమాలకు తెగబడటం.. ప్రజాధనాన్ని లూటీ చేయడం వారి దినచర్య. ఆనక అధికారం అండతో పాపాల్ని కడిగేసుకోవడం వారికి పరిపాటి. తాడిపూడి, పోలవరం కుడికాలువ వెంబడి ఇదే తంతు నడుస్తోంది. ప్రజాప్రతినిధులు.. అధికారుల అండతో నిత్యం భారీఎత్తున ఎర్ర కంకరను తవ్వుకుపోతున్నారు. దొడ్డిదారిన విక్రయిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. తిలాపాపం తలాపిడికెడు అన్నచందంగా ఇక్కడ కంకర మాఫియా బుసలు కొడుతోంది. ఉంగుటూరు మండలం గొల్లగూడెం వద్ద తాడిపూడి కాలువకు గండిపడిన వైనం ఈ వాస్తవాల్ని మరోసారి బహిర్గతం చేసింది. ఉంగుటూరు : తాడిపూడి కాలువకు ఉంగుటూరు మండలం గొల్లగూడెం వద్ద రెండోసారి గండి పడటానికి అక్రమార్కులే కారణమనే విషయం మరోసారి వెల్లడైంది. కొందరు ప్రజాప్రతినిధులు, అధికారుల అండతో చీకటి మాటున సాగిస్తున్న గ్రావెల్ తవ్వకాల వల్లే కాలువ గట్టు తెగిపోయింది. కాలువ గట్లతోపాటు, గట్ల పక్కన గల ఎర్రకంకరను తవ్వి తరలించుకుపోతున్నారు. ఇదే ప్రాంతంలో 2013లోనూ గండి పడింది. అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు అక్రమ తవ్వకాలను నిలువరించే ప్రయత్నం చేయకపోగా.. కంకర మాఫియాకు వంతపాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులకు ఫిర్యాదు చేసినా ఆగని తవ్వకాలు పోలవరం, తాడిపూడి కాలువ గట్లవెంబడి రాత్రి వేళల్లో పొక్లెయిన్ల సాయంతో కంకర తవ్వి నిత్యం ట్రాక్టర్లపై తరలిస్తున్నారు. దీనిని దొడ్డిదారిన విక్రయిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. ఎవరికి అందాల్సిన సొమ్ము వారికి అందుతుం డటంతో ఈ అక్రమాలకు అడ్డుకట్టవేసే నాథుడు కనబడటం లేదు. ఇదే విషయమై అనేకసార్లు కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి, మీకోసం కార్యక్రమాల్లో ప్రజలు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదం టే కంకర మాఫియా ఎంతగా వేళ్లూనుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు కాలువ గట్లపై అధికారుల పర్యవేక్షణ నామమాత్రంగానైనా లేకపోవడంతో అక్రమార్కులు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్టుగా ఉంది. అక్రమ తవ్వకాలు సాగిపోతుంటే పట్టించుకోరేం అని అడిగితే ‘మాకు పిల్లాపాపలు ఉన్నారు. మా జీవితాలను గట్ల కోసం పణంగా పెట్టలేం’ అని కొందరు అధికారులు చెబుతున్నారంటే.. మాఫియా ఎంతగా పేట్రేగిపోతోందో ఇట్టే అవగతం చేసుకోవచ్చు. 10 అడుగులపైనే గండి గొల్లగూడెం వద్ద తాడిపూడి కాలువకు 10 అడుగుల పైనే గండి పండింది. 2013లోనూ ఇక్కడే గండిపడగా, వరద నీరు తిమ్మాయపాలెం గ్రామంలోని కోడేరు చెరువులో చేరింది. అనంతరం చెరువుకు గండిపడి తిమ్మాయపాలెం నూతన కాలనీ రోడ్డు ముంపునకు గురైంది. సోమవారం వేకువజామున తిరిగి అదే ప్రాం తంలో గండిపడగా తిమ్మాయపాలెం ముంపుబారిన పడింది. గతంలో గండిపడినా అధికారులు పూర్తిస్థారుులో చర్యలు తీసుకోలేదు. దీంతో అదే ప్రాంతంలో రెండోసారి గండి పడిందని రైతులు చెబుతున్నారు. గ్రావెల్‌ను తవ్వేస్తుండటంతో ఉంగుటూరు మండలం పరిధిలో తాడిపూడి, పోలవరం కుడికాలువ గట్లు బలహీనమయ్యూరుు. ఒక్కరోజు మాత్రమే వర్షం కురవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని.. వర్షాలు ఇలాగే కొనసాగితే ఊళ్లు, పంటలు మునగటం ఖాయమని ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. వంతెన నిర్మించాలి ఏటా భారీ వర్షాల వల్ల వరద నీరు రావటంతో నానా ఇబ్బందులు పడుతున్నాం. 2013 భారీ వర్షాలకు ఇదే ప్రాంతం వద్ద గండి పడింది. అరుునా సరైన చర్యలు తీసుకోలేదు. సోమవారం మరోసారి గండి పడటంతో 60 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. తిమ్మయ్యపాలెం వద్ద వంతెన నిర్మించాలి. - మారిశెట్టి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ కాంక్రీట్ లైనింగ్ వేయాలని కోరాం తాడిపూడి కాలువ గట్లను పటిష్టత కోసం కాంక్రీట్ లైనింగ్ వేసేందుకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరాం. గట్ల పటిష్టానికి చర్యలు తీసుకుంటాం. తవ్విన గ్రావెల్‌ను గట్లపైనే ఉంచేలా చూడాలని అధికారులను కోరతాం. - గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే -
అక్రమాల క్వారీ
అవినీతికి చెట్టు, పుట్టు, మట్టి ఏదైనా ఒకటేనని నిరూపిస్తున్నారు కొత్తూరు రిజర్వు ఫారెస్టు అధికారులు, సిబ్బంది. దాదాపు రూ.20కోట్లకుపైనే అక్రమ క్వారీయింగ్ జరిగినట్లు సమాచారం. గురువారం ‘సాక్షి’లో వచ్చిన ‘అమ్మకానికి అడవి’ కథనం కలకలం రేపింది. దీనిపై చీఫ్ కన్జర్వేటర్ విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో అవినీతిరాయుళ్లు భయంతో వణికిపోతున్నారు. పశ్చిమ కృష్ణా, న్యూస్‌లైన్ : అటవీశాఖలో అవినీతి ఊడలు దిగింది. కొత్తూరు రిజర్వు ఫారెస్టును అడ్డాగా చేసుకొని కొందరు అధికారులే అక్రమాలకు ఊతమిస్తూ కోట్ల రూపాయలు గడించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటవీభూములను అడ్డగోలుగా అమ్ముకోవడమేగాక అక్రమ క్వారీలను ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ యడవల్లి వీరయ్య కుంట నుంచి జానకమ్మ కుంట వరకు 13 అక్రమ క్వారీలు వెలిశాయి. వీటిలో ప్రస్తుతం తొమ్మిది క్వారీల నుంచి గ్రావెల్ తరలిపోతుంది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు పొక్లెయిన్లతో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. అక్రమ క్వారీయింగ్ ద్వారా ఇప్పటివరకు సుమారు రూ.20 కోట్లపైనే వ్యాపారం జరిగిందని సమా చారం. భారీగా ముడుపులు దండుకుంటున్న అధికారులు ఈ విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తూ అప్పుడప్పుడు మొక్కుబడి కేసుల నమోదుతో ‘షో’ చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జరిగిన నష్టానికి ఐదురెట్లు వసూలు చేయాలని అటవీశాఖ చట్టాలు చెబుతున్నాయి. దీని ప్రకారం అక్రమ క్వారీయింగ్ వ్యవహారంలో రూ. కోట్లు నష్టపరిహారంగా వసూలు చేయాల్సి ఉంది. ఇక్కడి క్వారీలను పరిశీలిస్తే జరిగిన నష్టానికి, ఆ శాఖాధికారులు జరిమానాలుగా వసూలు చేసిన మొత్తానికి ఏమాత్రం పొంతన కనిపించడంలేదు. కలప సొమ్ము స్వాహా జానకమ్మ కుంట ప్రాంతంలో ఉన్న కానూరి కరణంగారి తోట 70 ఎకరాల్లో జామాయిల్ సాగులో ఉంది. నాలుగు నెలల క్రితం అధికారులు సర్వేచేసి 30 ఎకరాలు అటవీభూమిగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ భూమిలోని జామాయిల్ చెట్లను నరికించారు. ఆ కలపను లారీల్లో తరలించి విక్రయించగా వచ్చిన మొత్తం సొమ్ము రూ.8లక్షలను ఉద్యోగులు స్వాహా చేశారనే అభియోగాలు వినిపిస్తున్నాయి. ఇది కొత్తేమీకాదని, ఈ తరహా ఘటనలు కొత్తూరు రిజర్వు ఫారెస్ట్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్నాయి. సంచలనం రేపిన ‘సాక్షి’ కథనం గురువారం ‘సాక్షి’లో వచ్చిన ‘అమ్మకానికి అడవి’ కథనం అటవీశాఖలో కలకలం సృష్టించింది. డీఎఫ్ఓ రాజశేఖర్ గోప్యంగా కొందరు అధికారుల్ని విచారించినట్లు తెలుస్తోంది. నూజివీడు, మైలవరం ప్రాంతాల నుంచి ఫారెస్ట్ సిబ్బంది, అధికారులు కొందర్ని పిలిపించి కొత్తూరు రిజర్వు ఫారెస్ట్‌లో క్షేత్రస్థాయి పరిశీలన చేయాల్సిందిగా ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. అక్రమాలకు ప్రధాన సూత్రధారి అయిన కిందిస్థాయి ఉద్యోగి వైఖరిపై దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు భోగట్టా. అయితే అక్రమాలు బయటపడకుండా కేరిన్(అటవీ హద్దులు) మార్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. క్వారీ గోతుల విషయంలో విచారణ కమిటీకి దొరికిపోతామనే భయం అవినీతి అధికారుల్ని వెంటాడుతోంది.