Rock painting
-
అవి అరుదైనవి... విలువైనవే
సాక్షి, హైదరాబాద్: గుండ్లపోచంపల్లి సమీపంలో మల్లన్న గుట్టమీద ఉన్న ఆదిమానవుల కాలం నాటి రాతి చిత్రాలు అరుదైనవి, అత్యంత విలువైనవిగా రాష్ట్ర వారసత్వ శాఖ (పురావస్తు శాఖ) గుర్తించింది. వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని, వెంచర్ల కోసం రియల్ వ్యాపారులు ఆ ప్రాంతాన్ని చదును చేస్తుండటంతో ఈ రాతి చిత్రాలున్న గుట్ట ప్రమాదంలో పడిందని ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాములు నాయక్ వెల్లడించారు. గుండ్లపోచంపల్లి గుట్టల్లో ఉన్న రాతి చిత్రాల తావులను రియల్ వెంచర్ల విస్తరణతో ధ్వంసమవుతున్న తీరును వివరిస్తూ ‘‘చరిత్రను చెరిపేస్తున్నారు’’శీర్షికతో మంగళవారం ‘సాక్షి’ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనికి స్పందించిన తెలంగాణ వారసత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాములు నాయక్ ఆ శాఖ అధికారులు భానుమూర్తి, సైదులు, సతీశ్లతో కలిసి మంగళవారం మధ్యాహ్నం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ నాలుగు ప్రాంతాల్లో ఆదిమానవుల చిత్రాలున్నట్టు గుర్తించామని, మూడు తావులను పరిశీలించామని, రెండు చోట్ల చిత్రాలున్నాయని రాములు నాయక్ ‘సాక్షి’తో చెప్పారు. ఆ నాలుగు రాక్ పెయింటింగ్ షెల్టర్లను కాపాడేందుకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు వివరించారు. వెంటనే పరిరక్షించాలి: కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఆ అరుదైన రాతి చిత్రాలను వెంటనే పరిరక్షించని పక్షంలో ధ్వంసమయ్యే ప్రమాదముందని కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఆ బృందం సభ్యులు వేముగంటి మురళి, భద్ర గిరీశ్, డా.మండల స్వామి, మనోజ్లతో కూడిన బృందం వాటిని పరిశీలించింది. తెలంగాణ ప్రాంతంలో ఏనుగుల మనుగడ ఉండేదనటానికి సాక్ష్యంగా అక్కడ ఏనుగు చిత్రముందని, విచిత్రమైన ఆకృతుల్లో ఉన్న జంతువుల చిత్రాలున్నాయని, 10 వేల ఏళ్ల నుంచి 4 వేల ఏళ్ల క్రితం వరకు వివిధ కాలాల్లో బొమ్మలు గీసిన జాడలున్నాయని తెలిపారు. భవిష్యత్తులో కొత్త అధ్యయనాలకు ఇవి దోహదపడే అవకాశం ఉన్నందున వాటిని పరిరక్షించాలని కోరారు. -
అడవి దున్నలు.. ఆయుధంతో మనుషులు
సాక్షి, హైదరాబాద్: ఆది మానవులు గీసిన అద్భుత రాతి చిత్రాల కాన్వాస్ మరొకటి తాజాగా వెలుగు చూసింది. అడవి దున్నలు, వాటిని అనుసరిస్తున్న మనుషుల చిత్రాలు స్పష్టంగా ఉన్న ఈ రాతి చిత్రాలను యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మధిర గ్రామం కాశీపేట చిన్నరాతిగుట్ట మీద గుర్తించారు. ఇవి సూక్ష్మరాతియుగానికి చెందినవని పరిశోధకులు భావిస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికి 75 ప్రాంతాల్లో ఆదిమా నవుల రాతి చిత్రాల ప్రదేశాలు కనబడ్డాయి. చాలా ప్రాంతాల్లో వ్యవసాయంలో ప్రధానంగా ఉపయోగపడే పశువులు చిత్రాల్లో కనిపించాయి. ఇవి మూపురాలు కలిగి ఉండటంతో ఎద్దులుగా భావిస్తున్నారు. తాజా చిత్రాల్లో మూపురం లేకుండా ఉన్న జంతువులు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద కొమ్ములతో ఉన్న ఈ జంతువులు అడవి దున్నలను పోలి ఉన్నాయి. వీటి వెనుక మానవుల చిత్రాలు గీసి ఉన్నాయి. ఈ అద్భుత చిత్రాలున్న ప్రదేశాన్ని ఔత్సాహిక పరిశోధకులు మహ్మద్ నజీర్, కొరివి గోపాల్ గుర్తించారు. వీరి సమాచారంతో కొత్త తెలంగాణ చరిత్ర బృందం ప్రతినిధులు శ్రీరామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ, బీవీ భద్రగిరీశ్, అహోబిలం కరుణాకర్, మండల స్వామి, భాస్కర్ కలిసి ఈ చిత్రాలను పరిశీలించారు. ఇలాంటి చిత్రాలు హస్తలాపూర్, అక్షరాలలొద్ది ప్రాంతాల్లో గతంలో కనిపించాయని, దున్నలకు దగ్గరగా గీసి ఉన్న మనిషి చిత్రం లాంటి వి రేగొండ రాతి చిత్రాల తావులోని ఆయుధంతో నిలిచి ఉన్న మనిషిని పోలి ఉన్నాయని పరిశోధకులు హరగోపాల్, బండి మురళీధర్రెడ్డి తెలిపారు. వీటికి సమీపంలో కైరన్ సిస్టు సమాధులు, ఓ మెన్హిర్ కూడా ఉన్నాయన్నారు. -
బొమ్మలొద్దిగుట్టపై ప్రాచీన చిత్రాలు
ఎస్ఎస్తాడ్వాయి(ములుగు): జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్ఎస్తాడ్వాయి మండలం నర్సాపూర్ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో బొమ్మలొద్దిగుట్టపై ఆదిమానవులు వేసిన చిత్రాలు బుధవారం వెలుగు చూశాయి. జిల్లా ఎకో టూరిజం కోఆర్డినేటర్ సుమన్ స్థానికుల సాయంతో గుట్టలను సందర్శించి వీటిని గుర్తించారు. బొమ్మలొద్దిగా వ్యవహరించే ఈ కొండల్లో ఆదిమానవులు ఎరువు, తెలుపు రంగుల్లో చిత్రించిన రెండు చిత్రాలు అద్భుతంగా ఉన్నాయి. ఇవి ఇదే మండలంలోని రాక్షసులగుట్టల్లో ఉన్న మెగాలితిక్ సమాధులకు చాలా దగ్గరగా ఉన్నట్లు సుమన్ వెల్లడించారు. జయశంకర్ జిల్లాలో రాక్ పెయింటింగ్ ఉన్న మూడో ప్రాంతంగా బొమ్మలొద్ది గుట్టను గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఈ గుట్టపై నీటి కొలనులు కూడా ఉన్నాయి. పురావస్తు శాఖ అధికారులు వీటిపై మరింత పరిశోధన చేసి వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు. -
పులికోనలో.. ‘ఆది’ చిత్రం
కడప జిల్లా జమ్మలమడుగు- ముద్దనూరు మార్గంలో ఉన్న పులికోనలో ఆదిమానవుల కాలం నాటి అరుదైన చిత్రం (రాక్ పెయింటింగ్)గుర్తించారు. చుట్టూ దుప్పు లు... వాటి మధ్య నర్తిస్తున్న ఓ మహిళ ఉన్న చిత్రాలు గుట్టలోని పడకరాతిపై కనువిందు కనిపించాయి. ఇది దాదాపు 5 వేల ఏళ్లక్రితం సూక్ష్మ శిలాయుగం నాటిదిగా ఈ చిత్రాలపై అధ్యయనాలు చేసిన పాండిచ్చేరి వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ చంద్రమౌళి తెలిపారు. ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపో కండక్టర్ రామకృష్ణారెడ్డి, కంట్రోలర్ కృష్ణలు ఆ ప్రాంతానికి విధినిర్వహణకు వెళ్లినప్పుడు... విరామ వేళ పులికోన గుట్టల వద్దకు వెళ్లారు. ఆ సమయంలో గుట్ట రాయి ని పరిశీలించేక్రమంలో ఈ రాక్పెయింటింగ్స్ వెలుగు చూశాయి. - సాక్షి, హైదరాబాద్