వైద్యుడి నుంచి.. శాసన సభ్యుడి వరకు.. | - | Sakshi
Sakshi News home page

వైద్యుడి నుంచి.. శాసన సభ్యుడి వరకు..

Published Thu, Dec 28 2023 12:58 AM | Last Updated on Thu, Dec 28 2023 1:13 PM

- - Sakshi

నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ రేకులపల్లి భూపతిరెడ్డి

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ఆర్థోపెడిక్‌ సర్జన్‌గా మంచి పేరు తెచ్చుకున్న నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ రేకులపల్లి భూపతిరెడ్డి వైద్య వృత్తిని కొనసాగిస్తూనే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉమ్మడి జిల్లాలో కీలకంగా పనిచేశారు. ప్రజా దవా ఖానా పేరిట 20 ఏళ్లు ప్రాక్టీస్‌ చేసిన భూపతిరెడ్డి చాలామందికి ఉచితంగా వైద్యసేవలు అందించారు. ఈ క్రమంలో ప్రజలు ఆయనను అభిమానించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో తన ఆస్పత్రి తరపున పలు పోలియో క్యాంపులు నిర్వహించారు. మరోవైపు 2004 నుంచి 2009 వరకు ‘క్లియర్‌ సొసైటీ’(చైల్డ్‌ లేబర్‌ ఎలిమినేషన్‌ అండ్‌ రీహాబిటేషన్‌) అనే సంస్థను ఉమ్మడి జిల్లాలో నిర్వహించి దీనిద్వారా 1,500 మందికి పైగా చిన్నారులను పని మాన్పించి బడికి పంపేలా చేశారు.

ఈ క్లియర్‌ సొసైటీలో పలువురు విద్యావంతులను భాగస్వామ్యం చేశారు. నిజామాబాద్‌ రూరల్‌ మండలం జలాల్‌పూర్‌కు చెందిన భూపతిరెడ్డి తల్లిదండ్రులు రాజారెడ్డి, లక్ష్మి. భూపతిరెడ్డి 1988లో గాంధీ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తిచేశారు. 1993లో ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో ఎంఎస్‌(ఆర్థో) పూర్తి చేశారు. తర్వాత ఏడాది పాటు కోయంబత్తూర్‌ మెడికల్‌ కళాశాలలో శిక్షణ తీసుకున్నారు. తదుపరి నిజామాబాద్‌లో ప్రాక్టీస్‌ ప్రారంభించారు. పలువురికి ఉచిత సేవలు అందించిన నేపథ్యంలో ప్రజలతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో 2001లో బీఆర్‌ఎస్‌లో వ్యవస్థాపక సభ్యుడిగా చేరి ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

2009 నుంచి నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. విద్యావంతులు, న్యాయవాదులు, డాక్టర్లు, మేధావులతో కలిసి జేఏసీలో క్రియాశీలకంగా పనిచేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2016లో బీఆర్‌ఎస్‌ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయ్యారు. బీఆర్‌ఎస్‌ నాయకత్వం వ్యవహారశైలితో ఇమడలేక పార్టీ నుంచి బయటకు వచ్చారు. కాంగ్రెస్‌లో చేరి 2018లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. గత ఐదేళ్లుగా నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ తరపున కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చా రు. గతేడాది నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. మంచిప్ప ముంపు బాధితులతో కలిసి పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసి విస్తృత పోరాటం చేశారు. తాజా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

లక్ష ఎకరాలకు నీరందించడమే లక్ష్యం!
నిజామాబాద్‌రూరల్‌ నియోజకవర్గంలో పాత డిజైన్‌ మేరకే(ప్రాణహిత–చేవెళ్ల) లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృతనిశ్చయంతో పనిచేస్తా. దివంగత సీఎం వైఎస్సార్‌ హయాంలో నిర్దేశించుకున్న మేరకు టీఎంసీ నీటితో మంచిప్ప, కొండెం చెరువు జలాశయాన్ని నిర్మిస్తాం. దీంతో ఆయకట్టు తగ్గదు. 82వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు కొత్తగా నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుంది. పైగా తొమ్మిది గ్రామాలకు, వేలాది ఎకరాల రైతుల భూములకు ముంపు ముప్పు తప్పుతుంది. – డాక్టర్‌ భూపతిరెడ్డి, ఎమ్మెల్యే

ఇవి చదవండి: చేవెళ్ల బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి..?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement