బోధన్‌టౌన్/నిజామాబాద్ సిటీ : బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ భార్య కారు వెంట ఉన్న అనుచరుల కారు ఢీకొని బాలుడికి తీవ్రగాయాలైన ఘటన బోధన్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. పట్టణంలోని తట్టికోట్ కాలనీకి చెందిన అజ్జ ఒడ్డెన్న, రాధ దంపతుల ఏకై క కుమారుడు దీపక్ తేజ(12) తల్లిదండ్రులతో కలిసి పట్టణ శివారులోని నర్సి రోడ్డు లో గల రాయల్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన వివాహానికి ఆదివారం హాజరయ్యాడు.
పెళ్లి తర్వాత ఇంటికి వెళ్లడానికి బాలుడు తల్లిదండ్రులతో కలిసి బయటకు వచ్చాడు. కాగా పక్కనే ఉన్న మరో ఫంక్షన్ హాల్‌లో జరిగే వివాహ వేడుకకు హాజరు అవ్వడానికి బోధన్ ఎమ్మెల్యే షకీల్ సతీమణి అయేషా ఫాతీమా వస్తున్నారు. ఆమె వెనుక ఉన్న అనుచరుల కారు దీపక్ తేజను ఢీకొంది. దీంతో స్థానికులు, ప్రజాప్రతినిధులు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం నిజామాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతున్న బాలుడిని సోమవారం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి దొడ్ల రవీందర్‌రెడ్డి పరామర్శిచారు.
ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా గుర్తు తెలియని వాహనం ఢీకొని బాలుడికి తీవ్ర గాయాలైనట్లు సీఐ ప్రేమ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. కాగా ఏడాది క్రితం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే కుమారుడు ప్రయాణిస్తున్న కారు ఢీకొని పసిపాప మృతి చెందింది. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
మా బిడ్డను బతికించండి సారూ..
పెళ్లయిన పదేళ్లకు పుట్టిన తమ బిడ్డే ప్రపంచంగా బతుకుతున్నామని.. తమ కుమారుడిని ఎలాగైన రక్షించాలని ఒడ్డెన్న, రాధ ఎమ్మెల్యే షకిల్‌ను కోరుతున్నారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా దీపక్ తేజకు మెరుగైన వైద్యం కోసం ఎమ్మెల్యే షకీల్ అనుచరులు హైదరాబాద్ తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment