మోస్ట్ వాంటెడ్‌గా నాడు తండ్రి.. నేడు కొడుకు
హైదరాబాద్: అప్పట్లో మహ్మద్ షకీల్ ఆమీర్ అలియాస్ బోధన్ షకీల్... ఇప్పుడు ఆ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సాహిల్... హైదరాబాద్ పోలీసులు వాంటెడ్‌గా మారారు. 2007 నాటి నకిలీ పాస్పోర్ట్స్ కేసులో షకీల్, తాజాగా ప్రజాభవన్ వద్ద చోటు చేసుకున్న బీఎండబ్ల్యూ కారు ప్రమాదం, తదనంతర నాటకీయ పరిణామాల కేసులో సాహిల్ నిందితులుగా ఉన్నారు. పదహారేళ్ళ క్రితం తండ్రి కోసం పరుగులు పెట్టిన సిటీ కాప్స్ ఇప్పుడు కుమారుడి కోసం వెతుకుతున్నారు. సాహిల్ దుబాయ్‌కి పారిపోవడంతో అతడిపై ఎల్ఓసీ జారీ చేశారు. పంజగుట్ట ప్రమాదం నేపథ్యంలో వెస్ట్‌జోన్ పోలీసులు గతేడాది జూబ్లీహిల్స్ పరిధిలో జరిగిన మరో యాక్సిడెంట్ ఫైల్‌ను బయటకు తీస్తున్నారు.
ముప్పతిప్పలు పెట్టిన షకీల్...
మనుషుల అక్రమ రవాణాలో భాగమైన నకిలీ పాస్పోర్ట్స్ స్కామ్ 2007లో వెలుగులోకి వచ్చింది. అమెరికా సహా కొన్ని దేశాల్లో గుజరాతీయులకు ఎంట్రీ ఉండేది కాదు. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన వాళ్ళను అక్రమంగా దేశం దాటించడానికి దేశ వ్యాప్తంగా ముఠాలు ఏర్పడ్డాయి. వీరు కొందరు ప్రజాప్రతినిధులతో ఒప్పందాలు చేసుకుని గుజరాతీయులను వాళ్ళ కుటుంబీకులుగా మార్చారు. ఆయా ప్రతినిధుల సిఫారసుల ఆధారంగా మారు పేర్లతో గుజరాతీయులకు పాస్‌పోర్టులు అందించారు. సుదీర్ఘకాలం జరిగిన ఈ స్కామ్‌లో ఢిల్లీలో ఎంపీ బాబూభాయ్ కటారా అరెస్టుతో వెలుగులోకి వచ్చింది. నగరంలో నమోదైన కేసులో బోధన్ షకీల్ నిందితుడిగా మారాడు. అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో షకీల్ కోసం హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు ముమ్మరంగా గాలించి పట్టుకున్నారు.
కారు కేసులో కుమారుడి కోసం...
నకిలీ పాస్పోర్ట్స్ స్కామ్ జరిగిన దాదాపు పదహారేళ్ల తర్వాత ‘బీఎండబ్ల్యూ కారు’ కేసు చోటు చేసుకుంది. పంజగుట్ట ఠాణా పరిధిలోని ప్రజాభవన్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ప్రమాదం జరగడం, నిర్లక్ష్యంగా వాహనం నడిపి, ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం వంటి అంశాలతో ముడిపడి ఉన్న ఈ కేసు నుంచి సాహిల్‌ను తప్పించడానికి పోలీసులు ప్రయతి్నంచడంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పంజగుట్ట ఇన్స్పెక్టర్ బి.దుర్గారావును సస్పెండ్ చేశారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి పరారీలో ఉన్న సాహిల్ కోసం పంజగుట్టతో పాటు వెస్ట్‌జోన్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తు అతడిపై ఎల్ఓసీ జారీ చేశారు. షకీల్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాడని, అక్కడ నుంచే కుమారుడని తప్పించే కథ మొత్తం నడిపి, అతడినీ అక్కడికే రప్పించుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి.
నాటి కేసులోనూ గోల్మాల్ జరిగిందా?
తాజాగా పంజగుట్ట పరిధిలో జరిగిన ఈ ప్రమాదం కేసు గతేడాది నాటి జూబ్లీహిల్స్ యాక్సిడెంట్‌ను మరోసారి తెరపైకి తెచ్చింది. 2022 మార్చి 17 రాత్రి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వైపు నుంచి జూబ్లీహిల్స్ దూసుకువచ్చిన మహేంద్ర థార్ కారు రోడ్డుపై బుడగలు విక్రయించే వారిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన కాజల్ చౌహాన్, సారికా చౌహాన్, సుష్మ భోస్లే గాయపడగా.. కాజల్ కుమారుడు అశ్వతోష్ (రెండు నెలలు) మృతి చెందాడు.
ఈ థార్ కారుపై ఎమ్మెల్యే షకీల్ స్టిక్కర్ ఉండటంతో అప్పట్లో సాహిల్‌పై ఆరోపణలు వచ్చాయి. మరుసటి రోజు స్పందించిన షకీల్ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. జూబ్లీహిల్స్‌లో ప్రమాదానికి కారణమైన కారు తన సోదరుడిదని (కజిన్), తానూ అప్పుడప్పుడు వాడుతుంటానని పేర్కొన్నారు. సోదరుడి కుటుంబం కారులో ప్రయాణిస్తుండగా జూబ్లీహిల్స్ రోడ్ నం.45 వద్ద సిగ్నల్ సమీపంలో బెలూన్లు అమ్ముకునే యువతికి కారు వల్ల గాయమైందని, ఆ భయంలో ఆమే పసిపాపను పడేయడంతో దుర్ఘటన జరిగిందని చెప్పుకొచ్చారు.
ఆ ఉదంతం చాలా బాధాకరమంటూ జరిగిన విషయాన్ని తాను తన కజిన్‌తో మాట్లాడి తెలుసుకున్నానని షకీల్ పేర్కొన్నారు. పసిపాపను కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పానని అన్నారు. ఈ కేసులో పోలీసులు సైతం సాహిల్‌కు క్లీన్చిట్ ఇచ్చేశారు. తాజాగా పంజగుట్ట కేసులో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఉన్నతాధికారులు నాటి జూబ్లీహిల్స్ కేసును తిరగదోడుతున్నారు. అప్పట్లో జరిగిన ప్రమాదంలోనూ సాహిల్ పాత్ర ఉందా? ఏదైనా గోల్మాల్ జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తామని పశి్చమ మండల డీసీపీ ఎస్ఎం విజయ్‌కుమార్ మీడియాకు వెల్లడించారు.