Orthopaedic Surgeon
-
వైద్యుడి నుంచి.. శాసన సభ్యుడి వరకు..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆర్థోపెడిక్ సర్జన్‌గా మంచి పేరు తెచ్చుకున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి వైద్య వృత్తిని కొనసాగిస్తూనే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉమ్మడి జిల్లాలో కీలకంగా పనిచేశారు. ప్రజా దవా ఖానా పేరిట 20 ఏళ్లు ప్రాక్టీస్ చేసిన భూపతిరెడ్డి చాలామందికి ఉచితంగా వైద్యసేవలు అందించారు. ఈ క్రమంలో ప్రజలు ఆయనను అభిమానించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో తన ఆస్పత్రి తరపున పలు పోలియో క్యాంపులు నిర్వహించారు. మరోవైపు 2004 నుంచి 2009 వరకు ‘క్లియర్ సొసైటీ’(చైల్డ్ లేబర్ ఎలిమినేషన్ అండ్ రీహాబిటేషన్) అనే సంస్థను ఉమ్మడి జిల్లాలో నిర్వహించి దీనిద్వారా 1,500 మందికి పైగా చిన్నారులను పని మాన్పించి బడికి పంపేలా చేశారు. ఈ క్లియర్ సొసైటీలో పలువురు విద్యావంతులను భాగస్వామ్యం చేశారు. నిజామాబాద్ రూరల్ మండలం జలాల్‌పూర్‌కు చెందిన భూపతిరెడ్డి తల్లిదండ్రులు రాజారెడ్డి, లక్ష్మి. భూపతిరెడ్డి 1988లో గాంధీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తిచేశారు. 1993లో ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంఎస్(ఆర్థో) పూర్తి చేశారు. తర్వాత ఏడాది పాటు కోయంబత్తూర్ మెడికల్ కళాశాలలో శిక్షణ తీసుకున్నారు. తదుపరి నిజామాబాద్‌లో ప్రాక్టీస్ ప్రారంభించారు. పలువురికి ఉచిత సేవలు అందించిన నేపథ్యంలో ప్రజలతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో 2001లో బీఆర్ఎస్లో వ్యవస్థాపక సభ్యుడిగా చేరి ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2009 నుంచి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరించారు. విద్యావంతులు, న్యాయవాదులు, డాక్టర్లు, మేధావులతో కలిసి జేఏసీలో క్రియాశీలకంగా పనిచేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2016లో బీఆర్ఎస్ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయ్యారు. బీఆర్ఎస్ నాయకత్వం వ్యవహారశైలితో ఇమడలేక పార్టీ నుంచి బయటకు వచ్చారు. కాంగ్రెస్‌లో చేరి 2018లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. గత ఐదేళ్లుగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చా రు. గతేడాది నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. మంచిప్ప ముంపు బాధితులతో కలిసి పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసి విస్తృత పోరాటం చేశారు. తాజా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. లక్ష ఎకరాలకు నీరందించడమే లక్ష్యం! నిజామాబాద్‌రూరల్ నియోజకవర్గంలో పాత డిజైన్ మేరకే(ప్రాణహిత–చేవెళ్ల) లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృతనిశ్చయంతో పనిచేస్తా. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో నిర్దేశించుకున్న మేరకు టీఎంసీ నీటితో మంచిప్ప, కొండెం చెరువు జలాశయాన్ని నిర్మిస్తాం. దీంతో ఆయకట్టు తగ్గదు. 82వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు కొత్తగా నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుంది. పైగా తొమ్మిది గ్రామాలకు, వేలాది ఎకరాల రైతుల భూములకు ముంపు ముప్పు తప్పుతుంది. – డాక్టర్ భూపతిరెడ్డి, ఎమ్మెల్యే ఇవి చదవండి: చేవెళ్ల బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి..? -
ఇజ్రాయెల్‌లో అద్భుతం.. తెగిన తలను అతికించారు..
ఇజ్రాయెల్: తెగిపోయిన బాలుడి తలను తిరిగి అతికించి అద్భుతం సృష్టించారు ఇజ్రాయెల్ డాక్టర్లు. సైకిల్ తొక్కుతుండగా కారు ఢీకొట్టడంతో 12 ఏళ్ల బాలుడి తల మెడ నుండి దాదాపుగా తెగిపోయింది. సుదీర్ఘంగా సాగిన సర్జరీ విజయవంతమైనా డాక్టర్లు ఆ బాలుడు డిస్చార్జి అయ్యేంత వరకు విషయం బయటకు చెప్పలేదు. 12 ఏళ్ల సులేమాన్ హాసన్ సైకిల్ తొక్కుతుండగా ఓ కారు వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో బాలుడి తలభాగం మెడ నుండి వేరయింది. వెన్ను భాగానికి పుర్రె వేలాడుతూ ఉంది. వెంటనే బాలుడిని హదస్స త్ మెడికల్ సెంటరుకు తరలించగా అక్కడి డాక్టర్లు ఎమర్జెన్సీ కేర్ లో ఉంచి ట్రీట్మెంట్ ప్రారంభించారు. హదస్స త్ మెడికల్ సెంటరులోని ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ ఒహాడ్ ఎయినావ్ తెలిపిన వివరాల ప్రకారం బాలుడు అడ్మిట్ అయ్యే సమయానికి అతడి తల మొండెం దాదాపుగా వేరయ్యాయి.. బ్రతికే అవకాశం కూడా 50% మాత్రమే. దీన్ని బైలేటరల్ అట్లాంటో ఆక్సిపిటల్ జాయింట్ డిస్ లోకేషన్ గా పిలుస్తుంటాం. బ్రతుకుతాడో లేదో తెలియని పరిస్థితుల్లోనే మేము సర్జరీ ప్రారంభించాము. బాలుడుని బ్రతికించడానికి మా బృందం ఆపరేషన్ థియేటర్లో చాలా గంటలపాటు శ్రమించాము. చివరికి తలను యధాతధంగా అతికించగలిగామని తెలిపారు. బాలుడు ఎప్పటిలాగే తన పనులు తాను చేసుకుంటున్నాడు. అంతటి మేజర్ సర్జరీ అయినా కూడా ఎవ్వరి సాయం లేకుండా నడవగలుగుతున్నాడు. అతడి శరీరంలోని అవయవాలు, ఇంద్రియాలూ, శరీర భాగాలన్నీ బాగానే పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ సంఘటన గత నెలలో జరగగా బాలుడు పూర్తిగా కోలుకున్నాక గాని ఈ విషయాన్ని బయటకు చెప్పకూడదని ఉద్దేశ్యంతోనే గుప్తంగా ఉంచామన్నారు ఆసుపత్రి సిబ్బంది. బాలుడిని డిశ్చార్జి చేసే రోజున డాక్టర్లు ఆ బాలుడితో ఫోటో తీసుకుని విషయాన్ని వివరించారు. ఇది కూడా చదవండి: Pakistan Crisis : ఆర్ధిక సంక్షోభంతో ఆస్తులను అమ్ముకుంటున్న పాకిస్తాన్.. -
కుటుంబంలో స్పర్ధలతోనే అలీఖాన్ ఆత్మహత్య?
హైదరాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వియ్యంకుడు మజారుద్దీన్ అలీఖాన్(60) ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సోమవారం మధ్యాహ్నం బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఎమ్మెల్యే కాలనీలో తన నివాసంలో రివాల్వర్‌తో కాల్చుకొని ఆయన మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆత్మహత్యకు గల కారణాలపై కుటుంబ సభ్యులతో పాటు ఆ ఇంట్లో పని చేస్తున్న సిబ్బందిని విచారిస్తున్నారు. మజారుద్దీన్కు రెండు లైసెన్స్డ్ తుపాకులు ఉండగా వీటిని గత డిసెంబర్లో బంజారాహిల్స్‌లోని గన్ అఫైర్స్‌లో డిపాజిట్ చేశారు. అయితే ఇందులో ఒక పిస్టల్‌ను తిరిగి వారం క్రితమే రిలీజ్ చేసుకొని ఇంటికి తెచ్చుకున్నట్లుగా తెలుస్తోంది. భార్యతో ఇంటి వివాదం..: ప్రస్తుతం ఉన్న ఇల్లు ఆయన భార్య అఫియా రషీద్ అలీఖాన్ పేరు మీద ఉండగా ఈ ఇంట్లో తాను మాత్రమే ఉంటానని భర్తతో పాటు కొడుకు, కోడలును బయటికి పంపించాలంటూ ఆమె సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. నెలన్నర క్రితం తీర్పు కాపీతో బంజారాహిల్స్ పోలీసుల బందోబస్తు మధ్య ఆమె ఇంట్లోకి వెళ్ళారు. కానీ ఇంట్లో ఉన్న వాళ్లెవరూ బయటకు వెళ్లలేదు. ఇక ఇంట్లోకి వెళ్ళిన ఒకటి, రెండు రోజులకే గొడవలు తీవ్రమై ఆమె కత్తితో చెయ్యి కూడా కోసుకున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ ఇంటి వివాదంతో పాటు భార్యా భర్తల మధ్య తరచూ మనస్ఫర్థలు వచ్చేవని, కుమారుడు పూర్తిగా తండ్రికి మద్దతుగా ఉండే వాడని చెబుతున్నారు. ఒక రౌండ్ కాల్పులు... మజారుద్దీన్ తన పిస్టల్‌తో ఒక రౌండ్ కాల్పులు జరుపుకున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. బుల్లెట్ కుడివైపు కణతి నుంచి ఎడమ వైపు మీదుగా బయటపడి ఆ గదిలోనే క్లూస్ టీమ్‌కు లభించింది. పోలీసుల దర్యాప్తునకు కుటుంబ సభ్యులు అంతగా సహకరించడం లేదని తెలుస్తోంది. మృతుడి సోదరుడు జహీరుద్దీన్ అలీఖాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. -
ఫుల్లుగా తాగిన డాక్టర్ ఏం చేశాడంటే..!
బెంగళూరు: అతడు ఓ డాక్టర్. వైద్యం చేసి మనుషుల ప్రాణాలు నిలబెట్టేవాడు. కానీ, పీకలదాక తాగేసి రోడ్డుపై అడ్డుగోలుగా వాహనం నడిపి ఓ స్కూటరిస్టులను మరో నలుగురిని ఢీకొట్టాడు. దీంతో ఆ స్కూటరిస్టు చనిపోగా.. మరో నలుగురు గాయాలపాలయ్యారు. ఈఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరులోని బనాశంకరీ థర్డ్ ఫేజ్ లోగల ఐటీఐ కాలనీకి చెందిన డాక్టర్ ఎన్ఎస్ శంకర్ అనే వ్యక్తి జయానగర్ థర్డ్ బ్లాక్ లో ఆర్థోపెడిక్ క్లినిక్ నడుపుతున్నాడు. అతడు ఆదివారం సాయంత్రం ఫుల్లుగా మద్యం సేవించి కారును వేగంగా నడిపాడు. అది కాస్త అదుపుతప్పి స్కూటరిస్టును ఢీకొనడమే కాకుండా ఓ రేకుల ఇంట్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో సరిత అనే తన ఇంట్లో పనిచేసే మహిళ, ఆమె రెండేళ్ల కూతురు ఉన్నారు. వారికి ఎలాంటి గాయాలు కాలేదు. వైద్యుడు మాత్రం గాయపడ్డాడు. ఘటన స్థలికి వచ్చిన పోలీసులు అతడిని అరెస్టు చేసి అనంతరం ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించి స్టేషన్‌కు తీసుకెళ్లారు. -
మోకాలు వొంగిపోయింది... సరిచేసే అవకాశముందా?
రెండేళ్ల క్రితం నా మోకాలి కింది ఎముక విరిగింది. నేను మా ఊళ్లో కట్టు కట్టించుకున్నాను. ఇప్పుడు నా మోకాలు ఒంగిపోయి ఉంది. అలాగే రెండో కాలితో పోలిస్తే రెండు అంగుళాలు పొట్టిగా కూడ ఉంది. నా మోకాలు సరిగా అయ్యే అవకాశం ఉందా? - సుధీర్, హైదరాబాద్ మీరు చెప్పిన వివరాలను బట్టి మీకు మోకాలి వద్ద డిఫార్మిటీ ఉన్నట్లుగా తెలుస్తోంది. దాంతో పాటు మీకు జరిగిన ప్రమాదం వల్ల జరిగిన నాటు తరహా చికిత్స తర్వాత ఆ కాలు పొట్టిగా ఉందని అర్థమవుతోంది. ఇలాంటి కండిషన్ ఉన్నవారికి ‘స్టాండింగ్ లాంగ్ లెగ్’ అనే ప్రత్యేకమైన ‘ఎక్స్-రే’ తీసి పరీక్షిస్తాం. ఆ కాలి వెయిట్ బేరింగ్ యాక్సిస్ ఎలా ఉంది, మీ కాలు దాని సహజ ఆకృతితో పోలిస్తే ఏ మేరకు ఒంగిపోయి ఉంది (అంటే ఎంత అలైన్మెంట్ తప్పింది) అనే అంశాలను నిర్ణయిస్తాం. కాలు ఒంగినట్లు చెప్పారు కదా... ఆ ఒంపు ఎన్ని డిగ్రీలు ఒంగిపోయింది, దాన్ని ఎలా సరిచేయాలని, ఇలా సరిచేసే ప్రక్రియలో దాన్ని ఎంతవరకు కట్ చేయాలి, మొత్తం సరికావడానికి ఎంత సమయం పడుతుంది అనే అంశాలన్నింటినీ తెలుసుకొని, వాటిని పేషెంట్‌కు వివరిస్తాం. ఇలా ఒంగి ఉన్న కాలిని సరిచేయడానికి వివిధ రకాల ఆపరేషన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి... 1. ఇలిజరోవ్ పద్ధతి : ఈ ప్రక్రియలో ఎముకను పూర్వపు అలైన్‌మెంట్‌కు తీసుకువచ్చాక, కాలిని మునుపటి పొడవునకు తీసుకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. 2. ఆస్టియాటమీ అండ్ ఫిక్సేషన్ : ఈ ప్రక్రియలో ఎముక ఒంపును సరిచేయడానికి వీలుంటుంది. కానీ తగ్గిన పొడవును పెంచడానికి వీలుకాదు. 3. టీఎస్ఎఫ్ : ఇది అత్యాధునికమైన పద్ధతి ఈ ప్రక్రియ ద్వారా ఎముకను సరిచేయడంతో పాటు, తగ్గిన మేరకు పొడవు పెంచడం కూడా సాధ్యమవుతుంది. ఈ రెండు ప్రక్రియలనూ ఒకేసారి చేయడానికి వీలవుతుంది. ఈ ప్రక్రియ తర్వాత చాలా త్వరగా నడవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకసారి మీకు దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలవండి. -
ఐస్‌ప్యాక్ ఎలాంటప్పుడు పెట్టాలి
డాక్టర్ సలహా గాయం తగిలిన చోట ఐస్‌తో అద్దడం వల్ల ఉపశమనం కలుగుతుంది. ఇలా ఐస్‌తో బాధ నుంచి ఉపశమనం పొందడం అన్నది తాజాగాయాల విషయంలోనే జరుగుతుంది. వాటి విషయంలోనే ఐస్ ఎక్కువగా ప్రభావం చూపుతుంది. దెబ్బతగిలినప్పుడు ఆ ప్రాంతం ఎరుపెక్కుతుంది. వాపు వచ్చి ఆ ప్రదేశం కాస్త వేడిగా మారుతుంది. అప్పుడు అక్కడ ఐస్ పెట్టడం వల్ల స్థానికంగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. తర్వాత ఆ ప్రాంతంలోని రక్తనాళాలు సంకోచిస్తాయి. కొద్ది నిమిషాల తర్వాత అవే రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. ఇలా రక్తనాళాల సంకోచ-వ్యాకోచాలను ‘లూయీస్-హంటింగ్ చర్య’ అంటారు. దీనివల్ల చిన్న రక్తనాళాలు వ్యాకోచించగానే దెబ్బతగిలినప్పుడు ఏర్పడ్డ మలిన పదార్థాలన్నీ రక్తంలో ఒక్కసారిగా కలిసి పలచబారిపోతాయి. దాంతో వాపు తగ్గుతుంది. ఆ ప్రాంతంలో వాపు, దెబ్బ త్వరగా తగ్గడానికి రక్తనాళాలు వ్యాకోచించి, రక్తప్రసరణ ఎక్కువగా జరగడం తోడ్పడుతుంది. ఐస్ పెట్టడం వల్ల కోల్డ్ రిసెప్టార్స్ ఉత్తేజం చెంది ఎండార్ఫిన్స్, ఎన్‌కెఫలిన్స్ అనే ఉత్ప్రేరకాలు విడుదల అవుతాయి. దాంతో నొప్పి తగ్గుతుంది. ఐస్ పెట్టగానే నరాల నుంచి వెళ్లే సంకేతాల వేగం (నర్వ్ కండక్షన్ వెలాసిటీ) తగ్గుతుంది. కండరాల బిగుతు కూడా తగ్గుతుంది. ఐస్ ప్యాక్ అన్నది కనీసం 10-15 నిమిషాలు పెట్టాలి. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే... ఐస్ క్యూబ్‌ని నేరుగా ఒంటిమీద పెట్టకూడదు. క్యూబ్స్‌ని టవల్‌లోగాని, కవర్లోగాని పెట్టి గాయం మీద పెట్టాలి. అలాగే జెల్‌ప్యాక్స్ కూడా అందుబాటులో ఉంటున్నాయి. వాటితో కూడా ఐస్‌ప్యాక్ పెట్టుకోవచ్చు. ఐస్‌ప్యాక్ ఈ సందర్భాల్లో..! ఆర్థరైటిస్ ఉన్నప్పుడు వాపు, మంట వచ్చిన చోట (టెండర్‌పాయింట్స్‌లో),/ అప్పుడే అయిన గాయాల (ఫ్రెష్ ఇంజరీస్)కు ఐస్‌ప్యాక్ పెట్టాలి. - డాక్టర్ శివభారత్ రెడ్డి, ఆర్ధోపెడిక్ సర్జన్, ఈషా హాస్పిటల్స్, హైదరాబాద్