ఐస్‌ప్యాక్ ఎలాంటప్పుడు పెట్టాలి | What do the ice pack | Sakshi
Sakshi News home page

ఐస్‌ప్యాక్ ఎలాంటప్పుడు పెట్టాలి

Published Mon, Feb 3 2014 11:40 PM | Last Updated on Wed, Apr 3 2019 4:38 PM

ఐస్‌ప్యాక్ ఎలాంటప్పుడు పెట్టాలి - Sakshi

ఐస్‌ప్యాక్ ఎలాంటప్పుడు పెట్టాలి

డాక్టర్ సలహా
 
గాయం తగిలిన చోట ఐస్‌తో అద్దడం వల్ల ఉపశమనం కలుగుతుంది. ఇలా ఐస్‌తో బాధ నుంచి ఉపశమనం పొందడం అన్నది తాజాగాయాల విషయంలోనే జరుగుతుంది. వాటి విషయంలోనే ఐస్ ఎక్కువగా ప్రభావం చూపుతుంది. దెబ్బతగిలినప్పుడు ఆ ప్రాంతం ఎరుపెక్కుతుంది. వాపు వచ్చి ఆ ప్రదేశం కాస్త వేడిగా మారుతుంది. అప్పుడు అక్కడ ఐస్ పెట్టడం వల్ల స్థానికంగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.

తర్వాత ఆ ప్రాంతంలోని రక్తనాళాలు సంకోచిస్తాయి. కొద్ది నిమిషాల తర్వాత అవే రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. ఇలా రక్తనాళాల సంకోచ-వ్యాకోచాలను ‘లూయీస్-హంటింగ్ చర్య’ అంటారు. దీనివల్ల చిన్న రక్తనాళాలు వ్యాకోచించగానే దెబ్బతగిలినప్పుడు ఏర్పడ్డ మలిన పదార్థాలన్నీ రక్తంలో ఒక్కసారిగా కలిసి పలచబారిపోతాయి. దాంతో వాపు తగ్గుతుంది.

ఆ ప్రాంతంలో వాపు, దెబ్బ త్వరగా తగ్గడానికి రక్తనాళాలు వ్యాకోచించి, రక్తప్రసరణ ఎక్కువగా జరగడం తోడ్పడుతుంది. ఐస్ పెట్టడం వల్ల కోల్డ్ రిసెప్టార్స్ ఉత్తేజం చెంది ఎండార్ఫిన్స్, ఎన్‌కెఫలిన్స్ అనే ఉత్ప్రేరకాలు విడుదల అవుతాయి. దాంతో నొప్పి తగ్గుతుంది. ఐస్ పెట్టగానే నరాల నుంచి వెళ్లే సంకేతాల వేగం (నర్వ్ కండక్షన్ వెలాసిటీ) తగ్గుతుంది. కండరాల బిగుతు కూడా తగ్గుతుంది. ఐస్ ప్యాక్ అన్నది కనీసం 10-15 నిమిషాలు పెట్టాలి.
 
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే... ఐస్ క్యూబ్‌ని నేరుగా ఒంటిమీద పెట్టకూడదు. క్యూబ్స్‌ని టవల్‌లోగాని, కవర్‌లోగాని పెట్టి గాయం మీద పెట్టాలి. అలాగే జెల్‌ప్యాక్స్ కూడా అందుబాటులో ఉంటున్నాయి. వాటితో కూడా ఐస్‌ప్యాక్ పెట్టుకోవచ్చు.
 
ఐస్‌ప్యాక్ ఈ సందర్భాల్లో..! ఆర్థరైటిస్ ఉన్నప్పుడు వాపు, మంట వచ్చిన చోట (టెండర్‌పాయింట్స్‌లో),/ అప్పుడే అయిన గాయాల (ఫ్రెష్ ఇంజరీస్)కు ఐస్‌ప్యాక్ పెట్టాలి.

 - డాక్టర్ శివభారత్ రెడ్డి, ఆర్ధోపెడిక్ సర్జన్, ఈషా హాస్పిటల్స్, హైదరాబాద్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement