Ice pack
-
ఫిజియోథెరపీ కౌన్సెలింగ్
నాకు నిద్రలో మెడ పట్టుకుంది. తగ్గాలంటే ఏం చేయాలి? - హరీశ్, తుని నిద్రలో మెడపట్టుకోవడం చాలా సాధారణంగా కనిపించే సమస్య. దీనితో వచ్చే మెడనొప్పిని తగ్గించుకోవడం కోసం హీట్‌ప్యాక్ (వేడికాపడం) తర్వాత కోల్డ్ప్యాక్ (ఐస్‌ముక్కలు టవల్లో చుట్ట్టి కాపడంలా పెట్టడం) కొంతకొంత వ్యవధిలో చేస్తుండాలి. (ఒకవేళ ఇలా మెడలు పట్టేసిన చోటగానీ లేదా మరేచోటనైనా నొప్పితోపాటు ఆ ప్రదేశం ఎర్రబారడం, వాపు కనిపిస్తే వేడికాపడం కంటే కోల్డ్ ప్యాక్ చాలా ప్రభావపూర్వకంగా పనిచేస్తుంది). ఇలా హీట్‌ప్యాక్, ఐస్‌ప్యాక్‌ల మధ్యమధ్యన నొప్పి రానంతమేరకు మెడను నెమ్మదిగా పక్కలకు, వెనక్కు వంచాలి. కానీ ముందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ వంచవద్దు. కూర్చున్నా, నిల్చున్నా, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మెడను నిటారుగా ఉంచాలి. ఇలా మెడనొప్పిగా ఉన్నప్పుడు మెడను గుండ్రంగా తిప్పవద్దు. నాకు తీవ్రమైన నడుము నొప్పి వస్తోంది. ఈ నొప్పి తగ్గడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. - సుభానీ, గుంటూరు మీ నడుము కండరాలు బలంగా ఉన్నప్పటికీ ఇలా నడుము నొప్పి వచ్చినప్పుడు సాధ్యమైనంత విశ్రాంతి తీసుకోండి. చాలావరకు విశ్రాంతితోనే నడుము నొప్పి ఉపశమిస్తుంది. అలాగే నిద్రపోతున్నప్పుడు ఈ నొప్పి నడుం పట్టుకుని ఈ నొప్పి వచ్చి ఉంటే వెల్లకిలా కాకుండా ఓరగా ఓ పక్కకు పడుకోండి. ఈ సమయంలో మీ రెండు కాళ్ల మధ్య ఒక చిన్న తలగడ ఉంచుకోండి. దీనివల్ల మీ నడుం వద్ద ఉన్న కండరాలపై అదనపు భారం పడకుండా ఈ తలగడ ఒక సపోర్ట్‌లా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఐస్‌ప్యాక్ పెట్టడం వల్ల నొప్పి, వాపు తగ్గుతాయి. ఐస్‌ప్యాక్ లేకపోతే ఒక టవల్‌ను ప్లాస్టిక్‌బ్యాగ్‌లో ఉంచి, దాన్ని మీ ఫ్రిజ్‌లోని డీప్ ఫ్రీజర్‌లో 15-30 నిమిషాలు ఉంచి, ఆ తర్వాత తీసి, నొప్పి ఉన్న చోట అద్దండి. ఈ ఐస్ప్యాక్తో నొప్పి తగ్గుతుంది. -
ఐస్‌ప్యాక్ ఎలాంటప్పుడు పెట్టాలి
డాక్టర్ సలహా గాయం తగిలిన చోట ఐస్‌తో అద్దడం వల్ల ఉపశమనం కలుగుతుంది. ఇలా ఐస్‌తో బాధ నుంచి ఉపశమనం పొందడం అన్నది తాజాగాయాల విషయంలోనే జరుగుతుంది. వాటి విషయంలోనే ఐస్ ఎక్కువగా ప్రభావం చూపుతుంది. దెబ్బతగిలినప్పుడు ఆ ప్రాంతం ఎరుపెక్కుతుంది. వాపు వచ్చి ఆ ప్రదేశం కాస్త వేడిగా మారుతుంది. అప్పుడు అక్కడ ఐస్ పెట్టడం వల్ల స్థానికంగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. తర్వాత ఆ ప్రాంతంలోని రక్తనాళాలు సంకోచిస్తాయి. కొద్ది నిమిషాల తర్వాత అవే రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. ఇలా రక్తనాళాల సంకోచ-వ్యాకోచాలను ‘లూయీస్-హంటింగ్ చర్య’ అంటారు. దీనివల్ల చిన్న రక్తనాళాలు వ్యాకోచించగానే దెబ్బతగిలినప్పుడు ఏర్పడ్డ మలిన పదార్థాలన్నీ రక్తంలో ఒక్కసారిగా కలిసి పలచబారిపోతాయి. దాంతో వాపు తగ్గుతుంది. ఆ ప్రాంతంలో వాపు, దెబ్బ త్వరగా తగ్గడానికి రక్తనాళాలు వ్యాకోచించి, రక్తప్రసరణ ఎక్కువగా జరగడం తోడ్పడుతుంది. ఐస్ పెట్టడం వల్ల కోల్డ్ రిసెప్టార్స్ ఉత్తేజం చెంది ఎండార్ఫిన్స్, ఎన్‌కెఫలిన్స్ అనే ఉత్ప్రేరకాలు విడుదల అవుతాయి. దాంతో నొప్పి తగ్గుతుంది. ఐస్ పెట్టగానే నరాల నుంచి వెళ్లే సంకేతాల వేగం (నర్వ్ కండక్షన్ వెలాసిటీ) తగ్గుతుంది. కండరాల బిగుతు కూడా తగ్గుతుంది. ఐస్ ప్యాక్ అన్నది కనీసం 10-15 నిమిషాలు పెట్టాలి. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే... ఐస్ క్యూబ్‌ని నేరుగా ఒంటిమీద పెట్టకూడదు. క్యూబ్స్‌ని టవల్‌లోగాని, కవర్లోగాని పెట్టి గాయం మీద పెట్టాలి. అలాగే జెల్‌ప్యాక్స్ కూడా అందుబాటులో ఉంటున్నాయి. వాటితో కూడా ఐస్‌ప్యాక్ పెట్టుకోవచ్చు. ఐస్‌ప్యాక్ ఈ సందర్భాల్లో..! ఆర్థరైటిస్ ఉన్నప్పుడు వాపు, మంట వచ్చిన చోట (టెండర్‌పాయింట్స్‌లో),/ అప్పుడే అయిన గాయాల (ఫ్రెష్ ఇంజరీస్)కు ఐస్‌ప్యాక్ పెట్టాలి. - డాక్టర్ శివభారత్ రెడ్డి, ఆర్ధోపెడిక్ సర్జన్, ఈషా హాస్పిటల్స్, హైదరాబాద్