నాకు నిద్రలో మెడ పట్టుకుంది. తగ్గాలంటే ఏం చేయాలి?
- హరీశ్, తుని
నిద్రలో మెడపట్టుకోవడం చాలా సాధారణంగా కనిపించే సమస్య. దీనితో వచ్చే మెడనొప్పిని తగ్గించుకోవడం కోసం హీట్‌ప్యాక్ (వేడికాపడం) తర్వాత కోల్డ్‌ప్యాక్ (ఐస్‌ముక్కలు టవల్‌లో చుట్ట్టి కాపడంలా పెట్టడం) కొంతకొంత వ్యవధిలో చేస్తుండాలి. (ఒకవేళ ఇలా మెడలు పట్టేసిన చోటగానీ లేదా మరేచోటనైనా నొప్పితోపాటు ఆ ప్రదేశం ఎర్రబారడం, వాపు కనిపిస్తే వేడికాపడం కంటే కోల్డ్ ప్యాక్ చాలా ప్రభావపూర్వకంగా పనిచేస్తుంది).
ఇలా హీట్‌ప్యాక్, ఐస్‌ప్యాక్‌ల మధ్యమధ్యన నొప్పి రానంతమేరకు మెడను నెమ్మదిగా పక్కలకు, వెనక్కు వంచాలి. కానీ ముందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ వంచవద్దు. కూర్చున్నా, నిల్చున్నా, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మెడను నిటారుగా ఉంచాలి. ఇలా మెడనొప్పిగా ఉన్నప్పుడు మెడను గుండ్రంగా తిప్పవద్దు.
నాకు తీవ్రమైన నడుము నొప్పి వస్తోంది. ఈ నొప్పి తగ్గడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి.
- సుభానీ, గుంటూరు
మీ నడుము కండరాలు బలంగా ఉన్నప్పటికీ ఇలా నడుము నొప్పి వచ్చినప్పుడు సాధ్యమైనంత విశ్రాంతి తీసుకోండి. చాలావరకు విశ్రాంతితోనే నడుము నొప్పి ఉపశమిస్తుంది. అలాగే నిద్రపోతున్నప్పుడు ఈ నొప్పి నడుం పట్టుకుని ఈ నొప్పి వచ్చి ఉంటే వెల్లకిలా కాకుండా ఓరగా ఓ పక్కకు పడుకోండి. ఈ సమయంలో మీ రెండు కాళ్ల మధ్య ఒక చిన్న తలగడ ఉంచుకోండి. దీనివల్ల మీ నడుం వద్ద ఉన్న కండరాలపై అదనపు భారం పడకుండా ఈ తలగడ ఒక సపోర్ట్‌లా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఐస్‌ప్యాక్ పెట్టడం వల్ల నొప్పి, వాపు తగ్గుతాయి. ఐస్‌ప్యాక్ లేకపోతే ఒక టవల్‌ను ప్లాస్టిక్‌బ్యాగ్‌లో ఉంచి, దాన్ని మీ ఫ్రిజ్‌లోని డీప్ ఫ్రీజర్‌లో 15-30 నిమిషాలు ఉంచి, ఆ తర్వాత తీసి, నొప్పి ఉన్న చోట అద్దండి. ఈ ఐస్‌ప్యాక్‌తో నొప్పి తగ్గుతుంది.
ఫిజియోథెరపీ కౌన్సెలింగ్
Published Wed, May 6 2015 12:23 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM
Advertisement