నిద్రలేమితో నా'ఢీలా'! | Insomnia: Health Effects Factors And Diagnosis | Sakshi
Sakshi News home page

నిద్రలేమితో జర భద్రం! లేదంటే బాసూ... మెమరీ లాసూ..!

Published Sun, Feb 9 2025 12:10 PM | Last Updated on Sun, Feb 9 2025 2:20 PM

Insomnia: Health Effects Factors And Diagnosis

నిద్రకూ, మెదడూ అలాగే నాడీ వ్యవస్థకు ఉన్న సంబంధం చాలా సంక్లిష్టం. అయినప్పటికీ చాలా చిన్న చిన్న ఉదాహరణలతోనే ఆ సంక్లిష్ట సంబంధాన్ని నిరూపించవచ్చు. ఉదాహరణకు క్రితం రాత్రి  నిద్రలేకపోతే... ఆ మర్నాడంతా దేనిపైనా దృష్టి కేంద్రీకరించలేరు. స్వల్పకాలిక జ్ఞాపకశక్తి (షార్ట్‌ టర్మ్‌ మెమరీ) తగ్గుతుంది. 

అలాగే నాలుగైదు రోజులు సరిగా నిద్రలేకపోతే చిన్న చిన్న విషయాలకే చికాకు కలగవచ్చు. చిర్రెత్తుకురావచ్చు.  పిచ్చికోపం వచ్చేస్తుంది. కొన్ని భ్రాంతులకూ లోనయ్యే ప్రమాదం ఉంది. ఇలా నిద్రలేమి కారణంగా మూడ్స్‌ మారిపోవడాన్ని బట్టి చూస్తే... నిద్రకూ, నాడీ వ్యవస్థకూ సంబంధముంటుందని తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు... వాహనాలు నడిపేవారికి తగినంత నిద్రలేకపోతే డ్రైవింగ్‌పై పూర్తిగా దృష్టి నిలపలేక యాక్సిడెంట్లు అయిన ఉదంతాలు అన్నీ ఇన్నీ కావన్నది అందరికీ తెలిసిన విషయాలే.

నిద్ర సమయంలో మెదడులో జరుగుతూ మానవులకు మేలు చేసే కొన్ని పరిణామాలివి... 
పెద్దవాళ్ల విషయంలో... 
అల్జిజమర్స్‌ వ్యాధికి గురికావడం : మెదడులో వెలువడే కొన్ని విషపూరితమైన రసాయనాలను అంటే... ఉదాహరణకు బీటా ఎమైలాయిడ్‌ ప్యాక్‌ వంటి పాచిలాంటి పదార్థాలను నిద్రపోయే సమయంలోనే బ్రెయిన్‌  వదిలించుకుంటుంది. ఈ పాచి వంటి రసాయనాలే అల్జిజమర్‌ వ్యాధికి కారణమవుతాయి. 

ఈ వ్యాధి ఎంతటి ప్రమాదకరమైనదంటే గతంలో తాను నివసించిన ప్రాంతాలు, తాను నివాసముంటున్న ఇల్లు, తనకు తెలిసిన అన్ని నైపుణ్యాలు (వాహనం నడపడం వంటివి) ఇలా అన్నింటినీ మరచిపోయే ప్రమాదముంటుంది. అల్జిమర్స్‌ సోకినవాళ్లు మింగడం ఎలాగో అనేదేకాదు... చివరికి తానెవరో అనే సంగతీ మరచిపోతారు. 

స్లీప్‌ ఆప్నియా: గొంతులోంచి ఊపిరితిత్తులకు గాలిని తీసుకెళ్లే నాళం ముడత పడటంతో శ్వాసప్రక్రియలో అందులోంచి గాలి ప్రవహించేటప్పుడు గురక వస్తుంది. చాలామంది గురకను తేలిగ్గా తీసుకుంటారుగానీ ‘స్లీప్‌ ఆప్నియా’ అని పిలిచే ఇది...  చాలా ప్రమాదకరమైన వ్యాధి. 

గొంతులోని వాయునాళానికి సంబంధించిన ఈ వ్యాధిని... నిజానికి ముక్కు, గొంతుకు సంబంధిత రుగ్మత అనుకుంటారుగానీ... ఈ వ్యాధికీ మెదడుకూ ఎంత సంబంధముంటుందంటే...  గురక సమయంలో ముడుచుకుపోయిన వాయునాళం కారణంగా మెదడుకు తగినంత ఆక్సిజన్‌ అందనప్పుడు... బాధితుణ్ణి నిద్రలేవాల్సిందిగా మెదడు ఆదేశిస్తుంది. 

ఈ శ్వాసనాళం పూర్తిగా మూసుకుపోవడం అనే పరిస్థితి 10 సెకండ్లకు పైగానే కొనసాగవచ్చు. అంటే ఆ టైమ్‌లో శ్వాస అందదు. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితిని తప్పించడానికి బాధితుణ్ణి నిద్రలేవమని మనను మన మెదడు ఆదేశిస్తుంది. అప్పుడు నిద్రలేచి  శ్వాస తీసుకుని మళ్లీ  నిద్రలోకి జారుకుంటారు. 

అలా నిద్రాభంగం కాగానే ముడుతలు పడ్డ వాయునాళం కాస్తా  మామూలుగా అయిపోవడంతో మళ్లీ మెదడుకు తగినంత ఆక్సిజన్‌ అందుతుంటుంది. ఇలా శ్వాస అందని (ఆప్నియా) స్థితి ఒక రాత్రిలోనే కొన్ని వందల సార్లు రావచ్చు. ఫలితంగా వచ్చే నిద్రలోటును ‘స్లీప్‌ డెఫిసిట్‌’ అంటారు.  

ఇలా గురక వస్తూ ఉంటుంది కాబట్టి మెదడుకు తగినంత ఆక్సిజన్‌ అందకపోవడంతో అలాగే నాణ్యమైన నిద్ర కరవు కావడంతో (అంటే స్లీప్‌ డెఫిసిట్‌తో) ఆ మర్నాడు బాధితులు మగతగా, డల్‌గా కనిపిస్తుంటారు. దేనిపైనా దృష్టి కేంద్రీకరించలేరు. దీనివల్ల అర్థం చేసుకునే శక్తి, లాజికల్‌గా నేర్చుకునే శక్తియుక్తులు (కాగ్నెటివ్‌ ఎబిలిటీస్‌) తగ్గుతాయి. అంతేకాదు... పలు నాడీ సంబంధమైన రుగ్మతలు (న్యూరలాజికల్‌ కండిషన్స్‌)తోపాటు క్రమంగా మెదడు ఆరోగ్యమూ ప్రభావితమయ్యే అవకాశముంది. 

పక్షవాతం : నిద్రలేమి కారణంగా మెదడుకు కలిగే అసౌకర్యాలూ లో΄ాలతో పక్షవాతం లాంటి తీవ్రమైన వ్యాధులు సైతం వచ్చే అవకాశముంది. 

త్వరగా వయసు పైబడటం: నిద్రలేమి కారణంగా వయసు పెరగడం (ఏజింగ్‌) వల్ల కలిగే అనర్థాలు చాలా త్వరగా వచ్చేస్తాయి. కంటినిండా నిద్ర΄ోయే వారిలో ఏజింగ్‌ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది. అంటే వాళ్లు సుదీర్ఘకాలం ΄ాటు యౌవనంగా ఉంటారు. ఆరోగ్యకరమైన  నిద్ర వల్ల చర్మం త్వరగా ముడతలు పడదు. అలా ముడతలు పడకుండా ఉంచేందుకు దోహదపడే కొలాజెన్‌ అనే కణజాలం చాలా కాలం పటుత్వంగా ఉండటంతో చర్మంపైనా, కళ్ల కింద నల్లబడటం జరగదు (డార్క్‌ సర్కిల్స్‌ రావు). నుదుటిమీద గీతలు పడవు. 

మంచి నిద్రతోనే మంచి జ్ఞాపకశక్తి : నిద్రలో మెదడులో కొన్ని తరంగాలు లయబద్ధంగా కదులుతూ ఉంటాయి. వాటినే ‘షార్ట్‌ వేవ్‌ రిపుల్స్‌’ అంటారు. మనుషులు ఏదైనా విషయాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు అది మరింతగా గుర్తుండిపోవడానికి కారణమౌతూ జ్ఞాపకశక్తికి తోడ్పడేవి ఈ తరంగాలే. 

అమెరికన్, ఫ్రెంచ్‌ శాస్త్రజ్ఞులు 2009లో నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం ఈ జ్ఞాపకాలన్నీ మెదడులోని హి΄్పోక్యాంపస్‌ నుంచి మరో ప్రాంతం అయిన నియోకార్టెక్స్‌కు బదిలీ అయి... అక్కడ దీర్ఘకాలపు జ్ఞాపకాలు (లాంగ్‌ టర్మ్‌ మెమరీ)గా ఉండిపోతాయి. అంటే ఇక్కడ షార్ట్‌ టర్మ్‌ మెమరీగా ఉన్న జ్ఞాపకాలు... అక్కడ లాంగ్‌ టర్మ్‌ మెమరీస్‌గా మారి శాశ్వతమవుతాయి. అందుకు కారణమైన ‘షార్ప్‌ వేవ్‌ రిపుల్స్‌’ అన్నీ గాఢనిద్రలోనే సాధ్యమవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే... నిద్ర ఉంటేనే మంచి జ్ఞాపకశక్తి సాధ్యమవుతుంది.

నిద్రతోనే పిల్లలు ఎత్తు 

పెరిగే సామర్థ్యం:  పిల్లల్లో ఎత్తు పెరిగేందుకు సహాయం చేసే గ్రోత్‌ హార్మోన్‌లు నిద్రలోనే స్రవించేలా మెదడు ఆదేశాలు ఇస్తుంది. అంటే పిల్లలు కంటి నిండా నిద్రపోతేనే బాగా పెరుగుతారు. బాగా ఎత్తుగా ఎదురుతారు. ఒక వయసు దాటాక ఇదే గ్రోత్‌ హార్మోన్‌ కండరాలను పెంచుతుంది. అవి మందంగా అయ్యేలా చేస్తుంది. ఎముకలను గట్టిపరుస్తుంది. చిన్న పిల్లలు కంటి నిండా నిద్రపోతున్నారంటే... పై ప్రయోజనాలన్నీ చేకూరుతున్నాయని అర్థం. 

మంచి నిద్ర కోసం... 

  • ప్రతిరోజూ ఒకే వేళకు నిద్రించడం / నిద్రలేవడం 

  • నిద్రపోయే ముందర సమస్యలను చర్చించకపోవడం 

  • గోరువెచ్చటి నీళ్లతో స్నానం, శ్రావ్యమైన సంగీతం వినడం 

  • రాత్రిపూట పడుకునే ముందు కాఫీ, టీ, శీతల నీయాలు, మద్యం వంటి అలవాట్లకు  దూరంగా ఉండటం 

  • నిద్రకు ముందర టీవీ చూడటం, కంప్యూటర్‌ పై పనిచేయడానికి దూరంగా ఉండటం 

  • పడకగదిలో మరీ ఎక్కువ కాంతిగానీ, చప్పుళ్లు గానీ లేకుండా చూసుకోవడం

  • పడకగదిలో మరీ ఎక్కువ చల్లగా లేకుండా, వెచ్చగా లేకుండా జాగ్రత్తపడటం 

  • అన్నిటికంటే ముఖ్యంగా రోజూ దేహానికి తగినంత వ్యాయామం ఇవ్వడం. దానితోటు మెదడుకు మేతగా సుడోకూ, పజిల్స్‌ వంటివి సాల్వ్‌ చేస్తూ మెదడుకూ తగినంత వ్యాయామాన్ని కల్పించడం. ఇలాంటివి చేయడం వల్ల మంచి నిద్ర పట్టడంతోపాటు మెదడుకూ మంచి ఆరోగ్యం 
    సమకూరుతుంది. 

డా. విక్రమ్‌ కిశోర్‌ రెడ్డి, సీనియర్‌ న్యూరో ఫిజిషియన్‌ 

(చదవండి: అందాన్ని చెడగొట్టే పులిపిరులను సులభంగా తొలగించుకోండిలా..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement