మోకాలు వొంగిపోయింది... సరిచేసే అవకాశముందా?
రెండేళ్ల క్రితం నా మోకాలి కింది ఎముక విరిగింది. నేను మా ఊళ్లో కట్టు కట్టించుకున్నాను. ఇప్పుడు నా మోకాలు ఒంగిపోయి ఉంది. అలాగే రెండో కాలితో పోలిస్తే రెండు అంగుళాలు పొట్టిగా కూడ ఉంది. నా మోకాలు సరిగా అయ్యే అవకాశం ఉందా?
- సుధీర్, హైదరాబాద్
మీరు చెప్పిన వివరాలను బట్టి మీకు మోకాలి వద్ద డిఫార్మిటీ ఉన్నట్లుగా తెలుస్తోంది. దాంతో పాటు మీకు జరిగిన ప్రమాదం వల్ల జరిగిన నాటు తరహా చికిత్స తర్వాత ఆ కాలు పొట్టిగా ఉందని అర్థమవుతోంది. ఇలాంటి కండిషన్ ఉన్నవారికి ‘స్టాండింగ్ లాంగ్ లెగ్’ అనే ప్రత్యేకమైన ‘ఎక్స్-రే’ తీసి పరీక్షిస్తాం. ఆ కాలి వెయిట్ బేరింగ్ యాక్సిస్ ఎలా ఉంది, మీ కాలు దాని సహజ ఆకృతితో పోలిస్తే ఏ మేరకు ఒంగిపోయి ఉంది (అంటే ఎంత అలైన్‌మెంట్ తప్పింది) అనే అంశాలను నిర్ణయిస్తాం. కాలు ఒంగినట్లు చెప్పారు కదా... ఆ ఒంపు ఎన్ని డిగ్రీలు ఒంగిపోయింది, దాన్ని ఎలా సరిచేయాలని, ఇలా సరిచేసే ప్రక్రియలో దాన్ని ఎంతవరకు కట్ చేయాలి, మొత్తం సరికావడానికి ఎంత సమయం పడుతుంది అనే అంశాలన్నింటినీ తెలుసుకొని, వాటిని పేషెంట్‌కు వివరిస్తాం. ఇలా ఒంగి ఉన్న కాలిని సరిచేయడానికి వివిధ రకాల ఆపరేషన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి...
1. ఇలిజరోవ్ పద్ధతి : ఈ ప్రక్రియలో ఎముకను పూర్వపు అలైన్‌మెంట్‌కు తీసుకువచ్చాక, కాలిని మునుపటి పొడవునకు తీసుకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
2. ఆస్టియాటమీ అండ్ ఫిక్సేషన్ : ఈ ప్రక్రియలో ఎముక ఒంపును సరిచేయడానికి వీలుంటుంది. కానీ తగ్గిన పొడవును పెంచడానికి వీలుకాదు.
3. టీఎస్‌ఎఫ్ : ఇది అత్యాధునికమైన పద్ధతి ఈ ప్రక్రియ ద్వారా ఎముకను సరిచేయడంతో పాటు, తగ్గిన మేరకు పొడవు పెంచడం కూడా సాధ్యమవుతుంది. ఈ రెండు ప్రక్రియలనూ ఒకేసారి చేయడానికి వీలవుతుంది. ఈ ప్రక్రియ తర్వాత చాలా త్వరగా నడవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకసారి మీకు దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలవండి.