పింఛన్ రికవరీ..!
Published Sat, Nov 12 2016 12:13 PM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM
అనర్హుల నుంచి వసూలుకు అధికారుల సమాయత్తం
ఉమ్మడి ఆదిలాబాద్‌లో 3,33,966 మందికి పింఛన్లు
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 3,318 మంది పింఛన్ల తొలగింపు
రికవరీకి నోటీసుల అందజేత.. ఆందోళనలో లబ్ధిదారులు
ఆదిలాబాద్ అర్బన్ : సామాజిక పింఛన్ పథకం(ఆసరా) ద్వారా లబ్ధిపొందిన అనర్హుల నుంచి పింఛన్ డబ్బులు వసూలుకు రంగం సిద్ధమైంది. ఎలాంటి ఆధారం లేని వృద్ధులకు నెలనెల అందిస్తున్న పింఛన్ సొమ్ము పక్కదారి పట్టడంతోపాటు అనర్హులూ పింఛన్ పొందడంతో ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. ఎన్ని రోజుల నుంచి ఆసరా పథకం ద్వారా పింఛన్ పొందుతున్నారు.. ఏ విధంగా పింఛన్ సొమ్ము పక్కదారి పడుతోంది.. అనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఆ లెక్క తేలిన వెంటనే అనర్హుల నుంచి పింఛన్ సొమ్ము రికవరీ చేయడంతోపాటు పక్కదారి పట్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3,33,966 మంది పింఛన్లు నెలనెల తీసుకుంటున్నారు. గత నెలలో సెర్ప్ నుంచి అందిన ఆదేశాల ప్రకారం 3,318 మంది పింఛన్లు తొలగించారు. కాగా, జాబితా నుంచి తొలగించిన కొందరికీ ఇప్పటికే పింఛన్ రికవరీకి సంబంధించిన నోటీసులు అందజేశారు. ఇక వారు తీసుకున్న నెలల వారీగా పింఛన్ డబ్బులు వసూలు చేయాల్సి ఉందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఇలా...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్ని రకాల పింఛన్లు కలిపి 3,33,966 ఉన్నాయి. వీరు ప్రతి నెల పింఛన్ పొందుతున్నారు. పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ప్రతినెల రూ. 48 కోట్లు విడుదల చేస్తోంది. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత, బీడీ కార్మికుల పింఛన్లు కలిపి మొత్తం 62,688 ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో 1,36,353 పింఛన్లు, మంచిర్యాలలో 88,505 పింఛన్లు, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 46,420 పింఛన్లు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాల ప్రకారం మండలాల్లోని ఎంపీడీవోలు అనర్హులు, అర్హుల లెక్క తేల్చి నాలుగు జిల్లాల పరిధిలో ఉన్న 3,318 మంది పింఛన్లను తొలగించారు. తొలగించిన లబ్ధిదారులకు పింఛన్ రికవరీ నోటీసులు సైతం అందజేశారు. ఎన్ని నెలలు, ఎంత సొమ్ము రికవరీ చేస్తారు.. ఎలా రికవరీ చేస్తారనే విషయం తేలాల్సి ఉంది.
సొమ్ము దారి మళ్లకుండా...
ప్రభుత్వం ఆసరా పింఛన్ల సొమ్ముపై నిఘా పెట్టింది. పక్కదారి పట్టకుండా చర్యలు చేపడుతోంది. పింఛన్ డబ్బులు ముందుగా డీఆర్‌డీఏకు చేరుతుంది. అక్కడి నుంచి సంబంధిత మండలాల ఎంపీడీవోల ఖాతాల్లో జమ అవుతుంది. ఎంపీడీవోలు పంచాయతీ కార్యదర్శులు, పోస్టల్ అధికారులు, బ్యాంకులకు చెక్కులు జారీ చేస్తారు. ఆ చెక్కులతో సంబంధిత అధికారులు సొమ్మును డ్రా చేసి పింఛన్‌దారులకు పంపిణీ చేయాలి. చనిపోయిన వారి డబ్బులు, పింఛన్ తీసుకునేందుకు రానివారి సొమ్మును అధికారులు ఎంపీడీవోలకు తిరిగివ్వాలి. వారు ఆ సొమ్మును మళ్లీ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. కానీ అలా జరగడం లేదని ఆరోపణలు ఉన్నాయి. పింఛన్ పంపిణీ చేయగా మిగిలిన సొమ్మును కొందరు అధికారులు తమ సొంత పనులకు వాడుకుంటున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై నిఘా పెట్టడంతోపాటు లబ్ధిదారులపై కూడా ప్రభుత్వం ఓ కన్నేసింది. అసలు పింఛన్లు పొందుతున్న వారిలో ఎవరు అర్హులు... ఎవరు అనర్హులు అనే లెక్క తేల్చి సంబంధిత అధికారులకు జాబితా పంపించింది. అ జాబితాలో అనర్హులుగా ఉన్న వారిని తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే అధికారులు పింఛన్ సొమ్ము రికవరీకి సిద్ధమైనట్లు పేర్కొంటున్నారు.
ఆదేశాల ప్రకారం రికవరీ చేస్తాం..
అనర్హులు పింఛన్లు పొందితే రికవరీ చేస్తాం. ఆసరా ద్వారా అర్హులతోపాటు అనర్హులు పింఛన్ పొందారని సమాచారం ఉంది. మాకు వచ్చిన ఆదేశాల ప్రకారం అనర్హుల నుంచి పింఛన్ సొమ్మును రికవరీ చేయాలని ఉంది. అనర్హత గల లబ్ధిదారుల నుంచి పింఛన్ సొమ్మును వెనక్కి తీసుకునేందుకు కొంత సమయం పడుతుంది. ప్రభుత్వాదేశాల ప్రకారం తప్పకుండా అనర్హుల నుంచి సొమ్మును రికవరీ చేస్తాం.
– రాజేశ్వర్ రాథోడ్, డీఆర్డీవో, ఆదిలాబాద్
Advertisement