మోసకారి బాబును అనర్హుడిగా ప్రకటించాలి
అనంతపురం టవర్‌క్లాక్ :
తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబును ముఖ్యమంత్రి పదవికి అనర్హుడిగా ప్రకటించాలని వామపక్షపార్టీల నేతలు ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేశారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జగదీష్‌తోపాటు సీపీఐ సీనియర్ నాయకుడు ఎంవీ రమణ, సీపీఎం నగర కార్యదర్శి రాంభూపాల్, నల్లప్ప, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకరరెడ్డి, సీపీఐ ఎంఎల్ నాయకుడు చంద్రశేఖర్, ఎస్‌యూసీఐ నాయకులు రాఘవేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ... ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా చంద్రబాబు నె రవేర్చలేదని దుయ్యబట్టారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చె ప్పి ఉన్న ఉద్యోగాలను ఊడదీస్తున్నారని, రైతుకు అండగా నిలవాల్సిన బాబు వ్యవసాయాన్ని బ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. రైతులు, మహిళలను మొండి బకాయిదారులుగా మార్చి ఆయా వర్గాలను నీరు గార్చారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే రూ. 8లక్షల కోట్లు అవసరమవుతాయని, ఇంత భారీ బడ్జెట్‌ను ఎక్కడ నుంచి తెస్తారని నిలదీశారు. అక్టోబర్‌లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలు పాలకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈనెల 29 నుంచి అక్టోబర్ 12 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపటుతున్నట్లు ప్రకటించారు. 13న అన్ని మండల కార్యాలయాల ఎదుట ఆందోళన చేపడతామని, మహిళలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.