‘ఆసరా’ పక్కదారి.. అర్హులకేదీ దారి? | Getting Pensions For Ineligible Persons In Telangana | Sakshi
Sakshi News home page

‘ఆసరా’ పక్కదారి.. అర్హులకేదీ దారి?

Published Mon, Sep 5 2022 4:10 AM | Last Updated on Mon, Sep 5 2022 3:57 PM

Getting Pensions For Ineligible Persons In Telangana - Sakshi

నారాయణపేట జిల్లా మరికల్‌ మండల కేంద్రంలో శనివారం పింఛన్‌ ధ్రువపత్రాల పంపిణీ చేపట్టారు. ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి పంపిణీ చేస్తుండగా.. ఓ వ్యక్తి పెన్షన్‌ పత్రం తీసుకోవడానికి స్టేజీపైకి వచ్చారు. 45ఏళ్లు కూడా ఉండని ఆయనకు వృద్ధాప్య పింఛన్‌ మంజూరు కావడం చూసి ఎమ్మెల్యే అవాక్కయ్యారు. ఇదేమిటంటూ అధికారులపై మండిపడ్డారు. 

ఇదే కార్యక్రమానికి మరికల్‌కు చెందిన బోయ అనంతమ్మ వచ్చి ఎమ్మెల్యేను ఆశ్రయించారు. భర్త చనిపోయి మూడేళ్లవుతోందని.. 2020లో వితంతు పెన్షన్‌కు దరఖాస్తు చేసుకున్నా రాలేదని వాపోయారు. ఎమ్మెల్యే దీనిపై అధికారులను ప్రశ్నించగా.. ఆమె చనిపోయినట్టు ఆన్‌లైన్‌లో నమోదై ఉండటంతో రాలేదని వివరించారు. దీంతో తనను బతికుండగానే చంపేశారని, ఎలాగైనా పింఛన్‌ మంజూరు చేయాలని అనంతమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. 

..తాజాగా నారాయణపేట జిల్లాలో కొత్త పింఛన్ల మంజూరు సందర్భంగా బయటపడిన వాస్తవాలు. ఈ ఒక్క చోటేకాదు.. రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల మంజూరులో ఇలాంటి అవకతవకలు కనిపిస్తున్నాయి. అనర్హులకు ఆసరా అందుతుండగా.. అర్హులకు మొండిచేయి మిగిలింది.ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంతో పింఛన్ల మంజూరు లోపభూయిష్టంగా మారిన తీరుపై ‘సాక్షి’గ్రౌండ్‌ రిపోర్ట్‌..     
– సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌

భారీగా పింఛన్లు ఇస్తుండటంతో.. 
పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ‘ఆసరా’పథకం కింద భారీ సంఖ్యలో పింఛన్లు అందజేస్తోంది. మరింత మందికి ‘ఆసరా’అందించే ఉద్దేశంతో వృద్ధాప్య పింఛన్‌ అర్హత వయసును 65 నుంచి 57 ఏళ్లకు కుదించింది. దివ్యాంగులు, వితంతువులు, చేనేత, బీడీ కార్మికులు, ఇతర లబ్ధిదారుల నుంచి కూడా కొత్తగా దరఖాస్తులు స్వీకరించింది. దాదాపు మూడేళ్ల తర్వాత కొత్త పింఛన్ల మంజూరుకు సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే కొత్త పింఛన్ల జాబితాలో పెద్ద సంఖ్యలో అనర్హులకు చోటు దక్కిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

క్షేత్రస్థాయి విచారణ ఏదీ? 
కొత్త పింఛన్ల కోసం మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించగా.. అర్హులతోపాటు అనర్హులూ దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అర్హులను గుర్తించాలి. కానీ ఎక్కడా ఈ ప్రక్రియ సరిగా జరగలేదని.. వాస్తవ వయసు తక్కువగా ఉన్నా, ఆధార్‌ కార్డులో నమోదైన వయసు ప్రకారం వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేశారని తెలిసింది. కొందరు ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు పింఛన్లు మంజూరవడం, ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురికి ఇవ్వడం వంటివెన్నో జరగడం గమనార్హం. 

అవకతవకలు ఎన్నో.. 
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చనిపోయినవారి పేరిట, సింగరేణి, రైల్వే ఉద్యోగులకు, ఒకే వ్యక్తికి రెండు, ఒకే ఇంట్లో రెండేసి పింఛన్లు వంటి అవకతవకలు ఉన్నో జరిగాయి. ఇప్పటివరకు 1,257 మందిని అనర్హులుగా గుర్తించారు. 
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురానికి చెందిన జటంగి సోమమ్మ భర్త చనిపోయి రెండేళ్లవుతోంది. వితంతు పింఛన్‌ కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నా రాలేదు. అదే మండలం చెరువు మాదారంలో ఉద్యోగుల తల్లిదండ్రులకు పింఛన్లు మంజూరయ్యాయి. 
సిద్దిపేట జిల్లా రాఘవాపూర్‌ మధిర గ్రామం ఇంద్రగూడేనికి చెందిన గాండ్ల లక్ష్మి వృద్ధాప్య పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదు. ఇదేమిటని అధికారులను అడిగితే.. సమగ్ర కుటుంబ సర్వే వివరాల్లో వయసు తక్కువగా ఉండటంతో రాలేదని సమాధానమిచ్చారు. 
సిరిసిల్ల జిల్లా కథలాపూర్‌ మండలం పెగ్గెర్లకు కారపు సత్యనారాయణ వయసు 57. ఆయనకు చేనేత పింఛన్‌ రావాల్సి ఉంది. కానీ ఆయన చనిపోయినట్టు వివరాల్లో ఉందంటూ పింఛన్‌ ఇవ్వలేదు. 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్‌కు చెందిన కొండపాక సత్యనారాయణ (69) చనిపోయి ఏడాదిన్నర అవుతోంది. కొత్త పింఛన్ల జాబితాలో ఆయన పేరుంది. 
మహబూబ్‌నగర్‌ మండలానికి చెందిన జనార్దన్‌గౌడ్‌ నాలుగేళ్ల క్రితం వృద్ధాప్య పింఛన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. 8 నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. కొత్త పింఛన్ల జాబితాలో ఆయన పేరుంది. తాను వితంతు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నానని.. తనకు మంజూరు చేయాలని ఆయన భార్య జయమ్మ వాపోతున్నారు.  

‘సమగ్ర’సర్వేతో పోల్చి.. 
కొన్ని జిల్లాల్లో కొత్త పింఛన్ల జాబితాలో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు మాత్రమే ఉన్నాయి. మండల, మున్సిపల్‌ కార్యాలయాల్లో దరఖాస్తులు ఇచ్చినవారికి మంజూరు కాలేదని తెలిసింది. ఇక మండల, పురపాలికల్లో దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధించిన వివరాలను సమగ్ర కుటుంబ సర్వేతో పోల్చినట్టు తెలిసింది. అందులో వృత్తి నమోదు కాకపోవడంతో పలువురు గీత, చేనేత కార్మికుల పేర్లు పింఛన్ల జాబితాలో చేర్చలేదని సమాచారం. ప్రస్తుతం పింఛన్ల మంజూరులో లొసుగులు వెలుగులోకి వస్తుండటంతో అధికారులు జల్లెడ పట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే అనర్హుల తొలగింపు పనికి స్థానిక ప్రజాప్రతినిధులు అడ్డువస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


ఈయన పేరు సుంచు మల్లయ్య. వయసు 67 ఏళ్లు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌కు చెందిన ఆయన.. ఓ రేకుల షెడ్డులో భార్య, ఇద్దరు పిల్లలతో బతుకీడుస్తున్నాడు. మరో కుమారుడు ఏడాది క్రితం కరోనాతో మృతిచెందాడు. బిడ్డ శ్రీలతకు 30ఏళ్లు.. ఆమె మరుగుజ్జు. అయినా ఈ కుటుంబానికి పింఛన్‌ మంజూరు కాలేదు.  

బతికుండగానే చనిపోయిందంటూ.. 
ఈ మహిళ పేరు బానోతు వీరమ్మ. వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం చిలుకమ్మతండాకు చెందిన వీరమ్మ 2019లో వితంతు పింఛన్‌ కోసం దరఖా­స్తు చేసుకుంది. కొత్త పింఛన్ల జాబితాలో తన పేరు లేదు. అధికారుల వద్దకు వెళితే ఆమె చనిపోయినట్టు ఆన్‌లైన్‌లో చూపిస్తోందనడంతో అవాక్కైంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement