ఇస్టులకే పింఛన్లు | Istulake pensions | Sakshi
Sakshi News home page

ఇస్టులకే పింఛన్లు

Published Wed, Nov 12 2014 2:36 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

Istulake pensions

పింఛన్ల జాబితాలో అర్హుల పేర్లు తొలగించడం దుమారం రేపుతోంది. ఆనక అనర్హులకు పింఛన్లు చెల్లించడం ప్రభుత్వ ప్రతిష్టను మసకబారేలా చేస్తోంది. ఈ ఉదంతంలో తెలుగుదేశం పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు వివాదస్పదమవుతోంది. రాజకీయాలతో తమకు పని లేదని, అయినా తమ జీవితాలతో ఇలా చెలగాటమాడటం ఎంత వరకు సమంజసమని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

 చక్రాయపేట:చక్రాయపేట మండలం గంగారపువాండ్లపల్లెకు చెందిన పింఛన్‌దారుల పేర్లను జాబితా నుంచి తొలగించడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విచారణ అనంతరం అర్హులైన చాలా మందిని పింఛన్ల కమిటీ అనర్హులుగా తేల్చడంతో వారి పేర్లను పీకేశారు. అక్టోబర్ వరకు ఫించన్లు అందుకున్న వారు నవంబర్ వచ్చేసరికి ఏ విధంగా అనర్హులయ్యారో అర్థం కావడం లేదంటున్నారు. ఏ ప్రాతిపదికన తమను అనర్హులుగా తేల్చారో చెప్పాలని పట్టుబడుతున్నారు.

తొలగించిన వారి పేర్లను పరిశీలిస్తే...
  ఎద్దులవాండ్లపల్లెకు చెందిన పెద్దెరికల నాగమ్మ వృద్ధురాలు. భర్తకు వయసు మీదపడింది. దానికి తోడు అనారోగ్యం వెంటాడుతోంది. మంచం నుంచి కదలలేని స్థితి. మరే దిక్కు లేదు. ఆమెకు గత నెలలో పింఛన్ ఇచ్చారు. నవంబర్ వచ్చేసరికి జాబితాలో పేరు లేదంటూ డబ్బులు ఇవ్వలేదు.

  గంగారపువాండ్లపల్లెకు చెందిన డేరంగుల రామక్క వితంతువు. ఆమెకు తలదాచుకునేందుకు కనీసం ఇల్లు కూడా లేదు. భూమి లేదు. ఆమె పేరును పింఛ న్ల జాబితాలో లేకుండా చేశారు.
  అదే గ్రామానికి చెందిన జె.నాగమ్మదీ అదే పరిస్థితి. ఇలా మరో 15 మంది పేర్లను జాబితా నుంచి తొలగించారు.

 కక్షతోనే ఇలా చేశారు
 పైన పేర్కొన్న వారంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గీయులుగా భావించారు. దీంతో వారి పేర్లను టీడీపీ నాయకులు పట్టుబట్టి పింఛన్ల జాబితా నుంచి తొలగించేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 వీరు అర్హులట..
 గంగారపువాండ్లపల్లెకు చెందిన జరిపిటి నారాయణమ్మ(ఖాతా నెంబరు 31)కు అనువంశిక ంగా 8.38 ఎకరాలు వచ్చినట్లు రెవెన్యూ రికార్డులు తెలుపుతున్నాయి. అదే గ్రామానికి చెందిన పెద్దారికల పెద్ద గంగిరెడ్డి(ఖాతా నెంబరు 43)లో 6.29 ఎకరాల భూమి ఉంది. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఐదెకరాల భూమి ఉంటే పింఛన్‌కు అనర్హులు. అయితే వీరు టీడీపీ వర్గానికి చెందిన వారు కావడంతో వీరి పేర్లు పింఛన్ల జాబితాలో పదిలంగా ఉన్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇవి ఉదాహరణ మాత్రమే. అధికారులు సమగ్ర విచారణ జరిపితే ఇటువంటి మరెన్నో ఉదంతాలు వెలుగులోకి వస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement