సాక్షి, హైదరాబాద్: అనర్హుల ఏరివేత పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాత పింఛనుదారుల్లో 9,16,310 మందిని తొలగించింది. సెప్టెంబర్ వరకు 13 జిల్లాల్లో మొత్తం 43,12,533 మంది పింఛన్లు పొందుతుండగా, అక్టోబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 33,96,223 మందికే పింఛన్లు విడుదల చేసింది. పింఛనుదారులలో అనర్హులను గుర్తించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు కమిటీలు 3,34,569 మందిని అనర్హులుగా నిర్ధారించాయి. ఈ కమిటీలు అర్హులుగా పేర్కొన్న జాబితాను సైతం ప్రభుత్వం గత రెండు రోజులుగా పునఃపరిశీలించి, మరో 4.70 లక్షల మందికిపైగా అనర్హులంటూ వారి పింఛన్లకు కోతపెట్టింది. అలాగే పాతవారిలో 1,11,372 మంది గ్రామ సభల సమయంలో అందుబాటులోకి రాకపోవడంతో వారినీ అనర్హులుగా తేల్చారు.