అధికార పార్టీకి మద్దతు తెలపడం లేదన్న నెపంతో వృద్ధాప్య, వికలాంగ....
హైకోర్టును ఆశ్రయించిన బాధితులు
హైదరాబాద్: అధికార పార్టీకి మద్దతు తెలపడం లేదన్న నెపంతో వృద్ధాప్య, వికలాంగ, వితంతు పింఛన్లకు అనర్హులుగా ప్రకటించి జాబితా నుంచి తమ పేర్లను తొలగించారని, ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దాదాపు 50 మంది హైకోర్టును ఆశ్రయించారు. పింఛన్లు పొందేందుకు అనర్హులుగా చేస్తూ గ్రామ పంచాయతీ పెన్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై తమ అప్పీళ్లను పరిశీలించి అర్హుల జాబితాలో చేర్చేలా అధికారులను ఆదేశించాలని కోరారు.
ఈ మేరకు అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన సబ్బెల సూర్యనారాయణరెడ్డితోపాటు మరో 49 మంది పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా పెన్షన్ల కమిటీ మెంబర్ కన్వీనర్, మండల పెన్షన్ల కమిటీ మెంబర్, గ్రామ పంచాయతీ పెన్షన్ల కమిటీ మెంబర్ కన్వీనర్, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు.