Koppavaram
-
వేషం కట్టి.. జోలె పట్టి..
అనపర్తి: చిన్నా, పెద్దా అనే తారతమ్యం లేదు.. పేద, ధనిక అనే భేదం లేదు.. అందరూ విచిత్రవేషధారణలతో ఆకట్టుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారికి మొక్కుబడిగా వీధుల్లో భిక్షాటన చేశారు. అలా వచ్చిన సొమ్మును అమ్మవారికి సమర్పించారు. కోట్లకు పడగలెత్తిన కుబేరుల నుంచి దినసరి కూలీల వరకు అందరూ సత్తెమ్మతల్లి జాతరలో ఆనందంగా పాల్గొనడం అక్కడ విశేషం.అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో రెండేళ్లకోసారి జరిగే ఈ సత్తెమ్మతల్లి జాతర సోమవారంతో ముగిసింది.రాష్ట్రం నలుమూలల నుంచి విశేషంగా తరలివచ్చిన భక్తులతో కొప్పవరం వీధులన్నీ జనసంద్రమయ్యాయి. అమ్మవారి అనుగ్రహం కోసం బెత్తం దెబ్బలు తింటూ.. ఆ తల్లిని స్మరిస్తూ తెలుగు సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఉత్సవాలు, సంబరాల గొప్పదనాన్ని, జాతర విశిష్టతను చాటారు. అచంచలమైన భక్తి విశ్వాసం :కొప్పవరం గ్రామానికి చెందిన కర్రి వంశీకుల కులదేవతగా పూజలందుకుంటున్న సత్తెమ్మ తల్లిని కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కొలుస్తారు. ముఖ్యంగా సంతానం కోసం అమ్మవారిని దర్శించిన భక్తులు రెండేళ్ల తరువాత వచ్చే సంబరానికి బిడ్డతో అమ్మవారి దర్శనానికి వస్తారు. ఈనెల 25న అమ్మవారి సన్నిధిలో ఉంచిన కత్తి కుండను కిందకు దింపడంతో ప్రారంభమైన జాతర సోమవారంతో ఘనంగా ముగిసింది. ఈ జాతరలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్తి సుబ్బిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకుడు, కేవీఆర్ రియల్ ఎస్టేట్ అధినేత కాయల వెంకటరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధులు సబ్బెళ్ల కృష్ణారెడ్డి, మేడపాటి షర్మిలారెడ్డి, జిల్లా కార్యదర్శి ఒంటిమి సూర్యప్రకాష్, పార్టీ మండల కన్వీనర్ మల్లిడి ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి తోట నరసింహం సతీమణి తోట వాణి, కాకినాడకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, జిల్లా రెడ్డి సంఘం అసోసియేషన్ అ«ధ్యక్షుడు కర్రి త్రినాథరెడ్డి, కాకినాడ, రాజమహేంద్రవరం టౌన్ రెడ్డి సంఘం అధ్యక్షడు కర్రి అచ్యుతరామారెడ్డి, కర్రి వెంకటరామారెడ్డి తదితర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. -
స్పందిస్తారా... సరిచేసుకోమంటారా ?
రోడ్ల దుస్థితిపై డాక్టర్ సూర్యనారాయణరెడ్డి ఆగ్రహం ప్రభుత్వ తీరుపై విమర్శలు కొప్పవరం - అనపర్తి వరకు పాదయాత్ర అనపర్తి : అనపర్తి మండలం కొప్పవరం గ్రామ రహదారులు దుస్థితికి చేరి ప్రయాణికులు ఇబ్బందులు ఎరుర్కొంటున్నారని, ప్రభుత్వం స్పందించని పక్షంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మతులు చేపడతామని వైఎస్సార్సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి స్పష్టం చేశారు. కొమరిపాలెం–కొప్పవరం–అనపర్తి, మహేంద్రవాడ–కొప్పవరం–లక్ష్మీనరసాపురం అభివృద్ధి పరచాలని కోరుతూ డాక్టర్ సూర్యనారాయణరెడ్డి శనివారం కొప్పవరం నుంచి అనపర్తి వరకు పాదయాత్ర నిర్వహించారు. తొలుత గ్రామంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. వందలాది మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు, కొప్పవరం, మహేంద్రవాడ, కొమరిపాలెం, తొస్సిపూడి గ్రామస్తులు ఆయన పాదయాత్రను అనుసరించారు. పాదయాత్ర అనంతరం అనపర్తి మండల పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన సభలో డాక్టర్ సూర్యనారాయణరెడ్డి మాట్లాడారు. కొప్పవరం గ్రామానికి సంబంధించిన అత్యధిక రోడ్లు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి చెందాయన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పాలకులు కొప్పవరం గ్రామ రోడ్లపై చూపుతున్న తీవ్ర నిర్లక్ష్యం కారణంగా వాటిని రోడ్లు అని కూడా అనే పరిస్థితి లేనంతగా శిథిలస్థితికి చేరాయని ఆయన విమర్శించారు. పదిహేను రోజుల లోపు ఈ రోడ్లను కనీసం మరమ్మతులైనా చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి మరమ్మతులు చేపట్టని పక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయా గ్రామస్తులకు అత్యవసర రహదారి అయిన కొప్పవరం–అనపర్తి రోడ్డు గోతులను పూడ్చి మరమ్మతులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని సూర్యనారాయణరెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి మోకా సూరిబాబు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, జిల్లా కార్యనిర్వాహణ కార్యదర్శి సత్తి వీర్రెడ్డి, జిల్లా కార్యదర్శి చిర్ల వీర్రాఘవరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఒంటిమి సూర్యప్రకాశ్, పడాల శ్రీనివాసరెడ్డి, అడబాల వెంకటేశ్వరరావు, తిబిరిశెట్టి ఆదినారాయణ, నియోజకవర్గ లీగల్ సెల్ కన్వీనర్ వెలగల లక్ష్మీనారాయణరెడ్డి, అనపర్తి, బిక్కవోలు మండల కన్వీనర్లు మల్లిడి ఆదినారాయణరెడ్డి, ఒంగా రామ్‌గోపాల్‌రెడ్డి, అనపర్తి, బిక్కవోలు యువజన విభాగం కన్వీనర్లు కర్రి బులిమోహన్‌రెడ్డి, గువ్వల సత్తిరెడ్డి, మండల కార్యదర్శి పాదూరి డేవిడ్‌రాజు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీకి మద్దతివ్వలేదని పింఛన్లు తొలగించారు
హైకోర్టును ఆశ్రయించిన బాధితులు హైదరాబాద్: అధికార పార్టీకి మద్దతు తెలపడం లేదన్న నెపంతో వృద్ధాప్య, వికలాంగ, వితంతు పింఛన్లకు అనర్హులుగా ప్రకటించి జాబితా నుంచి తమ పేర్లను తొలగించారని, ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దాదాపు 50 మంది హైకోర్టును ఆశ్రయించారు. పింఛన్లు పొందేందుకు అనర్హులుగా చేస్తూ గ్రామ పంచాయతీ పెన్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై తమ అప్పీళ్లను పరిశీలించి అర్హుల జాబితాలో చేర్చేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఈ మేరకు అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన సబ్బెల సూర్యనారాయణరెడ్డితోపాటు మరో 49 మంది పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా పెన్షన్ల కమిటీ మెంబర్ కన్వీనర్, మండల పెన్షన్ల కమిటీ మెంబర్, గ్రామ పంచాయతీ పెన్షన్ల కమిటీ మెంబర్ కన్వీనర్, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు.