బెదిరించి.. ప్రలోభపెట్టి..
- నంద్యాలలో టీడీపీ విజయతీరం చేరిందిలా..
- ఈ స్థాయిలో అధికార దుర్వినియోగమా..?
- విస్తుపోతున్న రాజకీయ విశ్లేషకులు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార పార్టీ విజయానికి.. బెదిరింపులు, ప్రలోభాలతో పాటు అభివృద్ధి ఆగిపోతుందనే ఆందోళన, పింఛన్లు– రేషన్‌కార్డులు తీసేస్తారనే భయం.. ఇలా అనేక కారణాలు దోహదం చేశాయని విశ్లేషకులంటున్నారు. నోటిఫికేషన్ కంటే ముందు హడావుడిగా మొదలుపెట్టిన రోడ్ల విస్తరణ పనులు మధ్యలోనే ఉండటంతో అధికార పార్టీకి ఓటు వేయకపోతే పనులు నిలిపివేస్తారనే భయాన్ని నంద్యాల నియోజకవర్గ ప్రజల్లో కలిగించిందని వారు పేర్కొంటున్నారు.
అలాగే సర్వే టీంల పేరుతో ‘మీకు వస్తున్న పింఛన్, రేషన్‌కార్డు తీసివేయకుండా ఉండాలంటే టీడీపీకి ఓటు వేయాలి’అని అధికారపార్టీ నేతలు మానసికంగా భయపెట్టే విధంగా గూండాయిజం చేయడంతో ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందారని, ఇవన్నీ అధికారపార్టీకి అనుకూలంగా ఓటేయడానికి ఉపయోగపడ్డాయని విశ్లేషకులంటున్నారు.. ఇక మొత్తం కేబినెట్ నంద్యాలలోనే తిష్టవేసి కులాలు, మతాల వారీగా విడదీసి.. ప్యాకేజీలు ప్రకటించడంతో పాటు అనేక ప్రలోభాలకు గురిచేశారు. ప్రతిపక్ష పార్టీ గెలిస్తే మాత్రం ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో ఏమి చేయగలదు? అనే వాదనను కూడా అధికార పార్టీ కరపత్రాలు వేసి మరీ ప్రచారం సాగించింది. అంతటితో ఆగకుండా ఓటుకు ఇంత రేటు అని నిర్ణయించి అధికారపార్టీ డబ్బు పంపిణీ జరిపింది. డబ్బు పంపిణీ ఏ స్థాయిలో జరిగిందంటే ఓటుకు రూ.2,000 నుంచి రూ.10,000 వరకు పంచారని, పోలింగ్ రోజు చివరి నిమిషం వరకు కూడా ఈ పంపిణీ కొనసాగిందంటే అధికారపార్టీ ఎంత ‘జాగ్రత్త’గా వ్యవహరించిందో అర్ధమౌతోందని పరిశీలకులంటున్నారు.
పదే పదే ప్రలోభాలు : వాస్తవానికి నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ కంటే ముందునుంచీ∙కేబినెట్‌లో సగం మంది మంత్రులు నంద్యాలలో తిష్టవేశారు. కులాలు, మతాల వారీగా సమావేశాలు నిర్వహించారు. అధికారులను అడ్డం పెట్టుకుని మరీ బెదిరింపులకు దిగారు. ఆయా కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తామని ఆశ చూపారు. ఎవరికి ఎంతివ్వాలనేది స్పష్టంగా నిర్ణయించి ఆ మేరకు నగదు పంపిణీ చేశారు. ఉదాహరణకు నంద్యాల రూరల్ మండలంలో ఒక సర్పంచ్‌కు ఏకంగా రూ.కోటి అందజేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక మసీదులు, చర్చిల మరమ్మతుల పేరుతో రూ.30 లక్షలు, రూ.20 లక్షల చొప్పున ఇచ్చారు.
నంద్యాల పట్టణంలోని ఒక చర్చికి రూ.కోటి ఇస్తామని స్వయంగా ఓ మంత్రి బహిరంగంగా ప్రకటించడం గమనార్హం. పది ఓట్లు ఉన్న వారికి కూడా లక్షలకు లక్షలు అందజేశారు. రోడ్ల విస్తరణలో స్థలాలు కోల్పోయిన వారిని తమ పార్టీకి ఓటు వేయకపోతే నష్టపరిహారం అందించేది లేదని బెదిరించారు. పోలింగ్ సమయంలో కూడా పక్కనే ఉన్న నియోజకవర్గంలో తిష్టవేసి మరీ డబ్బు పంపిణీ వ్యవహారాలను మంత్రులు పర్యవేక్షించారు.అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా నంద్యాలలోనే తిరుగుతూ డబ్బు పంపిణీ చేపట్టారు. బూత్ స్థాయిలో ఎవరెవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయనేది లెక్కలు గడుతూ వారందరినీ కొనుగోలు చేశారు. మాట వినకపోతే బెదిరింపులకు దిగారు. వైఎస్సార్‌సీపీ వెంట నడిచే వారిని సోదాల పేరుతో వేధించారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థను మొత్తం నంద్యాలలోనే దించి టీడీపీకి అనుకూలంగా లేనివారిని బెదిరించడమో, ప్రలోభపెట్టడమో చేశారు.
సర్వేల పేరుతో బెదిరింపులు : రోడ్ల విస్తరణ పనులు ఆగిపోతాయనే భయాన్ని సృష్టించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పింఛన్, రేషన్‌కట్ అవుతాయంటూ సర్వే టీంలు ఇంటింటికీ తిరుగుతూ గూండాయిజం చేశాయి. ఇతర జిల్లాలకు చెందిన యువకులను, నారాయణ కాలేజీకి చెందిన యువకులను సర్వే పేరుతో తిప్పుతూ... పింఛన్, రేషన్ లబ్ధిదారుల వివరాలతో వారి ఇళ్లకు వెళ్లి మరీ బెదిరింపులకు దిగారు. ఇక మైనార్టీల్లో శిల్పా మోహన్‌రెడ్డిపై విపరీతంగా విష ప్రచారం చేశారు. ముస్లిం యువతపై రౌడీషీటు తెరిపించారని దుష్ప్రచారం సాగించారు. వీటికితోడు సానుభూతి అంశం కూడా పనిచేసింది. తల్లీ తండ్రి లేని పిల్లలపై పోటీనా అంటూ సీఎం స్థాయిలో సానుభూతిని రెచ్చగొట్టి... ఓట్లుగా మలచుకునే ప్రయత్నం చేశారు. మొత్తం మీద అభివృద్ధి ఆగిపోతుందనే ఆందోళన, పింఛన్లు, రేషన్‌కార్డులు తొలగిస్తారనే భయానికి తోడు ఉప ఎన్నికలో ప్రతిపక్ష పార్టీకి ఓటు వేసినా జగన్ సీఎం కాడుకదా అనే భావన అధికార పార్టీ విజయానికి దోహదపడ్డాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.