‘నంద్యాల ప్రజలే ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి’
సాక్షి, అమరావతి : ఓటు రేటును రూ.300 నుంచి రూ.3 వేలకు పెంచిన చంద్రబాబు ధనబలంతో నంద్యాలలో గెలిచిన సంగతి అందరికీ తెలుసునని, అలాంటిది మంత్రులు, ఎమ్మెల్యేలను పంపి అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు చెబుతామనడం విడ్డూరంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఎద్దేవా చేశారు. విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్‌లో శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
‘‘ఓటు రేటు పెంచినందుకు నంద్యాల ప్రజలే చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పాలి. 50 మంది ఎమ్మెల్యేలు, 20 మంది మంత్రులు, చోటా మోటా నాయకులు వందలాది మంది నంద్యాలలో మోహరించడంతోపాటు 10వేల పెన్షన్లు, రూ.వందల కోట్ల అభివృద్ధి పనులకు నిధులు ఇస్తామని ఎన్నికల్లో గెలిచారు’’ అని రామకృష్ణ అన్నారు.
ఇంకా చంద్రబాబుకు దురాశ తగ్గలేదు: ఓట్లు కొని ఎమ్మెల్యేలు అవుతున్నారని, ఎమ్మెల్యేలను కొని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని, తద్వారా సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్నారని సీపీఐ నేత మండిపడ్డారు. ‘‘ఇప్పటికే 21 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబుకు దురాశ తగ్గలేదు. ఇకనైనా వైఖరి మార్చుకోకపోతే ఆయనను ప్రజలు విశ్వసించరు’ అని రామకృష్ణ హితవు పలికారు.