అనర్హులకు అడ్డుకట్ట వేయండి
అప్పుడే ప్రభుత్వ లక్ష్యం సిద్ధిస్తుంది: సీఎం కేసీఆర్
* పాములపర్తి గ్రామానికి వరాల జల్లు కురిపించిన సీఎం
వర్గల్: ప్రభుత్వ పథకాలు అనర్హుల పరం కాకుండా.. ప్రజలు అప్రమత్తంగా ఉండి అడ్డుకట్ట వేయాలని, అపుడే అర్హులకు ప్రయోజనం చేకూరుతుందని, ప్రభుత్వ లక్ష్యం కూడా సిద్ధిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. అనర్హులను ప్రజలు గుర్తించినట్లయితే వెంటనే అధికారులకు సమాచారమివ్వాలని సూచించారు. ఆదివారం మధ్యాహ్నం ఫాంహౌస్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న సీఎం కేసీఆర్ వర్గల్ మండలం పాములపర్తి గ్రామాన్ని సందర్శించారు.
ఆ గ్రామపంచాయతీ చావిడి వద్ద చెట్టునీడలో గ్రామస్తులతో గంటసేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ గ్రామానికి వివిధ అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని అభ్యర్థిస్తూ సర్పంచ్ చంద్రకళ, ఎంపీటీసీ సభ్యురాలు స్వప్న ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేశారు. దీంతో ఆ వినతిపత్రాన్ని నిశితంగా పరిశీలించిన కేసీఆర్.. అందులోని అంశాలను ఒక్కొక్కటిగా చదువుతూ దాదాపు రూ.10 కోట్ల పైచిలుకు అంచనాలతో కూడిన పనులను అక్కడికక్కడే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాలు సహా 150 ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
10 రోజుల్లో మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని, మోడల్ కాలనీగా తీర్చిదిద్దేందుకు కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తానన్నారు. రూ. 50 లక్షలతో ఫంక్షన్ హాల్ (కల్యాణ మండపం), రూ.10 లక్షలతో వైకుంఠధామం, రూ. 20 లక్షలతో అంగన్‌వాడీ భవనాలు, రూ. 50 లక్షలతో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, రూ. 70 లక్షలతో మురుగు తొలగింపు కాల్వ, గ్రామ పంచాయతీకి 2 అదనపు గదులు, తాగునీటి సమస్య పరిష్కారానికి 3 బోర్లు, మోటార్లు, హైస్కూల్‌కు కాంపౌండ్ వాల్ నిర్మాణం, వెటర్నరీ ఆసుపత్రి భవనం, పాములపర్తితోపాటు, పాతూరులో తాగునీటి కోసం పైప్‌లైన్లు, సీసీ రోడ్ల కోసం నిధులు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఊళ్లోకి బస్సు వచ్చేలా ఆర్టీసీ అధికారులను ఆదేశించిన సీఎం, బస్ షెల్టర్‌ను కూడా మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సీఎంను వేడుకున్న ఇద్దరు మహిళలకు సీఎం ఫండ్ నుంచి రూ. లక్ష చొప్పున మంజూరు చేశారు.
కలత చెందవద్దు.. ఖర్చు ఎంతైనా భరిస్తా..
చికిత్స కోసం వికలాంగుడిని తన వెంటే తీసుకెళ్లిన సీఎం కేసీఆర్
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తిపేరు కనకస్వామి. నల్లగొండ జిల్లా భువనగిరి నివాసి. వెల్డింగ్ పని చేసుకుంటూ ఉపాధి పొందుతుండగా ప్రమాదవశాత్తు రెండు చేతులు కోల్పోయాడు. కృత్రిమ అవయవాలు పెట్టిం చుకోవాలంటే రూ. లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా ములుగు మండలం నాగిరెడ్డిపల్లిలోని అత్తగారింటికి వచ్చిన ఆ యువకుడు పక్కనే ఉన్న పాములపర్తికి సీఎం కేసీఆర్ వస్తున్నట్లు తెలిసి అక్కడకు చేరుకున్నాడు. సీఎం వద్దకు అతికష్టంగా చేరుకున్న కనకస్వామి.. సగంవరకు తెగిన రెండుచేతులను చూపుతూ తనకు సాయం చేయాలని అభ్యర్థించారు.
అతన్ని దగ్గరకు తీసుకొని అప్యాయంగా మాట్లాడిన సీఎం ఏం సాయం కావాలని అడిగాడు. కృత్రిమ అవయవాలకు ఇరవై లక్షల రూపాయలు అడిగారని, నాకు చేతులు పెట్టించండని అభ్యర్థించాడు. సానుకూలంగా స్పందించిన సీఎం వెంటనే తన విజిటింగ్ కార్డును అందజేసి సోమవారం హైదరాబాద్‌కు రావాలని చెప్పా డు. కలత చెందొద్దు, ఖర్చు ఎంతైనా సరే కృత్రిమ అవయవాలు పెట్టిస్తానని చెప్పారు. అయితే, తన వెంట బావమరిది పరుశురాము లు ఉన్నాడని చెప్పడంతో.. ఇపుడే నా వెంట వచ్చేయ్.. అని చెప్పి తనతోపాటు వెంట ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వాహనంలో కనకస్వామిని చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లారు.