రుణమాఫీలో ఏరివేత
అనర్హుల లెక్క తేల్చేందుకు సిద్ధమైన సర్కారు
సాక్షి, హైదరాబాద్: రైతుల రుణమాఫీలో లబ్ధిపొందిన అనర్హులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతేడాది గ్రామాల్లో అంచనా సర్వే నిర్వహించిన ప్రభుత్వం.. ఈసారి సమగ్రంగా, సంపూర్ణంగా పరిశీలన జరిపేందుకు సిద్ధమైంది. అనర్హులను గుర్తించి జాబితా తయారుచేయాలని యోచిస్తోంది. రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో బుధవారం జరిగిన సమావేశంలో ఆర్థిక శాఖ ఈ మేరకు తమ ఉద్దేశాన్ని బ్యాంకర్లకు వివరించినట్లు తెలిసింది. రుణమాఫీ లబ్ధిదారుల జాబితాను సమగ్రంగా పరిశీలించాలని భావిస్తున్నామని, అందుకోసం లబ్ధిపొందిన 35 లక్షల మంది రైతుల సంపూర్ణ జాబితాను ఇవ్వాలని ఆర్థికశాఖ అధికారులు కోరినట్లు సమాచారం. అయితే తక్షణమే సంపూర్ణ జాబితా ఇవ్వలేమని, కొంత గడువిస్తే వివిధ బ్యాంకుల నుంచి సమాచారం తెప్పించి ఇస్తామని బ్యాంకర్లు స్పష్టం చేసినట్లు తెలిసింది. నెలాఖరు నాటికి ఆర్థికశాఖకు బ్యాంకర్లు సమాచారం ఇచ్చే అవకాశమున్నట్లు చెబుతున్నారు.
మూడోసారి విడుదలకు ముందు...
రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షలోపు పంట రుణాలకు రుణమాఫీ పథకాన్ని ప్రకటించింది. ఇందుకు 35.82 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించి.. వారికి సంబంధించి సుమారు రూ.17వేల కోట్లు మాఫీ చేయాలని నిర్ణయించింది. నాలుగు విడతల్లో రుణమాఫీ చేస్తామని ప్రకటించి... మొదటి విడతగా 2014లో రూ.4,230కోట్లను బ్యాంకులకు అందజేసింది. ఆ సొమ్ములో రూ.4,040 కోట్లను బ్యాంకులు రైతుల ఖాతాలో మాఫీ చేశాయి. తర్వాత రెండో విడత రుణమాఫీ కింద రూ.4,040 కోట్లను విడుదల చేసింది. ఇంకా రెండు విడతల సొమ్ము రూ.8,080 కోట్లు బ్యాంకులకు ఇవ్వాల్సి ఉంది. ఈ ఏడాది మూడో విడత సొమ్ము రూ.4,040 కోట్లు విడుదల చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం బడ్జెట్లో నిధులు కేటాయించింది. వీటిని వచ్చే జూన్‌లో విడుదల చేసే అవకాశాలున్నాయి.
అయితే ఈ నిధులను విడుదల చేయడానికి ముందే రుణమాఫీ లబ్ధిపొందిన బోగస్ రైతులను, అనర్హులను గుర్తించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ పథకం కింద అనర్హులున్నారా, ఉంటే ఎంతమంది ఉండొచ్చు, వారిని ఏరివేస్తే ప్రభుత్వానికి మిగిలేదెంత? అనే అంశాలను సమగ్రంగా పరిశీలించాలని తాజాగా నిర్ణయించినట్లు సమాచారం. ‘బోగస్ పాసు పుస్తకాలు, బినామీ పేర్లతో అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వానికి సమాచారం అందినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తొలి రెండు విడతల జాబితాలను క్షుణ్నంగా పరిశీలించనున్నారు. అవసరాన్ని బట్టి క్షేత్రస్థాయిలోనూ పరిశీలన జరిపే అవకాశాలున్నాయి. గతంలో ప్రతి జిల్లాలో 10 గ్రామాల చొప్పున తనిఖీలు చేశారు. ఈసారి ప్రతి రైతు వివరాలను సమగ్రంగా పరిశీలించి.. నిబంధనల ప్రకారమే వారికి రుణమాఫీ జరిగిందా లేదా పరిశీలిస్తారని తెలిసింది.