సాక్షి, విశాఖపట్నం: నవరత్నాల్లో భాగంగా వైఎస్సార్ గృహ నిర్మాణం పథకం కింద అర్హులందరికీ ఇళ్లు ఇవ్వాలనేదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పం. ఈ మేరకు ఇప్పటికే ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. మరో వైపు ఇళ్ల కోసం ‘స్పందన’లో భారీ సంఖ్యలోనే వినతులు దాఖలవుతున్నాయి. ఆయా దరఖాస్తులను బట్టి జిల్లాలోని రూరల్‌లో 68,520, అర్బన్‌లో ఇండివిడ్యువల్ ఇళ్లు 13,898 అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇవి మొత్తం 82,418 ఉన్నప్పటికీ ఈ సంఖ్య లక్ష దాటే అవకాశం ఉందని జిల్లా గృహనిర్మాణ శాఖ అధికారులు భావిస్తున్నారు. వీటి నిర్మాణం కోసం రూరల్‌లో 1,354, అర్బన్‌లో 1,199 ఎకరాలు అవసరం అవుతాయని అంచనా.
అవకతవకలకు చెల్లు..
గత టీడీపీ ప్రభుత్వం అందరికీ ఇళ్లు ఇస్తామని ఊరించినప్పటికీ తొలి నాలుగేళ్లూ మంజూరు గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఎన్నికలు సమీపిస్తున్నాయనే తరుణంలో ఇళ్లు మంజూరు కు తెరలేపింది. అర్హతలతో సంబంధం లేకుండా జన్మభూమి కమిటీలు సిఫారసు చేసిన పేర్లన్నీ జాబితాలో చేరిపోయాయి. టీడీపీ ప్రభుత్వం మంజూరైతే చేసింది కానీ నిర్మాణాలకు పైసా కూడా విదల్చలేదు. దీంతో చాలావరకూ నిర్మాణాలు ప్రారంభించలేదు. చాలా చోట్ల పునాది రాయి కూడా వేయలేదు. ఇలాంటివాటిని రద్దు చేయాలన్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ నిర్ణయం మేరకు గృహనిర్మాణ శాఖ అధికారులు క్షేత్ర పరిశీలన చేశారు. 19,054 ఇళ్లను రద్దు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఇందులో భాగంగా చోడవరంలో జీ ప్లస్ 3 ఇళ్లు 3,936 రద్దు చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు విడుదల చేసింది. అలాగే ఎన్టీఆర్ స్పెషల్ హౌసింగ్ స్కీమ్ (ప్రస్తుతం వైఎస్సార్ స్పెషల్ హౌసింగ్ స్కీమ్‌గా పేరు మారింది) కింద జిల్లాలో మంజూరైన మరో 10,042 ఇళ్లను రద్దు చేయడానికి త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ స్కీమ్‌లో లబ్ధిదారులంతా ఇప్పటికే ఇళ్లను నిర్మించుకున్నారు. కానీ వాటినీ టీడీపీ నాయకులు స్కీమ్‌లో చేర్చేశారు. కొత్త ఇళ్ల మాదిరిగానే సొమ్ము వస్తుందని ఆశ చూపించడం గమనార్హం.
మిగతా స్కీమ్‌లన్నీ కొనసాగింపు..
గతంలో మంజూరై పిట్టగోడలు, శ్లాబ్ దశలో ఆగిపోయిన 68,201 ఇళ్లతో పాటు కేంద్ర ప్రభుత్వం హౌసింగ్ పథకాల కింద మంజూరైన 20,158 ఇళ్లను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్సార్ రూరల్ హౌసింగ్ పథకం 2016–17 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన 415 ఇళ్లు, 2017–18లోని 1,896 ఇళ్లు, 2018–19లోని 3,648 ఇళ్లు, 2019–20లోని 1,983 ఇళ్లు మొత్తం 7,942 ఇళ్లకూ నిధుల విడుదలకు అడ్డంకి ఏమీ లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన పీఎంఏవై–వైఎస్సార్ (గ్రామీణ్) 2016–17 స్కీమ్‌లోని 1,879 ఇళ్లు, 2017–18లోని 1,543 ఇళ్లనూ పూర్తి చేయాల్సి ఉంది. అలాగే అర్బన్‌లో పీఎంఏవై–వైఎస్సార్(యూ) బీఎల్‌సీ 2016–17లోని 1,126 ఇళ్లు, 2017–18లో సిఫారసు చేసిన 468 ఇళ్లతో పాటు మంజూరైన 5,053 ఇళ్లను, అలాగే పీఎంఏవై–వైఎస్సార్ (యూ) యూడీఏ స్కీమ్ 2018–19లో ఎంపిక చేసిన 19,690 ఇళ్లతో పాటు మంజూరైన 37,956 ఇళ్ల నిర్మాణాలకు ఢోకా లేదు.
అర్హులందరికీ ఇళ్లు..
ఒక్క వైఎస్సార్ స్పెషల్ హౌసింగ్ 2018–19 స్కీమ్ తప్ప మిగతా 11 రకాల హౌసింగ్ స్కీమ్‌లు కొనసాగుతున్నాయి. వాటికి సంబంధించి మార్చి 31వ తేదీ నాటికి లబ్ధిదారులకు చెల్లించాల్సిన రూ.32 కోట్ల వరకూ బకాయిలు ఉండిపోయాయి. ప్రస్తుతం అవి రూ.64 కోట్లకు చేరాయి. వీటిని ప్రభుత్వం త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఆచరణలోకి వచ్చిన వెంటనే ఇళ్లు, ఇళ్ల స్థలాల మంజూరు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అర్హులైన వారందరికీ ఇల్లు వస్తుందనడంలో సందేహం అక్కర్లేదు.
– సి.జయరామాచారి, ప్రాజెక్టు డైరెక్టర్, జిల్లా గృహనిర్మాణ శాఖ
Comments
Please login to add a commentAdd a comment