సాక్షి, హైదరాబాద్: లక్ష రూపాయలకు మించి రుణాలున్న రైతులెవరైనా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారు. లక్ష రూపాయలలోపున్న రైతులకు మాత్రం పోటీ చేయడానికి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల్లోపు రుణమాఫీ ప్రకటించినందున, ఆ మేరకు మినహాయింపు ఇస్తూ సహకార ఎన్నికల అథారిటీ అంతర్గత ఆదేశాలు జారీ చేసింది. ఎవరికైనా రూ.లక్షకు మించి రుణాలుంటే, వారు నామినేషన్ నాటికి లక్షకు పైబడి ఉన్న బకాయిలను చెల్లించాలి. లేదంటే వారి నామినేషన్‌ను తిరస్కరిస్తారు.
అదీ రుణమాఫీకి గడువుగా ప్రకటించిన గతేడాది డిసెంబర్ 11లోపు రూ.లక్షలోపు బకాయి ఉన్న రైతులకే వర్తిస్తుంది. ఆ తర్వాత అంతకంటే ఎక్కువ అప్పు చేసి ఉంటే దాన్ని చెల్లించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులకే ఈ నిబంధనలు వర్తిస్తాయి. వాణిజ్య బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులకు ఈ నిబంధనలు వర్తించబోవని స్పష్టంచేశారు. బకాయిలు వసూలు చేసేందుకు సహకారశాఖ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు.
మహిళలు, బీసీలకు చెరో 1,812 పదవులు..
మొత్తం 906 ప్యాక్స్‌కు ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రతీ ప్యాక్స్‌కు 13 మంది డైరెక్టర్లను రైతులు ఎన్నుకుంటారు. వాటిలో 2 డైరెక్టర్ పదవులు మహిళలకు, మరో 2 డైరెక్టర్ పదవులు బీసీలకు, ఒక డైరెక్టర్ పదవి ఎస్సీ, ఎస్టీల్లో ఎవరో ఒకరికి రిజర్వు చేశారు. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 906 ప్యాక్స్‌ల్లో 11,778 డైరెక్టర్ పదవులుంటే, వాటిల్లో మహిళలకు 1,812 డైరెక్టర్ పదవులు రిజర్వు చేసినట్లయింది. బీసీలకూ 1,812 డైరెక్టర్ పదవులు రిజర్వు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు 906 డైరెక్టర్ పదవులు రిజర్వు చేస్తారు. అయితే ప్యాక్స్ చైర్మన్ పదవులను రిజర్వు చేయలేదు.
ప్యాక్స్ ఎన్నికలకు దాదాపు రూ.12 కోట్ల మేరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఆ సొమ్మును ప్యాక్స్‌లే సమకూర్చుకోవాలి. లేదంటే డీసీసీబీ బ్యాంకుల నుంచి అప్పుగా తెచ్చుకోవాలి. ఎన్నికలను బ్యాలెట్‌తోనే నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. ప్యాక్స్ డైరెక్టర్లు ఎన్నికయ్యాక, వారంతా ఆయా జిల్లాల్లోని డీసీసీబీ చైర్మన్లను ఎన్నుకుంటారు. డీసీసీబీ చైర్మన్లు టెస్కాబ్ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ప్యాక్స్ ఎన్నికలయ్యాక డీసీసీబీ, టెస్కాబ్ చైర్మన్ల ఎంపిక ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment